ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విశాఖపట్నంలో 2026 నవంబర్ 3న ఆర్ఐఎన్ఎల్ భూముల వేలం రెండో దశను విజయవంతంగా ముగించిన ఎన్ఎల్ఎంసీ: విజయవంతమైన బిడ్ల ద్వారా రూ.218 కోట్ల సమీకరణ


రెండో దశలో 114 భూముల వేలం: రిజర్వు ధరపై 17.96 శాతం అధికంగా లభించిన ప్రీమియం

ఎన్ఎల్ఎంసీ తొలి పూర్తిస్థాయి ఈ-వేలం నిర్వహణ విజయవంతం: పారదర్శకమైన, పోటీతత్వం నిండిన, సాంకేతిక ఆధారిత ఆస్తుల నగదీకరణ బలోపేతం

నాడు పోస్టు చేయడమైనది: 04 NOV 2026 11:48AM by PIB Hyderabad

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని నిర్వహించే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) భూముల రెండో దశ ఈ-వేలం 2026 నవంబర్ 3న విజయవంతంగా పూర్తయింది. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థల విభాగం పరిధిలో కార్యకలాపాలు నిర్వహించే నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) ఈ-వేలాన్ని నిర్వహించింది.

నిర్మాణాత్మకమైన, పారదర్శకమైన, పోటీతత్వంతో కూడిన సాంకేతిక ఆధారిత వేలం ప్రక్రియ ద్వారా వినియోగంలో లేని అదనపు ప్రభుత్వ ఆస్తుల నుంచి  ఆదాయాన్ని సమకూర్చుకోవడాన్ని సులభతరం చేసేలా ఎన్ఎల్ఎంసీ ప్రయత్నాలు చేపడుతోంది. వీటిలో భాగంగా నిర్వహించిన రెండో దశ ఈ-వేలం విజయవంతం అయింది.

ఈ వేలంలో 114 భూములను విక్రయించేందుకు రూ.184.8కోట్లు రిజర్వు ధరగా నిర్దేశించారు. ఈ భూములకు బిడ్ల విలువ రూ.218 కోట్లుగా నమోదయింది. మొత్తం రిజర్వు ధర కంటే బిడ్ల ద్వారా 17.96 శాతం అధిక ప్రీమియం లభించింది. ఇది పోటీతత్వంతో కూడిన బిడ్డింగ్‌ను, సమర్థమైన మార్కెట్ ఆధారిత ధర నిర్ణయాన్ని తెలియజేస్తోంది.

రెండో దశలో నమోదైన అత్యధిక బిడ్ ధర చదరపు గజానికి రూ. 1,82,650. ఒక ప్లాట్‌కు రిజర్వ్ ధర కంటే గరిష్ఠంగా 67.65 శాతం అదనపు ధర లభించింది.

 విశాఖపట్నంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న భూములపై మార్కెట్‌ ఆసక్తిని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే మిగులు ప్రభుత్వ ఆస్తుల ఆర్థిక విలువను వెలికితీయడంలో పారదర్శకమైన, పోటీతత్వంతో కూడిన ఈ-వేలం విధానం ఎంత సమర్థంగా పనిచేస్తుందో కూడా ఇవి తెలియజేస్తున్నాయి.

ఆర్ఐఎన్ఎల్ భూముల ఈ-వేలం రెండు దశలూ విజయవంతం

మొదటి దశలో మొత్తం రూ. 312.48 కోట్ల రిజర్వ్ ధరకు గాను 150 భూములను విజయవంతంగా వేలం వేసి రూ. 366.33 కోట్ల బిడ్ విలువను ఎన్ఎల్ఎంసీ సాధించింది. విజయవంతమైన బిడ్లు రిజర్వ్ ధర కంటే సగటున 17.23 శాతం అధిక ప్రీమియాన్ని నమోదు చేశాయి. అత్యధిక వేలం ధర చదరపు గజానికి రూ.1.80 లక్షలకు పైగా నమోదైంది.

రెండు దశల్లోనూ మొత్తం రూ. 497.29 కోట్ల రిజర్వు ధరతో 264 భూముల వేలం విజయవంతంగా పూర్తయింది. వీటికి రూ. 584.33 కోట్ల బిడ్ విలువ సమకూరింది.

ఈ-ఆక్షన్ ద్వారా ఆర్ఐఎన్ఎల్‌కు సమకూరిన మొత్తం ఆదాయం

వివరాలు

మొదటి దశ

రెండో దశ

మొత్తం

వేలం తేదీ

2026 అక్టోబర్ 12

2026 నవంబర్ 3

—

విజయవంతంగా వేలం పూర్తయిన భూములు

150

114

264

వేలం పూర్తయిన ప్లాట్ల మొత్తం రిజర్వు ధర

రూ. 312.48 కోట్లు

రూ.184.81 కోట్లు

రూ. 497.29 కోట్లు

మొత్తం బిడ్ విలువ

రూ. 366.33 కోట్లు

రూ. 218 కోట్లు

రూ. 584.33 కోట్లు

రిజర్వు ధర కంటే అధికంగా లభించిన ప్రీమియం

17.23 శాతం

17.96 శాతం

17.50 శాతం

తొలిసారి పూర్తి స్థాయిలో ఈ-వేలం నిర్వహించి ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసిన  ఎన్ఎల్ఎంసీ

ఆర్ఐఎన్ఎల్ భూముల ఈ-వేలం... ఎన్ఎల్ఎంసీ తొలిసారిగా పూర్తిస్థాయిలో చేపట్టిన ఈ-వేలం ప్రక్రియ. కార్పొరేషన్ కార్యకలాపాల్లో ఇది ప్రధాన విజయంగా నిలిచింది. ఆస్తుల గుర్తింపు, లావాదేవీల రూపకల్పన, పెట్టుబడిదారులను సమీకరించడం, బిడ్డర్లకు మార్గదర్శకత్వం, పోటీతత్వంతో కూడిన ఆన్‌లైన్ వేలం, తదితర అంశాలను సమన్వయం చేస్తూ, పెద్ద ఎత్తున ఆస్తుల నగదీకరణను విజయవంతంగా నిర్వహించడంలో ఎన్ఎల్ఎంసీ సామర్థ్యాన్ని ఈ లావాదేవీ స్పష్టం చేస్తోంది.

నెల రోజుల వ్యవధిలోనే రెండు దశల ఈ-వేలాన్ని ఎన్ఎల్ఎంసీ విజయవంతంగా పూర్తి చేసింది. 2026 అక్టోబర్ 12, నవంబర్ 3 తేదీల్లో వీటిని నిర్వహించింది. సీపీఎస్ఈలు, ఇతర ప్రభుత్వ సంస్థల మిగులు భూములు, స్థిరాస్తుల నగదీకరణకు సంబంధించి ఈ తరహా లావాదేవీలను చేపట్టడంలో ఈ వేలం ప్రక్రియ సంస్థ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది.

ఈ రెండు దశల్లోనూ సాధించిన విజయం ఆధారంగా, వర్తించే నిబంధనలు, అనుమతులకు లోబడి అమ్ముడుపోని భూముల కోసం మూడో విడత ఈ-వేలాన్నినిర్వహించాలని ఎన్ఎల్ఎంసీ యోచిస్తోంది. పారదర్శకమైన, పోటీతత్వంతో కూడిన ప్రక్రియల ద్వారా మిగులు ప్రభుత్వ ఆస్తుల నగదీకరణను వేగవంతం చేసే నిరంతర ప్రయత్నాలకు అనుగుణంగా, దీనికి సంబంధించిన షెడ్యూల్, ఇతర వివరాలను తగిన సమయంలో ప్రకటిస్తారు.

ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ లక్ష్యాలకు తోడ్పాటు

ఆర్ఐఎన్ఎల్ భూముల ఈ-వేలం విజయవంతంగా పూర్తి కావడం ద్వారా మిగులు ప్రభుత్వ భూములను, సరిగ్గా వినియోగంలో లేని ప్రభుత్వ ఆస్తుల ఆర్థిక సామర్థ్యాన్ని వెలికితీసి... భారత ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే ప్రయాణంలో ఎన్ఎల్ఎంసీ ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది.

నిర్మాణాత్మక ఆస్తుల సన్నద్ధత, భాగస్వాములతో సమర్థమైన సమన్వయం, పారదర్శక సాంకేతిక ఆధారిత వేలం ప్రక్రియల ద్వారా పెద్ద ఎత్తున నగదీకరణ లావాదేవీలను చేపట్టడంలో పెరుగుతున్న ఎన్ఎల్ఎంసీ సంస్థాగత సామర్థ్యాలను ఈ కార్యక్రమం స్పష్టం చేస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) ఆస్తులకు సరైన ధరను నిర్ణయించడంలో, పూర్తి విలువను రాబట్టడంలో పోటీతత్వం నిండిన మార్కెట్ ప్రక్రియల పాత్రను కూడా ఇది తెలియజేస్తోంది.

ఈ విజయం ఆధారంగా మిగులు భూములు, భవనాల గుర్తింపు, సన్నద్ధత, నగదీకరణ అంశాల్లో సంబంధిత సంస్థలతో కలిసి ఎన్ఎల్ఎంసీ పనిచేస్తుంది. తద్వారా వాటి ఉత్పాదక వినియోగానికి, సమర్థవంతమైన ప్రభుత్వ ఆస్తుల నిర్వహణకు, విస్తృత ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.

ఎన్ఎల్ఎంసీ గురించి

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వ సంస్థల విభాగం పరిపాలనా నియంత్రణలో నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్ఎల్ఎంసీ) పనిచేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. సీపీఎస్ఈలు, ఇతర ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న మిగులు భూములు, భవనాలను గుర్తించడం, మదింపు చేయడం, సన్నద్ధం చేయడం, వాటి నగదీకరణ ప్రక్రియలను ఇది పారదర్శకమైన, నిర్మాణాత్మకమైన, మార్కెట్ ఆధారితమైన విధానాల ద్వారా సులభతరం చేస్తుంది. తద్వారా సమర్థమైన ఆస్తుల నిర్వహణ, విలువ సాధన దిశగా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలకు తోడ్పడుతుంది.

 

అధికారిక వెబ్‌సైట్: https://nlmc.dpe.gov.in/homepage/homepage.php

 

***


(రిలీజ్ ఐడి: 2332464) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Bengali-TR , Assamese , Tamil