నాడు పోస్టు చేయడమైనది:
02 NOV 2026 8:56PM by PIB Hyderabad
‘నశా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్ ఆవిష్కరణ లక్ష్య సాధనలో మత్తు మందులకు స్వస్తి పలికేలా యువతను ప్రోత్సహించే కార్యక్రమం) ప్రచార ఉద్యమం 7వ వారంలో 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 447 కార్యక్రమాలను నిర్వహించారు. వీటితో పాటు 1,002 కార్యకలాపాలను కూడా చేపట్టారు. వీటిలో 93,000 కన్నా ఎక్కువ మంది పాల్గొన్నారు. ఈ విషయాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని మేరా యువ భారత్ (‘మై భారత్’) ఓ తాత్కాలిక నివేదికలో తెలిపింది. 2026 అక్టోబర్ 31న ముగిసిన ఈ కార్యక్రమాలలో ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించడం, మాదక ద్రవ్యాలను వినియోగించవద్దంటూ అవగాహనను కలిగించడంతో పాటు ఆ వ్యసనం బారిన పడకుండా యువజనులను కూడగట్టడంపై దృష్టిని కేంద్రీకరించారు.
ఈ ప్రచార ఉద్యమాన్ని ఢిల్లీ, బీహార్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర అనేక ప్రాంతాలలో నిర్వహించారు. దీనిలో భాగంగా మినీ మారథాన్లు, ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమాలు, యువజన మాక్ పార్లమెంటులు, నినాదాల లేఖనం వంటివి చేపట్టారు. ఈ కార్యక్రమాలలో ఇద్దరు సహాయ మంత్రులు, ముగ్గురు శాసనసభ్యులు సహా అయిదుగురు ప్రజా ప్రతినిధులు పాలుపంచుకున్నారు.
ఈ ప్రచార ఉద్యమంలో భాగంగా ‘ఫిట్ ఇండియా’, భారత క్రీడా ప్రాధికారసంస్థ (ఎస్ఏఐ), ఇతర భాగస్వామ్య సంస్థల సహకారంతో 267 మినీ మారథాన్లను ‘మై భారత్’ ఏర్పాటు చేసింది. దీనికి తోడు, 401 కార్యకలాపాలను నిర్వహించారు. వీటిలో 70,566 మంది పాల్గొన్నారు. సహకారాన్ని అందించిన సంస్థలలో బ్రహ్మకుమారీలు, హార్ట్ఫుల్నెస్, సీఐపీయూ, అసోచామ్, ఫిక్కీ ఉన్నాయి. దక్షిణ ఢిల్లీలోనూ, న్యూ ఢిల్లీలోనూ ‘మై భారత్’ ఆధ్వర్యంలో సాగిన మినీ మారథాన్‌లో కేంద్ర మంత్రి శ్రీ రవీందర్ ఇంద్రజ్ సింగ్ పాల్గొని యువతలో స్ఫూర్తిని నింపారు. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా మేజిస్ట్రేట్ సమక్షంలో ప్రతిజ్ఞను స్వీకరించి, ఓ పరుగు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్స్ (ఎన్వైపీస్) 2026 అక్టోబర్ 31న ‘నశా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ పర్ పరిచర్చా’ను నిర్వహించింది. మొత్తం 180 కార్యక్రమాలను పూర్తి చేశారు. వాటిలో భాగంగా 601 కార్యకలాపాలు చేపట్టారు. 22,488 మంది ఈ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. మత్తుపదార్థాలను సేవించడం వల్ల ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకొని, వాటి వలలో చిక్కుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తచర్యలను తీసుకోవచ్చో చర్చల రూపంలో యువతకు తెలియజెప్పారు.
ప్రతి ఒక్క నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్‌లోనూ ‘మై భారత్’ వెబ్సైట్, మత్తుపదార్థాల దుర్వినియోగంతో పాటు దేశ యువత ముందున్న సవాళ్లు, అవగాహన దశ నుంచి చేతల దిశగా ముందుకు సాగేందుకు దోహదం చేసే సాధనాలు, నశా ముక్త్ భారత్ దిశగా పయనంతో ముడిపడిన కథలకు సంబంధించిన నాలుగు సమావేశాలను నిర్వహించారు. వారం రోజుల పాటు కార్యకలాపాలు కొనసాగించి 93,054 మందితో ప్రతిజ్ఞ పాఠాలను చదివించారు.
***