57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

‘‘ప్రతి క్షణం కొనసాగే ఆధ్యాత్మిక ప్రయాణమే బికమింగ్’’: 57వ ఇఫీలో దర్శకురాలు లీనా యాదవ్

భావవ్యక్తీకరణకు ఉన్న సాధనాల్లో భాష కూడా ఒకటి, భావోద్వేగాలు పదాలకు అతీతమైనవి: ఇండియన్ పనోరమలో ప్రదర్శించిన తొలి చిత్రం రూపకర్త

నాడు పోస్టు చేయడమైనది: 21 NOV 2026 8:13PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340176Views: 4

 భావవ్యక్తీకరణకు ఉన్న అనేక సాధనాల్లో భాష కూడా ఒకటనీ, మానవ భావోద్వేగాలు భాషా సరిహద్దులను అధిగమించగలవనీ లదాఖీ నాన్-ఫీచర్ చిత్రం బికమింగ్ దర్శకురాలు లీనా యాదవ్ అన్నారు. గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇండియన్ పనోరమా-2026 తొలుత ప్రదర్శించే నాన్-ఫీచర్ చిత్రంగా బికమింగ్ ఎంపికయింది. లదాఖ్ సాంస్కృతిక నేపథ్యం, సంప్రదాయాల గుండా సాగే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది.

స్థానికంగా నివసించే, వృత్తిపరమైన అనుభవం లేని నటీనటులకు దర్శకత్వం వహించిన అనుభవాన్ని యాదవ్ గుర్తు చేసుకున్నారు. తాను ఎక్కువగా హిందీలోనే మాట్లాడాననీ, నటీనటుల్లో చాలామంది లదాఖీ భాష మాట్లాడేవారనీ, వారికి హిందీ అంతగా తెలియదనీ ఆమె చెప్పారు. భాషాపరమైన అడ్డంకి ఉన్నప్పటికీ, నటీనటులు తమ పాత్రల్లోని భావోద్వేగాలను అర్థం చేసుకుని, వాటిని వ్యక్తం చేయగలిగారు. ఇతరుల మాటలను శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడం, మాటలకు అతీతమైన భావవ్యక్తీకరణ ఎంత ముఖ్యమో ఈ అనుభవం తనకు మరోసారి గుర్తుచేసిందని ఆమె పేర్కొన్నారు.

లీనా యాదవ్ రచించి, దర్శకత్వం వహించిన బికమింగ్ చిత్రం లదాఖ్‌కు చెందిన అగ్యల్ అనే బాలుడి చుట్టూ తిరుగుతుంది. ప్రకృతితో ఉన్న అసాధారణమైన అనుబంధం, గత జన్మకు సంబంధించినవిగా అనిపించే జ్ఞాపకాలు పురాతన లికిర్ మఠం వైపు అతడిని నడిపిస్తాయి. అక్కడ ఓ రింపోచేకు సంబంధించిన వస్తువులను గుర్తిస్తాడు. దీంతో ఈ బాలుడే ఆ ఆధ్యాత్మిక గురువు పునర్జన్మ అని సాధువులు విశ్వసించడం ప్రారంభిస్తారు. పునర్జన్మ, గుర్తింపు, విధి, గతానికి వర్తమానానికి మధ్య ఉన్న సంబంధం తదితర అంశాలను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది.

ఈ చిత్రాన్ని ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా యాదవ్ అభివర్ణించారు. బికమింగ్ అనే ఆలోచన కేవలం ప్రధాన పాత్ర ప్రయాణానికే పరిమితం కాలేదని యాదవ్ వివరించారు. నిరంతరం పరిణామం చెందే మానవ జీవితానికి ఇది ప్రతీక అనీ, దానికి ఒక నిర్దిష్టమైన ముగింపు అంటూ ఉండదనీ ఆమె తెలియజేశారు. చిత్ర కథనంపై, విజువల్ భాషపై బౌద్ధ తత్వశాస్త్రం, లదాఖ్‌కే ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాల ప్రభావం ఎలా ఉందో కూడా ఆమె వివరించారు.

ప్రాజెక్టు ఆలోచన ప్రారంభమైన సందర్భాన్ని నిర్మాత, సినిమాటోగ్రాఫర్ అసీమ్ బజాజ్ గుర్తు చేసుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కెమెరా పరికరాలను పరీక్షించే అవకాశం వచ్చినప్పుడు ఈ చిత్ర ఆలోచన మొదలైందని తెలిపారు. కేవలం ఆ పరికరాలకు ప్రచారం కల్పించడానికి బదులుగా, లదాఖ్‌లో ఒక లఘు చిత్రం నిర్మించాలని తాను ప్రతిపాదించినట్లు చెప్పారు. దీనికోసం బికమింగ్ అనే పేరునూ, బౌద్ధమత ప్రపంచమూ, లదాఖ్ ప్రాంతమూ అనే మూడు ప్రాథమిక అంశాలను తాను యాదవ్ ముందుంచానని తెలియజేశారు. ఆ ప్రాంతం, అక్కడ కలిసిన ప్రజల నుంచి పొందిన స్ఫూర్తితో క్రమంగా ఈ కథ రూపుదిద్దుకుందని ఆయన వివరించారు.

నిర్మాణ ప్రక్రియ గురించి కూడా చిత్ర రూపకర్తలు మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 19 మంది సభ్యులతో కూడిన చిన్న బృందం... లదాఖ్‌లోని స్థానిక సహాయకులతో కలిసి పనిచేసిందని తెలిపారు. అక్కడి ఎత్తయిన పర్వత ప్రాంత వాతావరణానికి అలవాటయ్యేందుకు పట్టిన సమయంతో కలిపి కేవలం 15 రోజుల్లోనే కథను సిద్ధం చేయడం, నటనానుభవం లేని నటీనటులను ఎంపిక చేయడంతో పాటు షూటింగ్‌ను కూడా పూర్తి చేశామని తెలియజేశారు. ఆ ప్రాంతమూ, అక్కడి ప్రజలే ఈ సినిమా రూపుదిద్దుకోవడంలో కీలక పాత్ర పోషించారని యాదవ్ అన్నారు.

ఈ చిత్రంలో ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్‌ను ఉపయోగించలేదని, సహజమైన ప్రకృతి దృశ్యాలు, ఆయా ప్రదేశాల్లోనే ప్రత్యక్షంగా చిత్రీకరించిన సన్నివేశాలపైనే ఆధారపడ్డామని శ్రీ బజాజ్ వివరించారు. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిన పరిస్థితుల్లో చిత్ర బృందం ఎన్నో శారీరక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, కెమెరా పరికరాలు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా పనిచేశాయని తెలిపారు. అక్కడి ప్రకృతి దృశ్యాలు, లదాఖ్ ప్రజల ఆప్యాయత, ఆతిథ్యం తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఇద్దరు చిత్ర రూపకర్తలూ తెలియజేశారు.

పునర్జన్మకు సంబంధించిన స్థానిక కథనాలూ, బౌద్ధ సంప్రదాయాల గురించి కూడా చిత్ర రూపకర్తలు వివరించారు. ఏ నమ్మకాలు, సాంస్కృతిక నేపథ్యం ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుందో అర్థం చేసుకోవడానికి ఇవి ఎంతగానో తోడ్పడ్డాయని వారు తెలియజేశారు.

చిత్రం పోస్టర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని యాదవ్ పంచుకున్నారు. ఎరుపు రంగు వస్త్రాన్ని కప్పుకొని వెనక్కి తిరిగి ఉన్న బాలుడి చిత్రం షూటింగ్ సమయంలో అనుకోకుండా జరిగిన ఒక సన్నివేశం నుంచి పుట్టిందని యాదవ్ గుర్తుచేసుకున్నారు. వస్త్రం, నీడలు, చుట్టూ ఉన్న వెలుతురు కలయికతో కూడిన ఆ పోస్టర్... బికమింగ్ చిత్ర ప్రధాన సారాంశాన్ని అందంగా ప్రతిబింబించిందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇఫీ- 2026లో ఇండియన్ పనోరమా విభాగంలో తొలుత ప్రదర్శించే నాన్-ఫీచర్ చిత్రంగా తమ సినిమాను ఎంపిక చేసినందుకు లీనా యాదవ్, అసీమ్ బజాజ్ కృతజ్ఞతలు తెలిపారు. మానవ సంబంధాలూ, సాంస్కృతిక సంప్రదాయాలూ, సహజమైన లదాఖ్ ప్రకృతి అందాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్ర ప్రయాణం... భాషాపరమైన, భౌగోళికపరమైన సరిహద్దులను దాటి సాగే ఒక కథను అనుభూతి చెందే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పిస్తుంది.

ఈ విలేకరుల సమావేశానికి శ్రీ కిరణ్ మురళి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

పూర్తి ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఇక్కడ వీక్షించండి.

ఇఫీలాయిడ్‌ను ఇక్కడ చదవండి:

Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340176
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026