వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఓలా’లో ప్రయాణాని కన్నా ముందే టిప్ ఇవ్వాల్సిందిగా ప్రోత్సహించే ఫీచరుకు గాను రూ.10 లక్షల జరిమానా విధించిన సీసీపీఏ.. ఆ పద్ధతిని నిలిపేయాల్సిందిగా ఆదేశం

ఓలా ముందస్తు చెల్లింపు పద్ధతి తప్పుదోవ పట్టించేదిగా ఉందన్న ప్రాధికార సంస్థ..
ఈ పద్ధతి అనైతిక వ్యాపార పద్ధతే కాకుండా నిరాశామయం కూడా అని వ్యాఖ్యలు

నాడు పోస్టు చేయడమైనది: 13 NOV 2026 1:04PM by PIB Hyderabad

 

రైడ్-హెయిలింగ్ వేదిక ఓలా నిర్వాహక సంస్థ ఏఎన్ఐ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్‌కు కేంద్ర వినియోగదారు సంరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) రూ.10 లక్షల జరిమానాను విధించింది. ప్రయాణికులను వారి ప్రయాణాన్ని ముగించుకొనేకన్నా ముందే బహుమతి ఇచ్చే (‘టిప్’) లేదా మరికొంత డబ్బును కలిపి ఇచ్చే (‘యాడ్-ఆన్’) ఫీచర్ల ద్వారా అదనపు సొమ్మును చెల్లించాల్సిందిగా ప్రోత్సహిస్తోందన్న ఆరోపణపై సీసీపీఏ ఈ చర్యను తీసుకుంది. ఈ పద్ధతిని వెంటనే విరమించాలని ఓలాను ప్రాధికార సంస్థ ఆదేశించింది. ఈ ఫీచర్లు వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయని, ఇది అనైతిక వ్యాపార పద్ధతి అని, నిరాశామయ నమూనా అని తెలిపింది.
చీఫ్ కమిషనరు శ్రీమతి నిధి ఖరే, కమిషనరు శ్రీ అనుపమ్ మిశ్రాల అధ్యక్షతన పనిచేస్తున్న సీసీపీఏ.. యాప్‌లో డ్రైవరును వెతికే సమయంలో అదనపు చెల్లింపు జరిపి ప్రయాణాన్ని ఖరారు చేసుకొనే అవకాశాన్ని పెంపొందింపచేసే ఫీచరును సమీక్షించిన అనంతరం పైన ప్రస్తావించిన మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఓలా ‘టిప్’ ఫీచరు పేరును ‘యాడ్-ఆన్’ అని తరువాత మార్చినా మౌలిక ప్రక్రియలో మాత్రం ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.
అదనపు డబ్బు ఇవ్వాలంటూ ప్రోత్సహిస్తున్న సందేశాలు త్వరిత గతిన ప్రయాణం ఖరారు అవుతుందనే భ్రమను కల్పిస్తున్నాయి
ఓలా యాప్‌లో వివిధ వెర్షన్లను సీసీపీఏ సమీక్షించింది. ఈ క్రమంలో, ‘‘టిప్ ఇవ్వడం వల్ల ప్రయాణం త్వరగా ఖాయమయ్యే అవకాశాలు పెరగవచ్చు’’, ‘‘ఇప్పుడే టిప్ ఇస్తే.. త్వరగా రైడ్‌ను పొందేందుకు వీలుంటుంది’’, ‘‘సవారీని తొందరగా దక్కించుకొనే అవకాశాన్ని  మెరుగుపరుచుకోండి’’ వంటి సందేశాలను సీసీపీఏ గమనించింది. దీంతో అదనపు మొత్తాన్ని చెల్లించడం వల్ల ప్రయాణం త్వరగా చేజిక్కుతుందన్న భావన కలుగుతున్నది.
డ్రైవర్లను వెతకడానికి యాప్‌ ప్రయత్నాలు చేస్తుంటే ఈ సందేశాలు నిర్ణీత చెల్లింపు మొత్తానికి సరిగ్గా పై భాగంలో కనిపిస్తోందని ప్రాధికార సంస్థ అధికారులు గ్రహించారు. దీంతో అదనపు సొమ్మును చెల్లించినట్లయితే, బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేసుకోవచ్చన్న అభిప్రాయం కలుగుతుంది.  ‘బహుశా’, లేదా ‘అవకాశం’ అనే మాటలను ప్రస్తావించడం వల్ల, వినియోగదారులకు కలిగే మొత్తంమీద అవగాహనలో మాత్రం ఎలాంటి మార్పు ఉండట్లేదు.
 

ఈ సంవత్సరం జూన్ 1 నుంచి జూన్ 15వ మధ్య ‘ఓలా’ సొంత బుకింగ్ సమాచారం కూడా ఈ వాదనను బలపరచడం లేదు. ‘యాడ్-ఆన్’ (అదనపు చెల్లింపు)తో కూడిన రైడ్ రిక్వెస్టులు అలాంటి అభ్యర్థనలు లేని వాటితో పోలిస్తే తక్కువ సార్లు ఆమోదానికి నోచుకున్నాయి:

నగరం

యాడ్-ఆన్‌తో ఉన్నవి

యాడ్-ఆన్‌ లేనివి

ఢిల్లీ

38 శాతం

62  శాతం 

 బెంగళూరు

40  శాతం

68 శాతం

ముంబయి

39 శాతం

68 శాతం

ఓలా వైఖరి పరస్పర విరుద్ధంగా ఉందని కూడా ప్రాధికార సంస్థ గుర్తించింది.  ప్రయాణ కేటాయింపును యాడ్-ఆన్ ప్రభావితం చేయబోదని కంపెనీ తెలిపినప్పటికీ, కంపెనీకి చెందిన యాప్ అదనంగా చెలించడం ప్రయాణాన్ని త్వరితంగా ఖాయపరిచే అవకాశాలను మెరగుపరచగలుగుతుందని సూచిస్తున్నది.
దీనికి అదనంగా, యాడ్-ఆన్‌తో కూడిన అభ్యర్థనల స్వీకృతి రేటు తక్కువగా ఉందని గాని, లేదా సూచించిన చెల్లింపు రాశిని ఏ ప్రాతిపదికన నిర్ధారించారన్నది గాని వినియోగదారులకు తెలియజేయ లేదన్న సంగతిని ప్లాట్‌ఫాముకు చెందిన సొంత డేటా వెల్లడిస్తోంది. ఈ లోపాలు వినియోగదారు పరిరక్షణ చట్టం-2019లోని సెక్షన్ 2(28)(iv)లో భాగంగా కీలక సమాచారాన్ని దాచిపెట్టడంతో సమానమైనవని సీసీఈఏ తేల్చింది.
ముందస్తు చెల్లింపును అనుచిత వ్యాపార పద్ధతిగా పేర్కొన్న సీసీపీఏ
బహుమతి ఇవ్వడం (టిప్) సామాన్యంగా సేవను అందుకున్న అనంతరం చేసే స్వచ్ఛంద చెల్లింపు అని ప్రాధికార సంస్థ ప్రస్తావించింది. ప్రయాణం మొదలవడాని కన్నా ముందుగానే దానిని కోరడం స్వచ్ఛంద గ్రాచ్యుయిటీని సేవకు ముందస్తు చెల్లింపుగా మార్చివేయడమే అవుతుందంది. ఈ ఫీచరుకు ‘టిప్’ అని ఉన్న పదాన్ని మార్చి ‘యాడ్-ఆన్’ అంటూ ఒక వేరే పేరును పెట్టినంత మాత్రాన పద్ధతి స్వభావంలో ఎలాంటి మార్పూ రాలేదు అని ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది.
సీసీపీఏ ప్రస్తావించిన ఇతర అంశాలు ఇలా ఉన్నాయి:
     •  వినియోగదారు ముందస్తు చెల్లింపు పద్ధతిపై ప్రయాణాన్ని బుక్ చేసుకున్న తరువాత అదనపు చెల్లింపును కోరుతున్నారు. దీనిలో, అధిక ధరతో పాటు పిక్-అప్ పాయింటుకు ఎంత దూరంలో డ్రైవరు ఉన్నారన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. సరఫరాతో ముడిపడిన పరిమిత సేవల కారణంగా అదనపు చెల్లింపును ఆశించడమంటే అది ఒక విధంగా అదనంగా ఎక్కువ ధరను వసూలు చేయడంతో సమానం.
     •  ప్రస్తావించిన మొత్తాలు.. గుర్తు తెలియని ప్రాతిపదికన ప్లాట్‌ఫామ్ నిర్ధారించినవే. ఈ మొత్తాలు 2025 మే నెలలో రూ.10 నుంచి రూ.40 ఉన్నవి కాస్తా పెరిగిపోయి రూ.140కి చేరుకున్నాయి. మరోవైపు, రూ.499 వరకు చెల్లింపులకు ఇంటర్‌ఫేస్ అనుమతిస్తోంది.
     •  డ్రైవర్ అందుబాటులో ఉండే విషయంలో సమాచారాన్ని ప్లాట్‌ఫాం తన నియంత్రణలో ఉంచుకొంటుంది కాబట్టి, అదనపు చెల్లింపు అవసరం ఎంతవరకు ఉందనే అంశాన్ని వినియోగదారులు స్వతంత్రించి రూఢి పరుచుకోలేకపోతున్నారు.
     •  అప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణాన్ని అందుకోవడానికి అదనపు చెల్లింపు అవసరం ఎదురు కావడం అనుచిత కాంట్రాక్టు అనే ఆందోళనల్ని కూడా పెంచేస్తోంది.
ఈ పద్ధతి ‘మోటారు వాహనాల ఎగ్రిగేటర్స్ మార్గదర్శకసూత్రాలు-2025’లో క్లాజ్ 14.15ను ఉల్లంఘిస్తోందని కూడా తేల్చారు. ఆ మార్గదర్శకాల్లో .. ప్రయాణం పూర్తి అయిన తరువాతనే టిప్ ఇచ్చే అవకాశాన్ని పొందుపరిచారు. అలాంటి ప్రాంప్టులను ప్రయాణం పూర్తి కావడాని కన్నా ముందు ప్రదర్శించ కూడదని 2026 ఆగస్టు 11న రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిన తరువాత కూడా ‘ఓలా’ ప్రాంప్టును ప్రదర్శిస్తూనే వచ్చిందని ప్రాధికార సంస్థ గమనించింది.
వినియోగదారు పరిరక్షణ చట్టం-2019లో సెక్షన్ 2(47) ప్రకారం.. అనుచిత విధానాలను, లేదా భ్రమ కల్పించే విధానాలను ఉపయోగించడం, ఏదైనా సేవ తాలూకు లబ్ధి లేదా ఆ సేవను వినియోగించుకొనే విషయంలో అసత్య ప్రకటనలు, పెడదోవ పట్టించే ప్రకటనలను ‘అనుచిత వ్యాపార పద్ధతుల’లో చేర్చారు. అదనపు చెల్లింపుతో ముడిపడిన ఓలా ప్రాంప్టులు ఈ నిబంధన పరిధిలోకి వస్తాయని సీసీపీఏ పేర్కొంది.
అదనపు చెల్లింపులను జరిపేలా ప్రోత్సహించడానికి ‘కన్‌ఫర్మ్ షేమింగ్’ను ఉపయోగిస్తున్న ఇంటర్‌ఫేస్
ఈ ఫీచరును ‘డార్క్ పాటర్న్‌స్‌కు అడ్డుకట్ట వేయడానికి, నియంత్రించడానికి ఉద్దేశించిన మార్గదర్శక సూత్రాలు-2023’ను కూడా సీసీపీఏ దృష్టిలో పెట్టుకొని మరీ సమీక్షించింది. వినియోగదారులు తమ బుకింగ్ ప్రతిపాదనను డ్రైవర్ ఆమోదించిందీ లేనిదీ తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్న సందర్భాల్లో ఈ ప్రాంప్టులు కనపడ్డాయి. అదనపు చెల్లింపు జరపడం వల్ల ప్రయాణాన్ని ఖరారు చేసుకొనేందుకు అవకాశాలు మెరుగుపడతాయని సూచించడం ద్వారా, అలా చెల్లింపు జరపలేకపోయే వినియోగదారులు.. అయితే జాప్యాలను ఎదుర్కోవడమో, లేదా అసలు ప్రయాణాన్నే పొందలేక పోవడమో జరగవచ్చని ఈ ఇంటర్‌ఫేస్ పరోక్షంగా సూచించేది. ఇది భయాన్ని రేకెత్తించిందని, ఇది మార్గదర్శకాలలో అనుబంధం 1 లోని క్లాజు 3 లో భాగంగా నిర్దిష్ట ‘కన్ఫర్మ్ షేమింగ్’ కిందకు వస్తుందని ప్రాధికార సంస్థ భావించింది.
ప్రాధికార సంస్థ తేల్చిన ఇతర అంశాలు ఇలా ఉన్నాయి:
ప్రాంప్టునకు కింద ప్రస్తావించిన పూర్వ నిర్ణీత చెల్లింపు రాశి వినియోగదారులను ఎక్కువ సొమ్మును చెల్లించేటట్లుగా ప్రోత్సహిస్తోంది.
 ‘‘ఉదారంగా అదనపు మొత్తం’’ అనే సందేశం అదనపు చెల్లింపు జరపాలంటూ వినియోగదారులను ప్రోత్సహించింది.
ప్రాంప్టును మూసివేసేందుకు ఎలాంటి ఐచ్ఛికాన్నీ ఇంటర్‌ఫేస్‌లో జోడించడం జరగలేదు.
అప్పటికే ప్రయాణాన్ని ఎంచుకొన్న తరువాత, వినియోగదారులు రూఢి పరుచుకోవడానికి వేచి ఉన్నప్పుడూ, వారి వద్ద డ్రైవర్ అందుబాటు గాని లేదా అదనపు చెల్లింపు జరిపే అవకాశం తాలూకు ప్రభావాన్ని గురించి గాని పరిమిత సమాచారం మాత్రమే ఉన్నప్పుడు ఈ ప్రాంప్టు కనిపించింది.
ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, అంతర రాష్ట్ర బస్ టర్మినళ్లు, విమానాశ్రయాల నుంచి ఈ విధమైన అభ్యర్థనలు అందాయని ‘ఓలా’కు సంబంధించిన బుకింగ్ సమాచారం (డేటా) ద్వారా ప్రాధికార సంస్థ తెలుసుకుంది. రోగులు, వయోవృద్ధులు, సామానును తీసుకుపోయే ప్రయాణికులు, ఒంటరిగా లేదా రాత్రిపూట ప్రయాణిస్తున్న వ్యక్తులు.. ఇటువంటి వినియోగదారులు ఈ తరహా అభ్యర్థనల వల్ల మరీముఖ్యంగా ప్రభావితం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి.
అన్ని ప్రీ-రైడ్ చెల్లింపు ప్రాంప్టులను విరమించుకొని, రూ.10 లక్షల జరిమానాను చెల్లించాలని ఓలాకు ఆదేశాలిచ్చారు.
సీసీపీఏ ‘ఓలా’ను ఈ కింది విధంగా ఆదేశించింది:
     • ప్రయాణం పూర్తి కావడాని కన్నా ముందు అడ్వాన్స్ అద్దెకు అదనంగా ఎలాంటి చెల్లింపును అయినా జరపాలని కోరే అన్ని ప్రాంప్టులు, సందేశాలు, ముందుగా నిర్ణయించిన మొత్తాలు, ఇంటర్‌ఫేస్ డిజైన్లు.. అవి టిప్‌కు సంబంధించినవి కావచ్చు, యాడ్-ఆన్ కావచ్చు, అదనపు కిరాయి లేదా మరేదైనా పేరుతో ఉన్న సందేశాలు కావచ్చు.. వాటిని తక్షణం నిలిపివేయాలి.
     • వినియోగదారు పరిరక్షణ చట్టం-2019, ‘డార్క్ పాటర్న్‌స్‌కు అడ్డుకట్ట వేయడానికి, నియంత్రించడానికి ఉద్దేశించిన మార్గదర్శక సూత్రాలు-2023’లతో పాటు, ‘తప్పుదారి పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయడం, తప్పుదారి పట్టించే ప్రకటనలకు ఆమోదం తెలపడానికి సంబంధించిన మార్గదర్శకాలు-2022’లను ఖచ్చితంగా పాటించడానికి చొరవ తీసుకోవాలి.
     • రూ.10 లక్షల జరిమానా చెల్లించాలి. ఇదే పద్ధతిలో కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇతర క్యాబ్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్లను సీసీపీఏ తనంతట తాను పరిగణనలోకి తీసుకుని ఆ సంస్థలపై చర్యలను చేపట్టింది. ఇంతకు ముందు, ‘ర్యాపిడో’ (రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్)కు రూ.10 లక్షల జరిమానాను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ‘ఊబర్’, ‘నమ్మ యాత్రి’లకు వ్యతిరేకంగా ప్రొసీడింగ్స్ ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నాయి.
ఇలాంటి పద్ధతుల వల్ల ఇబ్బంది పడుతున్న వినియోగదారులు గాని, లేదా సేవలను అందుకొనే ప్రక్రియలో కష్టనష్టాలను ఎదుర్కొనే వారు గాని తమ ఫిర్యాదులను జాతీయ వినియోగదారు హెల్ప్‌లైన్ 1915 ద్వారా దాఖలు చేయవచ్చు, లేదా వాటిని  com-ccpa[at]gov[dot]in. కి పంపించవచ్చు.
తుది ఆదేశాన్ని (Final Order)   సీసీపీఏ వెబ్‌సైట్లో  అందుబాటులో ఉంచారు.

(రిలీజ్ ఐడి: 2336389) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , English , Gujarati , Urdu , Marathi , Bengali , Tamil , Kannada , Malayalam