గిరీష్ కాసరవల్లి సామాజిక స్పృహతో కూడిన సమాంతర సినిమాల నుంచి సమకాలీన కుటుంబ కథాచిత్రాలు, జానపద నేపథ్య ఇతిహాసాలు, డాక్యుమెంటరీ కథనాల వరకు.. కన్నడ, తుళు సినిమాల గొప్పదనం, వైవిధ్యాన్ని గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం(ఇఫి) ప్రత్యేకంగా ప్రదర్శిస్తోంది.
కన్నడ చిత్రాలు
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించిన ‘కాంతార: ఎ లెజెండ్-చాప్టర్ 1’ కథ కదంబుల కాలం నేపథ్యంలో సాగుతుంది. బెర్మే అనే యువ అటవీ వాసి పొరుగున ఉన్న బంగ్రా రాజ్యంలోకి ప్రవేశించి, అక్కడి పాలకులు అటవీ ప్రాంత ప్రజల పట్ల చూపుతున్న కఠిన వైఖరిని చూస్తాడు. యువరాజు కులశేఖర గిరిజనులపై దాడి చేసి, వారిలో చాలామందిని హతమార్చినప్పుడు, న్యాయం, ధర్మం కోసం జరిగే పోరాటంలో బెర్మే వారితో కలుస్తాడు. జానపద సంప్రదాయాలు, విశ్వాసం, అటవీ ప్రాంత ప్రజల రక్షణ కోసం జరిగే పోరాటాన్ని ఈ చిత్రం సమ్మిళితం చేస్తుంది. ఈ చిత్రం భారతీయ పనోరమా మెయిన్‌స్ట్రీమ్ సినిమా విభాగంతోపాటు అంతర్జాతీయ పోటీ విభాగంలోనూ ప్రదర్శనకు ఎంపికైంది.
పీ శేషాద్రి దర్శకత్వం వహించిన ‘రూబీ-క్యూబ్’ చిత్రం.. కొండ ప్రాంతంలోని ఒక పర్యాటక ప్రదేశంలో స్వల్ప విహారయాత్రకు వెళ్లిన కుటుంబంలోని మూడు తరాల కథను చెబుతుంది. మానసిక వైద్య నిపుణురాలైన రోహిణి, వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న కుమార్తె చిత్ర ద్వారా తనకు దూరమైన భర్త మూర్తిని మళ్లీ కలుసుకుంటుంది. కుటుంబ సభ్యులంతా కలిసి సమయం గడుపుతున్న క్రమంలో పాత విభేదాలు, పరిష్కారం కాని భావోద్వేగాలు తెరపైకి వస్తాయి. సంబంధాల్లోని సంక్లిష్టతలకు రూబిక్స్ క్యూబ్ ప్రతీకగా నిలుస్తుంది. సహనం, పరస్పర అవగాహన ఉంటే సమస్యల నుంచి బయటపడేందుకు మార్గం కనుగొనవచ్చనే విషయాన్ని ఈ చిత్రం చూపిస్తుంది.
డాక్టర్ ప్రదీప్ కెంచనూరు (డాక్టర్ ప్రదీప్ కుమార్ శెట్టి కె) దర్శకత్వం వహించిన ‘ది హగ్ ఆఫ్ ఎంప్టీనెస్’ చిత్రం చంద్రశేఖర్ కథను వివరిస్తుంది. రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో 2003లో సుళ్య సహకార బ్యాంకు ఆయన ఆస్తిని స్వాధీనం చేసుకుంది. ఈ చర్య అన్యాయమని భావించిన చంద్రశేఖర్ న్యాయపోరాటం ప్రారంభిస్తాడు. అది రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతుంది. శాశ్వత నివాసం లేకపోవడంతో న్యాయం కోసం పోరాడుతూనే తన కారులో నివసిస్తుంటాడు. అనిశ్చిత భవిష్యత్తు ఎదురైనా, ఆయన సాగించిన సుదీర్ఘ పోరాటం, ఒంటరితనం, పట్టుదలను ఈ డాక్యుమెంటరీ చిత్రీకరిస్తుంది.
అభిషేక్ దర్శకత్వం వహించిన ‘ఉలిదిద్దు సంపిగె మాత్ర’ (మిగిలింది పువ్వు మాత్రమే) చిత్రం. తాను ప్రేమించిన మహిళను కోల్పోయి, ఆమె జ్ఞాపకాలతో ఒంటరిగా జీవిస్తున్న మంజన కథను చెబుతుంది. ఆమె ఫొటో దెబ్బతినడంతో, ఒక చిత్రకారుడిని సంప్రదించి, తన జ్ఞాపకాల ఆధారంగా ఆమె చిత్రపటాన్ని మళ్లీ గీయాలని కోరతాడు. ఆ చిత్రపటాన్ని అందుకున్న తర్వాత మంజన ఒక రహస్యమైన వ్యక్తిని కలుస్తాడు. అనూహ్యంగా ఎదురైన ఆ పరిచయం అతను తన గతాన్ని చూసే దృక్పథాన్ని మారుస్తుంది. ఊహించని ముగింపు దిశగా అతడిని నడిపిస్తుంది. నష్టాన్ని, జ్ఞాపకాలను, భావోద్వేగ మార్పులను ఈ లఘుచిత్రం ఆవిష్కరిస్తుంది.
తుళు చిత్రాలు
అనుపమ శారధి దర్శకత్వం వహించిన ‘పిలి చన్నె’ చిత్రం.. తన అమ్మమ్మ నుంచి సంప్రదాయ మూలికా వైద్యాన్ని నేర్చుకున్న ఒక గిరిజన మహిళ కథను వివరిస్తుంది. మరణించే ముందు అమ్మమ్మ, అడవిలోని వైద్య పరిజ్ఞానాన్ని తనలో నిక్షిప్తం చేసుకుందని నమ్మే పవిత్రమైన రాయిని ఆమెకు అందిస్తుంది. తన వైద్య నైపుణ్యంతో సమాజానికి సేవ చేస్తూ ఆమె ప్రజల విశ్వాసాన్ని పొందుతుంది. అయితే, అత్యాశ కలిగిన గ్రామ వైద్యుడు, గ్రామ పెద్ద ఆ రాయిని తమ సొంతం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, దానిని ఇచ్చేందుకు ఆమె నిరాకరిస్తుంది. సంప్రదాయ జ్ఞానం, ధైర్యం, పూర్వీకుల నుంచి సంక్రమించిన విజ్ఞాన పరిరక్షణ అంశాలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. 2026 ఇఫిలో ఈ చిత్రం ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధమవుతోంది.
గిరీష్ కాసరవల్లి ప్రత్యేక చర్చా కార్యక్రమం..
2026 ఇఫిలో భాగంగా నవంబర్ 21న ‘సమాంతర సినిమా నైతిక ప్రపంచం: గిరీష్ కాసరవల్లి 50 ఏళ్ల ప్రస్థానం’ పేరుతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. నమన్ రామచంద్రన్ సమన్వయం చేసే ఈ కార్యక్రమంలో ప్రశంసలు పొందిన కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవల్లి అయిదు దశాబ్దాల సినీ ప్రస్థానాన్ని సమీక్షించనున్నారు. ఆయన తొలి చిత్రం ‘ఘటశ్రద్ధ’ నుంచి ‘తబరన కథే’, ‘తాయి సాహెబా’, ‘ద్వీప’ వంటి చిత్రాల వరకు.. సామాజిక అన్యాయం, నైతిక నిర్ణయాలు, అణగారిన వర్గాల జీవితాలను ఆయన చిత్రాలు ఆవిష్కరించాయి. కథలను తెరకెక్కించడంలో ఆయన అనుసరించిన విధానం, సినిమా-సామాజిక స్పృహ మధ్య ఉన్న సంబంధాలపై ఈ చర్చలో విశ్లేషించనున్నారు.
***