నాడు పోస్టు చేయడమైనది:
04 NOV 2026 8:37PM by PIB Hyderabad
ఎన్నికల వ్యవస్థపై యువతరంలో అవగాహన పెంపు లక్ష్యంగా కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ‘మై భారత్’ ద్వారా "వికసిత భారత్ యువజన గోష్ఠి: మీ ఓటు గురించి తెలుసుకోండి" పేరిట చేపట్టిన ప్రచారంలో భాగంగా ఇవాళ ఒకే రోజున 100 కార్యక్రమాలను నిర్వహించింది. ప్రజాస్వామ్యంలో విజ్ఞాన సహిత, బాధ్యతాయుత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ ప్రచారోద్యమ ధ్యేయం. ఈ మేరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించిన గోష్ఠులలో 16,600 మందికి పైగా యువత సహా 100 మంది యువజన ప్రముఖులు పాల్గొన్నారు. వీటిలో భాగంగా ప్రజా ప్రతినిధులతో మాటామంతీ, ఓటు హక్కు, పౌర బాధ్యత, ప్రజాస్వామ్య బలోపేతంలో యువతరం పాత్రపై లోతుగా చర్చించారు.
ఉత్తరాదిన ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్; దక్షిణాదిన తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి; ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మిజోరం; తూర్పున బీహార్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్; మధ్య భారతంలోని ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. పశ్చిమ భారత ప్రాంతంలోని గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో 26.10.2026 నుంచి 05.11.2026 దాకా కొనసాగే ఈ ప్రచారోద్యమంలో నేటి కార్యక్రమాలతో కలిపి 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 411 యువజన గోష్ఠులు పూర్తయ్యాయి. వీటిలో 77,500 మంది యువతీయువకులు సహా 411 మంది యువజన ప్రముఖులు పాలుపంచుకున్నారు.
ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో నిర్వహించిన గోష్ఠిలో కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ విద్యార్థులతో ముచ్చటిస్తూ, ఎన్నికల ప్రక్రియలపై వారికి సందేహ నివృత్తి చేశారు. హర్యానాలో భివానీ ఎంపీ శ్రీ చౌదరి ధరంబీర్ సింగ్ యువతరంతో మాటామంతీలో ఓటింగ్-ఎన్నికల అవగాహనపై తన ఆలోచనలను పంచుకున్నారు. పంజాబ్‌లోని లూధియానాలోగల ‘సీటీ విశ్వవిద్యాలయం’ సహకారంతో తరన్‌తరన్ పట్టణంలోని గురు అర్జున్ దేవ్ కళాశాలలో ‘మై భారత్’ సంస్థ వివిధ కార్యక్రమాలను నిర్వహించింది.
అస్సాంలోని ధేమాజి, తేజ్‌పూర్ (సోనిత్పూర్)లలో నిర్వహించిన కార్యక్రమాల్లోఎంపీలు శ్రీ ప్రదాన్ బారువా, శ్రీ రంజిత్ దత్తా యువ భాగస్వాములతో సంభాషించారు. ఓటర్లకు అవగాహన, ప్రజాస్వామ్యంలో వారి భాగస్వామ్యంపై సందేహాలు తీర్చుకోవడానికి వివరణలు కోరడానికి, మార్గనిర్దేశం పొందడానికి ఈ చర్చలు ఒక అవకాశం కల్పించాయి. ఛత్తీస్‌గఢ్‌లో మై భారత్ సంస్థ గోష్ఠి కార్యక్రమాలను నిర్వహించగా, ధమ్తరిలో ఎంపీ శ్రీమతి రూపకుమారి చౌదరి విద్యార్థుల సందేహాలకు సమాధానాలిచ్చారు. అలాగే ‘మీ ఓటు-మీ గళం’ ఇతివృత్తంగా ఇచ్చిన ప్రదర్శన ద్వారా ఓటు హక్కు-పౌర బాధ్యతల గురించి యువజన ప్రముఖుడు శ్రీ గులాబ్ సింగ్ వర్మ వివరించారు. కవర్ధాలో ఎంపీ యువతతో సంభాషించగా, యువజన ప్రముఖులు శ్రీమతి అదితి మిశ్రా విజ్ఞానయుత పౌరసత్వం గురించి వివరించారు. పౌరులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా యువతీయువకులు ప్రతిజ్ఞ చేశారు.
బీహార్‌లోని భాగల్పూర్లో ఓటరు నమోదు, ఎన్నికల విధానాలు, స్వతంత్ర, నైతిక ఓటింగ్ ప్రాధాన్యంపై దృష్టి సారించారు. తొలిసారి ఓటర్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో బాధ్యతాయుతంగా పాల్గొనాలని, ఎలాంటి ప్రలోభాలు-ప్రభావాలకు లోనుకాకుండా తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమాల్లో వక్తలు యువతకు దిశానిర్దేశం చేశారు.
మధ్యప్రదేశ్‌లో అనూప్పూర్, దమోహ్, ఝబువా, ఖర్గోన్, మాండ్లాలోనూ మై భారత్ సంస్థ కార్యక్రమాలు నిర్వహించింది. వీటిలో భాగంగా పరిచయాలు, ‘మీ ఓటు గురించి తెలుసుకోండి’ ప్రదర్శనలు, యువ భాగస్వాములతో చర్చలు, సామూహిక ప్రజాస్వామ్య ప్రతిజ్ఞ తదితరాలను నిర్వహించారు. మాండ్లాలో యువతరం దృక్పథం, ప్రజా ప్రతినిధులతో చర్చలు, క్రీడలపై అనుభవాల కలబోత, ప్రజాస్వామ్య విలువలు-దేశ ప్రగతి ప్రాధాన్యం తదితరాలపై చర్చలు కేంద్రీకృతమయ్యాయి.
ఈ దేశవ్యాప్త కార్యక్రమాల ద్వారా ప్రజాస్వామ్యంలో పాలుపంచుకోవడంపై చర్చ కళాశాలలు, విద్యాసంస్థల స్థాయికి చేరింది. దీంతో యువతరానికి ప్రజా ప్రతినిధులతో ప్రత్యక్షంగా సంభాషించే అవకాశం లభించింది. విజ్ఞానవంతులైన పౌరులుగా తమ పాత్రను వారు తరచి చూసుకోగల వేదికగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతోంది.