నాడు పోస్టు చేయడమైనది:
16 NOV 2026 3:03PM by PIB Hyderabad
ఒడిశాలోని కటక్‌లో శ్రీ శ్రీ విశ్వవిద్యాలయంలో ప్రతిష్ఠాత్మక టవర్‌ను ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా గవర్నర్ శ్రీ బ్రజ్ మోహన్ రామ్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, శ్రీ శ్రీ యూనివర్సిటీ వ్యవస్థాపకులు, జీవితకాల అధ్యక్షులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఈ టవర్ ప్రారంభోత్సవం కేవలం ఒక భవనాన్ని ప్రారంభించడం మాత్రమే కాదని.. ఒక దార్శనికతకు, స్ఫూర్తిదాయకమైన విద్య ప్రాధాన్యతకూ, దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న నిబద్ధతను ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
శ్రీ శ్రీ విశ్వవిద్యాలయం గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ అద్భుతమైన దార్శనికతకు ప్రతిరూపమని ఉప రాష్ట్రపతి అభివర్ణించారు. విద్యపై గురుదేవ్‌కు ఉన్న అవగాహన సంప్రదాయ విద్యా బోధన పరిధులను దాటి విస్తరించిందని అన్నారు. ప్రాచ్య వివేకం, పాశ్చాత్య జ్ఞాన సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ విశ్వవిద్యాలయం 2012లో విద్యా ప్రస్థానాన్ని ప్రారంభించిందని తెలిపారు. నిజమైన విద్య అనేది వ్యక్తి వ్యక్తిత్వాన్ని, చైతన్యాన్ని, కరుణా గుణాన్ని పెంపొందించాలన్న తాత్విక పునాదిపై ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలోనూ ఈ దార్శనికత ఎంతో సముచితమైనదని చెప్పారు. విద్య యువతను కేవలం విద్యాపరమైన విజయాలకే కాకుండా, సమాజానికి అర్థవంతమైన సేవలందించేలా, ప్రపంచానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేలా ఉండాలని ఉపరాష్ట్రపతి అన్నారు.
శ్రీశ్రీ విశ్వవిద్యాలయం తనను తాను ‘‘ప్రపంచంలోనే అత్యంత ఆనందకరమైన ప్రాంగణం’’గా అభివర్ణించుకోవడం పట్ల ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఆనందం అనేది యావత్ మానవాళి ఆకాంక్షించే అంశమని, అది భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో లోతుగా పాతుకుపోయిందని పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సాంస్కృతిక విలువలను ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
ఒడిశా రాష్ట్ర గొప్ప నిర్మాణ, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో నిర్మాణ కళ కేవలం భౌతిక కట్టడాల నిర్మాణానికి మాత్రమే పరిమితం కాలేదని ఉపరాష్ట్రపతి అన్నారు. అక్కడి ఆలయాలు కళాత్మక నైపుణ్యం, శాస్త్రీయ పరిజ్ఞానం, ఆధ్యాత్మికత, సాంస్కృతిక పరంపరకు చిరస్థాయిగా నిలిచే ప్రతీకలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పూరీలోని పవిత్ర జగన్నాథ ఆలయం, భువనేశ్వర్‌లోని దేవాలయాలు, కోణార్క్ ఆలయ వైభవాన్ని ప్రస్తావిస్తూ.. కళింగ నిర్మాణ శైలి భారతీయ నాగరికతలోని అసాధారణ సృజనాత్మక ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు.
ఐకానిక్ టవర్ ఈ గొప్ప వారసత్వం నుంచి స్ఫూర్తి పొందిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. దాని ఆరోహణ నిర్మాణ రూపం.. జ్ఞాన పునాదుల నుంచి విజ్ఞానం, జ్ఞానోదయం అనే ఉన్నత శిఖరాల వైపు మానవ ఆకాంక్షల ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తోందని వివరించారు.
దేశ విస్తృత ఆకాంక్షలను ప్రస్తావిస్తూ.. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశానికి స్ఫూర్తిదాయకమైన దార్శనికతను అందించారని ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు పూర్తయ్యే నాటికి ఆత్మవిశ్వాసం, సామర్థ్యం, ప్రపంచ నాయకత్వంతో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించాలన్నది ఆయన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ జాతీయ ఆకాంక్షను సాకారం చేయడంలో విద్యా సంస్థలు కీలకమైన మార్పునకు దోహదపడతాయని ప్రధానమంత్రి పలుమార్లు స్పష్టం చేశారని తెలిపారు.
గత 12 ఏళ్లలో ఉన్నత విద్యా రంగం విస్తరించిన తీరును ఉప రాష్ట్రపతి వివరించారు. 2014-15లో దేశంలో విశ్వవిద్యాలయాల సంఖ్య 760 ఉండగా, ప్రస్తుతం 1,400కు పైగా పెరిగిందని తెలిపారు. 2014కు ముందు 16గా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీల (ఐఐటీ) సంఖ్య ప్రస్తుతం 23కు చేరిందని.. ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ల (ఐఐఎం) సంఖ్య 13 నుంచి 22కు పెరిగిందని పేర్కొన్నారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థల (ఎయిమ్స్) సంఖ్య కూడా 2014కు ముందు 7 ఉండగా, ప్రస్తుతం 20కి పెరిగిందని తెలిపారు. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల నమోదు సంఖ్య 2014-15లో 3.42 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం 4.50 కోట్లకు పైగా చేరిందని వెల్లడించారు.
ఒడిశాలో గణనీయమైన సంఖ్యలో గిరిజన జనాభా కలిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. గిరిజన పిల్లలు చదువుకు మధ్యలోనే దూరం కాకుండా, ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ఒడిశాలోని అన్ని విశ్వవిద్యాలయాలు ‘స్కూల్ కనెక్ట్’ కార్యక్రమాలను ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి కోరారు.
భారతీయ సాంస్కృతిక గుర్తింపు, జాతీయ బలానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఉప రాష్ట్రపతి వివరించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో దేశ సంస్కృతి, సంప్రదాయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఎవరూ తమపై షరతులు, నిబంధనలు విధించలేని విధంగా భారత్ బలమైన, సామర్థ్యవంతమైన దేశంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశ స్వాతంత్య్రం, గౌరవం, ప్రయోజనాలను పరిరక్షించడంలో జాతీయ బలం ప్రాధాన్యతను ఆయన తెలియజేశారు.
ఒక వ్యక్తి గొప్పతనాన్ని అతని జ్ఞానం, వ్యక్తిత్వ బలం, కరుణా భావం విస్తృతి ఆధారంగా అంచనా వేస్తారని విద్యార్థులకు గుర్తుచేశారు. ఆలోచనలు, ఆచరణలో ఎల్లప్పుడూ ‘దేశమే ప్రథమం’ అనే సూత్రాన్ని పాటించాలని, ‘మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి’ అని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
ఐకానిక్ టవర్ ప్రతిబింబించే ఆదర్శాల పట్ల తమ నిబద్ధతను పునరుద్ధరించుకోవాలని విశ్వవిద్యాలయ వర్గాలకు ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. జ్ఞానం పునాదిగా, వివేకం మార్గదర్శకంగా, ఆవిష్కరణ సాధనంగా, కరుణ బలంగా, సేవ అంతిమ లక్ష్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ టవర్ తరతరాలకు విజ్ఞానానికి దారిచూపే మార్గదర్శిగా, ఆకాంక్షలకు ప్రతీకగా, ఒడిశా శాశ్వత స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మవిశ్వాసం, శ్రేయస్సు, కరుణ, అభివృద్ధితో కూడిన దేశ నిర్మాణానికి కృషి చేసేలా తరతరాల విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
కొత్తగా ప్రారంభించిన శ్రీశ్రీ విశ్వవిద్యాలయం ఐకానిక్ టవర్లోని అత్యాధునిక ప్లానెటోరియాన్ని కూడా ఉపరాష్ట్రపతి సందర్శించారు. శాస్త్రీయ జిజ్ఞాస, ఆవిష్కరణ, నూతన ఆవిష్కరణల స్ఫూర్తిని చాటేలా ఈ ప్లానెటోరియం ఏర్పాటు చేశారు.
***