వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత బయోఫార్మాల అంకురసంస్థల రంగాన్ని బలోపేతం చేసే, బయోఎకానమీ వృద్ధిని పెంచే రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్


బయోఫార్మా అంకురసంస్థలను ప్రోత్సహించడానికి నియంత్రణ సంస్కరణలు, ఉమ్మడి మౌలిక వసతులకు పిలుపునిచ్చిన సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 03 NOV 2026 11:06AM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో ‘‘ఇండియాస్ బయోఎకానమీ ఆపర్చ్యూనిటీ: రోల్ ఆఫ్ స్టార్టప్స్ ఇన్ డ్రైవింగ్ ఇన్నోవేషన్ అండ్ గ్రోత్’’ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్, నీతి ఫ్రాంటియర్ టెక్ హబ్ సహకారంతో పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య పోత్సాహక విభాగం (డీపీఐఐటీ) నిర్వహించింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, బయోఫార్మా అంకురసంస్థల ప్రతినిధులు భారతదేశ బయోఎకానమీ వృద్ధిని వేగవంతం చేసే చర్యలపై చర్చించారు. బయోఎకానమీ రంగంలో అగ్రగామిగా భారత్‌ను నిలబెట్టేలా దేశీయ శాస్త్రీయ సామర్థ్యాలను, ఔత్సాహిక పారిశ్రామిక ప్రతిభను ఉపయోగించుకోవాలని తన ప్రసంగంలో శ్రీ పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. వేగవంతమైన అనుమతులు, అందుబాటులో ఆర్థిక వనరులు, ఉమ్మడి మౌలిక వసతులు, బలమైన పరిశ్రమ–విద్యాసంస్థ–ప్రభుత్వ సహకారానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో సూచించిన సిఫారసులపై నిర్దేశిత కాలపరిమితిలో తగిన చర్యలు చేపట్టాలన్నారు.

వ్యవస్థీకృత నియంత్రణలు, వేగవంతమైన ఆమోదాలు, ప్రతిపాదిత రెగ్యులేటరీ శాండ్ బాక్స్, సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు, అంతర్జాతీయ నియంత్రణలతో సమన్వయం, సరళీకృత పేటెంట్ దరఖాస్తు ప్రక్రియల ద్వారా బయోఫార్మా అకుంరసంస్థల వ్యవస్థను బలోపేతం చేయడంపై చర్చలో దృష్టి సారించారు.

వ్యయాన్ని తగ్గించడానికి, అంకుర సంస్థలు తమ ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి కేంద్ర బడ్జెట్ 2026–27లో ప్రకటించిన బయోఫార్మా శక్తి ప్రాధాన్యం గురించి, ప్రయోగశాలలు, టెస్టింగ్ కేంద్రాలు, క్లినికల్ ట్రయల్ వసతులతో పాటు ఉమ్మడి మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం గురించి ఈ సమావేశంలో చర్చించారు.  

అంతర్జాతీయంగా పోటీనిచ్చే బయోఎకానమీని నిర్మించడంలో అంకుర సంస్థలు, పరిశ్రమ, విద్యాసంస్థలు, ప్రభుత్వం మధ్య సహకారానికి ఉన్న ప్రాధాన్యం గురించి నీతి ఆయోగ్‌ విశిష్ట నిపుణులు డేబ్జానీ ఘోష్ వివరించారు. పరిశోధన సామర్థ్యాలను బలోపేతం చేయాల్సిన, శాస్త్రీయ ఆవిష్కరణలను వాణిజ్యపరంగా లాభదాయకమైన ఉత్పత్తులుగా మార్చాల్సిన  నీతి ఆయోగ్ సభ్యులు ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ వివరించారు.

దేశీయంగా లైఫ్ సెన్సెస్ మ్యానుఫాక్చరింగ్‌ను బలోపేతం చేయడం, ప్రయోగశాల పరికరాలకు, రసాయనాలకు కస్టమ్స్ అనుమతులను వేగవంతం చేయడం, ప్రభుత్వ పథకాలు, నియంత్రణల మద్దతును సులభంగా పొందడానికి వీలు కల్పించడం తదితర చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. సమగ్ర విధానపరమైన చర్యలను సులభతరం చేయడానికి, రంగాల వారీగా ఎదురయ్యే సవాళ్లను వేగంగా పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖల మధ్య మరింత బలమైన సమన్వయం అవసరమని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నవారు స్పష్టం చేశారు.

***


(రిలీజ్ ఐడి: 2332035) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil