ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆధార్‌ ఆఫ్‌లైన్‌ ధ్రువీకరణ వ్యవస్థ విస్తరణ: 300 ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ సీకింగ్ ఎంటిటీ (ఓవీఎస్ఈ)లను భాగస్వాములుగా చేర్చుకున్న యూఐడీఏఐ


సులభతరమైన సేవలు: ఆధార్‌ యాప్‌ ద్వారా 86 లక్షల మందికి పైగా మొబైల్‌ నంబర్ల నవీకరణ - యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నవారు దాదాపు 7.5 కోట్లు

4.6 కోట్ల బయోమెట్రిక్‌ లాక్‌/అన్‌లాక్‌ లావాదేవీలు నమోదు - డిజిటల్‌ భద్రతా సదుపాయాల వినియోగం పెరుగుదలకు నిదర్శనం

ఆధార్‌ యాప్‌ ద్వారా 22 లక్షలకు పైగా చిరునామాలు, 40 లక్షల ఈ - మెయిల్‌ వివరాల నవీకరణకు అవకాశం

నాడు పోస్టు చేయడమైనది: 05 NOV 2026 5:29PM by PIB Hyderabad

జనవరిలో ఆధార్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినప్పటి నుంచి, ప్రజల్లో దాని వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, యూఐడీఏఐ మరో కీలక ముందడుగు వేసింది. ఆఫ్‌లైన్‌ ధ్రువీకరణ కోరే 330 సంస్థలను (ఓవీఎస్ఈలు) భాగస్వాములుగా చేర్చుకుంది.

 

హోటళ్లు, ఆతిథ్య రంగం, ఆరోగ్య సంరక్షణ, విద్య, కార్యక్రమాల నిర్వహణ, గిగ్‌ ఎకానమీ, వినియోగదారులకు నేరుగా సేవలందించే సంస్థలు సహా వివిధ రంగాల్లో ఆధార్‌ ఆధారిత ఆఫ్‌లైన్‌ ధ్రువీకరణ వినియోగాన్ని విస్తరించే దిశగా ఇది  కీలక చర్య.

ఈ సంస్థలను ఆఫ్‌లైన్‌ ధ్రువీకరణ భాగస్వాములుగా చేర్చుకోవడం ద్వారా, ఆధార్‌ ఆధారిత డిజిటల్‌ ధ్రువీకరణ వ్యవస్థల పట్ల పెరుగుతున్న విశ్వాసం ప్రతిబింబిస్తోంది. ఈ వ్యవస్థలు వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యమిస్తూ, వినియోగదారులకు తమ సమాచారంపై నియంత్రణ కల్పించడంతో పాటు, సులభంగా సేవలను పొందే అవకాశం కల్పిస్తాయి. అదే సమయంలో, డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ (డీపిడీపీ) చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరించే విధానాన్ని అనుసరిస్తాయి.

అవసరమైన సేవలను ప్రజల స్మార్ట్‌ఫోన్లలోనే అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆఫ్‌లైన్‌ ధ్రువీకరణకు సంబంధించిన సంస్థాగత వ్యవస్థను విస్తరించడం ద్వారా యూఐడీఏఐ ప్రజలతో పాటు సంస్థలకు కూడా డిజిటల్‌ గుర్తింపు సేవలను మరింత సులభతరం చేస్తోంది.

ఆధార్‌ యాప్‌కు ప్రజాదరణ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దాదాపు 7.5 కోట్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రజలు ఈ యాప్‌ను విస్తృతంగా వినియోగిస్తుండటం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ), ప్రజల మధ్య కీలకమైన డిజిటల్‌ వేదికగా ఇది రూపుదిద్దుకుంటోందని తెలియజేస్తోంది. తద్వారా ఆధార్‌ నంబర్‌ కలిగినవారు తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారానే వివిధ ఆధార్‌ సంబంధిత సేవలను సులభంగా పొందగలుగుతున్నారు.

86 లక్షలకు పైగా మొబైల్‌ నంబర్‌ వివరాలు, 22.16 లక్షల చిరునామాలను , 40.25 లక్షల మేర ఈ-మెయిల్‌ వివరాలను నవీకరించుకునేందుకు ఈ యాప్‌ వీలు కల్పించింది. ఈ సేవల ద్వారా ప్రజలు ఆధార్‌ కేంద్రాలను నేరుగా సందర్శించాల్సిన అవసరం లేకుండా యాప్‌ ద్వారానే తమ వివరాలను సులభంగా నవీకరించుకునే వీలు కలిగింది. 

ఈ యాప్‌ ద్వారా ఇప్పటివరకు 4.6 కోట్ల బయోమెట్రిక్‌ లాక్‌/అన్‌లాక్‌ లావాదేవీలు కూడా నమోదయ్యాయి. ప్రజల్లో భద్రతా సదుపాయాలపై అవగాహన, వాటి వినియోగం పెరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనం. ఈ సదుపాయాల ద్వారా తమ బయోమెట్రిక్‌ వివరాల వినియోగంపై ప్రజలు మరింత నియంత్రణ కలిగి ఉండవచ్చు.

ఇంకా ఈ యాప్‌ ద్వారా 3.61 లక్షల ఆధార్‌ లాక్‌/అన్‌లాక్‌ లావాదేవీలు కూడా నమోదయ్యాయి. బయోమెట్రిక్‌ లాక్‌/అన్‌లాక్‌, ఆధార్‌ లాక్‌/అన్‌లాక్‌ సదుపాయాలు ఆధార్‌ నంబర్‌ కలిగినవారికి తమకు నచ్చినప్పుడు అదనపు గోప్యతా భద్రతను ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి.

ఈ కార్యక్రమాలు ప్రభుత్వ డిజిటల్‌ ఇండియా దార్శనికతకు అనుగుణంగా వికసిత్ భారత్  సాధన దిశగా సురక్షితమైన, సులువైన, ఆధునిక సాంకేతికతతో కూడిన ప్రభుత్వ సేవలను పౌరులందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2333434) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Tamil , Kannada , Malayalam