నాడు పోస్టు చేయడమైనది:
09 NOV 2026 12:39PM by PIB Hyderabad
భారత్, మయన్మార్ రక్షణ దళాల మధ్య తొలిసారిగా నిర్వహించిన ద్వైపాక్షిక త్రివిధ దళాల మానవతా సహాయం, విపత్తు సహాయక విన్యాసం (హెచ్ఏడీఆర్) ‘రహత్ మిత్ర’ 2026 నవంబర్ 5, 6 తేదీల్లో చెన్నైలో విజయవంతంగా ముగిసింది. రెండు రోజులపాటు జరిగిన ఈ విన్యాసంలో భారత నావికాదళం, భారత సైన్యం, భారత వైమానిక దళాల సిబ్బందితో పాటు మయన్మార్ రక్షణ దళాల ప్రతినిధి బృందం పాల్గొంది. విపత్తుల సమయంలో చేపట్టే సహాయక చర్యల్లో కార్యాచరణ పరస్పర సమన్వయాన్ని పెంపొందించడం, సమన్వయాన్ని మెరుగుపరచడం, విపత్తు ప్రతిస్పందన కార్యకలాపాల్లో ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడం ఈ విన్యాసం ప్రధాన లక్ష్యాలు.
ఉమ్మడి ప్రణాళిక రూపకల్పన, మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యల్లో (హెచ్ఏడీఆర్) అందుబాటులో ఉన్న సామర్థ్యాలపై అవగాహనతో ఈ విన్యాసం ప్రారంభమైంది. తీవ్ర తుపాను పరిస్థితిని ఆధారంగా చేసుకుని నిర్వహించిన టేబుల్‌టాప్ విన్యాసం (టీటీఎక్స్) ద్వారా సమన్వయంతో స్పందించే విధానాలు, ఉమ్మడి విపత్తు నిర్వహణ ప్రణాళికలపై చర్చలు జరిగాయి. భారత సైన్యం ప్రదర్శించిన అడ్డంకుల తొలగింపు, వంతెనల నిర్మాణ సామర్థ్యాలను పాల్గొన్న బృందాలు వీక్షించాయి. అలాగే భారత నావికాదళం నౌకల ద్వారా అందించే విపత్తు సహాయక సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఐఎన్ఎస్ సుకన్యను సందర్శించాయి. (https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2333709 )
రెండో రోజు భారత రక్షణ దళాలు సముద్ర, భూమి, వాయు మార్గాల్లో సమన్వయంతో చేపట్టే బహుళ రంగ మానవ, విపత్తు సహాయక చర్యల సామర్థ్యాలను ప్రదర్శించాయి. చెన్నైలోని ఐఎన్ఎస్ అడయార్, కమ్యూనికేషన్ నెట్వర్క్ కేంద్రం ద్వారా తీర ప్రాంతాల నుంచి చేపట్టే విపత్తు ప్రతిస్పందన ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితుల్లో కమాండ్-కంట్రోల్‌కు తోడ్పడే సమాచార వ్యవస్థలను ప్రదర్శించారు. చెన్నై మిలిటరీ ఆసుపత్రి క్షేత్రస్థాయిలో వైద్యపరమైన ప్రాథమిక వర్గీకరణ (ట్రయాజ్), విపత్తు సహాయక శిబిరాల నిర్వహణలో సమన్వయ విధానాలను వివరించింది.
భారత నావికాదళానికి చెందిన వరద సహాయక బృందాలు (ఎఫ్‌ఆర్‌టీ) వరద సహాయక చర్యల్లో ఉపయోగించే ప్రత్యేక పరికరాలు, తమ సామర్థ్యాలను ప్రదర్శించాయి. చేతక్ హెలికాప్టర్, ఐఎన్ఎస్ బిట్రా సమన్వయంతో నిర్వహించిన విన్యాసాల ద్వారా సముద్రంలో గాలింపు, రక్షణ (ఎస్ఏఆర్) సామర్థ్యాలను కూడా ప్రదర్శించారు. భారత వైమానిక దళం క్షతగాత్రులను తరలించే సామర్థ్యాలను ప్రదర్శించింది. వైమానిక విన్యాసాల సమయంలో మయన్మార్ ప్రతినిధి బృందానికి చెందిన కమోడోర్ ఆంగ్ నియాంగ్ విన్, మరో ఇద్దరు అధికారులు భారత వైమానిక దళానికి చెందిన ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లో ప్రయాణించారు.
‘రహత్ మిత్ర’ విన్యాసం ఇరు దేశాల రక్షణ దళాలకు కార్యాచరణ అనుభవాలను పరస్పరం పంచుకోవడానికి, ఉత్తమ విధానాలను తెలుసుకోవడానికి, విపత్తు సహాయక చర్యల ప్రణాళిక, అమలులో పరస్పర అవగాహనను పెంపొందించుకోవడానికి కీలక వేదికగా నిలిచింది. ఒకరి సామర్థ్యాలు, విధానాలపై మరొకరు అవగాహన పెంచుకునేందుకు ఈ విన్యాసం దోహదపడింది. తద్వారా విపత్తుల సమయంలో సమన్వయంతో స్పందించే సామర్థ్యం మెరుగుపడనుంది.
తొలిసారిగా నిర్వహించిన ఈ విన్యాసం విజయవంతంగా ముగియడం భారత్, మయన్మార్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న నిబద్ధతను, విపత్తుల సమయంలో సామూహిక సంసిద్ధతను పెంపొందించుకోవాలన్న సంకల్పాన్ని బలపరుస్తుంది. ప్రాంతీయ స్థిరత్వం, సముద్ర రంగ సహకారం, సమర్థవంతమైన మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యలకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయన్న విషయాన్ని కూడా ఈ విన్యాసం స్పష్టం చేస్తుంది.
***