నాడు పోస్టు చేయడమైనది:
16 NOV 2026 9:37AM by PIB Hyderabad
ఈజిప్టు నూతన పరిపాలనా రాజధానిలో ఈ రోజు జరిగిన భారత్-ఈజిప్ట్ సంయుక్త వాణిజ్య కమిటీ (జేటీసీ) ఏడో సమావేశానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఈజిప్ట్ పెట్టుబడులు, విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ మొహమ్మద్ ఫరీద్ సలేహ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. మంత్రిత్వ స్థాయిలో ఈ ముఖ్యమైన ద్వైపాక్షిక సంస్థాగత వేదిక సమావేశం కావడం ఇదే తొలిసారి. భారత్-ఈజిప్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఆర్థిక కోణాన్ని బలోపేతం చేసేందుకు రెండు దేశాల ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది.
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 12 బిలియన్ల అమెరికన్ డాలర్లకు విస్తరించే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఉభయ పక్షాలు పునరుద్ఘాటించాయి. వాణిజ్య వైవిధ్యీకరణ, విలువ ఆధారిత ఎగుమతులను ప్రోత్సహించడం, వాణిజ్య సంబంధిత సవాళ్లను పరిష్కరించడం అత్యవసరమని స్పష్టం చేశాయి. ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం లేదా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విధివిధానాలను పరిశీలించేందుకు ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఇరువురు మంత్రులు అంగీకరించారు. ఇది ఏడో సంయుక్త వాణిజ్య కమిటీ సమావేశంలో సాధించిన ముఖ్యమైన ఫలితం. ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు, రెండు దేశాల మార్కెట్లలో అవకాశాలను మెరుగుపరిచేందుకు, పెట్టుబడుల అనుసంధానాన్ని ప్రోత్సహించేందుకు ఇది తోడ్పడుతుంది.
ఈ సమావేశానికి ముందు వాణిజ్య విస్తరణ, పెట్టుబడుల ప్రోత్సాహం, దీర్ఘకాలిక పారిశ్రామిక, వాణిజ్య సంబంధాల అభివృద్ధిపై మంత్రులిద్దరూ ద్వైపాక్షిక చర్చలను నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న వాణిజ్య సంబంధాలను సమీక్షించేందుకు, వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను అంచనా వేసేందుకు, మరింత సన్నిహిత సహకారం కోసం కొత్త రంగాలను గుర్తించే వేదికను ఈ జేటీసీ అందించింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో (2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు) 35 శాతం వృద్ధితో 6.5 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్న భారత్-ఈజిప్ట్ వాణిజ్య పురోగతిని కమిటీ సమీక్షించింది. 2025లో ఇదే సమయంలో నమోదైన 3.08 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2026 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో వాణిజ్యం 65 శాతం పెరిగి 5.04 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ పెరుగుదల వాణిజ్య కార్యకలాపాల్లో వేగాన్ని, వాణిజ్య రంగాలను మరింత విస్తరించేందుకు ఉన్న అవకాశాలను సూచిస్తోంది. పారిశ్రామిక వస్తువులు, ఇంధనం, ఎరువులు, రసాయనాలు, ఔషధాలు, ఇంజనీరింగ్, వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తుల రంగాల్లో వాణిజ్యాన్ని మరింత పెంచుకునేందుకు ఇరు దేశాల మధ్య అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
వాణిజ్యాన్ని విస్తరించడం, సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయడం, స్థిరమైన వాణిజ్య మార్గాలను ఏర్పాటు చేయడంపై చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. వాణిజ్య విస్తరణ, సుంకేతర అడ్డంకులను తొలగించడం, కస్టమ్స్ ప్రక్రియలను సులభతరం చేయడం, నాణ్యతా ప్రమాణాలను, మదింపును బలోపేతం చేయడం, మార్కెట్ అవకాశాలను మెరుగుపరచడం లాంటి చర్యలను ఇరు పక్షాలు పరిశీలించాయి. ఉత్పత్తుల రిజిస్ట్రేషన్, వాణిజ్య సంబంధిత నియంత్రణ ప్రక్రియలతో సహా వ్యాపార కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్న ఆచరణాత్మక సమస్యలపై కూడా వారు చర్చించారు.
వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడం, ఉమ్మడి తయారీ, పెట్టుబడులను ప్రోత్సహించడంపై కూడా చర్చలు కేంద్రీకృతమయ్యాయి. ఔషధాలు, వైద్య పరికరాలు, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ పరికరాలు, ఎరువులు, వస్త్రాలు, పునరుత్పాదక ఇంధనం, కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు దీనిలో ప్రాధాన్య రంగాలుగా ఉన్నాయి. ఈజిప్ట్ పారిశ్రామిక జోన్లలో భారతీయ పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో పాటు, విస్తరిస్తున్న భారత తయారీ, సేవా రంగాల్లో ఈజిప్ట్ పెట్టుబడుల అంశం కూడా ఈ ఎజెండాలో ఒక ముఖ్య భాగంగా నిలిచింది.
పెట్టుబడుల సమాచారాన్ని పంచుకునేందుకు, వ్యాపార సంబంధాలను సులభతరం చేసేందుకు ప్రతిపాదించిన డిజిటల్ వేదికతో సహా ఇన్వెస్ట్ ఇండియా, ఈజిప్ట్ జనరల్ అథారిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫ్రీ జోన్స్ మధ్య ఉన్న విధాన ఒప్పందాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు పక్షాలు ఆసక్తి వ్యక్తం చేశాయి.
సూయజ్ కాలువకు చేరువగా ఉండటం, ఆఫ్రికన్, అరబ్, యూరోపియన్ మార్కెట్లతో అనుసంధానం కలిగి ఉండటం వల్ల ఎగుమతి ఆధారిత తయారీ, ప్రాంతీయ సరఫరా వ్యవస్థలకు ఈజిప్ట్ ఒక విలువైన భాగస్వామిగా నిలుస్తోంది. ప్రతిగా భారత్ కూడా ఈజిప్టు పెట్టుబడిదారులు, ఎగుమతిదారులకు విస్తృతమైన, క్రియాశీలకమైన మార్కెట్‌ను, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలను, సాంకేతిక, ఉత్పత్తి భాగస్వామ్య అవకాశాలను అందిస్తోంది.
సంయుక్త వాణిజ్య కమిటీ సమావేశంలో శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారత్, ఈజిప్ట్ మధ్య బలమైన పరస్పర సహకారానికి అవకాశం ఉన్న అయిదు రంగాలను ప్రముఖంగా ప్రస్తావించారు. అవి ఫార్మాసూటికల్స్–ఆరోగ్య సేవలు: అందుబాటు ధరల్లో మందులు, వ్యాక్సిన్లు, వైద్య సాంకేతికతలో భారత్‌కున్న బలాలను ఉపయోగించుకోవడం. ఇంజినీరింగ్–ఆటోమొబైల్స్: యంత్రాలు, వాహన విడిభాగాలు, పారిశ్రామిక తయారీ. వ్యవసాయం–ఆహార శుద్ధి: ఆహార భద్రత, ఎరువులు, నీటిపారుదల, కోల్డ్-చెయిన్ మౌలిక సదుపాయాలు. డిజిటల్–ఫిన్‌టెక్: యూపీఐ అనుసంధానం, స్థానిక కరెన్సీలో వాణిజ్యం, భారత డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు. సంస్కృతి–మ్యూజియం: కళాఖండాల సంరక్షణ, నిర్వహణ, డిజిటలైజేషన్ రంగాల్లో గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం, భారత్‌లో ఏర్పాటు చేయనున్న యుగే యుగీన్ భారత్ జాతీయ మ్యూజియం మధ్య ప్రతిపాదిత సహకారం.
భారత్–ఈజిప్టు వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఆర్థిక ప్రాధాన్యాలను ముందుకు తీసుకెళ్లే దిశగా వేసిన ముఖ్యమైన ముందడుగే మంత్రిత్వ స్థాయి జేటీసీ. 2026 సెప్టెంబర్‌లో భారత్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీల మధ్య జరిగిన భేటీ నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ రాజకీయ సానుకూలతను బలమైన వాణిజ్య కార్యకలాపాలు, కొత్త పెట్టుబడులు, ఉమ్మడి తయారీ, మెరుగైన మార్కెట్ అవకాశాలతో పాటు భారత్, ఈజిప్ట్, విస్తృత ప్రాంతీయ మార్కెట్లను అనుసంధానించే మరింత పటిష్ఠమైన సరఫరా వ్యవస్థలుగా మార్చడానికి మార్చడానికి ఈ జేటీసీ కృషి చేస్తుంది.
తదుపరి జేటీసీ సమావేశాన్ని 2028లో న్యూఢిల్లీలో లేదా అంతకంటే ముందుగా పరస్పరం అనుకూలమైన తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.
భారత్-ఈజిప్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యం పరిధిలో వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు వేదికను అందించిన భారత్-ఈజిప్ట్ బిజినెస్ ఫోరమ్ ద్వారా భారత్, ఈజిప్ట్ దేశాలకు చెందిన 300కు పైగా కంపెనీలు ఒక్కచోట చేరాయి. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు, సీనియర్ వ్యాపార ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఈజిప్ట్ పెట్టుబడులు, విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ మొహమ్మద్ ఫరీద్ సలేహ్ ప్రసంగించారు.
2026 నవంబర్ 15 నుంచి 16 వరకు శ్రీ పీయూష్ గోయల్ ఈజిప్ట్ అధికారిక పర్యటన సందర్భంగా ఈ ఫోరమ్ నిర్వహించారు. దీని ప్రారంభ సమావేశంలో జనరల్ అథారిటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫ్రీ జోన్స్ (జీఏఎఫ్ఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ మొహమ్మద్ అవాద్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) అధ్యక్షుడు, సన్మార్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ విజయ్ శంకర్, ఫెడరేషన్ ఆఫ్ ఈజిప్షియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీ అహ్మద్ ఎల్వాకిల్ ప్రసంగించారు.
ఈ సమావేశంలో 2027లో భారత్–ఈజిప్టు మధ్య దౌత్య సంబంధాలకు 80 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో నాలుగు అంశాలతో కూడిన కార్యాచరణ అజెండాను శ్రీ గోయల్ ప్రతిపాదించారు. గుర్తించిన వాణిజ్య అడ్డంకులను నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించడం, ఇన్వెస్ట్ ఇండియా సహకారంతో భారతదేశంలోని రాష్ట్రాలు, పారిశ్రామిక క్లస్టర్లలో ఈజిప్టు పెట్టుబడులను ప్రోత్సహించడం, చిన్న వ్యాపారాలకు అవకాశాలు కల్పించేందుకు పెద్ద కంపెనీల సరఫరాదారులను ఈ భాగస్వామ్యంలోకి తీసుకురావడం, పురోగతిని సమీక్షించి వ్యాపార చర్చలను వాస్తవ ఒప్పందాలుగా మార్చేందుకు వార్షిక సమీక్షలను సంస్థాగతీకరించడం లాంటి అంశాలు ఈ అజెండాలో ఉన్నాయి.
‘‘ఈ దశాబ్దం గురించి భవిష్యత్తులో ఎవరైనా అధ్యయనం చేస్తే.. మేడిన్ ఈజిప్ట్ విత్ ఇండియా, మేడిన్ ఇండియా విత్ ఈజిప్టు లేబుళ్లు ఉన్న ఫ్యాక్టరీలు వారికి కనిపించాలి’’ అని ఈ భాగస్వామ్య ఆశయం గురించి శ్రీ గోయల్ వివరించారు.
ఈజిప్టులో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై జరిగిన చర్చలో జీఏఎఫ్ఐ, సూయజ్ కాలువ ఆర్థిక మండలి (ఎస్సీజోన్) సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు. తమ దేశంలో పారిశ్రామిక, పెట్టుబడి అవకాశాల గురించి వివరించారు. మధ్యధరా, ఎర్ర సముద్రాలను అనుసంధానించే వ్యూహాత్మక స్థానంలో ఈజిప్టు ఉండటం, ఆ దేశంలో విస్తరిస్తున్న నౌకాశ్రయాలు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, ఆఫ్రికన్, అరబ్, యూరోపియన్ మార్కెట్లతో ఉన్న అనుసంధానం భారతీయ వ్యాపార సంస్థలకు తయారీ, ఎగుమతి ఆధారిత కార్యకలాపాల్లో అవకాశాలను అందిస్తున్నాయి.
ఈజిప్టులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీసీఐ సన్మార్, గెలాక్సీ కెమికల్, అబ్డోస్ వంటి భారతీయ కంపెనీల అనుభవాలపై కూడా ఈ ఫోరమ్‌లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈజిప్ట్ పారిశ్రామిక ఉత్పత్తి, ఉపాధి, సాంకేతిక అభివృద్ధి, ఎగుమతులతో పాటు ప్రాంతీయ సరఫరా వ్యవస్థలతో అనుసంధానం కావడంలో భారతీయ పెట్టుబడులకు ఉన్న సామర్థ్యాన్ని ఆ సంస్థల ఉనికి స్పష్టం చేసింది. ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ పరికరాలు, రసాయనాలు, ఎరువులు, ఔషధాలు, వస్త్రాలు, ఆహార శుద్ధి, వాహన విడిభాగాలు, పునరుత్పాదక ఇంధనం, లాజిస్టిక్స్ రంగాల్లో సహకార అవకాశాలపై ఇరు దేశాల వ్యాపార వర్గాల ప్రతినిధులు చర్చించారు.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై జరిగిన ప్రత్యేక చర్చలో ఈజిప్ట్ డిజిటల్ టెక్నాలజీ, ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో భాగస్వాములతో పాటు ప్రముఖ భారతీయ అంకురసంస్థలు, సాంకేతిక కంపెనీలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి గ్లోబల్ ఫర్ స్మార్ట్ సొల్యూషన్స్ ఛైర్మన్ ఇంజనీర్ ఐమన్ ఎల్ గోహరీ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సదస్సులో రెండు దేశాలకు చెందిన నిపుణులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. ఈజిప్ట్ తరఫున ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐటీఐడీఏ)కి చెందిన ఇంజనీర్ మహమూద్ సొఫ్రాటా, ఏజీఎక్స్ ప్రతినిధి ఫాదీ ఇస్మాయిల్, నేషనల్ సిస్టమ్‌కు చెందిన డాక్టర్ కరీమ్ హమ్జా, ఎరామ్ హోల్డింగ్స్‌కు చెందిన డాక్టర్ సిద్దీక్ అహ్మద్ హాజరయ్యారు. భారతీయ పరిశ్రమల ప్రతినిధుల్లో జోహో సంస్థకు చెందిన శ్రీ రాజేష్ రంగనాథన్, డేటామార్ఫోసిస్ సంస్థకు చెందిన శ్రీ ప్రదీప్ గిల్బిలే పాల్గొన్నారు. ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, డిజిటల్ పరిష్కారాలు, ఆవిష్కరణలు, పారిశ్రామిక భాగస్వామ్యాల రంగాల్లో ఉన్న అవకాశాలపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి.
ఈ రోజు ఉదయం నూతన పరిపాలనా రాజధానిలో ఆరో ఇండియా–ఈజిప్టు సంయుక్త వ్యాపార మండలి (జేబీసీ) సమావేశం జరిగింది. దీనిలో శ్రీ గోయల్, మంత్రి సలేహ్ ప్రసంగించారు. భారత్ తరఫున టీసీఐ సన్మార్ కెమికల్స్ ఎస్‌ఏఈ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గణేష్ కుమార్, ఈజిప్టు తరఫున మకరెం టెక్స్ ప్రతినిధి ఖలీద్ అబౌల్ మకరెం ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఫిక్కీ అధ్యక్షుడు శ్రీ విజయ్ శంకర్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.
రసాయనాలు–పెట్రో కెమిక్సల్, ఫార్మసూటికల్స్–ఆరోగ్యసేవలు, ఆహారశుద్ధి–అగ్రి బిజినెస్, పునరుత్పాదక ఇంధనం–గ్రీన్ హైడ్రోజన్, మౌలిక వసతులు–పోర్టులు–లాజిస్టిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–డిజిటల్ సేవలు, టెక్స్టైల్స్, ఆటోమోటివ్ తయారీ సహా ప్రాధాన్య రంగాలపై దృష్టి సారించి చర్చలు జరిపే అవకాశాన్ని సంయుక్త వ్యాపార మండలి అందించింది. వ్యాపార సంస్థల మధ్య సంస్థాగత సంబంధాలను బలోపేతం చేసే మార్గాలను కూడా మండలి పరిశీలించింది. ఇందులో భాగంగా రంగాల వారీగా కార్యవర్గాలను ఏర్పాటు చేసే అవకాశం, కస్టమ్స్, వాణిజ్య సౌలభ్యం, వ్యాపార వీసాలతో పాటు 2026-27 సంవత్సరానికి పరస్పర వాణిజ్య లక్ష్యాల క్యాలెండర్ లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంది.
భారత్, ఈజిప్ట్ ఆర్థిక వ్యవస్థల మధ్య ఉన్న పరస్పర అనుకూలతలను ఈ రెండు సమావేశాలు ప్రధానంగా తెలియజేశాయి. విస్తృతమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌తో పాటు పోటీతత్వం గల తయారీ, ఇంజనీరింగ్, డిజిటల్ సామర్థ్యాలను భారత్ అందిస్తోంది. పటిష్ఠమైన పారిశ్రామిక పునాది, వ్యూహాత్మక అనుసంధానం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఆఫ్రికాతో పాటు విస్తృత ప్రాంతీయ మార్కెట్లలో ప్రవేశ అవకాశాలను ఈజిప్టు అందిస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్యం 6.5 బిలియన్ అమెరికన్ డాలర్లను దాటగా, ఈజిప్టులో భారతీయ పెట్టుబడులు ఇప్పటికే 5.5 బిలియన్ డాలర్లకు పైగా చేరుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సేవలందించే విధంగా ద్వైపాక్షిక పెట్టుబడులు, ఉమ్మడి తయారీ, సాంకేతిక భాగస్వామ్యాలు, సరఫరా వ్యవస్థలను మరింత వృద్ధి చేసేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఇరు పక్షాలు భావిస్తున్నాయి.
2026 సెప్టెంబర్‌లో భారత్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీల మధ్య జరిగిన భేటీకి కొనసాగింపుగా శ్రీ గోయల్ ఈ పర్యటన చేపట్టారు. భారత్–ఈజిప్టు వ్యూహాత్మక భాగస్వామ్యం పరిధిలో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనే రెండు దేశాల ఆకాంక్షను ఈ ఉన్నత స్థాయి పర్యటన, 300కు పైగా కంపెనీలు పాల్గొన్న భారత్-ఈజిప్ట్ బిజినెస్ ఫోరమ్, భారత్-ఈజిప్ట్ సంయుక్త వ్యాపార మండలి సమావేశాలు ప్రతిబింబిస్తున్నాయి.
ద్వైపాక్షిక వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను సమీక్షించేందుకు, తదుపరి ఆర్థిక సహకార మార్గాలను అన్వేషించేందుకు శ్రీ పీయూష్ గోయల్ ఈజిప్ట్ పెట్టుబడులు, విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ మొహమ్మద్ ఫరీద్ సలేహ్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. వాణిజ్య విస్తరణ, మార్కెట్ అవకాశాలు, పెట్టుబడి అవకాశాలు, ఔషధాలు, ఎరువులు ఈజిప్టులో భారతీయ వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వీసా సంబంధిత సమస్యలతో సహా ఈ చర్చలు కొనసాగాయి. భారతీయ పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం, ద్వైపాక్షిక సరఫరా వ్యవస్థలను, వ్యాపార సంస్థల మధ్య సంబంధాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడం, తయారీ భాగస్వామ్యాలను ప్రోత్సహించడం, పెట్టుబడి సంబంధాలను పెంపొందించే అవకాశాలపై చర్చించేందుకు శ్రీ పీయూష్ గోయల్ ఈజిప్ట్ పరిశ్రమల శాఖ మంత్రి ఇంజనీర్ ఖలీద్ హషీమ్‌తో కూడా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక భాగస్వామ్యాలు, ఎంఎస్ఎంఈ అభివృద్ధి, పారిశ్రామిక ఆటోమేషన్, అధునాతన తయారీ రంగాల్లో సహకార అవకాశాలపై ఇరు పక్షాలు చర్చించాయి.
***