57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

57వ ఇఫీ 2026లో కొత్తగా యానిమేషన్ విభాగం.. భావోద్వేగాలకు పెద్దపీట వేసే యానిమేషన్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు


జపాన్, ఫ్రాన్స్, చైనా, సింగపూర్, అమెరికా నుంచి ఎంపిక చేసిన ఐదు అంతర్జాతీయ యానిమేషన్ చిత్రాల ప్రదర్శన

నాడు పోస్టు చేయడమైనది: 18 NOV 2026 1:09PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2337850Views: 6

సాధారణ చిత్రాలకు ప్రాణం పోసి మనసును హత్తుకునే కథలుగా మలచగల ప్రత్యేక శక్తి యానిమేషన్‌కు ఉంది. సంస్కృతి, వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం దీని ప్రత్యేకత. యానిమేషన్ చిత్రాల్లో కళాత్మకత, భావోద్వేగాల లోతును చాటిచెప్పేందుకు 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) 2026లో కొత్తగా ప్రత్యేక యానిమేషన్ విభాగాన్ని ప్రవేశపెడుతున్నారు. జపాన్, ఫ్రాన్స్, చైనా, సింగపూర్, అమెరికా దేశాల నుంచి ఎంపిక చేసిన ఐదు అత్యుత్తమ అంతర్జాతీయ యానిమేషన్ చిత్రాలను ఈ విభాగంలో ప్రదర్శించనున్నారు. అద్భుతమైన దృశ్యాలతో కనువిందు చేయడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను స్పృశించే చిత్రాలకు ఈ విభాగం వేదికగా నిలవనుంది.

చెర్రీ అండ్ వర్జిన్ (జపాన్)

ఆధునిక ప్రేమ సంబంధాలు, సామాజిక ఆందోళనలను సున్నితంగా ఆవిష్కరించే జపాన్ యానిమేషన్ చిత్రం 'చెర్రీ అండ్ వర్జిన్'. మసానావో కవాజిరి దర్శకత్వం వహించిన ఈ 2026 చిత్రం ఇద్దరు వ్యక్తుల మధ్య క్రమంగా చిగురించే అనుబంధాన్ని చూపిస్తుంది. మహిళలతో మాట్లాడటానికి ఇబ్బందిపడే 32 ఏళ్ల ర్యో అనే శృంగార మాంగా చిత్రకారుడు, నిజజీవితంలో పురుషులతో మెలగడానికి సంకోచించే 28 ఏళ్ల అమీ చుట్టూ కథ సాగుతుంది. ప్రేమ సంబంధాల్లో అనుభవం లేకపోవడం, తమలోని భయాలు, అభద్రతా భావాల మధ్య వీరిద్దరూ కలుసుకుంటారు. క్రమంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తమలోని సంకోచాలను అధిగమిస్తారు. నిజమైన అనుబంధంలో దాగి ఉన్న ఆనందాన్ని తెలుసుకుంటారు.

 

వాస్తవ నటీనటులతో చిత్రీకరించిన దృశ్యాలను మాంగా యానిమేషన్‌తో మేళవించి హాస్యం, ఆత్మీయత కలగలిసిన రీతిలో దర్శకుడు ఈ కథను తెరకెక్కించారు. ఒసాకా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌లో విద్యనభ్యసించిన కవాజిరి, 2018లో రూపొందించిన 'ఎ జపనీస్ బాయ్ హూ డ్రాస్' అనే యానిమేషన్ లఘుచిత్రంతో పలు చలనచిత్రోత్సవాల్లో గుర్తింపు పొందారు. వాస్తవ దృశ్యాలు, యానిమేషన్‌ను కలిపి రూపొందించే ఆయన ప్రత్యేక శైలి జపాన్‌తో పాటు అంతర్జాతీయంగానూ ప్రశంసలు అందుకుంటోంది.

 

జిమ్ క్వీన్ (ఫ్రాన్స్)

సమకాలీన సామాజిక పరిస్థితులను వ్యంగ్యంతో పాటు భావోద్వేగాలను మేళవించి చూపించే ఫ్రెంచ్ యానిమేషన్ చిత్రం 'జిమ్ క్వీన్'. నికోలస్ అథానే, మార్కో న్గుయెన్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ 2026 చిత్రం పారిస్ నేపథ్యంలో సాగుతుంది. నగరంలోని స్వలింగ సంపర్కుల సమాజంలో ఎంతో ఆదరణ పొందిన ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ జిమ్ ఈ కథలో ప్రధాన పాత్రధారి. 'హెటెరోసిస్' అనే అంతుచిక్కని వైరస్ స్వలింగ సంపర్కులైన పురుషులను భిన్నలింగ సంపర్కులుగా మార్చడం ప్రారంభించడంతో జిమ్ జీవితం ఒక్కరాత్రిలో తలకిందులవుతుంది. తనను అనుసరించేవారు, స్నేహితులు, సామాజిక హోదాను అతడు కోల్పోతాడు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అతనికి అండగా నిలిచేది పెద్దగా ప్రజాదరణ లేని యువకుడు లూసియన్ మాత్రమే. ఈ వైరస్‌కు చికిత్స అందించగల వైద్యుడిని వెతుకుతూ వీరిద్దరూ పారిస్‌లోని సందడిగా ఉండే మరైస్ ప్రాంత వీధుల్లో ప్రయాణం ప్రారంభిస్తారు.

ఈ చిత్ర దర్శకులిద్దరూ ప్రసిద్ధ గొబెలిన్స్ యానిమేషన్ విద్యాసంస్థలో శిక్షణ పొందారు. నికోలస్ అథానే గతంలో 'రేమాన్' గేమ్స్, 'ది రబ్బీస్ క్యాట్', 'ది రెడ్ టర్టిల్' వంటి ప్రాజెక్టుల్లో పనిచేశారు. 'మిస్టర్ ఫ్లాప్', 'స్టార్టప్ హీరోస్', 'పీపూడో' వంటి యానిమేషన్ ధారావాహికలకు సహదర్శకత్వం వహించారు. మార్కో న్గుయెన్ 'ది రబ్బీస్ క్యాట్', 'ఎర్నెస్ట్ అండ్ సెలెస్టీన్', 'ది సమ్మిట్ ఆఫ్ ది గాడ్స్' వంటి చిత్రాలకు అందించిన సేవలతో దృశ్యకళా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

లైట్ పిల్లర్ (చైనా)

వేగంగా మారుతున్న ప్రపంచంలో ఒంటరితనం, ఆరాటం, అనుబంధాలను ఆవిష్కరించే చైనా యానిమేషన్ చిత్రం 'లైట్ పిల్లర్'. రచయిత, దర్శకుడు, ప్రొడక్షన్ డిజైనర్ షు జావో తొలిసారిగా పూర్తి నిడివి యానిమేషన్ చిత్ర దర్శకుడిగా రూపొందించిన 2026 చిత్రం ఇది. అంతరిక్ష ప్రయాణాలు సాధారణమైన భవిష్యత్ ప్రపంచం నేపథ్యంలో కథ సాగుతుంది. దివాలా తీసిన ఓ సినిమా స్టూడియో ప్రాంగణాన్ని శుభ్రం చేసే జా అనే ఒంటరి వ్యక్తి, ఆకర్షణీయమైన వర్చువల్ ప్రపంచంలో ఒక మహిళతో ప్రేమలో పడతాడు. ఆమెను కలుసుకునేందుకు చంద్రుడిపైకి వెళ్లే టికెట్ కొనడానికి అదనపు గంటలు పనిచేసి డబ్బు సంపాదిస్తాడు. అయితే తాను కొనుగోలు చేసిన టికెట్ చెల్లదని తెలుసుకుని నిరాశ చెందుతాడు. ఇదే సమయంలో ఓ సినిమా క్లైమాక్స్ సన్నివేశం చిత్రీకరణ కోసం పాత స్టూడియోను కూల్చివేసేందుకు చిత్ర బృందం అక్కడికి వస్తుంది. తనకు తెలిసిన ఏకైక ప్రపంచమైన ఆ స్టూడియోతో పాటే తానూ అంతమైపోవాలని జా భావోద్వేగభరితమైన నిర్ణయం తీసుకుంటాడు.

1991లో చైనాలోని అన్షాన్‌లో జన్మించిన షు జావో, బీజింగ్ ఫిల్మ్ అకాడమీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. గతంలో ఆయన రూపొందించిన 'నో చేంజెస్ హావ్ టేకెన్ ఇన్ అవర్ లైఫ్' అనే యానిమేషన్ లఘుచిత్రం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం రోటర్‌డామ్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో తొలిసారిగా ప్రదర్శితమైంది.

 

మ్యాజిక్ అట్లాస్ (సింగపూర్)

జ్ఞాపకాలు, ప్రతిఘటన ఇతివృత్తాల ఆధారంగా సింగపూర్ నుంచి వస్తున్న చైనీస్ భాషా యానిమేషన్ చిత్రం 'మ్యాజిక్ అట్లాస్'. సన్ షున్ దర్శకత్వం వహించిన ఈ 2026 చిత్రం లోతైన సామాజిక సందేశంతో కూడిన రూపక కథగా తెరకెక్కింది. ప్రపంచానికి దూరంగా ఉన్న లువోచా అనే బొగ్గు రాజ్యంలోకి ఓ రహస్య మాంత్రికుడు ప్రవేశించడంతో అప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్న సమాజంలో భయం, అశాంతి మరింత పెరుగుతాయి. అధికారులు ఆ మాంత్రికుడిని అరెస్టు చేసి షియావో జి అనే అనాథ బాలుడితో కలిసి జైలులో నిర్బంధిస్తారు. మిమెంగ్ ఉత్సవం సందర్భంగా మాంత్రికుడిని సజీవ దహనం చేయడానికి కొద్దిసేపటి ముందు అతడు రహస్యంగా ఓ మాయా అట్లాస్‌ను ఆ బాలుడికి అప్పగిస్తాడు. పౌరులు తమ గతాన్ని మరిచిపోయేలా చేసే ప్రభుత్వ ఆచారమే ఈ మిమెంగ్ ఉత్సవం.

 

1980లో చైనాలోని ఫుషిన్‌లో జన్మించిన సన్ షున్, బీజింగ్‌లో నివసిస్తున్న కళాకారుడు. చైనా అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో విద్యనభ్యసించిన ఆయన 2005లో 'పై యానిమేషన్ స్టూడియో'ను స్థాపించారు. ఆయన రూపొందించిన చిత్రాలు వెనిస్, బెర్లిన్ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమయ్యాయి. లోకార్నో, టోక్యో చలనచిత్రోత్సవాల్లో పోటీ విభాగాల్లో ప్రదర్శితమైన 'మ్యాజిక్ అట్లాస్' ఇప్పుడు ఇఫీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

రే గన్ (అమెరికా)

ఈ ప్రత్యేక యానిమేషన్ విభాగంలో చివరి చిత్రం అమెరికాకు చెందిన ఆంగ్ల భాషా యానిమేషన్ చిత్రం 'రే గన్'. అకాడమీ అవార్డు విజేత బ్రాడ్ బర్డ్ 2026లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భవిష్యత్ నగరమైన మెట్రోపియా నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మనుషులు, గ్రహాంతరవాసులు కలిసి నివసించే ఈ నగరంలో ఆకాశమంతా ఎగిరే కార్లతో నిండి ఉంటుంది. ప్రతి వస్తువుకూ ధర ఉండే ఈ నగరం పైకి ఎంతో ఆకర్షణీయంగా కనిపించినా, అంతర్గతంగా విస్తృతమైన అవినీతి రాజ్యమేలుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాతకాలపు విలువలను కాపాడుకునేందుకు ప్రయత్నించే ప్రైవేట్ డిటెక్టివ్ రే గన్ అనుకోకుండా తన వృత్తి జీవితంలోనే అతిపెద్ద కేసులో చిక్కుకుంటాడు. తన వృత్తికి కాలం చెల్లిందని సమాజం భావిస్తున్నప్పటికీ, అతడు తన విలువలకు కట్టుబడి పోరాడుతుంటాడు.

రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాత్ర కళాకారుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాడ్ బర్డ్ భావోద్వేగాలు, హాస్యం, యాక్షన్‌ను అద్భుతంగా మేళవించడంలో ప్రసిద్ధి చెందారు. 'ది ఇన్‌క్రెడిబుల్స్', 'రాటటూయి', 'మిషన్: ఇంపాజిబుల్ – ఘోస్ట్ ప్రోటోకాల్' వంటి చిత్రాలతో తనదైన కథన నైపుణ్యాన్ని చాటుకున్న ఆయన, అదే ప్రత్యేకతను భవిష్యత్ సాంకేతిక ప్రపంచాన్ని పాతకాలపు డిటెక్టివ్ కథా శైలితో మేళవించిన 'రే గన్' చిత్రంలోనూ చూపించారు.

ఈ కొత్త విభాగం ద్వారా యానిమేషన్‌ను కేవలం ఒక చిత్ర నిర్మాణ ప్రక్రియగా కాకుండా మానవ ఆశలు, బలహీనతలు, భావోద్వేగాలు, మనుషుల మధ్య ఉమ్మడి అనుభూతులను ప్రతిబింబించే కళారూపంగా చూడాలని 57వ ఇఫీ 2026 ప్రేక్షకులను ఆహ్వానిస్తోంది.

ఇఫీ గురించి

1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆసియాలోనే అత్యంత పురాతనమైన, ప్రముఖ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఒకటి. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గోవా ప్రభుత్వం, గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ సహకారంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ సినీ రంగంలోని అత్యుత్తమ చిత్రాలను ప్రోత్సహించడంతో పాటు భారతీయ సినిమాలు, ప్రతిభకు అంతర్జాతీయ వేదిక కల్పించడం ఇఫీ ప్రధాన లక్ష్యం. ప్రతి సంవత్సరం గోవాలో నిర్వహించే ఈ చలనచిత్రోత్సవం సృజనాత్మక ఆలోచనల పరస్పర మార్పిడికి, కొత్త ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి, సినిమా ద్వారా విభిన్న సంస్కృతుల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి వేదికగా నిలుస్తోంది.

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2337850
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026