నాడు పోస్టు చేయడమైనది:
18 NOV 2026 1:26PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఉన్న 13 క్రీడా విశ్వవిద్యాలయాలతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో సమావేశం నిర్వహించారు.
క్రీడా విశ్వవిద్యాలయాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, నైపుణ్యాలు, వనరులను పరస్పరం పంచుకోవడం, దేశ క్రీడా విద్య, పరిశోధన, శిక్షణ, అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించేందుకు సమగ్ర వ్యవస్థను నిర్మించడంపై ఈ సమావేశంలో చర్చించారు.

కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. ‘‘క్రీడాకారులు, శిక్షకులు, శిక్షణ, పరిశోధన, పోటీలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అన్నీ సమన్వయంతో అభివృద్ధి చెందేలా, మొత్తం క్రీడా వ్యవస్థకు కేంద్రాలుగా క్రీడా విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు.
దేశానికి ప్రయోజనం చేకూరేలా ప్రతి విశ్వవిద్యాలయం నిర్దిష్ట క్రీడల్లో తనదైన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని క్రీడల మంత్రి ప్రోత్సహించారు. ‘‘ప్రతి విశ్వవిద్యాలయం ఒక నిర్దిష్ట క్రీడ, శిక్షణ, క్రీడా శాస్త్రం లేదా పరిశోధన వంటి రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ఇది మొత్తం దేశానికి ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని ఆయన అన్నారు.

విశ్వవిద్యాలయాలు తమకంటూ ప్రత్యేక నైపుణ్య రంగాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించడంతోపాటు.. పరస్పరం విజ్ఞానాన్ని పంచుకోవాలని కూడా ప్రోత్సహించారు.
‘‘ఇకపై విడివిడిగా పనిచేయడం ఉండదు. మన ప్రయత్నాలు, వనరులు, నైపుణ్యాలను సమన్వయం చేసుకోవడం ద్వారా బలమైన, సహకారంతో కూడిన జాతీయ క్రీడా వ్యవస్థను నిర్మిస్తాం. విశ్వవిద్యాలయాల మధ్య శిక్షకుల మార్పిడి, విజ్ఞాన మార్పిడి, వనరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాం’’ అని డాక్టర్ మాండవీయ తెలిపారు.
భారత క్రీడాకారుల సామర్థ్యాలను మరింత పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి కొనసాగుతున్నప్పటికీ.. దేశంలో మొత్తం క్రీడా వ్యవస్థతో పాటు క్రీడా పరిశ్రమ అభివృద్ధికి దోహదపడే వ్యవస్థలను రూపొందించాలని కూడా డాక్టర్ మాండవీయ విశ్వవిద్యాలయాలకు సూచించారు.

“క్రీడా శాస్త్రం, క్రీడా చట్టం, క్రీడా పర్యాటకం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై విశ్వవిద్యాలయాలు దృష్టి సారించాలి. తద్వారా ఈ రంగాల్లో దేశవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయడంతో పాటు, బలమైన సంస్థాగత సామర్థ్యాలను అభివృద్ధి చేయాలి’’ అని డాక్టర్ మాండవీయ అన్నారు.
“క్రీడా విశ్వవిద్యాలయాలు కేవలం క్రీడాకారుల తయారీకి మాత్రమే పరిమితం కాకుండా, క్రీడా నిర్వహణ, పరిపాలన, మొత్తం క్రీడా వ్యవస్థకు తోడ్పడగల నిపుణులను కూడా తీర్చిదిద్దాలి. భారతీయ క్రీడా విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయిలో తమదైన ముద్ర వేసి, ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో స్థానం సంపాదించాలన్నది మా లక్ష్యం” అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఈ సమావేశానికి కేంద్ర యువజన యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే, క్రీడల కార్యదర్శి శ్రీ హరి రంజన్ రావు, దేశవ్యాప్తంగా ఉన్న 13 క్రీడా విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు.
***