శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ సవాళ్లకు సైన్స్ ఆధారిత పరిష్కారాల పట్ల నిబద్ధతను స్పష్టం చేస్తూ, జీ20 సైన్స్ అకాడమీల సంయుక్త ప్రకటనను ఆమోదించిన ఇన్సా

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2026 12:58PM by PIB Hyderabad

విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక శాఖ (డీఎస్‌టీ) ఆధ్వర్యంలోని సంస్థ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఇన్సా). ఇది ఎస్20 2026 ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొని, జీ20 దేశాల సైన్స్ అకాడమీలు సంయుక్తంగా విడుదల చేసిన ఎస్20 ప్రకటనను ఆమోదించింది. సైన్స్20 (ఎస్20) ఎంగేజ్‌మెంట్ ప్రక్రియలో భాగంగా యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఎన్ఏఎస్) నేతృత్వంలో నవంబర్ 10, 2026న ఈ ప్రకటన వెలువడింది.

 

ప్రకృతి వైపరీత్యాలు, విపతులను ఎదుర్కోవటంలో సన్నద్ధతను, ప్రతిస్పందనను బలోపేతం చేసేందుకు అధునాతన సాంకేతికతలను వినియోగించటం పట్ల అవకాశాలను ఈ సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది. దీనికి మద్దతు తెలపటం ద్వారా ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు సైన్స్ ఆధారిత విధానాలను ప్రోత్సహించాలనే నిబద్ధతను ఇన్సా స్పష్టం చేసింది.

 

జీ20 దేశాల సైన్స్ అకాడమీల సంప్రదింపులు, భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ ప్రకటన... ఆయా దేశాల ప్రభుత్వాల మధ్య చర్చలకు మార్గనిర్దేశం చేసేలా రూపొందించారు. డిసెంబర్ 2026లో ఫ్లోరిడాలోని మియామి నగరంలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ పత్రాన్ని జీ20కి అందజేస్తారు.

 

భారీ వర్షపాతం, భూకంపాలు, కరవు, కార్చిచ్చులు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, చలిగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలు జనాభా, ఆవరణ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలకు మునుపెన్నడూ లేనివిధంగా పెను సవాళ్లను విసురుతున్నాయి. నిర్ణయ ప్రక్రియను మెరుగుపరిచేందుకు, విపత్తులను ఎదుర్కొనే సన్నద్ధతను, స్థిరత్వాన్ని పెంపొందించేందుకు భూ పరిశీలన, రిమోట్ సెన్సింగ్, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, డిజిటల్ ట్విన్స్, డ్రోన్ సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఎంతగానో దోహదపడగలవని ఈ ప్రకటన తెలియజేస్తుంది.

 

సమాచార లభ్యత, మౌలిక వసతులు, సాంకేతిక సామర్థ్యం, సంస్థాగత సమన్వయాల్లోని లోపాలను పూడ్చటంతో పాటు.. సాంకేతికతను అందరికీ సమానంగా అందుబాటులోకి తెస్తూ, అమలుకు తగిన సన్నద్ధతను కల్పించినప్పుడే వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సాధ్యమవుతుంది.

చర్యలు తీసుకునేందుకు అయిదు ప్రధాన రంగాలను సంయుక్త ఎస్‌20 ప్రకటనలో గుర్తించారు. వీటిలో ప్రమాదాలపై అవగాహన, డేటా సేకరణను బలోపేతం చేయటం, డేటా, సాంకేతికతను సురక్షితంగా, భద్రతతో కూడిన, అందరికీ అందుబాటులో ఉండేలా, స్థానిక నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించటం, ఆయా సందర్భాలకు తగిన పరిష్కారాలను రూపొందించటం, మానవ నిర్ణయాధికారం, పాలనను బలోపేతం చేయటం, అంతర్జాతీయ, రంగాలవారీగా పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవటం వంటివి ఉన్నాయి.

 

సాంకేతికత కేవలం మానవ నైపుణ్యాలను భర్తీ చేయటానికి కాక, వాటిని మెరుగుపరిచేందుకు ఉపయోగపడాలని ఈ ప్రకటన స్పష్టం చేసింది. బలమైన శాస్త్రీయ సహకారం, సంస్థాగత భాగస్వామ్యాల మద్దతుతో స్థానిక పరిష్కారాల ద్వారానే సమర్థవంతమైన విపత్తు నిర్వహణ సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.

 

భారతదేశ జాతీయ సైన్స్ అకాడమీగా, విపత్తు సన్నద్ధత, స్థిరత్వానికి సంబంధించి ఈ ప్రకటనలోని సిఫార్సులను తగిన జాతీయ భాగస్వాముల దృష్టికి తీసుకెళ్లేందుకు, శాస్త్రీయ నిపుణులు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు ఇన్సా కృషి చేస్తుంది. జాతీయ, అంతర్జాతీయ వ్యవస్థల ద్వారా ఇంటర్‌డిసిప్లినరీ పరిశోధనలు, విజ్ఞాన మార్పిడి, సహకారాన్ని ఇన్సా నిరంతరం ప్రోత్సహిస్తుంది.

 

జీ20 దేశాల్లోని సైన్స్ అకాడమీలు అభిప్రాయాలను పంచుకునేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఉమ్మడి సవాళ్లను సమష్టిగా ఎదుర్కొనేందుకు ఎస్20 2026 ప్రక్రియ కీలక వేదికను అందించింది. 2027లో రాయల్ సొసైటీ నేతృత్వంలో ఈ భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఇన్సా ఆసక్తితో ఉంది.

 

చర్యలు తీసుకోవాల్సిన కీలక రంగాలు

 

డేటా సేకరణ, నష్టభయ అవగాహనను బలోపేతం చేయటం: సంసిద్ధత, ప్రతిస్పందన, కోలుకునే ప్రక్రియలకు మద్దతుగా పరిశీలనా వ్యవస్థలను, ముప్పు, ప్రమాదాలు, జరగబోయే హానికి సంబంధించి విశ్వసనీయమైన సమాచార లభ్యతను మెరుగుపరచటం.

 

డేటా, సాంకేతికతను సురక్షితంగా, భద్రంగా, అందరికీ అందుబాటులో ఉండేలా చేయటం: డేటా రక్షణ, భద్రత, గోప్యతకు సంబంధించి జాతీయ బాధ్యతలను గౌరవిస్తూనే డేటా భాగస్వామ్యం, ప్రమాణాలు, పరస్పర అనుసంధానం, పటిష్టమైన వ్యవస్థలను ప్రోత్సహించటం.

 

స్థానిక నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించటం, సందర్భానుసార పరిష్కారాలను రూపొందించటం: సాంకేతికతలు స్థానిక అవసరాలకు తగినట్లుగా మలచుకునేలా, సమర్థవంతంగా నిలకడగా ఉండేలా చూసేందుకు విద్య, ఉద్యోగ కల్పన, శిక్షణ, సామాజిక భాగస్వామ్యంలో పెట్టుబడులు పెట్టటం.

 

మానవ నిర్ణయాధికారం, పాలనను బలోపేతం చేయటం: సముచితమైన పర్యవేక్షణ, స్థానిక ధ్రువీకరణ, పారదర్శకత, జవాబుదారీతనం, ప్రమాదాలపై సమర్థవంతమైన సమాచార ప్రసారం ద్వారా అధునాతన సాంకేతికతలు మానవ నైపుణ్యానికి తోడ్పడేలా చూడటం.

 

అంతర్జాతీయ, రంగాలవారీ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లటం: విజ్ఞానం, సాంకేతికతను సంయుక్తంగా రూపొందించటంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, పౌర సమాజం, సంఘాలు, అంతర్జాతీయ సంస్థల మధ్య నిరంతర భాగస్వామ్యాన్ని ప్రోత్సహించటం.

****


(రిలీజ్ ఐడి: 2335542) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Tamil