గోవా వేదికగా జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) సందర్భంగా ఏర్పాటు చేసే 'వేవ్స్ బజార్'లోని 'వేవ్ఎక్స్ స్టార్టప్ పెవిలియన్'లో పాల్గొనేందుకు చలనచిత్ర రంగం, అనుబంధ సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న అంకుర సంస్థల నుంచి భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వినూత్న అంకుర సంస్థలు తమ ఉత్పత్తులు, సాంకేతికతలు, పరిష్కారాలను... జాతీయ, అంతర్జాతీయ చలనచిత్ర, మీడియా పరిశ్రమ సమక్షంలో ప్రదర్శించేందుకు ఒక ప్రత్యేక వేదికను అందించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఇది ప్రపంచ సృజనాత్మక వ్యవస్థలోని చిత్ర రూపకర్తలు, నిర్మాణ సంస్థలు, పెట్టుబడిదారులు... నెట్‌వర్కింగ్, పరిశ్రమతో మమేకమవడం, పరస్పరం సహకరించుకోవడం కోసం అవకాశాలను సులభతరం చేస్తుంది.
ఫిల్మ్, సంబంధిత టెక్నాలజీ రంగాల్లో పనిచేస్తూ, డీపీఐఐటీలో నమోదైన అంకుర సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వేవ్‌ఎక్స్ ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ నిర్వహించే స్క్రీనింగ్, మూల్యాంకన ప్రక్రియ ద్వారా అర్హతగల అంకురసంస్థలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఆసక్తి, అర్హత కలిగిన అంకుర సంస్థలు ఈ కార్యక్రమం కోసం దరఖాస్తు చేసుకోవాలని... అంతర్జాతీయ వేదికపై తమ ఆవిష్కరణలను ప్రదర్శించే సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.
రిజిస్ట్రేషన్ ఫారమ్, మరిన్ని వివరాలు wavex.wavesbazaar.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఏవైనా సందేహాలు ఉంటే Wavex-mib [at]gov[dot]in కు తెలియజేయవచ్చు.
ఐఎఫ్ఎఫ్ఐ, గోవా గురించి
1952లో స్థాపించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)... ఆసియాలోని ప్రముఖ చలన చిత్రోత్సవాల్లో ఒకటి. ఇది ప్రపంచ సినిమా శ్రేష్ఠతను చాటుతూ... భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్రరూపకర్తలు, కళాకారులు, నిర్మాతలు, సినీ ప్రియుల కోసం ఒక వేదికను అందిస్తుంది. ప్రతి సంవత్సరం గోవాలో జరిగే ఐఎఫ్ఎఫ్ఐ... ప్రపంచ సినీ పరిశ్రమను ఒకచోట చేర్చుతుంది. విభిన్న చిత్రాలను ప్రదర్శిస్తుంది. సృజనాత్మకతను పరస్పరం పంచుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. సినీ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందిస్తుంది.
వేవ్ఎక్స్ గురించి
వేవ్‌ఎక్స్ (వేవ్స్ స్టార్టప్ యాక్సిలరేటర్) కార్యక్రమం... భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ రూపొందించిన ఒక స్టార్టప్ యాక్సిలరేటర్, ఇంక్యుబేషన్ కార్యక్రమం. ఇది మీడియా, వినోద రంగంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపన, వర్ధమాన ప్రతిభను ప్రోత్సహించడానికి ఉద్దేశించినది. ఇది యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీసీజీ-ఎక్స్ఆర్), మీడియా టెక్నాలజీస్ వంటి రంగాల్లో పనిచేస్తున్న అంకుర సంస్థలకు అండగా నిలుస్తోంది.
***