ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

45వ భారత అంతర్జాతీయ వ్యాపార ప్రదర్శన (ఐఐటీఎఫ్)-2026లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ ఆరోగ్య పథకాలు, కార్యక్రమాల ప్రదర్శన

ఆరోగ్య పెవిలియన్‌ను ప్రారంభించిన నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఎం. శ్రీనివాస్... పెరుగుతున్న అసంక్రమిత వ్యాధుల భారాన్ని ఎదుర్కొనేందుకు నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికల ప్రాముఖ్యత గురించి వివరణ

న్యూఢిల్లీలోని భారత మండపంలో ఆరోగ్య పెవిలియన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలీల శ్రీవాస్తవ

యువ భారత్-ఆరోగ్యవంతమైన భారత్ ఇతివృత్తంతో ఆరోగ్య పెవిలియన్ ఏర్పాటు... నివారణాత్మక ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యానికి పెద్దపీట

ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, విజయాలు, సేవల ప్రదర్శనకు 24 జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, సంస్థలకు సంబంధించిన 39 స్టాళ్లు

సందర్శకులను ఆకట్టుకునేందుకు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు పరస్పర స్పందనా కార్యక్రమాలు, లైవ్ సీపీఆర్ ప్రదర్శనలు, ఆరోగ్య అవగాహనా సదస్సులు, ప్రత్యేకంగా చిన్నారుల కోసం కిడ్స్ జోన్ ఏర్పాటు

నాడు పోస్టు చేయడమైనది: 14 NOV 2026 2:47PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని భారత మండపంలో ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ) ఆధ్వర్యంలో నవంబర్ 14 నుంచి 27 వరకు జరుగుతున్న 45వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (ఐఐటీఎఫ్)-2026లో ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలు, కీలక విజయాలు, ప్రజా ఆరోగ్య సంరక్షణ సేవలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ (ఎంఓహెచ్ఎఫ్‌డబ్ల్యూ) ప్రత్యేకంగా ప్రదర్శిస్తోంది.

నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఎం. శ్రీనివాస్ ఈరోజు ఆరోగ్య పెవిలియన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలీలా శ్రీవాస్తవ, ఆరోగ్య పరిశోధన శాఖ (డీహెచ్ఆర్) కార్యదర్శి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహెల్ జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) శ్రీ సునీల్ కుమార్ బర్న్‌వాల్‌తో పాటు మంత్రిత్వశాఖ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రతిష్టాత్మకమైన ఈ వార్షిక వేడుకలో మంత్రిత్వశాఖ భాగస్వామ్యం వహించటంతో పౌరులతో నేరుగా మమేకం అయ్యేందుకు, ప్రభుత్వం చేపట్టిన విస్తృత ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను ప్రదర్శించేందుకు, నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ, ప్రారంభ దశలోనే వ్యాధి నిర్ధారణ, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కీలక వేదిక లభిస్తుంది.

'యువ భారత్, స్వస్థ భారత్’: నివారణతో కూడిన ఆరోగ్య సంరక్షణ సంస్కృతిని ప్రోత్సహించటం

ఈ ఏడాది ఆరోగ్య పెవిలియన్ 'యువ భారత్, స్వస్థ భారత్' ఇతివృత్తంతో ఏర్పాటైంది. నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లకు, ఆరోగ్యకరమైన, మరింత దృఢమైన భారతదేశ నిర్మాణంలో యువత క్రియాశీలక భాగస్వామ్యానికి విశేష ప్రాధాన్యతనిస్తుంది.

చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించటం, ఆరోగ్య అవగాహనను పెంపొందించటం, పౌరులు శారీరక, మానసిక ఆరోగ్యంపై తగిన నిర్ణయాలు తీసుకునేలా శక్తిమంతం చేయటం వంటి అంశాల ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తుంది.

సమాచార ప్రదర్శనలు, పరస్పరం స్పందించే ప్రదర్శనలు, ప్రజలను భాగస్వామ్యం చేసే కార్యక్రమాల ద్వారా అందరికీ, ముఖ్యంగా యువత, పిల్లలు, కుటుంబాలకు ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉండేలా, సులభంగా అర్థమయ్యేలా, ఆసక్తి కనబరిచేలా తెలియజేయటమే ఈ పెవిలియన్ లక్ష్యం.

అసంక్రమిత వ్యాధులు (ఎన్‌సీడీలు), జీవనశైలికి సంబంధించిన ఆరోగ్య సమస్యల భారం రోజురోజుకూ పెరుగుతున్నట్లు డాక్టర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నివారణాత్మక ఆరోగ్య సంరక్షణపై మరింత దృష్టి సారించాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఎన్‌సీడీల నివారణలో, వాటి నిర్వహణలో ప్రజల్లో అవగాహన పెంచటం, వ్యాధులను ముందస్తుగా గుర్తించటం, సకాలంలో వైద్య సేవలు పొందటం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. పౌరుల ఆరోగ్యం పట్ల మరింత బాధ్యత వహించాలని, తగిన సమాచారంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

సాధారణంగా వచ్చే ఆరోగ్య ప్రమాదాల గురించి తెలుసుకునేందుకు, నివారణ చర్యలపై అవగాహన తెచ్చుకునేందుకు, వివిధ ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, సేవల గురించి తెలుసుకునేందుకు ఆరోగ్య పెవిలియన్ పౌరులకు విలువైన అవకాశాన్ని కల్పిస్తోందని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

సందర్శకులు, ముఖ్యంగా యువకులు, కుటుంబాలు పెవిలియన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలని, ఆరోగ్యం, సంక్షేమంపై అవగాహనను పెంపొందించుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రోత్సహించారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఒకేచోట 24 ఆరోగ్య కార్యక్రమాలు, సంస్థలు

భారత మండపంలోని నాలుగో హాల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో 989 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 39 స్టాళ్ల ద్వారా ఈ ఆరోగ్య పెవిలియన్ రూపుదిద్దుకుంది. 24 జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రోగ్రామ్ డివిజన్లు, పాల్గొనే సంస్థలకు ఇది వేదికగా నిలిచింది.

ఈ పెవిలియన్ సందర్శకులకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నివారణ, నియంత్రణ, టీకా కార్యక్రమాలు, మాతా శిశు ఆరోగ్యం, డిజిటల్ ఆరోగ్య సేవలు, మానసిక ఆరోగ్యం, ఆహార భద్రత, అవయవ దానం, ఇతర ముఖ్యమైన ప్రజారోగ్య రంగాలపై, భారతదేశ ప్రజారోగ్య కార్యక్రమాలపై సమగ్ర అవగాహనను కల్పిస్తుంది.

ఇక్కడ ప్రదర్శితమవుతున్న ప్రధాన కార్యక్రమాలు, సేవల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, నేషనల్ హెల్త్ అథారిటీ ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ - ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఈ-సంజీవని, సార్వత్రిక టీకా కార్యక్రమం, రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం, క్షయ ముక్త భారత్ అభియాన్, టెలి-మానస్, అనేక జాతీయ వ్యాధి నివారణ, నియంత్రణ కార్యక్రమాలున్నాయి.

మంత్రిత్వశాఖకు చెందిన ప్రోగ్రామ్ డివిజన్లు, పాల్గొనే సంస్థల ప్రతినిధులతో సందర్శకులు నేరుగా మాట్లాడేందుకు ఈ పెవిలియన్ వీలు కల్పిస్తుంది. దీని ద్వారా ప్రజలు ఆరోగ్య సేవల గురించి తెలుసుకోవటంతో పాటు, సమాచారాన్ని పొందవచ్చు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలపై మరింత మెరుగైన అవగాహనను పెంపొందించుకోవచ్చు.

ఆరోగ్య అవగాహనను ఆకర్షణీయంగా, అందరికీ సులువుగా చేరవేసేలా ఇంటరాక్టివ్ కార్యక్రమాలు

ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు, నివారించదగిన ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించేందుకు పెవిలియన్ వ్యాప్తంగా విభిన్నమైన, సమాచారాన్ని అందించే, భాగస్వామ్యపూర్వకమైన కార్యక్రమాలను నిర్వహించారు.

వీటిలో లైవ్ కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) ప్రదర్శనలు, ఆరోగ్య అవగాహన సదస్సులు, వీధి నాటకాలు, ఆరోగ్య చర్చా వేదికలు, ఇంటరాక్టివ్ క్విజ్ కార్యక్రమాలున్నాయి.

వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు, అత్యవసర స్పందన, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై అవగాహనను పెంపొందిస్తూనే, ముఖ్యమైన ప్రజా ఆరోగ్య సందేశాలను సరళమైన, ఆకర్షణీయమైన రీతిలో అందించేలా ఈ కార్యక్రమాలను రూపకల్పన చేశారు.

స్క్రీన్ రహిత అభ్యాసం, ఆరోగ్యకరమైన వినోదాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కిడ్స్ జోన్ ఏర్పాటు

చిన్నారుల కోసం సంప్రదాయ ఆటలు, వినోద కార్యకలాపాలతో ఆరోగ్య పెవిలియన్లో ప్రత్యేకమైన 'కిడ్స్ జోన్'ను ఏర్పాటు చేశారు.

ప్రధానంగా స్క్రీన్లకు దూరంగా ఉంటూ శారీరక శ్రమ, సామాజిక పరస్పర చర్యలు, ఆటల ద్వారా అభ్యాసాన్ని ప్రోత్సహించటమే ఈ జోన్ ప్రధాన ఉద్దేశం.

పెవిలియన్‌ను సందర్శించే కుటుంబాలకు ఆనందకరమైన, ఆసక్తికరమైన వాతావరణాన్ని కల్పిస్తూనే ఆరోగ్యకరమైన అలవాట్ల ప్రాముఖ్యతను పిల్లలకు పరిచయం చేయటం ఈ కార్యక్రమం లక్ష్యం.

టీబీ అవగాహన, పరీక్షలు, సామాజిక భాగస్వామ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం

క్షయవ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు, దాని నివారణ, లక్షణాలు, నిర్ధారణ, చికిత్స, జాతీయ క్షయవ్యాధి నివారణ కార్యక్రమం (ఎన్‌టీఈపీ) ద్వారా అందుబాటులో ఉన్న వివిధ సేవల గురించి సందర్శకులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా టీబీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు.

ఈ కార్యకలాపాల్లో భాగంగా ఏఐ ఆధారిత హ్యాండ్‌హెల్డ్ ఎక్స్-రే సాంకేతికతను ఉపయోగించి టీబీ పరీక్షను నిర్వహిస్తున్నారు. సందర్శకులకు వైద్య సలహాలు, మార్గదర్శకాలను డాక్టర్లు అందిస్తున్నారు.

పోషకాహార కిట్ల పంపిణీ సహా టీబీ రోగులకు మద్దతుగా నిలిచేందుకు వ్యక్తులు, సంస్థలను ప్రోత్సహిస్తూ 'ని-క్షయ మిత్ర' నమోదు ప్రక్రియను కూడా ఈ స్టాల్ ద్వారా సులభతరం చేస్తున్నారు.

క్షయవ్యాధిపై పోరులో ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స, పోషకాహార మద్దతు, సమాజ భాగస్వామ్యం తదితర కీలక సందేశాలను అందించేందుకు, వీధి నాటకాలు, మ్యాజిక్ షోలు, టీబీ మస్కట్‌తో ముఖాముఖి వంటి ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

టీబీ-ముక్త భారత్ లక్ష్యాన్ని సాధించటంలో సామూహిక కృషి, పౌరుల భాగస్వామ్య ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం స్పష్టం చేస్తుంది.

ఆరోగ్యకరమైన భారతం కోసం ప్రజా చైతన్యం, పౌరుల భాగస్వామ్యాన్ని పెంపొందించటం

పౌరులకు ఆరోగ్య సమాచారాన్ని, ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను మరింత చేరువ చేయాలన్న మంత్రిత్వశాఖ నిరంతర నిబద్ధతను ఐఐటీఎఫ్-2026లోని ఆరోగ్య పెవిలియన్ ప్రతిబింబిస్తోంది.

సమాచార ప్రదర్శనలు, ఆచరణాత్మక ప్రదర్శనలు, ఆకర్షణీయమైన కార్యకలాపాలు, ప్రజలతో నేరుగా మమేకం అవటం ద్వారా నివారణ ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంచేందుకు ప్రజలు, కుటుంబాలు ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకునేలా శక్తిమంతం చేయటానికి ఈ పెవిలియన్ కృషి చేస్తోంది.

స్వస్థ భారత్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం, సామాజిక భాగస్వామ్యం, సరైన ఆరోగ్య అవగాహనల ప్రాముఖ్యతను ఈ వేదిక ద్వారా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

పాల్గొంటున్న ఆరోగ్య కార్యక్రమాలు, సంస్థల జాబితా


(రిలీజ్ ఐడి: 2336348) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , हिन्दी , Tamil