నాడు పోస్టు చేయడమైనది:
12 NOV 2026 12:59PM by PIB Hyderabad
గోవాలో 57వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)తో పాటు నిర్వహించనున్న వేవ్స్ బజార్లో వేవ్ఎక్స్ స్టార్టప్ పెవిలియన్ ఏర్పాటుకు సంబంధించి అర్హత కలిగిన అంకుర సంస్థలు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి, ప్రదర్శన కోసం స్థలాలను బుక్ చేసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆఖరి సూచన జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నమోదు గడువు రేపు, 2026 నవంబర్ 13తో ముగియనుంది.
ప్రతిష్ఠాత్మక స్టార్టప్ యాక్సిలరేటర్ కార్యక్రమమైన వేవ్ఎక్స్ కింద.. సినిమా, మీడియా, అనుబంధ సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న డీపీఐఐటీ (పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం) గుర్తింపు పొందిన అంకుర సంస్థలను మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) సహా ఆయా రంగాల్లోని అంకుర సంస్థలను తమ ఉత్పత్తులు, సాంకేతికతలు, వినూత్న పరిష్కారాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించవచ్చు.
వేవ్ఎక్స్ స్టార్టప్ పెవిలియన్ ద్వారా ఎంపికైన అంకుర సంస్థలకు వేవ్స్ బజార్లో తమ ఆవిష్కరణలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. ప్రపంచ మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రముఖ భాగస్వాములు, కీలక ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో ఈ వేదిక నెట్‌వర్కింగ్‌కు ప్రధాన కేంద్రంగా నిలవనుంది. దేశీయ, అంతర్జాతీయ చలనచిత్ర దర్శకులు, నిర్మాణ సంస్థలు, స్టూడియోలు, పెట్టుబడిదారులతో నేరుగా మాట్లాడే అవకాశం కూడా అంకుర సంస్థలకు లభిస్తుంది. తద్వారా పరస్పర సహకారం, వ్యాపార భాగస్వామ్యాలకు కొత్త మార్గాలు ఏర్పడనున్నాయి.
57వ ఐఎఫ్ఎఫ్ఐ 2026 నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది. వేవ్స్ బజార్లో అంకుర సంస్థల ప్రదర్శన నవంబర్ 20 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు.
నమోదు విధానం, అర్హతలు
సినిమా, మీడియా, అనుబంధ సాంకేతిక రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న డీపీఐఐటీ గుర్తింపు పొందిన అంకుర సంస్థలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన అంకురాలను వేవ్ఎక్స్ ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ తుది జాబితాలోకి ఎంపిక చేస్తుంది.
ఆసక్తి కలిగిన అంకుర సంస్థలు 2026 నవంబర్ 13లోగా అధికారిక వెబ్సైట్ wavex.wavesbazaar.com ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ప్రదర్శన కోసం ఎగ్జిబిషన్ పాడ్లను బుక్ చేసుకోవచ్చు.
వేవ్ఎక్స్ గురించి
భారతీయ మీడియా, వినోద రంగం, ఏవీజీసీ-ఎక్స్ఆర్ వ్యవస్థలో ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, సాంకేతిక అభివృద్ధికి తోడ్పడటం లక్ష్యంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వేవ్ఎక్స్ పేరుతో ప్రత్యేక స్టార్టప్ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఇఫి గురించి
గోవాలో ప్రతి ఏడాది నిర్వహించే అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) ఆసియాలోని ప్రముఖ చలనచిత్రోత్సవాల్లో ఒకటి. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర నిర్మాతలు, దర్శకులు, పరిశ్రమ నిపుణులు, సినీ ప్రియులకు ఈ ఉత్సవం ఒక వేదికగా నిలుస్తోంది. చలనచిత్ర కళా ప్రతిభను వేడుకగా నిర్వహించడంతోపాటు, సృజనాత్మక ఆలోచనల పరస్పర మార్పిడి, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తోంది.
***