పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
17 NOV 2026 1:04AM by PIB Hyderabad
వాతావరణ మార్పును తగ్గించడంలోను, పర్యావరణీయ దృఢత్వాన్ని పటిష్టపరచడంలోను పెద్ద పులుల సంరక్షణ చర్యలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అన్నారు. ఆయన ఈ రోజు ‘బిగ్ క్యాట్స్: డ్రైవర్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్’ (వాతావరణ మార్పులను తగ్గించడంలో సహకరిస్తున్న పెద్దపులులు) పేరుతో నిర్వహించిన ఒక ఉన్నత స్థాయి మంత్రుల సమావేశంలో పాల్గొని, ప్రసంగించారు. ఈ సమావేశాన్ని తుర్కియే లోని అంతాల్యాలో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ (సీఓపీ31) నేపథ్యంలో భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ పెద్ద పులుల అలయెన్స్ (ఐబీసీఏ) సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సమావేశంలో.. పెద్ద పులుల నివాస స్థానాలు కలిగివున్న నేపాల్, వెనెజుయేలా, కంబోడియా, శ్రీలంక వంటి దేశాలకు (బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్) చెందిన మంత్రులు, ప్రతినిధులతో పాటు రామ్సర్ కన్వెన్షన్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ (యూఎన్సీసీడీ) వంటి అంతర్జాతీయ సమావేశాలు, సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
వాతావరణ మార్పులను తగ్గింపచేయడం, విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్) దృఢత్వం, సుస్థిరాభివృద్ధి సాధనలో పెద్ద పులులు, వాటి సహజ ఆవాసాలు అందిస్తున్న తోడ్పాటుపై సంరక్షణ నిపుణులు, ప్రముఖులు ఈ సమావేశంలో సమీక్షించారు. కర్బన సమృద్ధ ఇకోసిస్టమ్ల రక్షణ, ఇకోసిస్టమ్ సేవలను బలోపేతం చేయడం, వాతావరణ దృఢత్వాన్ని పెంపొందింప చేయడం, ప్రపంచ వాతావరణ లక్ష్యాల సాధనను ముందుకు తీసుకుపోవడంలో ప్రపంచంలోని ఏడు ప్రధాన పెద్ద పులి ప్రజాతులు, వాటి ఆవాసాల సంరక్షణ ఏ రకంగా దోహదం చేయగలవన్న అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. ఐబీసీఏతో పాటు, బిగ్ క్యాట్ రేంజ్ దేశాలలో పెద్ద పులుల స్థితిగతులు ఎలా ఉన్నాయన్న అంశంపై ఐబీసీఏ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎస్.పి. యాదవ్ ఓ నివేదికను సమర్పించారు. పెద్ద పులుల సంరక్షణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయత్వంలో భారత్ చేపడుతున్న కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా చీతాలకు పునఃప్రవేశ దిశగా చేస్తున్న ప్రయత్నాలను సమావేశంలో పాలుపంచుకున్నవారు ప్రశంసించారు.
శ్రీ యాదవ్ ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా పెద్ద పులుల సంరక్షణను ప్రోత్సహించడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన అంతర్జాతీయ పెద్ద పులుల అలయన్స్ (ఐబీసీఏ) భూమికను వివరించారు. ప్రపంచంలో వన్యప్రాణుల సంరక్షణలో సవాళ్లు ఎదురవుతున్న సంగతిని మంత్రి అంగీకరిస్తూ, భారతదేశం విజయవంతంగా అమలు చేసిన సంరక్షణ నమూనాల్ని ఇతర దేశాలతో కలిసి పంచుకొనేందుకు, జ్ఞాన మార్పిడికి మార్గాన్ని సుగమం చేసేందుకు, అంతర్జాతీయ సహకారాన్ని పటిష్టపరిచేందుకు, ప్రపంచం నలుమూలలా పులులకు చెందిన మొత్తం ఏడు ప్రజాతుల సంరక్షణ సామర్థ్యాన్ని పెంచేందుకు ఐబీసీఏ ఒక వేదికను సమకూరుస్తోందన్నారు. రాజకీయ నిబద్ధత, బలమైన సంస్థలు, నిరంతర పెట్టుబడి, సామాజిక భాగస్వామ్యం.. ఇవి పర్యావరణ భద్రత, వాతావరణ మార్పుల పట్ల దృఢత్వం, దీర్ఘకాలిక అభివృద్ధికి వన్యప్రాణుల సంరక్షణను ఒక సాధనంగా ఏ విధంగా మార్చగలవన్నది పులుల సంరక్షణకు భారత్ తీసుకుంటున్న చర్యలే చాటి చెప్తున్నాయని శ్రీ యాదవ్ అన్నారు.
కర్బనమయ భూభాగాలను రక్షించడంలో పెద్ద పులుల సంరక్షణ ప్రభావవంతమైన పద్ధతి కాగలదని మంత్రి స్పష్టం చేశారు. కర్బన పాళ్లను తగ్గించడంలో పులులు ప్రత్యక్షంగా ఎలాంటి తోడ్పాటును అందించకపోవచ్చు గాని కర్బనాన్ని సంగ్రహించే అడవులు, గడ్డిమైదానాలు, తడి నేలలు, పర్వతీయ విస్తారిత అనుబంధ వ్యవస్థలను పులుల సంరక్షణ ప్రక్రియ కాపాడి, తద్ద్వారా సహజస్థలాల క్షీణ స్థితి వెదజల్లే ఉద్గారాలను నిరోధించడంలో, వాతావరణ మార్పుల పట్ల దృఢత్వాన్ని పటిష్టపరచడంలో సహకరించగలుగుతాయని ఆయన అన్నారు. పెద్ద పులులు ఛత్ర ప్రజాతులు (అంబ్రెలా స్పీసీస్) అయిన కారణంగా, సంపూర్ణ పర్యవరణ భద్రతను పెంపొందింపచేయడంలో దోహదం చేయగలవని, ఫలితంగా ఆ భూభాగాలపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న వేల కొద్దీ ఇతర ప్రజాతులు, సముదాయాలకు మేలు కలుగుతుందని మంత్రి వివరించారు. ప్రకృతితో ముడిపడిన వాతావరణ మార్పు సంబంధిత కార్యాచరణలో వన్యజీవుల సంరక్షణను అంతర్భాగంగా గుర్తించితీరాలని, ఇది జీవవైవిధ్యం, ఇకోసిస్టమ్, జీవనోపాధి సంబంధిత ప్రయోజనాల్ని అందిస్తూనే ఉద్గారాల్ని తగ్గించే దిశగా చేసే ప్రయత్నాలకు పూరకంగా కూడా నిలవాలని మంత్రి పేర్కొన్నారు.
పులులను సంరక్షించాలన్న లక్ష్యంతో భారత్లో మొదలుపెట్టిన కార్యక్రమాలను ప్రకృతి ఆధారిత పరిష్కారాల మార్గాలుగా మంత్రి శ్రీ యాదవ్ వర్ణించారు. దేశంలో పులుల అభయారణ్యాలను యాభై ఎనిమిదింటిని ఏర్పాటు చేశారని, ఈ అభయారణ్యాలు సుమారు 85,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించాయని, ఇవి విశాలమైన అటవీ పర్యావరణ వ్యవస్థతో పాటు ఆయా ప్రాంతాలలో కార్బన్ నిలవలను కాపాడుతున్నాయని ఆయన అన్నారు. ఈ భూభాగాలు కర్బన నియంత్రణ, జల శుద్ధీకరణ, భూసార పరిరక్షణతో పాటు భూగర్భ జలమట్టాల పెంపు సహా కీలక ఇకోసిస్టమ్ సంబంధిత సేవలను అందిస్తున్నాయని మంత్రి వివరించారు. ఈ అభయారణ్యాల్లో 600కు మించిన నదులు ప్రవహిస్తూ పులుల సహజసిద్ధ ఆవాస ప్రాంతాలకు కీలక జలవనరులుగా అలరారుతున్నాయని మంత్రి తెలిపారు. సముదాయాల భాగస్వామ్యం, పర్యావరణ వికాసం, దీర్ఘకాలిక ప్రాతిపదికన జీవనోపాధి కల్పన కార్యక్రమాలు పులుల సంరక్షణకు సమ్మిళితత్వాన్ని, సుస్థిరత్వాన్ని జోడించాయని ఆయన వివరించారు.
పులుల సంరక్షణలో భారతదేశం సాధించిన విజయాల్ని శ్రీ యాదవ్ ప్రస్తావిస్తూ, దీనికి ఖ్యాతి అంతా నిరంతర రాజకీయ నిబద్ధత, బలమైన చట్టాలు, దృఢమైన సంస్థాగత యంత్రాగానిదే అన్నారు. వన్యప్రాణుల (పరిరక్షణ) చట్టం-1972తో పాటు చట్టబద్ధ సంస్థ అయిన ‘జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ’ (ఎన్టీసీఏ) బలపరుస్తున్న ‘ప్రాజెక్ట్ టైగర్’ ఓ పటిష్ట పాలనాస్వరూపాన్ని అందించాయన్నారు. భారతదేశంలో పులుల సంఖ్య పెరిగి 2022లో 3,682కు చేరిందని, ఇది ప్రపంచంలో వన్య వ్యాఘ్రాల మొత్తం సంఖ్యలో 70 శాతం కన్నా ఎక్కువని వివరించారు. ఈ విజయం కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో నిరంతర కేటాయింపులు, అంకితభావంతో విధులను నిర్వర్తిస్తున్న అటవీ సిబ్బంది, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, సాముదాయిక నిర్వహణల వల్ల సాధ్యపడిందని తెలిపారు. ‘ప్రాజెక్ట్ టైగర్’ ఏటా దాదాపు 60 లక్షల పనిదినాల మేర బతుకుతెరువు అవకాశాలను కల్పిస్తోందని, దీంతో పర్యావరణ హితకర జీవనోపాధికల్పనకు తోడు సాముదాయిక జీవనోపాధి భద్రతకు ప్రధాన చోదక శక్తిగా పులుల సంరక్షణ కార్యక్రమం నిలిచిందని మంత్రి అన్నారు.
***