నాడు పోస్టు చేయడమైనది:
10 NOV 2026 11:58AM by PIB Hyderabad
అరుణాచల్ ప్రదేశ్లోని బొమ్డిలాలో ఉన్న తుబ్చోగ్ గట్సెల్ లింగ్ (టీజీఎల్) విహారం (దిగువ గోంపా)లో శాక్యముని బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన కొనసాగుతోంది. బుద్ధ భగవానునికి నమస్సులను అర్పించే పవిత్ర అవకాశాన్ని వేలాది భక్తులకు ఈ కార్యక్రమం అందించింది. పవిత్ర అవశేషాలకు ప్రార్థనలు చేయడానికి, ఆశీర్వాదం పొందడానికి ప్రదర్శన ప్రారంభమైన తొలి రెండు రోజుల్లోనే మొత్తం 11,969 మంది భక్తులు విహారాన్ని సందర్శించారు.

ఈ పవిత్ర అవశేషాలకు బౌద్ధమతంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటిపై ఉన్న విశ్వాసాన్ని, ఆధ్యాత్మిక భక్తిని భారీసంఖ్యలో కొనసాగుతున్న భక్తుల సందర్శన ప్రతిబింబిస్తోంది.
న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియం, ఆరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, న్యూఢిల్లీలోని అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబీసీ) సహకారంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. వివిధ నియోజకవర్గాలు, ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పవిత్ర అవశేషాలను సందర్శించుకొని, ప్రార్థించేందుకు వీలుగా టీజీఎల్ విహారంలో ఈ ప్రదర్శన 2026 నవంబర్ 13 వరకు కొనసాగుతుంది.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నియోజకవర్గాలు, విభాగాల వారీగా ప్రదర్శనలో మిగిలిన రోజులకు దిగువ పేర్కొన్న విధంగా షెడ్యూలును రూపొందించారు.
2026, నవంబర్ 11: అరుణాచల్ ప్రదేశ్లోని 5–కలక్టాంగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన భక్తులు
2026 నవంబర్ 12: అరుణాచల్ ప్రదేశ్లోని బురాగావ్–త్రిజినో అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన భక్తులు
2026 నవంబర్ 13: ఇతర జిల్లాలకు చెందిన భక్తులు, జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ
పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), తమకు కేటాయించిన రోజుల్లో పవిత్ర అవశేషాలను దర్శించుకోలేకపోయిన భక్తులు

నిర్దేశించిన రోజుల్లో ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు ఈ పవిత్ర అవశేషాలను దర్శించుకోవచ్చు.
బొమ్డిలాలో ప్రదర్శన పూర్తయిన అనంతరం పవిత్ర అవశేషాలకు 2026 నవంబర్ 14న లాంఛనప్రాయంగా వీడ్కోలు పలుకుతారు. అనంతరం వాటిని తదుపరి గమ్యస్థానమైన నమ్సాయి జిల్లాకు తరలిస్తారు. అక్కడ ప్రజల దర్శనార్థం 2026 నవంబర్ 14 నుంచి 20 వరకు నమ్సాయిలోని గోల్డెన్ పగోడాలో వాటిని ప్రతిష్ఠిస్తారు. ఆ తరువాత 2026 నవంబర్ 21న పవిత్ర అవశేషాలు న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియంకు తిరిగి తీసుకువస్తారు.

విశిష్టమైన భారతీయ బౌద్ధ వారసత్వాన్ని, నాగరికతా వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడం, ప్రదర్శించడంలో భారత ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ ప్రదర్శన ప్రతిబింబిస్తుంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పవిత్రమైన బౌద్ధ వారసత్వాన్ని భక్తులకు చేరువ చేయడానికి, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను బలోపేతం చేయడానికి, బౌద్ధమత బోధనలు, తత్వశాస్త్రానికి భారతదేశం అందించిన నిరంతర తోడ్పాటును విస్తృతంగా ప్రచారం చేయడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తోంది.
***