నాడు పోస్టు చేయడమైనది:
11 NOV 2026 8:38PM by PIB Hyderabad
విశాఖపట్నంలో రూ. 19 కోట్ల వ్యయంతో నిర్మించిన వాటర్‌ఫ్రంట్ ప్రొమెనేడ్‌ను కేంద్ర నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రజలకు అంకితం చేశారు. పోర్టులో మరో నాలుగు నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ. 560 కోట్ల వ్యయంతో విశాఖపట్నం పోర్టులో నూతన అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ వరకు సుమారు 710 మీటర్లు (2,330 అడుగులు), దాదాపు 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ పోర్టు ప్రొమెనేడ్ రూపుదిద్దుకుంది. నౌకలు, పోర్టు కార్యకలాపాలను విశాఖ ప్రజలు సురక్షితంగా తిలకించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి సోనోవాల్ తెలిపారు. "ఇది పోర్టును నగర ప్రజలకు మరింత చేరువ చేసింది. ఈ ప్రాజెక్టును విశాఖ ప్రజలకే అంకితం చేస్తున్నాం" అని పేర్కొన్నారు.
ఈ ప్రొమెనేడ్‌లో ప్రత్యేకమైన వాటర్‌ఫ్రంట్ వాక్‌వే, రెండు వ్యూ డెక్‌లు… వీటిలో ఒకటి 'టైటానిక్' తరహా వ్యూపాయింట్, ఉద్యానవనం, పబ్లిక్ ప్లాజా, చిన్నారుల ఆటస్థలం, ఫుడ్ కోర్టు, సందర్శకుల కోసం పార్కింగ్ సదుపాయం కల్పించారు. సరకు రవాణా కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, పోర్టుకు సంబంధించిన ఖాళీ స్థలంలోనే దీన్ని నిర్మించారు. క్రూయిజ్ టెర్మినల్ పక్కనే ఉండటం వల్ల ఇది పర్యాటకులను మరింత ఆకర్షించటమే కాక, క్రూయిజ్ ప్రయాణికులకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.
ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత సమ్మిళిత అభివృద్ధితో సోనోవాల్ అనుసంధానం చేశారు. దీనిలో పౌరులు కేవలం లబ్దిదారులుగా మాత్రమే కాక, దేశ నిర్మాణంలో భాగస్వాములుగా ఉంటారు. ఒకప్పుడు బయటి వ్యక్తులకు మూసివున్న ఒక పోర్టు ఇప్పుడు స్థానికులను ఆహ్వానిస్తోందని, నూతన టెర్మినల్ కాంట్రాక్టుల ద్వారా దాదాపు 500 మంది స్థానికులకు బెర్తులను నిర్వహించే ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు.
"ప్రతి పౌరుడికి ఒక స్థానం, పాత్ర ఉండేలా అభివృద్ధి జరగాలి అనేది ప్రదానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత" అని సర్బానంద సోనోవాల్ అన్నారు. "ప్రజల కోసం ద్వారాలు తెరిచి, స్థానిక యువతకు బెర్తుల నిర్వహణ బాధ్యతను అప్పగించే పోర్టు... ప్రధానమంత్రి దార్శనికతకు నిలువెత్తు రూపం" అని పేర్కొన్నారు.
సుమారు రూ. 580 కోట్ల విలువైన మూడు కార్గో టెర్మినళ్ల నిర్వహణ, కార్యకలాపాల కాంట్రాక్టులకు సోనోవాల్ శంకుస్థాపన చేశారు. వీటిలో డబ్ల్యూక్యూ-1, డబ్ల్యూక్యూ-1ఆర్ఈ, డబ్ల్యూక్యూ-2, డబ్ల్యూక్యూ-3, ఈక్యూ-3 బెర్తులున్నాయి. ఆపరేటర్లు ఈ బెర్తుల్లో క్రేన్లు, కన్వేయర్లు వంటి పనులతో పాటు పర్యావరణ నియంత్రణ చర్యలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాదాపు 500 మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తారు. "ఈ ప్రాజెక్టుల ద్వారా వీపీఏ నిర్దిష్ట కార్గో రవాణాను సాధించి, బెర్తుల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలదు" అని సర్బానంద సోనోవాల్ తెలిపారు.
పోర్టులో మురుగునీటి శుద్ధి కేంద్రం సామర్థ్యాన్ని రోజుకు 10 మిలియన్ లీటర్ల నుంచి 15 మిలియన్ లీటర్లకు పెంచే పనులకు, రూ. 11 కోట్ల అంచనా వ్యయంతో కొత్తగా నిర్మించనున్న 5 మిలియన్ లీటర్ల ప్లాంట్‌కు కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ శుద్ధి చేసిన నీటిని దుమ్ము నియంత్రణకు, రోడ్లను తడిగా మార్చేందుకు, నిల్వలు ఉంచే యార్డుల్లో చల్లేందుకు ఉపయోగిస్తారు. కేంద్ర మంత్రిత్వశాఖ చేపట్టిన 'హరిత్ సాగర్' గ్రీన్ పోర్టు కార్యక్రమానికి ఈ అప్‌గ్రేడ్ మద్దతిస్తుంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పోర్టు రికార్డు స్థాయిలో 91.17 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహించింది. ఇది గతేడాదితో పోలిస్తే సుమారు 10 శాతం ఎక్కువని, వరుసగా నాలుగో ఏడాది కూడా వృద్ధిని నమోదు చేసిందని సోనోవాల్ వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు గతేడాదితో పోలిస్తే కార్గో రవాణా 4.44 మిలియన్ మెట్రిక్ టన్నులు లేదా 8.88 శాతం పెరిగింది. "గతేడాది సాధించిన 10 శాతం వృద్ధి లక్ష్యాన్ని ఈసారి కచ్చితంగా అధిగమించాలి" అని పోర్టు ఉద్యోగులను ఉద్దేశించి సోనోవాల్ అన్నారు. వారితో సమావేశమైన మాట్లాడారు.
'నావిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్' ఇతివృత్తంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక 31వ సీఐఐ భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సు-2026లో సోనోవాల్ ప్రసంగం సందర్భంగా ఈ కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ పోర్టు సుమారు రూ. 800 కోట్ల వ్యయంతో నాలుగు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) ప్రాజెక్టులను చేపట్టింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టులు... 2027 నాటికి ప్రారంభం అవుతాయి. ఇది భారతదేశంలోని ప్రధాన పోర్టుల్లో అత్యంత లోతైన కంటైనర్ టెర్మినల్స్‌లో ఒకటి. దీని అనుమతి డ్రాఫ్ట్ 16 మీటర్లుగా ఉండగా, నౌకల తిరుగు సమయాన్ని, రవాణా ఖర్చులను తగ్గించేందుకు ఇది ల్యాండ్‌లార్డ్ పోర్టు నమూనాకు మారుతోంది.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో భారతదేశ పోర్టులను ప్రపంచ స్థాయి సౌకర్యాలుగా తీర్చిదిద్దటంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వమే కారణమని సోనోవాల్ కొనియాడారు. పబ్లిక్ ప్రొమెనేడ్ నుంచి మెరుగైన మురుగునీటి వ్యవస్థ వరకు నేటి ప్రాజెక్టులు ప్రజలందరినీ కలుపుకొనిపోయే అభివృద్ధి అనే ప్రధానమంత్రి దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
"పౌరులు కేవలం ప్రేక్షకులుగా కాకుండా భాగస్వాములు అయినప్పుడే శాశ్వత అభివృద్ధి జరుగుతుంది" అని సోనోవాల్ అన్నారు. "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ స్ఫూర్తి ఇదే. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు ఇదే అత్యంత కచ్చితమైన మార్గం" అని అన్నారు.
ఆ ప్రాజెక్టులకు మద్దతిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర ప్రభుత్వానికి సర్బానంద సోనోవాల్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశాఖపట్నం లోక్‌సభ సభ్యులు ఎం. శ్రీభారత్, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, శాసనసభ్యులు సి. వంశీ కృష్ణ శ్రీనివాస్, పి. విష్ణుకుమార్ రాజు, పోర్టు చైర్పర్సన్ జస్మీత్ సింగ్ బింద్రా, పోర్టు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
***