రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఏడాది పొడవునా సాగే ఐసీఎంఆర్ - ఎన్ఐఎంఆర్ స్వర్ణోత్సవాలను ప్రారంభించిన భారత రాష్ట్రపతి


పరిశోధన, సహకారం, ఆవిష్కరణల ద్వారా వికసిత భారత ఆరోగ్య లక్ష్యాల సాధనలో ముందువరుసలో నిలుస్తున్న ఐసీఎంఆర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నాడు పోస్టు చేయడమైనది: 17 NOV 2026 2:58PM by PIB Hyderabad

ఏడాది పొడవునా నిర్వహించతలపెట్టిన భారత వైద్య పరిశోధన మండలి - జాతీయ మలేరియా పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్-ఎన్ఐఎంఆర్) స్వర్ణోత్సవాలను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో ఈ రోజు (2026 నవంబర్ 17) ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎంతో కాలంగా మలేరియా ఒక తీవ్రమైన ప్రజారోగ్య సవాలుగా ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో మన దేశం ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన ప్రజారోగ్య సవాళ్లలో మలేరియా ఒకటని ఆమె గుర్తుచేశారు. అయితే, కొన్నేళ్లుగా మలేరియా నియంత్రణలో భారత్ గణనీయమైన పురోగతి సాధించడం ఎంతో సంతృప్తికరమైన విషయమని రాష్ట్రపతి పేర్కొన్నారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలు, ఆధునిక రోగనిర్ధారణ పద్ధతులు, ప్రభావవంతమైన ఔషధాలు, దోమల నియంత్రణపై ప్రచార కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. మలేరియా నిర్మూలన దిశగా భారత్ పురోగతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించిన ‘హై బర్డెన్ టు హై ఇంపాక్ట్’ విభాగం నుంచి 2024లో భారత్ బయటకు వచ్చిందన్నారు. మన ప్రజారోగ్య కార్యక్రమాలు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య రక్షణ సిబ్బంది, ప్రజలందరి సమష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు. మలేరియాపై సాగిన ఈ సుదీర్ఘ పోరాటంలో జాతీయ మలేరియా పరిశోధన సంస్థ (ఎన్ఐఎంఆర్) కీలక పాత్ర పోషించిందన్నారు. మలేరియా పరాన్నజీవులు, దోమలు, వాహక నియంత్రణ, క్రిమిసంహారక నిరోధకత, సామాజిక భాగస్వామ్యంతో కూడిన పర్యవేక్షణ వంటి అంశాల్లో అయిదు దశాబ్దాలుగా ఈ సంస్థ పరిశోధనలు మార్గదర్శకంగా నిలిచాయంటూ రాష్ట్రపతి ప్రశంసించారు.

వాతావరణ మార్పులు, ప్రణాళికారహిత పట్టణీకరణ, క్రిమిసంహారకాల పట్ల దోమల్లో పెరుగుతున్న నిరోధక శక్తి వంటి కొత్త సవాళ్లు మలేరియా నిర్మూలనకు సరికొత్త సవాళ్లుగా మారే అవకాశం ఉందని రాష్ట్రపతి అన్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కృషి మాత్రమే మలేరియా వ్యాప్తిని అరికట్టలేదని ఆమె పేర్కొన్నారు. నీరు నిల్వ ఉండకుండా చూడటం, దోమలు వృద్ధి చెందే ఆవాసాలను నిర్మూలించడం, పర్యావరణ నిర్వహణపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి సూచించారు. విధాన రూపకర్తలు, శాస్త్రీయ సమాజం ఈ దిశగా సమష్టి కృషి చేస్తున్నాయన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.

కొన్నేళ్లుగా డెంగ్యూ కూడా దేశంలో ఒక ప్రధాన సవాలుగా మారుతోందని రాష్ట్రపతి అన్నారు. భూతాపం, రుతుపవనాల సరళిలో వస్తున్న మార్పుల కారణంగా ఈ సవాళ్లు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. క్షయ, కుష్టు వ్యాధి, కాలా-అజార్ వంటి వ్యాధులపై మన పోరాటానికి ఐసీఎంఆర్ పరిశోధనలు, అధ్యయనాలు సరైన దిశను నిర్దేశించాయి. మన జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను రూపొందించడంలోనూ ఐసీఎంఆర్ కీలక పాత్ర పోషించింది. కోవిడ్-19 విపత్తు సమయంలో రికార్డు సమయంలో దేశవ్యాప్తంగా పరీక్షల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా, భారతదేశపు మొదటి దేశీయ కోవిడ్-19 టీకా అభివృద్ధిలోనూ ఈ సంస్థ భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు. డెంగ్యూ వంటి వ్యాధుల నిర్ధారణ దిశగా కూడా ఐసీఎంఆర్ సమర్థమైన చర్యలు తీసుకుంటోందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.

ఈ స్వర్ణోత్సవ ఘట్టం కేవలం గత విజయాలను గుర్తుచేసుకుంటూ గర్వపడే సమయం మాత్రమే కాదని, భవిష్యత్తు కోసం నిశ్చయాత్మక లక్ష్యాలను నిర్దేశించుకునే గొప్ప అవకాశమని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను సాకారం చేసుకోవాలన్న ఆశయంతో మనం ముందుకు సాగుతున్నామన్నారు. ఆరోగ్యకరమైన, సాధికార భారత్ నిర్మాణం లక్ష్యంగా.. పరిశోధన సంస్థలు, సాంకేతిక, ఉన్నత విద్యా కేంద్రాలు, పారిశ్రామిక రంగాల మధ్య బలమైన సహకారం ఎంతో కీలకమని రాష్ట్రపతి స్పష్టం చేశారు. ఈ సమన్వయాన్ని పెంపొందించే దిశగా ఐసీఎంఆర్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ముందంజలో నిలవగలవన్నారు. పరిశోధన, పరస్పర సహకారం, ఆవిష్కరణల ద్వారా వికసిత్ భారత ఆరోగ్య లక్ష్యాల సాధనలో ఐసీఎంఆర్, అనుబంధ సంస్థలు కీలకంగా నిలుస్తాయని రాష్ట్రపతి ధీమా వ్యక్తం చేశారు.  

***


(రిలీజ్ ఐడి: 2337706) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam