నాడు పోస్టు చేయడమైనది:
13 NOV 2026 4:17PM by PIB Hyderabad
కర్ణాటకలోని బెంగళూరులో రూ.15,600 కోట్ల పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. కొన్నింటిని జాతికి అంకితం చేయగా, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పలు రైలు సేవలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధానమంత్రి కన్నడ భాషలో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బెంగళూరు నగర అధిదేవత అన్నమ్మ తాయి, నాడప్రభు కెంపెగౌడలకు వినమ్ర వందనం చేశారు. రవాణా అనుసంధానం నుంచి ఇంధన భద్రత వరకు వివిధ రంగాలకు చెందిన నేటి ప్రాజెక్టుల ద్వారా బెంగళూరు, కర్ణాటక అభివృద్ధి ప్రస్థానానికి నూతన వేగం లభించనుందని పేర్కొన్నారు. “మెట్రో, రైల్వేలకు సంబంధించిన ప్రాజెక్టుల నుంచి ఇంధన భద్రతకు సంబంధించిన పనుల వరకు, ఈ ప్రాజెక్టులన్నీ కర్ణాటక మౌలిక సదుపాయాలకు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి” అని శ్రీ మోదీ అన్నారు.
మౌలిక సదుపాయాలు, మెరుగైన రవాణా అనుసంధానం అభివృద్ధి, ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ అవకాశాలు సమాజంలోని అన్ని వర్గాలకూ చేరినప్పుడు పేదరికంపై పోరాటం మరింత బలోపేతమవుతుందని అన్నారు. గత కొన్నేళ్లలో దాదాపు 50 కోట్ల మంది ప్రజలు అత్యంత పేదరికం నుంచి బయటపడటం ఇందుకు నిదర్శనమని వివరించారు. కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల సందర్భంగా కర్ణాటక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “వికసిత కర్ణాటక ద్వారా వికసిత భారత్ నిర్మాణానికి ఈ ప్రాజెక్టులు కొత్త ఊపునిస్తాయి. అదే సమయంలో టెక్ సిటీగా బెంగళూరుకు ఉన్న ప్రత్యేక గుర్తింపును మరింత బలోపేతం చేస్తాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
బెంగళూరు మెట్రో కొత్త పింక్ లైన్‌ను జాతికి అంకితం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ మార్గం ద్వారా ఐఐఎం బెంగళూరుతో పాటు నగరంలోని అనేక విద్యాసంస్థలు, ప్రధాన వ్యాపార, సాంకేతిక, వాణిజ్య కేంద్రాలకు రవాణా అనుసంధానం గణనీయంగా మెరుగుపడుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. “బెంగళూరులోని లక్షలాది మందికి ప్రయాణం మరింత సౌకర్యవంతం కావడమే కాకుండా, సమయం, డబ్బు కూడా ఆదా అవుతాయి” అని శ్రీ మోదీ అన్నారు.
నిన్న దివంగత అనంత్ కుమార్ పుణ్యతిథి సందర్భంగా ప్రధానమంత్రి ఆయనకు నివాళులర్పించారు. ఈ ప్రాంతంతో అనంత్ కుమార్‌కు విడదీయలేని అనుబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. “నేడు ఈ మెట్రో మార్గాన్ని చూస్తుంటే, ఆయన ఆత్మ కూడా ఎంతో సంతోషించి ఉంటుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు దేశ ఐటీ ఎగుమతుల్లో మూడో వంతుకు పైగా వాటాను కలిగి ఉండటంతో పాటు, ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదకశక్తిగా నిలుస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. బెంగళూరు ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు. 2014లో కేవలం 17 కిలోమీటర్లుగా ఉన్న నమ్మ మెట్రో నెట్‌వర్క్‌ను నేడు 100 కిలోమీటర్లకు పైగా విస్తరించినట్లు వివరించారు. దీంతో ఢిల్లీ - ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ తర్వాత మెట్రో రైలు నెట్‌వర్క్ 100 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిన దేశంలోని మూడో నగరంగా బెంగళూరు నిలిచిందని చెప్పారు. “జీవన సౌలభ్యం, ప్రయాణ సౌకర్యాలపై దేశం అనుసరిస్తున్న నూతన ఆలోచనా విధానానికి, మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్న దేశ నిబద్ధతకు నమ్మ మెట్రో సాధించిన ఈ విజయం నిదర్శనం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
వందే భారత్ రైళ్లు, అమృత్ భారత్ స్టేషన్ల ద్వారా భారతీయ రైల్వేలు వలస పాలన నాటి ఆలోచనా ధోరణిని విడనాడి రైల్వే స్టేషన్లు, ఇంజిన్లు, కోచ్‌లపై భారతదేశ ప్రత్యేక గుర్తింపు ప్రతిబింబించేలా నూతన వారసత్వాన్ని ఆవిష్కరిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కర్ణాటకలో చామరాజనగర్, చిక్కమగళూరు, సకలేశ్‌పుర, సుబ్రహ్మణ్య రోడ్ సహా 60కి పైగా రైల్వే స్టేషన్లను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్టేషన్లలో ఆధునికతతో పాటు మానవీయతకు కూడా ప్రాధాన్యతనిస్తున్నారని, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని వివరించారు. “గతంలో విమానాశ్రయాల్లో మాత్రమే కనిపించే సదుపాయాలను ఇప్పుడు పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి తెచ్చేలా రైల్వే స్టేషన్లలో కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
గత 10 నుంచి 12 ఏళ్లలో భారత రైల్వే బడ్జెట్ అనేక రెట్లు పెరిగిందని, కర్ణాటకకు కేటాయింపులు తొమ్మిది రెట్లు అధికమయ్యాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు రాష్ట్రానికి నాలుగు అమృత్ స్టేషన్లు, రెండు డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కర్ణాటకకు తొలి వందే భారత్ స్లీపర్ రైలు అందిన కొద్ది రోజులకే, నేడు కర్ణాటకను గోవాతో అనుసంధానించే మరో వందే భారత్ రైలును ప్రారంభించినట్లు తెలిపారు. “ఈ రైలు ద్వారా మంగళూరుతో సహా కర్ణాటక తీరప్రాంతం వెంబడి ప్రయాణించే వారికి సెమీ హైస్పీడ్ రైలు ప్రయాణంలో సరికొత్త అనుభూతి కలుగుతుంది” అని శ్రీ మోదీ అన్నారు.
ఇరాన్, గల్ఫ్ ప్రాంతం చుట్టూ కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ఇంధన భద్రత ఎంత కీలకమో స్పష్టం చేస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో తీసుకున్న చర్యల కారణంగానే భారత్ ఈ సవాళ్లతో కూడిన పరిస్థితులను దృఢంగా ఎదుర్కోగలిగిందని వివరించారు. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచడం, ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని విస్తరించడం, సౌర, జల, పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, రైల్వే మార్గాల్లో దాదాపు పూర్తి స్థాయిలో విద్యుదీకరణ చేపట్టడం, మెట్రో నెట్‌వర్క్‌లను విస్తరించడం వంటి చర్యలు ఇందులో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటకలో చేపట్టిన మూడు కొత్త ప్రాజెక్టులను గురించి ప్రధానమంత్రి వివరించారు. మంగళూరులోని ఎల్‌పీజీ ప్రాజెక్టు ద్వారా 80 వేల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం అందుబాటులోకి రానుంది. దేవనగొంథి మార్కెటింగ్ టెర్మినల్ ద్వారా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన సరఫరా వ్యవస్థ మరింత క్రమబద్ధం కానుంది. బెంగళూరులో ఏర్పాటు చేసిన కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంటు రోజుకు 13 టన్నుల బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయనుంది. “దీనివల్ల వ్యర్థాల నిర్వహణ మెరుగుపడటంతో పాటు, సహజ వాయువు దిగుమతుల కోసం వెచ్చించే ఖర్చు కూడా ఆదా అవుతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
చిప్‌ల తయారీ నుంచి నౌకా నిర్మాణం వరకు, కృత్రిమ మేధ (ఏఐ), డేటా కేంద్రాల నుంచి క్వాంటం కంప్యూటింగ్ వరకు నూతన సాంకేతిక రంగాల్లో ప్రపంచ నాయకత్వాన్ని సాధించే దిశగా భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు విశ్వసనీయమైన విద్యుత్ ఉత్పత్తి ఎంతో అవసరమని అన్నారు. స్వచ్ఛ ఇంధన లక్ష్యాలను సాధించేందుకు దేశంలో అణు విద్యుత్ కేంద్రాల విస్తరణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. “నేడు భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 300 గిగావాట్ల మైలురాయిని అధిగమించింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు దేశ ప్రజలను విద్యుత్ వినియోగదారుల నుంచి విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారుస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో దేశవ్యాప్తంగా 60 లక్షలకు పైగా కుటుంబాలు, కర్ణాటకలో 40 వేలకు పైగా కుటుంబాలు తమ ఇళ్లపై సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. ఒక్కో కుటుంబానికి సుమారు రూ.80 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని వివరించారు. ప్రధానమంత్రి–కుసుమ్ (పీఎం - కుసుమ్) పథకం కింద కర్ణాటక రైతుల కోసం 8 లక్షలకు పైగా సౌర విద్యుత్ పంపుల ద్వారా సాగునీటి సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా, రైతులకు అదనపు ఆదాయం, కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. “అంటే, కర్ణాటక అన్నదాతలు ఇప్పుడు ఊర్జాదాతలుగా (ఇంధనదాతలుగా) కూడా మారుతున్నారు” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
2014 తర్వాత ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ సంకల్పంతో చేపట్టిన లక్ష్యబద్ధమైన కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం, పన్ను చెల్లింపుదారుల సొమ్మును సమర్థంగా వినియోగించడం వల్ల దేశంలో మధ్యతరగతి విస్తరించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో కొత్త ఆశయాలు, ఆకాంక్షలు కలిగిన మరో వర్గం కూడా ఆవిర్భవించిందని తెలిపారు. గృహోపకరణాలు, ద్విచక్ర వాహనాలు, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, వైద్య సేవలు, పర్యాటక అనుభవాలు వంటి వాటిని కోరుకుంటున్న ఈ వర్గాన్ని ‘ఆకాంక్షాపరుల వర్గం’గా ఆయన అభివర్ణించారు. ఈ పెరుగుతున్న ఆకాంక్షలు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పర్యాటకం, సేవల రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి, కొత్త ఉద్యోగాల కల్పనకు ఊతమిస్తున్నాయని చెప్పారు. తద్వారా నూతన మధ్యతరగతి దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదకశక్తిగా మారుతోందని వివరించారు. “కర్ణాటకలో, ముఖ్యంగా బెంగళూరులో పెద్ద సంఖ్యలో ఉన్న ఈ నూతన మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
మధ్యతరగతి ప్రజల పొదుపును పెంచి, వారి చేతుల్లో ఖర్చు చేసేందుకు మరింత ఆదాయం మిగిలేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పించడం, సీనియర్ సిటిజన్లు, అద్దె ఆదాయం పొందేవారికి ప్రయోజనం చేకూరేలా టీడీఎస్ నిబంధనలను సవరించడం, తదుపరి తరం జీఎస్‌టీ సంస్కరణల ద్వారా నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడం వంటి చర్యలను వివరించారు. “వ్యక్తిగత ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జీఎస్‌టీని పూర్తిగా తొలగించడం ద్వారా బీమా సేవలను మరింత అందుబాటులోకి తెచ్చాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
కర్ణాటకలో నేడు ప్రారంభించిన ప్రాజెక్టులు దేశ అభివృద్ధి ప్రస్థానానికి మరింత వేగాన్ని అందిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు మరింత మేలు కలగాలని ఆకాంక్షిస్తూ, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా మరింత శక్తిమంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. “మధ్యతరగతి ప్రజల పొదుపు పెరగాలి, వారి కొనుగోలు శక్తి బలోపేతం కావాలి. తమ కుటుంబ కలలను సాకారం చేసుకోవడంతో పాటు, దేశ ఆర్థిక ప్రగతిలోనూ వారు భాగస్వాములు కావాలన్నదే మా ప్రయత్నం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
***