57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

జీవితానికి అర్థం చెప్పేది హాస్యం - ఐఎఫ్ఎఫ్ఐ 57లో ప్రపంచ ప్రీమియర్‌గా ప్రదర్శితమైన స్పెయిన్‌ చిత్రం ‘లుకింగ్‌ ఫర్‌ మైఖేల్‌’


నిజ జీవితంలో ఓ మహిళ సాగించిన ప్రయాణం ఆధారంగా రూపొందిన సంగీత ప్రధాన చిత్రం - జీవిత సవాళ్లను ఎదుర్కోవడంలో మనోధైర్యం, స్నేహబంధం, నవ్వుకి గల శక్తిని ఆవిష్కరించిన చిత్రం

నాడు పోస్టు చేయడమైనది: 21 NOV 2026 6:54PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340164Views: 3

జీవితంలోని కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొంటే ఎలా ఉంటుంది? స్పెయిన్‌కు చెందిన 2026 హాస్య, భావోద్వేగ ప్రధాన చిత్రం ‘లుకింగ్‌ ఫర్‌ మైఖేల్‌’ (పెర్సిగుయెండో ఎ మైఖేల్‌) ఈ ప్రశ్నకు హృద్యమైన కథనం ద్వారా సమాధానమిస్తుంది. జువానా మాసియాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ధైర్యం, స్నేహం, మనోధైర్యం వంటి అంశాలను ఆవిష్కరిస్తుంది. గోవాలోని పనాజీలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో ఈ చిత్రం నేడు తొలిసారిగా ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్న సోనియా అనే యువతి కథను ఆవిష్కరిస్తుంది.  పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని, జీవితాన్ని కొత్త దృక్పథంతో చూడాలని ఆమె నిర్ణయించుకుంటుంది. అదే వ్యాధితో జీవిస్తున్న తన సంగీత చికిత్సా బృందంలోని సభ్యుల సహకారంతో, పార్కిన్సన్స్‌ వ్యాధితో జీవిస్తున్న విషయాన్ని బహిరంగంగా వెల్లడించిన ప్రముఖ నటుడు మైఖేల్‌ జె. ఫాక్స్‌ను కలుసుకునేందుకు ఆమె ప్రయాణం ప్రారంభిస్తుంది. సంగీతం, హాస్యాన్ని మేళవిస్తూ సాగే ఈ ప్రయాణ కథా చిత్రం, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా జీవితాన్ని తమకు నచ్చిన విధంగా, తమదైన శైలిలో సాగించాలన్న సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది.

 

ముప్పై ఏళ్ల వయసు దాటిన తొలినాళ్లలోనే పార్కిన్సన్స్‌ వ్యాధి బారినపడిన యెస్‌ ఆండ్రెజ్‌ అనే మహిళ నిజ జీవిత ప్రయాణం, ఆమె కల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆమె వ్యక్తిగత అనుభవాలు ఈ కథనానికి ఆత్మీయతను, సహజత్వాన్ని అద్దాయి. నిత్యజీవితంలోని సంఘటనలను నిశితంగా పరిశీలించి తెరకెక్కించడం వల్ల కథనంలో భావోద్వేగపరమైన నిజాయతీ ప్రతిబింబిస్తుంది. తద్వారా పాత్రలు ఎదుర్కొనే సవాళ్లు, వారి ఆశయాలు ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కృతమవుతాయి.

ఈ చిత్ర ప్రదర్శన సందర్భంగా ఏర్పాటయిన కార్యక్రమంలో చిత్ర దర్శకురాలు జువానా మాసియాస్‌ మాట్లాడుతూ, ‘‘జీవితాన్ని అర్థం చేసుకునేందుకు హాస్యం ఒక తెలివైన మార్గం’’ అని పేర్కొన్నారు. అనారోగ్యం, అత్యంత ఆత్మీయులైన వారిని కోల్పోవడం లేదా అనుకోని ఇతర సమస్యల రూపంలో ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక దశలో కష్టాలను ఎదుర్కొంటారని ఆమె అన్నారు. ఈ అనుభవాలు అందరికీ సాధారణమే కావడంతో ఈ చిత్రానికి విస్తృతమైన ఆదరణ లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. దేశాల సరిహద్దులు, తరాల అంతరాలకు అతీతంగా ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఈ చిత్రం ప్రధాన సందేశం ఉంటుందని, ఇది 57వ ఐఎఫ్ఎఫ్ఐ ఇతివృత్తానికి కూడా అనుగుణంగా ఉందని ఆమె పేర్కొన్నారు

డోరిస్‌ పాత్రలో నటించిన లోరెనా లోపెజ్‌ మాట్లాడుతూ, ఆ పాత్రలోని మనోధైర్యం, ఉత్సాహభరితమైన వ్యక్తిత్వం, సోనియాతో ఉన్న స్నేహబంధం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. సోనియా పాత్రను నూరియా హెరెరో పోషించారు. వీల్‌చైర్‌ ఉపయోగించే డోరిస్‌ సోనియా ప్రయాణంలో స్నేహితురాలిగానే కాకుండా మార్గదర్శిగా కూడా నిలుస్తుంది. జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడంలో తోడుగా నిలిచే స్నేహం, పరస్పర సహకారం ఎంత ముఖ్యమో ఈ పాత్ర ద్వారా చిత్రం చాటిచెబుతుంది.

 

నటీనటుల నుంచి సహజమైన నటనను రాబట్టేందుకు తాను అనుసరించిన విధానం గురించి కూడా మాసియాస్‌ వివరించారు. రిహార్సల్స్‌తో పాటు చిత్రీకరణ సమయంలో కూడా నటీనటులను అక్కడికక్కడే తమదైన రీతిలో సంభాషణలు, హావభావాల మెరుగుదలకు ప్రోత్సహించినట్లు తెలిపారు. ముఖ్యంగా హాస్య చిత్రాల్లో ఈ పద్ధతి ఎంతో ఉపయోగకరమని, పాత్రల మధ్య సహజమైన సంబంధాలు, పరస్పర సంభాషణలు రూపుదిద్దుకునేందుకు దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు.

చిత్రంలో సంగీతం ప్రాధాన్యత గురించి వివరిస్తూ, సోనియా తన అనారోగ్య పరిస్థితితో క్రమంగా ఎలా సర్దుకుపోతోందో పాటల ద్వారా ప్రతిబింబించామని మాసియాస్‌ తెలిపారు. పాత్రల భావోద్వేగాలు, అనుభవాలతో పాటలను విడదీయలేని విధంగా మేళవించినట్లు వివరించారు. చిత్రం ప్రారంభంలో వచ్చే పాటను ప్రస్తావిస్తూ, తన ఆరోగ్య పరిస్థితిని అదుపులో ఉంచుకోవడానికి సోనియా ప్రతిరోజూ ఎనిమిది మాత్రలు వేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. నిత్యజీవితంలో ఆమె ఎదుర్కొనే ఈ వాస్తవాన్ని సంగీతం ద్వారా చిత్రంలోని భావోద్వేగ కథనంలో భాగం చేశామని ఆమె వివరించారు.

చిత్రం కోసం చేసిన  పరిశోధన గురించి మాసియాస్‌ మాట్లాడుతూ, యెస్‌ ఆండ్రెజ్‌తో పాటు పార్కిన్సన్స్‌ వ్యాధితో జీవిస్తున్న పలువురిని తాను విస్తృతంగా ఇంటర్వ్యూ చేసినట్లు తెలిపారు. వారి కథలను తెరపై ఆవిష్కరించేటప్పుడు, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు, అనుభవాలను నిజాయతీగా, సహజత్వంతో అర్థం చేసుకోవడం ఎంతో అవసరమని ఆమె స్పష్టం చేశారు.

 

స్పానిష్‌ సినిమాలు భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకు ఏ విధంగా చేరువ కాగలవన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, సంగీతానికి, ప్రతికూల పరిస్థితులను అధిగమించే కథలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంటుందని మాసియాస్‌ అభిప్రాయపడ్డారు. మరింత విస్తృతమైన ప్రేక్షకులకు తమ చిత్రాలను చేరువ చేసేందుకు స్పెయిన్‌తో పాటు అంతర్జాతీయ ఓటీటీ వేదికలతో కలిసి పనిచేసే ప్రణాళికలు కూడా ఉన్నాయని ఆమె వెల్లడించారు.

ఐఎఫ్ఎఫ్ఐలో ఈ చిత్రాన్ని తొలిసారిగా ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ద్వారా భౌగోళిక, సాంస్కృతిక సరిహద్దులను అధిగమించే ఒక కథను చలనచిత్రోత్సవానికి పరిచయం చేసినట్లయింది. జీవితంలోని అనిశ్చితులను ఎదుర్కోవడంలో హాస్యం, సంగీతం, మానవ సంబంధాలకు ఉన్న అపారమైన శక్తిని ఈ చిత్రం ప్రేక్షకులకు స్పష్టం చేస్తుంది.

ఈ  కార్యక్రమానికి శ్రీ కుల్దీప్‌ మీనా సమన్వయకర్తగా వ్యవహరించారు.

Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340164
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026