57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

సినిమా ముగిశాక మొదలయ్యే మాయ: ఇఫీ సాయంత్రాల గమ్మత్తు

ఆరు బయట చలనచిత్ర ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సృజనాత్మక ఆలోచనల మార్పిడితో కళకళలాడుతున్న గోవా సాయంత్రాలు

నాడు పోస్టు చేయడమైనది: 25 NOV 2026 6:47PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2341615Views: 2

మాండోవి నదిపై సూర్యుడు అస్తమిస్తూ పనాజీ వీధులు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న వేళ 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) ఒక విభిన్నమైన లయను సంతరించుకుంది. పగటిపూట చలనచిత్ర ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, రెడ్-కార్పెట్ హాజరులు, సినిమాపై చర్చలతో నిండి ఉండగా.. సాయంత్రాలు తమదైన ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి. ఇఫీలో సూర్యాస్తమయం ఆ రోజు ఉత్సవ ముగింపును మాత్రమే తెలియజేయదు.. అది మరొక వేడుక ప్రారంభానికి నాంది పలుకుతుంది.

సాంప్రదాయ సినిమా హాళ్ల పరిధులను దాటి ఇఫీ 2026 మిరామార్ బీచ్, మడ్గావ్‌లోని రవీంద్ర భవన్, వాగటోర్ బీచ్‌లోని హెలిప్యాడ్ ప్రాంతంలో ఆరుబయట చలనచిత్ర ప్రదర్శనల ద్వారా సినీ అనుభూతిని ప్రజలకు మరింత చేరువ చేస్తోంది. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల మధ్య నిర్వహించే ఈ ప్రదర్శనలలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన చిత్రాలను ప్రదర్శిస్తారు. గోవాలో బహిరంగంగా స్థానికులు, సందర్శకులు, సినీ ప్రియులు ఒక్కటై సినిమా చూసి ఆనందాన్ని పొందొచ్చు. సినిమాలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, అందరినీ కలుపుకొని వెళ్లడానికి ఈ చలనచిత్రోత్సవం కట్టుబడి ఉందన్న విషయాన్ని ఇది తెలియజేస్తోంది.

ఈ పండుగ వాతావరణం మాండోవి విహారపథం వరకు విస్తరించింది. అక్కడ ప్రదర్శించే ‘రోమ్‌టామెల్’ సాంస్కృతిక ప్రదర్శనలు గోవాకు ఉన్న సుసంపన్నమైన కళా సంప్రదాయాలను వెలుగులోకి తెస్తున్నాయి. నవంబర్ 23 నుంచి 27 వరకు నాలుగు రోజుల్లో సాయంత్రం వేళ నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఏడు సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు ఈ అంతర్జాతీయ ఉత్సవానికి ఒక విలక్షణమైన స్థానిక సొబగును అద్దుతున్నాయి. దేశీయ సాంస్కృతిక వ్యక్తీకరణలు, అంతర్జాతీయ సినీ సంప్రదాయాల కలయిక ఇఫీకి గోవా అందించే ప్రత్యేక గుర్తింపును ప్రతిబింబిస్తోంది.

ఈ వేడుకలకు మరింత శోభను చేకూరుస్తూ ‘సినిమా ఆనందాన్ని ఆస్వాదించటం’ అనే ఇతివృత్తంతో నవంబర్ 25న నిర్వహించే ఇఫీ పరేడ్ పనాజీలోని ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్‌జీ) ప్రాంగణం నుంచి కళా అకాడమీ వరకు రంగురంగుల శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రజా భాగస్వామ్యంతో సాగుతుంది. ఈ పరేడ్ ఉత్సవాన్ని కేవలం నిర్దేశిత వేదికలకు మాత్రమే పరిమితం చేయకుండా స్థానిక నివాసితులు, సందర్శకులు ఈ సినీ వేడుకలో భాగస్వాములయ్యేందుకు వీలు కల్పిస్తోంది.

చిత్ర నిర్మాతలు, ప్రతినిధులు, వర్ధమాన కళాకారులకు ఈ ఉత్సవ సాయంత్రాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా అంతకుమించిన అవకాశాలను అందిస్తున్నాయి. ప్రణాళికలో ఉన్న ప్రదర్శనలు, అధికారిక సమావేశాలను దాటుకొని అనధికారిక సంభాషణలు, సృజనాత్మక ఆలోచనల మార్పిడి, అర్థవంతమైన పరిచయాలకు ఇవి వేదికలుగా నిలుస్తున్నాయి. ఒక సినిమా గురించిన చర్చ సాంస్కృతిక దృక్పథాల మార్పిడికి దారితీయొచ్చు. ఇది చిత్ర నిర్మాతల మధ్య జరిగే ఒక యాదృచ్ఛిక కలయిక భవిష్యత్ భాగస్వామ్యానికి పునాది వేయగలదు.

విద్యుత్ దీపాలతో అలంకరించిన ఉత్సవ వేదికల వెనుక చలనచిత్ర ప్రదర్శనల తర్వాత కూడా పనిచేస్తూ ఉత్సవం సజావుగా సాగేలా చూసే వాలంటీర్లు, సాంకేతిక సిబ్బంది, మీడియా ప్రతినిధులు, నిర్వాహకుల నిరంతర కృషి దాగి ఉంది. వారి సేవలు ఇఫీ అనుభూతిలో ఒక అంతర్భాగంగా తరచుగా తెరవెనుక ఉండిపోయే కీలక అంశంగా నిలుస్తున్నాయి.

సూర్యాస్తమయం తర్వాత పనాజీ నగరం ఒక అద్భుత దృశ్యంగా మారుతుంది. బంగారు వర్ణపు ఫెయిరీ లైట్ల తోరణాలు నగరంలోని చెట్లతో నిండిన రహదారులను అలంకరించగా విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న భవనాలు, రంగురంగుల కళాకృతులు, ఇఫీ ప్రతిష్ఠాత్మక నెమలి చిహ్నాలు వీధులకు పండుగ శోభను అద్దుతున్నాయి. నగర వాస్తుశిల్పం, బహిరంగ ప్రదేశాలు ఉత్సవంలో ఒక భాగంగా మారిపోతాయి. ఆతిథ్య రాష్ట్రానికి ఉన్న విలక్షణత సినిమా సార్వత్రిక ఆకర్షణకు తోడవుతోంది. ఇఫీతో గోవాకు ఉన్న అనుబంధం ఒక విశిష్ట వేడుకగా మారిన తీరును ఇది తెలియజేస్తోంది.

ఇఫీ 2026 ఇతివృత్తమైన ‘విశ్వజనీయ కథల’కు అనుగుణంగా ఈ ఉత్సవ రాత్రులు సినిమాకు ఉన్న శక్తిని చాటిచెబుతున్నాయి. సినిమా కేవలం భౌగోళిక, భాషా సరిహద్దులను మాత్రమే కాకుండా ఆడిటోరియం భౌతిక సరిహద్దులను కూడా అధిగమించగలదని ఇవి నిరూపిస్తున్నాయి. ఒక చలనచిత్రోత్సవం మాయాజాలం వెండితెరపై ఆవిష్కృతమయ్యే కథలలో ఎంత ఉంటుందో అది ప్రేరేపించే చర్చలు, ఏర్పరిచే అనుబంధాలలో కూడా అంతే ఉంటుందని ఇవి ప్రేక్షకులకు గుర్తుచేస్తున్నాయి.

ఇఫీలో తెరపై టైటిల్స్ ఆగిపోవచ్చు, తెరలు మూసుకుపోవచ్చు, థియేటర్ల లోపల లైట్లు ఆరిపోవచ్చు కానీ సినిమా వేడుక మాత్రం నిరంతరాయంగా కొనసాగుతుంది. గోవాలో ఉత్సవ గడియారం అస్సలు ఆగడానికి ఇష్టపడదు.

ఇఫీలోయిడ్: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2341615
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026