శుభప్రదమైన కార్యక్రమాలకు ట్రాన్స్‌జెండర్ మహిళలను ఆహ్వానిస్తూనే రోజువారీ జీవితంలో వారికి గౌరవాన్ని, ఆదరణను నిరాకరించే సమాజంలోని ప్రధాన వైరుధ్యాన్ని నేపాలీ చలనచిత్రం 'ఎలిఫెంట్స్ ఇన్ ది ఫాగ్' ఆవిష్కరించింది. గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు, స్క్రీన్‌రైటర్ అబినాష్ బిక్రమ్ షా, ప్రధాన నటి పుష్ప థింగ్ లామా ఈ సినిమా విశేషాలు, ఇతివృత్తాల గురించి మాట్లాడారు.
79వ కేన్స్ చలన చిత్రోత్సవంలో ‘అన్ సెర్టెన్ రిగార్డ్’ విభాగంలో జ్యూరీ బహుమతిని, ఉత్తమ సౌండ్ క్రియేషన్ అవార్డును గెలుచుకున్న ఈ చిత్రం… ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై నేపాలీ సినిమాకు కీలక ఘట్టంగా నిలిచింది.

నేపాల్ నేపథ్యంలో రూపొందిన ‘ఎలిఫెంట్స్ ఇన్ ది ఫాగ్’ చిత్రం.. పిరాటి అనే ట్రాన్స్‌జెండర్ మహిళ, ముగ్గురు కుమార్తెల తల్లి చుట్టూ తిరుగుతుంది. తాను ప్రేమించిన వ్యక్తితో కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలని ఆమె కలలు కంటుంది. అడవి ఏనుగుల బారి నుంచి గ్రామాన్ని రక్షించేందుకు రాత్రిపూట నిర్వహించే గస్తీ సమయంలో చిన్న కుమార్తె అప్సర అదృశ్యం కావడంతో ఆమె ఆశలు గల్లంతవుతాయి. అప్సర కోసం సాగే అన్వేషణలో మాతృత్వం, గుర్తింపు, వ్యక్తిగత స్వేచ్ఛ, సమాజం నుంచి వెలివేత వంటి అంశాల మధ్య ఉన్న అంతరాలను ఈ చిత్రం లోతుగా విశ్లేషిస్తుంది.
కేన్స్ చలన చిత్రోత్సవానికి వెళ్లిన ఈ సినిమా ప్రయాణం గురించి అబినాష్ బిక్రమ్ షా వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు ఒక అద్భుతమైన అనుభూతి అని, అంతర్జాతీయ వేదికపై నేపాలీ సినిమాకు ప్రాతినిధ్యం వహించటం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. రెండు అవార్డులు అందుకోవటం ప్రత్యేక ఆనందాన్నిచ్చిందని అన్నారు. సాధారణంగా మూగబోయిన గొంతుకలను, అనుభవాలను ప్రపంచానికి చాటిచెప్పాలనుకునే ఈ చిత్రానికి 'ఉత్తమ సౌండ్ క్రియేషన్ అవార్డు' రావటం ఎంతో ప్రత్యేకమని అభిప్రాయపడ్డారు.

సినిమా టైటిల్ గురించి అబినాష్ బిక్రమ్ షా వివరిస్తూ... అసలు స్క్రీన్‌ప్లేలో ఏనుగుల ప్రస్తావన లేదని, సినిమా ప్రధాన ఇతివృత్తానికి ఒక రూపకంగా అవి క్రమంగా కథలో భాగమయ్యాయని తెలిపారు. నిర్ణీత పరిధుల్లో ఉన్నంత వరకు పూజలందుకుంటూ, ఆ హద్దులు దాటినప్పుడు భయాన్ని కలిగించే ఏనుగులకు… శుభకార్యాలకు ఆహ్వానించినా నిత్యజీవితంలో మాత్రం గౌరవానికి, ఆమోదానికి నోచుకోని ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు మధ్య సారూప్యతను ఆయన ఎత్తిచూపారు. ఈ వైరుధ్యం ద్వారా అణగారిన వర్గాల పట్ల సమాజం షరతులతో కూడిన అంగీకారం తెలపటాన్ని ఈ చిత్రం ప్రశ్నిస్తుంది.
పిరాటి పాత్రలో నటించటం సవాలుగా అనిపించిందని, వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైన అనుభవాన్ని ఇచ్చిందని పుష్ప థింగ్ లామా అన్నారు. ఒక ట్రాన్స్‌జెండర్ మహిళగా సొంత అభిప్రాయాన్ని వెల్లడించారు. ట్రాన్స్జెండర్లు నేటికీ సామాజిక అంగీకారం, గుర్తింపును పొందటంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. తమ అనుభవాలను విస్తృత స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు, తమ కథలను అందరూ చూసేందుకు, వినేందుకు, అర్థం చేసుకునేందుకు ఈ చిత్రం చక్కటి అవకాశమని ఆమె పేర్కొన్నారు.
ఈ పాత్ర కోసం సన్నద్ధమైన తీరును గుర్తుచేసుకుంటూ... నిజజీవిత అనుభవాలు, భావోద్వేగాలను ఆధారంగా చేసుకోవాల్సి వచ్చిందని, పాత్ర ప్రయాణాన్ని అంతర్గతంగా అర్థం చేసుకోవాల్సి వచ్చిందని లామా తెలిపారు. జీవితం పట్ల తన దృక్పథాన్ని, ఆత్మస్థైర్యాన్ని, సమాజాన్ని ఎదుర్కొనే సవాళ్లను అధిగమించే తత్వాన్ని పెంపొందించటంలో తల్లి పెంపకం, ఆమె నేర్పిన విలువలు ఎంతో ప్రభావం చూపాయని వివరించారు.
ఈ చిత్రాన్ని రూపొందించేందుకు దాదాపు మూడేళ్ల సమయం పట్టిందని సినీ రూపకర్త తెలిపారు. పిరాటి జీవిత ప్రయాణం, ఏనుగుల రూపకం ద్వారా ఎలిఫెంట్స్ ఇన్ ది ఫాగ్ చిత్రం గుర్తింపు, ఆత్మీయతకు సంబంధించిన సామాజిక హద్దులను విశ్లేషిస్తుందని, నామమాత్రపు ఆమోదానికి, నిత్యజీవితంలో గౌరవ మర్యాదల నిరాకరణకు మధ్య ఉన్న అంతరాన్ని ఎత్తిచూపుతుందని చెప్పారు.
ఈ మీడియా సమావేశానికి లక్ష్మీ ప్రియ సమన్వయకర్తగా వ్యవహరించారు.
పూర్తి ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఇక్కడ చూడవచ్చు:
Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***