నాడు పోస్టు చేయడమైనది:
10 NOV 2026 5:47PM by PIB Hyderabad
ఢిల్లీలో నదీ పర్యాటకాన్ని విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. యమునా నదిపై తొలిసారిగా ఏర్పాటు చేసిన వినోదాత్మక క్రూయిజ్ సేవలను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సమక్షంలో కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాలశాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ నేడు ఇక్కడి సోనియా విహార్‌లో ప్రారంభించారు.
సోనియా విహార్–జగత్‌పూర్ మార్గంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. యమునా నదిలోని పర్యాటక, వినోద అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, రాజధాని వాసులు, సందర్శకులకు ఢిల్లీని మరో కొత్త కోణంలో ఆస్వాదించే అవకాశాన్ని కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. పర్యాటకం, ప్రయాణికుల రవాణా, ఆర్థిక కార్యకలాపాలకు భారత నదులను కీలక వేదికలుగా అభివృద్ధి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాల్లో ఇది మరో మైలురాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శాంతను ఠాకూర్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, ఢిల్లీ ప్రజా పనుల శాఖ, నీటిపారుదల, వరద నియంత్రణ శాఖ మంత్రి ప్రవేశ్ సాహిబ్ సింగ్, పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా, అటవీ, పర్యావరణం, పరిశ్రమల శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా, ఎంపీ మనోజ్ తివారీ పాల్గొన్నారు. కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ కార్యదర్శి విజయ్ కుమార్, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ వర్మ, భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యూఏఐ) ఛైర్మన్ సుశీల్ కుమార్ లోహానీతో పాటు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌లోని విస్తారమైన అంతర్గత జలమార్గాల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలన్న ప్రభుత్వ నిబద్ధతకు ఈ ప్రాజెక్టు నిదర్శనమని పేర్కొన్నారు.
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత నదులు, అంతర్గత జలమార్గాలు ఆర్థిక వృద్ధి, పర్యాటకం, సుస్థిర రవాణాకు కీలక చోదకశక్తులుగా రూపుదిద్దుకుంటున్నాయి. యమునా నదిపై ఢిల్లీలో తొలి వినోదాత్మక క్రూయిజ్ సేవల ప్రారంభం.. ప్రజలకు, నదులకు మధ్య అనుబంధాన్ని పునరుద్ధరించడంతో పాటు వాటిలోని అపారమైన సామర్థ్యాన్ని వినియోగించుకునే దిశగా మరో ముందడుగు. ఈ ప్రారంభం నగరంలో నదీ పర్యాటకానికి కొత్త ఊపునిస్తుంది. పరిశుభ్రమైన, సమర్థవంతమైన రవాణా వ్యవస్థకు కట్టుబడి ఉంటూనే, జలమార్గాలను పర్యాటకం, వాణిజ్యం, జీవనోపాధికి వేదికలుగా మారుస్తున్నాం. వికసిత్ భారత్ నిర్మాణానికి సంబంధించిన మా దార్శనికతలో ఇది కీలక భాగం” అని సర్బానంద సోనోవాల్ అన్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా 30 మంది ప్రయాణించే సామర్థ్యం కలిగిన విద్యుత్ క్రూయిజ్ నౌకను అందుబాటులోకి తీసుకొచ్చారు. నదిలో సుమారు ఆరు కిలోమీటర్ల దూరం రానుపోను ప్రయాణిస్తూ సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించనుంది. విద్యుత్‌తో నడిచే నౌకల వినియోగం ద్వారా పరిశుభ్రమైన, సుస్థిర రవాణా సాధనంగా అంతర్గత జలమార్గాల సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్టు చాటిచెబుతోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఢిల్లీ పర్యాటక రంగానికి కొత్త కోణాన్ని అందించడంతోపాటు, యమునా నదితో ప్రజల అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
“యమునా నది ఢిల్లీ చరిత్ర, సంస్కృతి, గుర్తింపులో అంతర్భాగం. ఈ వినోదాత్మక క్రూయిజ్ సేవలు స్థానిక ప్రజలకు, సందర్శకులకు నదిని కొత్తగా ఆస్వాదించే అవకాశాన్ని కల్పించడంతోపాటు, పర్యాటకం, స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చైతన్యవంతమైన నాయకత్వంలో మెరుగైన సౌకర్యాలు, సుస్థిర మౌలిక సదుపాయాలు, నగర వారసత్వాన్ని చాటిచెప్పే అనుభవాలతో ఢిల్లీ నదీ తీర ప్రాంతాన్ని ఆకర్షణీయమైన ప్రజా సందర్శక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం” అని రేఖా గుప్తా తెలిపారు.
విస్తృతమైన పర్యావరణహిత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో యమునా ప్రాజెక్టులో పలు వినోద ఆకర్షణలు, సందర్శకులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రధాన ఆకర్షణగా సంగీతానికి అనుగుణంగా కాంతులు, శబ్దాలతో కూడిన ప్రదర్శనను నిర్వహించే మ్యూజికల్ ఫౌంటెన్ ఉంది. ఈ ప్రదర్శనలో యమునా నది చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తెలియజేస్తారు. సూర్యదేవుడు, యమధర్మరాజుతో యమునాకు ఉన్న అనుబంధంతోపాటు, శ్రీకృష్ణుడి దివ్య లీలలు, ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన కాళీయమర్దనం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు.
ఈ పర్యాటక కేంద్రంలో ఫుడ్ కోర్టు, షాపింగ్ ప్రాంతం, పిల్లల ఆట స్థలం, స్కేటింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడల సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. సందర్శకులకు సౌకర్యవంతమైన అనుభూతిని కల్పించేందుకు ఆధునిక తేలియాడే జెట్టీలు, ప్రత్యేక టికెట్ కౌంటర్లు, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సదుపాయం, మరుగుదొడ్లు, వేచిఉండే గదులు, విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రవేశ మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
జాతీయ జలమార్గాల చట్టం 2016 ప్రకారం యమునా నదిని జాతీయ జలమార్గం–110గా ప్రకటించారు. జాతీయ రాజధానిలో వినోదాత్మక నౌకాయానం, నదీ ఆధారిత పర్యాటక అభివృద్ధికి ఈ క్రూయిజ్ సేవల ప్రారంభం కీలక పరిణామం.
భారతీయ అంతర్గత జలమార్గాల్లో చోటుచేసుకుంటున్న విస్తృత పరివర్తనలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ జలమార్గాలపై సరకు రవాణా 2013–14లో 1.8 కోట్ల మెట్రిక్ టన్నుల నుంచి 2025–26 నాటికి 21.8 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. దేశ రవాణా, సరఫరా వ్యవస్థలో జలమార్గాల ప్రాధాన్యం పెరుగుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జలమార్గాల ద్వారా ఒక టన్ను సరుకును ఒక కిలోమీటరు దూరం తరలించేందుకు సుమారు రూ.1.06 ఖర్చవుతుండగా, రైలు మార్గంలో రూ.1.41, రోడ్డు మార్గంలో రూ.2.28 వ్యయమవుతోంది. దీంతో సరకు రవాణాకు అంతర్గత జలమార్గాలు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి.
ఈ విస్తరణలో నదీ క్రూయిజ్ పర్యాటకం మరో అభివృద్ధి చెందుతున్న విభాగం. రాత్రిపూట ప్రయాణ సదుపాయం కల్పించే నదీ క్రూయిజ్ నౌకల సంఖ్య 2013–14లో అయిదు ఉండగా, 2025–26 నాటికి 26కు పెరిగింది. ఎంవీ గంగా విలాస్ చేపట్టిన చారిత్రక ప్రయాణం ఈ రంగంలో మైలురాయిగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన నదీ క్రూయిజ్ ప్రయాణంగా ఈ యాత్ర లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు పొందింది. భారత్, బంగ్లాదేశ్ మీదుగా 3,200 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ ప్రయాణం 50 పర్యాటక ప్రాంతాలను అనుసంధానించింది. రెండు దేశాలు, అయిదు రాష్ట్రాలు, 27 నదీ వ్యవస్థల మీదుగా ఈ యాత్ర కొనసాగింది.
కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని భారత అంతర్గత జలమార్గాల ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యూఏఐ) ఈ వినోదాత్మక యమునా నదీ క్రూయిజ్ సేవలను అభివృద్ధి చేసింది. ఢిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ, ఢిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ, ఢిల్లీ జల్ బోర్డు, ఢిల్లీ ప్రభుత్వ నీటిపారుదల, వరద నియంత్రణ శాఖల సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.





***