సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
05 NOV 2026 3:13PM by PIB Hyderabad
దేశవ్యాప్త ‘డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్’ (డీఎల్సీ) ప్రచార కార్యక్రమం-5ను కేంద్ర సైన్స్-టెక్నాలజీ, భూ విజ్ఞానశాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధాన మంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్షశాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 2026 నవంబర్ 6న న్యూఢిల్లీ.. రైసినా రోడ్డులో గల నేషనల్ మీడియా సెంటర్లో లాంఛనంగా ప్రారంభిస్తారు.
దేశమంతటా 2,000కు పైగా నగరాలు, పట్టణాలను ఈ ప్రచార కార్యక్రమంలో చేరుస్తారు. 2026 నవంబర్ 30 వరకు నెల రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రచార కార్యక్రమాన్ని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ ఆధీనంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్, పెన్షనర్స్ వెల్ఫేర్ (డీఓపీపీడబ్ల్యూ) ఏర్పాటు చేసింది. లైఫ్ సర్టిఫికెట్ల దాఖలు ప్రక్రియను మరింత మంది పింఛన్‌దారుల చెంతకు చేర్చడం, ఈ ప్రక్రియను సులువైందిగా తీర్చిదిద్దడం, మరింత అనుకూలమైందిగా ఉండేటట్లు చూడటం, ఇబ్బందులను తొలగించడం ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యాలు. ఈ లక్ష్యాల సాధనకు డిజిటల్ సాంకేతికతను.. మరీ ముఖ్యంగా ముఖ గుర్తింపునకు జీవన్ ప్రమాణ్ యాప్‌ను ఉపయోగించుకుంటారు.
ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ), భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ), ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఐటీవై), పింఛన్‌దారుల సంక్షేమ సంఘాల సహకారంతో నిర్వహిస్తారు. అలాగే కీలక మంత్రిత్వ శాఖలు, రక్షణ, రైల్వేలు, తపాలా, టెలికమ్యూనికేషన్స్ విభాగం సహా అనేక విభాగాలు, కార్మికుల భవిష్య నిధి సంస్థతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని కూడా తీసుకుంటారు.
ఎనభై ఏళ్లు, అంతకు పైబడిన వయస్సు కల సూపర్-సీనియర్ పింఛన్‌దారులు, మహిళా పింఛన్‌దారులతో పాటు ఆరోగ్యం పరంగా సమస్యలను ఎదుర్కొంటున్న పింఛన్‌దారుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటారు. వయస్సు వల్ల గాని, అశక్తత వల్ల గాని ప్రచార కార్యక్రమ నిర్వహణ స్థానాలకు చేరుకోలేకపోయే పింఛన్‌దారులను దృష్టిలో పెట్టుకొని వారి కోసం వారి ఇంటి వద్దే సేవలను అందజేయనున్నారు.
కార్యక్రమాన్ని ప్రారంభించే వేళ, డాక్టర్ జితేంద్ర సింగ్ ‘దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రచార కార్యక్రమం-4.0’ కాలంలో సాధించిన ప్రగతి, అమలుచేసిన కార్యక్రమాలను వివరించే ఒక సంకలన గ్రంథాన్ని, ఒక కాఫీ టేబుల్ ఈ-బుక్‌ను ఆవిష్కరిస్తారు.
ఈ ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకునే మంత్రిత్వ శాఖలు, విభాగాలు, బ్యాంకులు, ఇతర ఆసక్తిదారు సంస్థల సీనియర్ అధికారులకు తోడు పెన్షనర్ల అసోసియేషన్ల ప్రతినిధులు కూడా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నారు.
***