హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ పురస్కార ప్రదానోత్సవంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగం

రామోజీరావు లాంటి అతి తక్కువ మంది మాత్రమే తమ జీవితకాల కృషితో తామే వ్యవస్థగా ఎదుగుతారు: వారి సేవలు దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి

దేశంలో నలుమూలలా జరుగుతున్న పరిణామాల గురించి రామోజీరావు క్షుణ్ణంగా తెలుసుకునేవారు, ప్రతి
సమస్యను పరిష్కరించే విషయంలో ఆయన అభిప్రాయాలు స్పష్టంగా, సూటిగా, నిర్భయంగా ఉండేవి


పేద రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు ఎలాంటి అండ లేకుండా ‘ఈనాడు’ ప్రారంభించి, నిత్యం ఉదయమే తెలుగు ఇళ్లలో తొలిగా సత్యమే ప్రతిధ్వనించేలా చేశారు

రామోజీరావు ప్రతి యుగంలోనూ సాంకేతిక పురోగతికి అనుగుణంగా నడుస్తూ, తెలుగుతో సహా అనేక ఇతర భారతీయ
భాషల్లో ఈటీవీ నెట్‌వర్క్‌ను నిర్మించి, టెలివిజన్ ఛానెళ్లను మొబైల్ వేదికలపైకి కూడా తీసుకొచ్చారు

అనేక మంది తమ కెరీర్లను నిర్మించుకోవడానికి కష్టపడతారు. కానీ విలువలను నిలబెట్టేందుకు ప్రయత్నించేవారే
గొప్పవారవుతారు:

రామోజీరావు విలువల కోసం పోరాడటం మాత్రమే కాకుండా వాటిని నిలబెట్టారు

పద్మవిభూషణ్ రామోజీరావుకు అందిన గౌరవం మాత్రమే కాదు, అది పాత్రికేయ రంగానికి, సాహిత్యానికి, తెలుగు అస్తిత్వానికి లభించిన గుర్తింపు

రామోజీరావు ఒక గొప్ప వ్యవస్థను నిర్మించారు, ఆయన భౌతికంగా లేకపోయినా ఆ సంస్థ నేటికీ ఆయన విలువలను నిలబెడుతోంది

కేవలం లాభం కోసమే వార్తాపత్రికలను, న్యూస్ ఛానెళ్లను ఆయన నడపలేదు, ఆర్థిక నష్టాలు, అపారమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆయన జర్నలిజాన్ని ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా నిలబెట్టారు

చలనచిత్ర రంగానికి కూడా ఆయన విశేష సేవలు అందించారు, రామోజీ ఫిలిం సిటీ లేకుండా ఏ ప్రాంతీయ భాషా చలనచిత్ర పరిశ్రమనైనా ఊహించుకోవడం కష్టం

శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, చాలా కాలం తర్వాత దేశం ఒక నిర్ణయాత్మక నాయకత్వాన్ని చూసింది. విధానపరమైన స్తబ్దతకు తెరపడి, పనితీరు ఆధారిత రాజకీయాలకు మార్గం సుగమమైంది.

సంపూర్ణ స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యధిక శక్తివంతమైన హైడ్రోజన్
రైలును భారతదేశం రూపొందించింది. ఈ రైలు సౌకర్యాన్ని కూడా ప్రారంభించింది

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలోనే 98 శాతం గ్రామ పంచాయతీలు 4జీకి అనుసంధానమయ్యాయి, గడచిన 12 ఏళ్లలో 50 కోట్ల మంది భారతీయులు పేదరికాన్ని అధిగమించారు – ఈ సత్యాన్ని ప్రపంచ బ్యాంకు గుర్తించింది

వచ్చే పదేళ్లలో దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్

నాడు పోస్టు చేయడమైనది: 16 NOV 2026 9:52PM by PIB Hyderabad

కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ – 2026 ప్రదానోత్సవంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు శ్రీ జి. కిషన్ రెడ్డి, శ్రీ కె. రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కె. పవన్ కళ్యాణ్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

పురస్కార ప్రదానోత్సవంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడారు.  రామోజీ రావు మన మధ్య లేరని, ఈ రోజు ఆయన 90వ జయంతి అని చెబుతూ... కొందరు వ్యక్తులు తమ జీవితకాలంలో అంకితభావంతో పనిచేసి తామే ఒక వ్యవస్థగా ఎదుగుతారని, వారు స్థాపించిన సంస్థలు దేశానికి ఎల్లవేళలా స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఆయన అన్నారు. తాను రామోజీరావును నాలుగుసార్లు కలిశానని, దేశంలో నలుమూలలా జరుగుతున్న పరిణామాల గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉండేదని శ్రీ షా అన్నారు. దేశం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, దానికి సాధ్యమయ్యే పరిష్కారాల గురించి ఆయనకు స్పష్టమైన అవగాహన ఉండేది. ఆయనకు తనదైన దృఢమైన నమ్మకాలు ఉండేవి. వాటిని నిర్భయంగా, నిష్కపటంగా వ్యక్తపరిచే ధైర్యం కూడా ఉండేది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై రామోజీ రావుకు అద్భుతమైన అవగాహన ఉందని ఆయన అన్నారు. వ్యవసాయం, విద్య, సినిమా నిర్మాణం, మీడియా సహా పలు రంగాలలో రామోజీ రావు యువతకు ఆదర్శంగా నిలుస్తూనే ఉన్నారని ఆయన చెప్పారు.

ఈశాన్య ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, జనాభా, సవాళ్లు, తిరుగుబాటుకు గల మూల కారణాలపై రామోజీరావుకు లోతైన అవగాహన ఉందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. రామోజీ రావు గురించి తాను తెలుసుకొనే కొద్దీ ఆయనపై గౌరవం మరింత పెరిగిందని శ్రీ అమిత్ షా చెప్పారు.

90 ఏళ్ల రామోజీ రావు జీవితాన్ని తరచి చూస్తే ఆయన తప్ప మరెవరూ ఇన్ని రంగాలలో దేశానికి ఇంత విస్తృతమైన సేవ చేసి ఉండరని స్పష్టమవుతుందని శ్రీ అమిత్ షా చెప్పారు. కృష్ణా జిల్లాలోని ఒక పేద కుటుంబంలో  రామోజీరావు జన్మించారని, ఆయనకు ఎలాంటి వారసత్వం, వనరులు లేదా జర్నలిజంలో డిగ్రీ లేదన్నారు. అయితే, కళ్లలోనూ, మదిలోనూ స్పష్టమైన దార్శనికతతో పాటు ఆయనకు అచంచలమైన సంకల్ప బలం ఉండేది. ఈనాడు దినపత్రికను ప్రారంభించి ప్రతి ఉదయం తెలుగు ఇళ్లకు తొలిగా సత్యమే చేరేలా రామోజీరావు కృషి చేశారని శ్రీ అమిత్ షా అన్నారు. రామోజీరావు చేసిన సేవలను అంచనా వేయాలంటే.. పాత్రికేయ ప్రపంచంలో ఆయనతో పోల్చదగిన ఏకైక మీడియా గ్రూప్ ఛైర్మన్ రామ్‌నాథ్ గోయెంకా మాత్రమేనని చెప్పవచ్చని ఆయన పేర్కొన్నారు.

మారుతున్న కాలానికి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా రామోజీరావు ఎల్లప్పుడూ ముందుకు సాగారని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ప్రైవేట్ న్యూస్ ఛానెళ్లు ప్రారంభమైన కొత్తలో ప్రాంతీయ భాషల్లో 24 గంటల వార్తా ఛానెళ్లను నిర్వహించాలనే ఆలోచన రామోజీరావుకు మాత్రమే వచ్చిందని ఆయన చెప్పారు. రామోజీరావు ఈటీవీని కేవలం తెలుగులోనే కాకుండా దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ భాషలలో ప్రారంభించారని శ్రీ షా తెలిపారు. ఆయన దేశంలోని ప్రాంతీయ భాషలను సుసంపన్నం చేయడమే కాకుండా, ఈటీవీ నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు సత్యాన్ని అందించేందుకు వినూత్న చొరవ తీసుకున్నారని అమిత్ షా కొనియాడారు. 

ఖాళీ సమయంలో ఏం చేయాలని అనుకుంటున్నారని ఓ సందర్భంలో రామోజీ రావును అడగ్గా… మొబైల్ ఫోన్లో ఒక టీవీ ఛానెల్‌ను ప్రారంభించాలనుకుంటున్నట్లు బదులిచ్చిచారని శ్రీ అమిత్ షా తెలిపారు. నేడు ఆయన మొబైల్ ఛానెల్స్ అన్ని భాషల్లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. నిరంతరం తోడ్పాటునందించాలనే ఈ తపన, సవాళ్లను అధిగమిస్తూ ఎల్లప్పుడూ శ్రమించాలనే ఉత్సాహమే రామోజీ రావును గొప్ప వ్యక్తిగా మార్చిందని పేర్కొన్నారు.

నేటి వార్తా పత్రికలు, వార్తా ఛానెళ్ల యజమానులను చూసినప్పుడు వ్యాపార ఉద్దేశాలు, లాభాలపైనే వాళ్లు నిరంతరం దృష్టి సారిస్తారని అర్థమవుతుందని, ఈ నేపథ్యంలో రామోజీ రావు ఎంతటి మహోన్నత వ్యక్తిత్వం గలవారో తెలుస్తుందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ప్రజాస్వామ్యానికి జర్నలిజం నాలుగో స్థంభమని రామోజీరావు బలంగా విశ్వసించి ఉంటారని శ్రీ అమిత్ షా చెప్పారు. ఈ నిబద్ధతను నిలబెట్టుకునేందుకు జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారని, ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు.

రామోజీ రావు జీవితంలో రెండు ప్రధాన దశలను పోరాటాలతోనే గడిపారని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. తీవ్రమైన ఆర్థిక నష్టాలు, ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ, ఆయన వార్తా చానల్ నిష్పాక్షికతను కాపాడారని, ప్రజాస్వామ్యానికి నిజమైన నాలుగో స్థంభంగా జర్నలిజం పాత్రను నిలబెట్టారని తెలిపారు. కెరీర్‌ను నిర్మించుకునేందుకు కష్టపడేవారు గొప్పవారని, మనిషిని గొప్పగా మార్చే అద్భుతమైన గుణం పోరాటమని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. విలువల పరిరక్షణకు పోరాడేవారు మరింత గొప్పవారని, రామోజీరావు ఎల్లప్పుడూ విలువల కోసమే పోరాడారని, వాటి స్థాపనకు కృషి చేశారని కొనియాడారు.

2016లో రామోజీ రావు పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నప్పుడు, ఇది కేవలం రామోజీ రావుకు మాత్రమే దక్కిన గౌరవం కాదని... జర్నలిజం, సాహిత్యం, విద్య, తెలుగు ఆత్మగౌరవానికి దక్కిన గౌరవమని గుజరాత్‌లోని ప్రముఖ గుజరాతీ వార్తాపత్రిక రాసిందని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. రామోజీ రావు కేవలం వార్తా పరిశ్రమను మాత్రమే నిర్మించలేదని, వ్యాపారాలను మించి సంస్థలను సృష్టించారని అన్నారు. వ్యవస్థాపకులు లేనప్పటికీ, అదే విలువలతో నిరంతరం పనిచేస్తూ కొనసాగేవే నిజమైన సంస్థలని అభివర్ణించారు.

రామోజీ రావు చిత్ర పరిశ్రమకు కూడా విశేషమైన సేవలందించారని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ లేకుండా ఏ భాషలోనైనా సినిమా రంగాన్ని ఊహించటం కష్టమని ఆయన పేర్కొన్నారు. చిత్రనిర్మాతల వద్ద ఉన్న నిధులతో, సృజనాత్మక ఆలోచనలతో వస్తే చాలు... మిగతావన్నీ స్టూడియోలోనే అందుబాటులో ఉంటాయని, మరెక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదనే భరోసాను రామోజీ రావు కల్పించారని శ్రీ అమిత్ షా చెప్పారు.

ఈ ఏడాది ఎక్సలెన్స్ అవార్డుల కోసం పలువురిని ఎంపిక చేసినట్లు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. శాస్త్ర, సాంకేతికత, యంగ్ ఐకాన్స్, మానవతా సేవ, కళలు, సంస్కృతి, విద్య, వైద్యం, ఆరోగ్య రంగం, గ్రామీణాభివృద్ధి, జర్నలిజం, మహిళా విజయాలు వంటి దేశాభివృద్ధికి అత్యంత కీలకమైన తొమ్మిది రంగాల్లో విశేష సేవలందించిన వారిని ఈ సందర్భంగా సత్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ తొమ్మిది రంగాలకు సంబంధించి పురస్కారాలు అందుకుంటున్న తొమ్మిది మంది విజేతలను ఉద్దేశించి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ... భవిష్యత్తులో మీరు మరెన్నో పురస్కారాలను పొందవచ్చు కానీ, రామోజీ రావు పేరుతో ముడిపడున్న ఈ అవార్డుకు మాత్రం ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పురోగతి పథంలో ముందుకు సాగుతోందని శ్రీ అమిత్ షా అన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో గత 13 ఏళ్లుగా స్థిరత్వం, కొనసాగింపు, నిర్ణయాత్మక నాయకత్వం కనిపిస్తోందన్నారు. విధానపరమైన పక్షపాతం గురించి విస్తృతంగా చర్చించుకునే కాలం పోయి, ఇప్పుడు పనితీరు ఆధారిత రాజకీయాలు, సరైన విధానాలపై ఆధారపడిన అభివృద్ధి వచ్చాయని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, అయిదు దశాబ్దాల నాటి నక్సలిజం సమస్య అంతం కావటం, దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయటం, జాతీయ భద్రతను సుస్థిరం చేయటం వంటి అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు కేంద్ర హోం మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్తోందని, అన్ని రంగాల్లోనూ అవకాశాలు అంతే వేగంగా విస్తరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

రష్యా-ఉక్రెయిన్, అమెరికా, ఇతర దేశాల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధాలు జరుగుతున్నప్పటికీ భారతదేశ ఆర్థిక వృద్ధిపై సానుకూల అంచనాలు వెలువడ్డాయని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడీస్ సంస్థ ఇటీవల భారతదేశ వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో 863 బిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసిందని, మన తదుపరి లక్ష్యం 1 ట్రిలియన్ డాలర్లు అని ఆయన తెలిపారు. ఈ లక్ష్యాన్ని మనం సాధించి తీరుతామనే పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

తయారీ రంగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని శ్రీ అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం అమెరికా, జపాన్‌ రెండూ ఉత్పత్తి చేసే ఉక్కు కంటే భారత్ అధికంగా ఉక్కును ఉత్పత్తి చేస్తోందని వెల్లడించారు. గత 12 ఏళ్లలో ఈ ఘనత సాధించినట్లు చెప్పారు. గతంలో కేవలం 58 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండేదని, నేడు 4జీ సేవల ద్వారా 2 లక్షల 15 వేల గ్రామ పంచాయతీలకు అనుసంధానం కల్పించామని, ఇది మొత్తం గ్రామ పంచాయతీల్లో దాదాపు 98 శాతానికి సమానమని వివరించారు.

ఆర్థిక రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని శ్రీ అమిత్ షా తెలిపారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యధిక సామర్థ్యం గల హైడ్రోజన్ రైలును భారత్‌లో నిర్మించామని, దాని కార్యకలాపాలు కూడా ప్రారంభమైనట్లు వెల్లడించారు.

2014లో దేశంలో కేవలం 76 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవని, నేడు ఆ సంఖ్య 150కి చేరుకోవటం వల్ల భారతదేశ పురోగతి స్పష్టమవుతుందని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 12 ఏళ్ల పదవీకాలంలో 50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. ఇది ఎంతో సంతృప్తికరమైన విషయమని తెలిపారు.

దేశంలో గతంలో దాదాపు 40 ఏళ్ల పాటు ఏటా 2,000లకుపైగా నక్సల్స్ దాడులు జరిగేవని, నేడు ఒక్క నక్సల్ దాడి కూడా జరగకపోవటం ఎంతో సంతృప్తికరమని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఇది మన సమష్టి విజయమని పేర్కొన్నారు.

శ్రీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. శ్రీ చంద్రబాబు నాయుడు రెండో విడత పాలనకు సంబంధించిన డేటాను నిరంతరం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాబోయే పదేళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

విశాఖపట్నంలో గూగుల్ ద్వారా 15 బిలియన్ డాలర్ల వ్యయంతో ఏఐ హబ్ ఏర్పాటు కావటం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాక భారతదేశ ప్రజలందరికీ గర్వకారణమని శ్రీ అమిత్ షా అన్నారు. ఒక గిగావాట్ డేటా సెంటర్, అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ హబ్ రెండూ దేశానికి కీలక విజయాలని తెలిపారు. సముద్రగర్భంలో కేబుళ్ల కోసం నూతన ప్రవేశ మార్గం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో తొలి సెమీకండక్టర్ యూనిట్‌కు శంకుస్థాపన చేశామని, భారీ ఉక్కు పరిశ్రమలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించటంతో పాటు రూ.18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.

ఈ కార్యక్రమాలన్నింటినీ పరిశీలిస్తే… కేవలం రెండున్నరేళ్లలోనే ఆంధ్రప్రదేశ్‌లో రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు శ్రీ చంద్రబాబు నాయుడు సులభతరమైన వాతావరణం కల్పించినట్లు స్పష్టమవుతుందని శ్రీ అమిత్ షా అన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మూలకు నీరు చేరితే, రాష్ట్ర రైతులకు ఎన్నో అవకాశాలు ఏర్పడుతాయని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ ప్రాజెక్టును దృఢ సంకల్పంతో, నిర్దేశిత కాలపరిమితితో ముందుకు తీసుకెళ్లటం గొప్ప విజయమని ఆయన అన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2337514) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Tamil