నాడు పోస్టు చేయడమైనది:
18 NOV 2026 2:27PM by PIB Hyderabad
భారత్లో మత్తుమందులు, మానసిక రోగ కారక పదార్థాలను గుట్టుగా తయారు చేస్తున్న వర్గాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఒక పెద్ద దాడిలో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) 2026 నవంబర్ 15వ, 16వ తేదీల్లో న్యూఢిల్లీలోని గాజీపూర్లో అల్ప్రాజోలమ్ను తయారు చేస్తున్న ఒక అక్రమ ప్రయోగశాల పనిపట్టింది.
రహస్య సమాచారం అందుకున్న మీదట, కంప్యూటర్ దుకాణం ముసుగులో చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగిస్తున్న ఒక చోటును డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. ఒక ప్రయోగశాలను పూర్తి స్థాయిలో పనిచేయిస్తున్నారని తనిఖీలో తెలుసుకున్నారు. అక్కడ ఒక రియాక్షన్ ఉపకరణం, వాటర్ చిల్లర్, వ్యాక్యూమ్ ఎగ్జాస్ట్ యంత్రంతో పాటు తయారీ ప్రక్రియలో ఉపయోగిస్తున్న ఇతర సామగ్రిని గమనించారు.
ఘన, ద్రవ రూపాల్లో ఉన్న148 కేజీల అల్ప్రాజోలమ్ ఇంటర్మీడియట్, సుమారు 1,046 కేజీల ముడిసరుకు, తయారీ ప్రక్రియలో వాడిన రసాయనాలు, 188 లీటర్ల అదనపు రసాయనాలు, ద్రవ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ (ఎన్డీపీఎస్) యాక్టు-1985 నిబంధనల ప్రకారం ప్రయోగశాల ఉపకరణాలను, సంబంధిత సామగ్రిని జప్తు చేశారు.
గుట్టుచప్పుడు కాకుండా ప్రయోగశాలను నడుపుతున్న ఒక వ్యక్తిని ఎన్డీపీఎస్ యాక్టు-1985 నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు.
బెంజోడాయజెపైన్ శ్రేణికి చెందిన మనోరోగకారక పదార్థమే అల్ప్రాజోలమ్. దీనిని సాధారణంగా జనాక్స్, అల్ప్రాక్స్ తదితర బ్రాండ్ పేర్లతో విక్రయిస్తారు. ఇది డాక్టరు రాసే చీటీని చూసి అమ్మే మందు. దీనిని ముఖ్యంగా వ్యాకులత, భయాందోళన, గాభరా వంటి అనారోగ్య స్థితుల చికిత్సకు వాడతారు. ఏమైనా దీని దురుపయోగం, వ్యసనంలా మారేందుకు అవకాశం ఉండటం, చట్ట వ్యతిరేక మార్గాల్లో చలామణి వంటివి ప్రజారోగ్యానికి గంభీర ఆందోళనకర అంశాలు అని చెప్పవచ్చు. అల్ప్రాజోలమ్ను ఎన్డీపీఎస్ యాక్టు-1985లో భాగంగా ఒక నోటిఫైడ్ మనోరోగకారక పదార్థంగా గుర్తించారు. దీనిని అనధికారికంగా తయారు చేయడం, అట్టిపెట్టుకోవడం, అమ్మకం, పంపిణీకి ఒడిగడితే ఈ చట్టంలోని శిక్షాత్మక నిబంధనలు వర్తిస్తాయి.
ఉత్తరప్రదేశ్లోని జాలౌన్ జిల్లాలో కృత్రిమ ఔషధాల తయారీ చేసే ఒక పెద్ద అక్రమ ప్రయోగశాల గుట్టును 2026 అక్టోబర్ 29న డీఆర్ఐ రట్టు చేసిన తరువాత, తాజా దాడిని నిర్వహించారు. జాలౌన్ దాడిలో ఉత్తరప్రదేశ్ తీవ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) సహకారాన్ని కూడా తీసుకున్నారు. జాలౌన్ జిల్లాలో చేసిన దాడిలో దాదాపు 1,100 కేజీల మత్తుమందులను, పూర్వ- రసాయనిక పదార్థాలను, తయారీకి ఉపయోగిస్తున్న ఒక యంత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఢిల్లీలో గప్చిప్గా సాగుతున్న ల్యాబొరేటరీ భరతం పట్టిన ఘటన జాలౌన్లో దాడి చేసిన కొన్ని వారాలకు చోటు చేసుకుంది. చట్టవిరుద్ధంగా మత్తుమందును తయారు చేస్తున్న కేంద్రాలను ఆరా తీసి, వాటిని ధ్వంసం చేయడానికి డీఆర్ఐ తదేకంగా దృష్టి సారిస్తోందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. అది ఇంటర్మీడియట్ సామగ్రి అయినా, లేదా అక్రమ సరఫరా వ్యవస్థలో భాగమైన పూర్వ- రసాయనిక పదార్థాలు అయినా సరే.. వాటి కూపీ లాగి, అలాంటి కార్యకలాపాలకు సహాయకారిగా ఉంటున్న నెట్వర్కుల పీచమణచడానికి డీఆర్ఐ కృతనిశ్చయంతో పనిచేస్తోంది.
***