57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

57వ ‘ఇఫి’లో బ్రిక్స్ చలనచిత్రోత్సవ రౌండ్ టేబుల్ సమావేశం సహ నిర్మాణం, పంపిణీ, సాంకేతికతల బదలాయింపునకు ఉన్న అవకాశాలపై చర్చ

సాంస్కృతిక సంబంధాల బలోపేతం, పరస్పర అవగాహనను ప్రోత్సహించడంలో
సినిమా పాత్రను ప్రస్తావించిన భాగస్వామ్య దేశాల ప్రతినిధులు

నాడు పోస్టు చేయడమైనది: 22 NOV 2026 7:11PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340288Views: 11

సినిమాలను వివిధ భాషల్లో రూపొందించవచ్చు, అయితే సినిమా వ్యక్తం చేసే భావనలు ఎక్కడికైనా పయనించగలవు.. ఆ భావనలకు పరిమితులు, సరిహద్దులంటూ ఉండవు. ఈ ఉమ్మడి భాషపైనే దృష్టిని కేంద్రీకరిస్తూ, 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ..‘ఇఫి’)లో భాగంగా ఏర్పాటు చేసిన ‘‘బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్ రౌండ్‌టేబుల్ సమావేశం’’లో.. పాలుపంచుకుంటున్న దేశాల మధ్య సహకారాన్ని పెంపొందింప చేసుకొనే అవకాశాల గురించి చర్చించారు. సహ నిర్మాణం, చలనచిత్రాల పంపిణీ, సాంకేతికత బదలాయింపుతో పాటు సాంస్కృతిక భాగస్వామ్యాల వంటి ముఖ్య విషయాలు కూడా సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి.
ఈ సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ), గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్‌జీ)లకు చెందిన అధికారులతో పాటు రష్యా, నైజీరియా, ఇండొనేషియా, ఇరాన్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.
దీర్ఘకాలిక భాగస్వామ్యాలు, ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని పటిష్టపరచడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్ తెలిపారు. సినిమా మాధ్యమం ప్రజలను ఏకం చేసి, వివిధ సమాజాలపై అవగాహన కలిగిస్తుందని ఆయన అన్నారు. చలనచిత్రాలు కళ్లకు కట్టే విభిన్న శైలులు, విషయాలు ప్రేక్షకులకు కొత్త దృష్టికోణాల్ని గుర్తించడంలో తోడ్పడతాయని శ్రీ ప్రభాత్ అన్నారు.


బ్రిక్స్ వేవ్స్ బజార్‌ను ముంబయిలో భారత్ నిర్వహించిన సంగతిని శ్రీ ప్రభాత్ ప్రస్తావించారు. ఆ కార్యక్రమంలో అంతర్జాతీయ సహ నిర్మాణం, కృత్రిమ మేధ, యానిమేషన్, గేమింగ్, మహిళల నాయకత్వం వంటి అంశాలపై చర్చించారని ఆయన అన్నారు. కలిసికట్టుగా పనిచేయడంపై ఆసక్తి అంతకంతకు పెరుగుతోందని చెబుతూ, భాగం పంచుకొనే దేశాల మధ్య నిర్మాణ భాగస్వామ్యాలను ఏర్పరుచుకొనేందుకు ఉన్న అవకాశాలను గుర్తించాలని సూచించారు. సహ నిర్మాణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంతో పాటు డిజిటల్ టెలివిజన్, ఓటీటీ వేదికల ద్వారా కంటెంటును ఇచ్చి పుచ్చుకోవడాన్ని ఇప్పటి స్థాయిల కన్నా పెంపొందించుకుందామని శ్రీ ప్రభాత్ పిలుపునిచ్చారు. అలాగే ఈ ఉత్సవంలో పాల్గొంటున్న దేశాలు ఈ జోరును కొనసాగించాలని, ఫలితంగా దీర్ఘకాలిక భాగస్వామ్యాలు పుంజుకోగలుగుతాయన్నారు.
ఈ కార్యక్రమం సాంస్కృతిక అనుబంధం ద్వారా బ్రిక్స్ భాగస్వామ్యాన్ని గమనించేందుకు ఒక అవకాశాన్ని అందించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ శంభు ఎల్. హక్కి అన్నారు. సినిమా ఏ ఒక్క దేశానికో ప్రతిబింబం కాదని, ఒక దేశాన్ని గురించి మరొక దేశం అర్థం చేసుకొనే మాధ్యమం కూడానని ఆయన అన్నారు. ఈ సారి ‘ఇఫి’కి ఇతివృత్తంగా ఎంపిక చేసిన ‘స్టోరీస్ వితౌట్ బార్డర్స్’ (ఎల్లలు లేని కథలు) గురించి ఆయన ప్రస్తావిస్తూ, బ్రిక్స్ దేశాల చలనచిత్రాలు భాగస్వామ్య దేశాల సాంస్కృతిక అభివ్యక్తీకరణలకు అద్దం పడుతున్నాయని, దీంతో సంస్థాగత సహకార పరిధిని మించి పరస్పర అవగాహన విస్తృతమవుతుందని వ్యాఖ్యానించారు.


ముంబయిలో నిర్వహించిన బ్రిక్స్ వేవ్స్ బజార్‌ బ్రిక్స్ దేశాల చలనచిత్ర రూపకర్తలను, చిత్ర పరిశ్రమతో ముడిపడిన వారిని ఒక చోటుకు తీసుకురావడానికి పునాదిని వేసిందని ఎన్ఎఫ్‌డీసీ చైర్మన్ శ్రీ జి. కృష్ణకుమార్ అన్నారు. ఈ సంబంధాలను పటిష్టపరచడంలోను, కలిసి కథలను వినిపించేందుకు అవకాశాలను కల్పించడంలోను చలనచిత్రాల సహ నిర్మాణ సంబంధిత అవకాశాలు పెంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
సినిమాలు, సాంస్కృతిక మార్పిడికి ఒక సమావేశ వేదిక వంటిది గోవా అని గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ (ఈఎస్‌జీ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ దీపక్ బాండేకర్ వర్ణించారు. చలనచిత్రాలు దేశ దేశాలకు చేరుకొంటే చేరుకోవచ్చు గాని, సినిమాల్లో ఆవిష్కరించే  భావనలు సార్వత్రికమని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాల సంస్కృతులను, అనుభూతులను ఆకళింపు చేసుకోవడానికి ప్రేక్షకవర్గాలకు ఒక శక్తిమంతమైన మాధ్యమంగా సినిమా నిలవడానికి గల కారణం కూడా ఇదేనని ఆయన అన్నారు.
సహకారానికి ఉన్న అవకాశాలపై, ఉత్సవాలలో పాల్గొంటున్న దేశాల ప్రతినిధులు కూడా చర్చించారు. నైజీరియాలో చైతన్యభరిత చలనచిత్ర పరిశ్రమను గురించి భారత్‌లో నైజీరియా హైకమిషనరు శ్రీ సైదు దాహిరు ముహమ్మద్ వివరించారు. చలనచిత్రోత్సవంలో నైజీరియా సినిమా రంగాన్ని చేర్చుకోవడాన్ని ఆయన స్వాగతించారు. సహ నిర్మాణం, పంపిణీ.. ఇవి సమన్వయానికి కీలక రంగాలు కాగలవని శ్రీ ముహమ్మద్ తెలిపారు. వీటితో పాటు, సాంకేతికత బదలాయింపు, సామర్థ్యాలను పెంపొందింప చేసే అవకాశాలను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇదే జరిగితే యువతకు ఆర్థిక అవకాశాలు అందివస్తాయన్నారు.
సరిహద్దులను మించి పయనించే సామర్థ్యం చలనచిత్రాల సొంతం అని ముంబయిలో రష్యన్ ఫెడరేషన్ తాత్కాలిక ప్రధాన వాణిజ్య దూత శ్రీ అలెక్సాంద్ర ఫురసొవ్ అన్నారు. భారత్, రష్యాల మధ్య చలనచిత్రోత్సవాల నిర్వహణ మార్పిడి రెండు దేశాల సాంస్కృతిక సంబంధాల్ని మరింత విస్తరించుకొనేందుకు లభించే ఓ అవకాశమని చెప్పవచ్చని ఆయన పేర్కొన్నారు.  
భారత్‌లో ఇండొనేషియా రాయబార కార్యాలయ ప్రథమ కార్యదర్శి ఎర్నీ వాహ్యునీ మాట్లాడుతూ, భారత్ ఇండొనేషియాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న సాంస్కృతిక సంబంధాలను ప్రస్తావించారు. వాటిలో రామాయణంతో, మహాభారతంతో ముడిపడిన ఉమ్మడి సంప్రదాయాలు తొంగిచూస్తుంటాయని ఆమె అన్నారు. చలనచిత్ర రూపకర్తలు, నిర్మాతలకు ఒక పరిచయ యాత్రను ఏర్పాటు చేయాలని ఎర్నీ వాహ్యునీ ప్రతిపాదించారు. ఇలాంటి కార్యక్రమం వల్ల వారు సహ నిర్మాణానికి ఉన్న అవకాశాలను అన్వేషించగలుగుతారన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. అలాగే ఓటీటీ వేదికల ద్వారా చలనచిత్రాలను ఇప్పటి కన్నా మరింత భారీ స్థాయిలో పంపిణీ చేయాలని కూడా ఎర్నీ వాహ్యునీ సూచించారు. యానిమేషన్‌, గేమింగ్‌ రంగాలు కూడా సహకారానికి అనేక అవకాశాలు ఉన్న రంగాలని, రాబోయే కాలంలో నిర్వహించే కార్యక్రమాలకు సాంస్కృతిక ప్రతినిధులు, నిర్మాతలు, యానిమేషన్ వృత్తినిపుణులను పిలిస్తే బాగుంటుందని ఎర్నీ వాహ్యునీ కోరారు.
గోవా సాంస్కృతిక వైవిధ్యం, విభిన్న సమాజాలను అర్థం చేసుకొనేందుకు మాటామంతీ జరపడం కోసం ఉపయోగపడే చోటు అని భారత్‌లో ఇరాన్ రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ డాక్టర్ ముస్తఫా గోహరీఫర్ వర్ణించారు. చలనచిత్రాలు వేరు వేరు దేశాలతో పాటు ఆయా దేశాల ప్రజలను అర్థం చేసుకొనేందుకు ఒక ప్రత్యేక దృష్టికోణాన్ని అందిస్తాయని ఆయన అన్నారు. ఈ తరహా ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించడం వల్ల చలనచిత్ర పరిశ్రమలు, సమాజాల మధ్య పరసపర సహకారం మరింత పెరుగుతుందనే ఆశ తనలో ఉందని ఆయన అన్నారు.
దేశాలను, సంస్కృతులను ఒక చోట చేర్చడానికి చక్కని వేదిక సినిమా అని  చర్చా కార్యక్రమం ముగింపులో శ్రీ జి. కృష్ణకుమార్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌ అందిస్తున్న మద్దతుకు గాను వారికి శ్రీ జి. కృష్ణకుమార్ ధన్యవాదాలు తెలిపారు. సామూహిక ప్రయత్నాలతో సినిమా మాధ్యమం ద్వారా అనేక ముఖ్య అవకాశాలు అందివస్తాయని శ్రీ కృష్ణకుమార్ అన్నారు.
ఒక చిన్న వీడియో ప్రదర్శనతో ఈ రౌండ్‌టేబుల్ చర్చకు తెర పడింది. బ్రిక్స్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్న చలనచిత్రాలకు చెందిన కొన్ని దృశ్యాలను ఈ వీడియోలో చూపించారు. ఈ చలనచిత్రాలు ఆయా దేశాలకు చెందిన వివిధ సినిమా సంప్రదాయాలను ఆవిష్కరించాయి.  
‘ఇఫిలాయిడ్‌’ (IFFILOID)ను ఇక్కడ చదవగలరు:   https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340288
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026