నిత్యజీవితంలో ఎదురయ్యే సంఘటనలు, అత్యంత వ్యక్తిగత అనుభవాలు స్ఫూర్తిగా తాను తెరకెక్కించిన అతీంద్రియ శక్తుల గురించిన కథా చిత్రం ‘సర్వం మాయ’ నిర్మాణ విశేషాలను మలయాళ దర్శకుడు శ్రీ అఖిల్ సత్యన్ పంచుకున్నారు. గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వేదికగా ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నివిన్ పౌలీ, రియా షిబు ప్రధాన పాత్రల్లో నటించిన 2025 మలయాళ చిత్రం 'సర్వం మాయ'... ఐఎఫ్ఎఫ్ఐ-2026లోని ప్రతిష్ఠాత్మక 'ఇండియన్ పనోరమా' విభాగంలో ప్రదర్శితమవుతోంది.
‘సర్వం మాయ’ చిత్రాన్ని స్థానిక నేటివిటీతో కూడిన అత్యంత వ్యక్తిగత సినిమాగా అభివర్ణించిన శ్రీ అఖిల్... హారర్ సినిమాలంటే తనకూ, తన స్నేహితుడు నివిన్ పౌలీకి ఉన్న భయం కారణంగా ఆ జానర్‌లో సినిమా చేయడానికి మొదట్లో ఇద్దరం సందేహించామని గుర్తుచేసుకున్నారు. అయితే, గతంలో నాస్తికుడిగా ఉండి ఆ తర్వాత పూజారిగా మారిన ఒక వ్యక్తిని ఆలయంలో కలిసిన సంఘటన స్ఫూర్తితో ఈ సినిమా ఆలోచనకు బీజం పడిందని ఆయన తెలిపారు. ఆ నిత్యజీవిత అనుభవం నుంచే.. భూతవైద్యం చేసే ఒక నాస్తిక పూజారి, నేటి తరం (జెన్-జీ) దయ్యంతో స్నేహం చేసే వినూత్న కథాంశం పుట్టుకొచ్చిందని ఆయన వివరించారు.

శ్రీ అఖిల్ సత్యన్ రచించి, దర్శకత్వం వహించిన 'సర్వం మాయ' చిత్రం... కుటుంబ పరిస్థితుల కారణంగా సంప్రదాయ హిందూ పూజారిగా మారాల్సి వచ్చిన సంగీతకారుడు, నాస్తికుడైన ప్రభేందు చుట్టూ తిరుగుతుంది. తన గతాన్ని అంగీకరించేందుకు సతమతమవుతున్న 'డెలూలు' గా పిలిచే మాయ అనే యువతి ఆత్మ తారసపడటంతో అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. వారిద్దరి మధ్య ఏర్పడిన ఈ విలక్షణ స్నేహం... విశ్వాసం, కోల్పోయిన జ్ఞాపకాలు, ప్రేమ, మానవ సంబంధాలకు ఉండే ఓదార్పు శక్తిని అన్వేషిస్తూ సాగే ఒక ఆత్మశోధన ప్రయాణంగా మారుతుంది.
తన కథనంలో హాస్యం పాత్ర గురించి మాట్లాడుతూ... ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఒక సినిమా దాని కథకు ఉపయోగపడని హింస, యాక్షన్ సన్నివేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని శ్రీ అఖిల్ సత్యన్ స్పష్టం చేశారు. డ్రామా లేదా థ్రిల్ లాగే హాస్యం కూడా ఒక సినిమా వాణిజ్య ఆకర్షణకు అంతే సమర్థంగా దోహదపడగలదన్నారు. అదే సమయంలో కథకు అందాన్ని, భావోద్వేగ లోతునూ అది అందిస్తుందని ఆయన గమనించారు. నివిన్ పౌలీ సహజ హాస్య చతురత తమ కలయికను మరింత ఆనందదాయకంగా మార్చిందని ఆయన జోడించారు.
ఇప్పటికే వాణిజ్యపరంగా మంచి విజయాన్ని అందుకున్న సినిమాను చిత్రోత్సవానికి పంపాలా వద్దా అని మొదట్లో కాస్త సంశయించామన్నారు. సినిమాలోని భావోద్వేగ తీవ్రత, కథనంలోని లోతు ఈ వేదికపై ప్రేక్షకుల ఆదరణ పొందుతాయని తాను బలంగా విశ్వసించినట్లు ఆయన తెలిపారు. ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శనకు తమ చిత్రం ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తన తండ్రి, ప్రముఖ సీనియర్ దర్శకుడు శ్రీ సత్యన్ అంతికాడ్ ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... తన సినిమాల్లో కనిపించే అచ్చమైన స్థానికత తన సొంత అనుభవాల నుంచి సహజంగా పుట్టుకొచ్చిందని శ్రీ అఖిల్ తెలిపారు. ప్రారంభంలో తాను దర్శకుడు మణిరత్నం సినిమాలకు, ముఖ్యంగా ‘బొంబాయి’ వంటి చిత్రాలకు ఆకర్షితుడయ్యాననీ... ఆ తర్వాత క్రమంగా తన తండ్రి రూపొందించిన ‘వరవేల్పు’ వంటి సినిమాల గొప్పతనాన్ని లోతుగా అర్థం చేసుకున్నానని పేర్కొన్నారు. ప్రముఖ నటుడు, స్క్రీన్‌ప్లే రచయిత శ్రీ శ్రీనివాసన్ ప్రభావం తనపై ఎంతో ఉందని ఆయన అన్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం నుంచి సినీ దర్శకత్వం వైపు అడుగులు వేసిన శ్రీ అఖిల్ సత్యన్... ముఖ్యంగా సినీ నేపథ్యం లేని ఔత్సాహిక దర్శకులకు విలువైన సూచన చేశారు. ముందుగా ఒక ఆసక్తికరమైన ఆలోచనతో రెండు నిమిషాల లఘు చిత్రానికి కథ రాసి, దాన్ని స్వయంగా చిత్రీకరించి, ఎడిట్ చేయాలని ఆయన ప్రోత్సహించారు. సినిమా రంగంలోకి తొలి అడుగు వేయడానికి ఒక పెన్సిల్, కాగితం ఉంటే సరిపోతుందనీ, అద్భుతంగా రాసుకున్న ఒక ఆలోచన ఒకరి భవిష్యత్తు గమనాన్నే మార్చేయగలదని ఆయన పేర్కొన్నారు.
_20261124181705_41251e.jpeg)
ఒక నాస్తిక పూజారి, యువతి ఆత్మ మధ్య ఏర్పడిన విలక్షణమైన స్నేహం ద్వారా 'సర్వం మాయ' చిత్రం హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో పాటు విశ్వాసం, కోల్పోయిన జ్ఞాపకాలపై లోతైన ఆలోచనలను ఒకే వేదికపైకి తెచ్చింది. ఐఎఫ్ఎఫ్ఐ-2026 ఇతివృత్తమైన ‘విశ్వజనీన కథలు’ స్ఫూర్తికి అనుగుణంగా... స్థానిక అనుభవాల నుంచి పుట్టిన కథలు సైతం సార్వత్రిక మానవ భావోద్వేగాల ద్వారా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులతో ఎలా అనుసంధానమవుతాయో ఈ చిత్రం చాటిచెబుతోంది.
ఈ పత్రికా సమావేశానికి శ్రీ అలన్ సిబి అనుసంధానకర్తగా వ్యవహరించారు.
ఇఫిలాయిడ్ (ఐఎఫ్ఎఫ్ఐఎవ్‌వోఐడి) సంచికను ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***