ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోల్‌కతా విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ అక్రమ తరలింపు యత్నాన్ని అడ్డుకున్న డీఆర్‌ఐ రూ.3.5 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం, ఏడుగురి అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 10 NOV 2026 3:17PM by PIB Hyderabad

విదేశీ కరెన్సీని దేశ సరిహద్దులు దాటి అక్రమంగా తరలించే ప్రయత్నాలను రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ (డీఆర్‌ఐ) భగ్నం చేసింది. తాజాగా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో (ఎన్‌ఎస్‌సీబీఐ) విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన పలువురు ప్రయాణికులను డీఆర్‌ఐ అధికారులు అడ్డుకున్నారు. వీరు దేశం నుంచి విదేశీ కరెన్సీని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

 

పక్కా సమాచారం ఆధారంగా 2026 నవంబర్‌ 6 తెల్లవారుజామున బ్యాంకాక్‌కు ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులను డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వ్యక్తిగత తనిఖీలతో పాటు చేతి సంచులు, విమానంలో చెక్‌-ఇన్‌ చేసిన సామానును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో యూఎస్‌ డాలర్లు, బ్రిటిష్‌ పౌండ్ల (జీబీపీ) రూపంలో ఉన్న వివిధ విదేశీ కరెన్సీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం రూ.3.12 కోట్లు ఉంటుందని అంచనా. 

ఈ ముఠా సభ్యులు విదేశీ కరెన్సీని తరలించేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. నోట్‌బుక్కుల్లో, ట్రాలీ బ్యాగుల్లో రెండు పొరలతో ఏర్పాటు చేసిన రహస్య అరల్లో, బూట్లలో కరెన్సీని చాకచక్యంగా దాచిపెట్టారు. మరికొంత మొత్తాన్ని చెక్‌-ఇన్‌ బ్యాగేజీలో సర్దిన దుస్తుల జేబుల్లో, చేతి సంచుల్లో దాచారు. విచారణలో ఆ కరెన్సీ తమదేనని లేదా చట్టబద్ధంగా తమ వద్ద ఉందని నిరూపించే ఎలాంటి పత్రాలనూ ప్రయాణికులు చూపించలేకపోయారు.  

విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్‌ చట్టం, ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. 

అదే సమయంలో మరికొందరు ప్రయాణికులను కూడా అధికారులు అడ్డుకుని, వారి లగేజీని తనిఖీ చేయగా రూ.39 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. తదుపరి విచారణ నిమిత్తం ఆ ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. 

విదేశీ కరెన్సీ అక్రమ తరలింపునకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలను విచ్ఛిన్నం చేయడం, దేశ ఆర్థిక, ద్రవ్య స్థిరత్వానికి విఘాతం కలగకుండా చూడటంపై డీఆర్‌ఐ దృష్టి సారించింది. నిరంతర నిఘా ఆధారిత చర్యల ద్వారా దేశ ఆర్థిక సరిహద్దుల పరిరక్షణకు కృషి చేస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2334724) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati