నాడు పోస్టు చేయడమైనది:
10 NOV 2026 12:46PM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మేరా యువ భారత్ (మై భారత్) దేశవ్యాప్తంగా ‘నషా ముక్త్ యువ దీపోత్సవం- ఏక్ దియా సంకల్ప్ కా’, స్థానిక యువజన సభల ద్వారా ‘నషా ముక్త్ యువ పర్ పరిచర్చ’ కార్యక్రమాలను నిర్వహించింది. 100 వారాల ‘వికసిత్ భారత్ కోసం మాదకద్రవ్య రహిత యువత’ సంకల్ప అభియాన్‌లో భాగంగా 8వ వారంలో2026 నవంబర్ 6, 7 తేదీల్లో ఈ అవగాహన సదస్సులను నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలు దీపావళి వేడుకలను మాదకద్రవ్యాల దుర్వినియోగంపై క్షేత్రస్థాయి చర్చలతో మిళితం చేశాయి. ఈ కార్యక్రమాల్లో 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1.19 లక్షల మందికి పైగా యువత, పౌరులు పాల్గొన్నారు. మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని పాల్గొన్న వారందరూ ప్రతిజ్ఞ చేశారు.

‘నషా ముక్త్ యువ దీపోత్సవం- ఏక్ దియా సంకల్ప్ కా’ సదస్సులో భాగంగా 435 కార్యక్రమాలు, 568 కార్యకలాపాలు నిర్వహించగా.. 1,10,101 మంది పాల్గొన్నారు. రంగవల్లులు వేయడం, దీపాలు వెలిగించడం, మిఠాయిల పంపిణీ, అవగాహన కార్యక్రమాలు, మై భారత్ వాలంటీర్లకు సన్మానం వంటివి నిర్వహించారు. బ్రహ్మకుమారీస్, ఈపీఎస్‌ఐ, హార్ట్‌ఫుల్‌నెస్ సహా భాగస్వామ్య సంస్థలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వాలంటీర్లతో కలిసి దీపావళి సందర్భంగా మై భారత్ వేడుకలు నిర్వహించింది. బండాలోని వృద్ధాశ్రమంలో మిఠాయిలు, పండ్లు పంపిణీ చేయడంతో పాటు రాంపూర్‌లో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో ముంగేలి, ధంతరిలో దీపోత్సవం, రంగవల్లుల కార్యక్రమాలు నిర్వహించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రాలోని వృద్ధాశ్రమంలో వేడుకలు, మిఠాయిల పంపిణీ చేపట్టారు. మహారాష్ట్రలోని యవత్మాల్, పుదుచ్చేరిలోని యానాం, జమ్మూ కశ్మీర్‌లోనూ ఇలాంటి వేడుకలే నిర్వహించారు.

మండల స్థాయిలో స్థానిక యువ సభల (ఎన్‌వైపీలు) ద్వారా నిర్వహించిన ‘నషా ముక్త్ యువ పర్ పరిచర్చ’ సదస్సులో 85 కార్యక్రమాలు, 298 కార్యకలాపాలు చేపట్టారు. వీటిలో 9,526 మంది పాల్గొన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, దాని వల్ల ఎదురయ్యే సవాళ్లు, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో యువత పాత్రపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి.
ప్రతి మండలంలో కనీసం 80 మంది యువతను భాగస్వాములను చేసేలా, నాలుగు క్రమబద్ధమైన సమావేశాలతో ప్రతి ఎన్‌వైపీని రూపొందించారు. వీటిలో మై భారత్ వేదికపై అవగాహన కల్పించడం, ‘మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అర్థం చేసుకోవడం: భారత యువత ముందున్న సవాళ్లు’, ‘అవగాహన నుంచి కార్యాచరణ వరకు: మాదకద్రవ్య రహిత యువత కోసం సాధనాలు’, ‘మార్పు కథలు: మాదకద్రవ్య రహిత భారత్ దిశగా ప్రయాణం’ అనే ఆడియో-విజువల్ ప్రదర్శనలు ఉన్నాయి.

ఈ చర్చల్లో నినాదాల రచన, రంగవల్లుల రూపకల్పన, వీధి నాటకాలు, పరస్పర చర్చా కార్యక్రమాలు, ప్రతిజ్ఞలు చేయడం వంటి కార్యకలాపాలు కూడా నిర్వహించారు. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా భునా, మహారాష్ట్రలోని లాతూర్, తూర్పు ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌గఢ్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. మాదకద్రవ్య రహిత భారత్ నిర్మాణం దిశగా యువత నిరంతర భాగస్వామ్యానికి, సమాజ ఆధ్వర్యంలోని కార్యాచరణకు ‘వికసిత్ భారత్ కోసం నషా యుక్త్ యువత’ 100 వారాల సంకల్ప అభియాన్’ దేశవ్యాప్త వేదికను అందిస్తోంది.
***