శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హారైజన్‌ యూరప్‌ కార్యక్రమంలో చేరికపై చర్చలను ముగించిన భారత్‌–యూరోపియన్‌ యూనియన్‌

నాడు పోస్టు చేయడమైనది: 07 NOV 2026 11:26AM by PIB Hyderabad

భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) .. ప్రతిష్ఠాత్మక పరిశోధన, ఆవిష్కరణ కార్యక్రమమైన ‘హారైజన్‌ యూరప్‌’లో భారత్‌ భాగస్వామ్యం కావడానికి సంబంధించిన చర్చలను విజయవంతంగా ముగించాయి. ఈ కార్యక్రమంలో భారత్‌ భాగస్వామ్యం కావడం ఇరుపక్షాల మధ్య దీర్ఘకాలిక పరిశోధన సహకారానికి సంస్థాగత రూపకల్పన దిశగా వ్యూహాత్మక ముందడుగు. భారత్‌–ఈయూ శాస్త్ర, సాంకేతిక సహకార ఒప్పందం, భారత్‌–ఈయూ వాణిజ్య, సాంకేతిక మండలి కింద ఇప్పటికే కొనసాగుతున్న పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) ప్రాజెక్టులు, సహకారానికి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుంది.

 

ఈ భాగస్వామ్యం ద్వారా భారత పరిశోధకులు, విద్యాసంస్థలు, పరిశ్రమలు ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టుల ద్వారా ఈ కార్యక్రమం కింద నిధుల కోసం ఆహ్వానించే ప్రతిపాదనల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అలాగే యూరోపియన్‌ కన్సార్టియాల్లో భాగస్వామ్యం కావడంతో పాటు అత్యాధునిక పరిశోధన మౌలిక సదుపాయాలను వినియోగించుకునే వీలుంటుంది. ప్రతిభావంతుల పరస్పర రాకపోకలకు మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు, కీలక సాంకేతికతలు, ప్రమాణాలు, పరిష్కారాల రూపకల్పనలో పెద్ద ఎత్తున ఉమ్మడి కృషికి మార్గం సుగమమవుతుంది.

 

హారైజన్‌ యూరప్‌ కార్యక్రమంలోని రెండో విభాగం (పిల్లర్‌–2) పరిధిలోని అంశాలు భారత్‌ పరిశోధనా ప్రాధాన్యాలకు దగ్గరగా ఉన్నాయి. ఆరోగ్యం, డిజిటల్‌ సాంకేతికతలు, పరిశ్రమ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, ఇంధనం, రవాణా, ఆహారం, జీవ ఆర్థిక వ్యవస్థ వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. ఈ రంగాల్లో భారత్‌కు ఉన్న శాస్త్రీయ సామర్థ్యాలను మరింతగా వినియోగించుకునేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుంది. వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్యం దిశగా దేశం ముందుకు సాగుతున్న తరుణంలో, ఈ భాగస్వామ్యం దేశ ఆవిష్కరణల వ్యవస్థకు గణనీయమైన విలువను చేకూరుస్తుంది.

 

2026 జనవరి 27న జరిగిన చారిత్రాత్మక భారత్‌–ఈయూ శిఖరాగ్ర సమావేశం అనంతరం ఈ కార్యక్రమంలో భారత్‌ భాగస్వామ్యం అయ్యే అవకాశాలపై పరిశీలన ప్రారంభమైంది. 2026 జూలై 15న బ్రస్సెల్స్‌లో జరిగిన వాణిజ్య, సాంకేతిక మండలి మంత్రుల సమావేశం ఫలితంగా అధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి.

 

****


(రిలీజ్ ఐడి: 2333960) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam