ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మందులు, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాలకు అధీకృత దిగుమతి కేంద్రాలను విస్తరించాలని ప్రతిపాదించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

ఆరోగ్యసంరక్షణ ఉత్పాదనల దిగుమతి, క్లియరెన్సులకు మార్గాన్ని సుగమం చేయడానికి

అదనపు ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపోలు, ప్రత్యేక ఆర్థిక మండలాలతో పాటు

ఓ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జతపరచాలంటూ ఔషధ నియమావళి-1945కి సవరణ ప్రతిపాదన

నాడు పోస్టు చేయడమైనది: 03 NOV 2026 9:54AM by PIB Hyderabad

ఔషధ నియమావళి-1945లో భాగంగా ఉన్న ‘43ఎ’ నియమానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక సవరణను ప్రతిపాదించింది. ఈ సవరణను మందులు, వైద్య ఉపకరణాలు, సౌందర్య సాధనాలను దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి అనుమతించిన ప్రవేశ కేంద్రాల వ్యవస్థను విస్తరించదలచడానికి ప్రతిపాదించారు. దిగుమతి ప్రక్రియలను సులభతరం చేయడం, ఆధునిక రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్) సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆరోగ్య సంరక్షణ ఉత్పాదనల సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రతిపాదిత సవరణ ఉద్దేశాలు.
మందులను దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి అనుమతించిన ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, రోడ్డు క్రాసింగులు, తదితర ప్రవేశ కేంద్రాలను గురించి ఔషధ నియమావళి-1945లో ‘43ఎ’ నియమంలో పేర్కొన్నారు. దిగుమతికి సంబంధించిన ప్రక్రియలలో అవసరమైన మార్పుచేర్పులు చేయడం ద్వారా వాణిజ్యాన్ని సుగమంగా మార్చే ధ్యేయంతో అధీకృత స్థానాల పట్టికలో మరిన్ని ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపోలు, ప్రత్యేక ఆర్థిక మండలాలతో పాటు ఓ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా జతపరచాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం, అదనపు స్థానాలు ఇలా ఉన్నాయి..
     • హర్యానాలో ఐసీడీ సోనీపత్, హర్‌సరూ;
     • గుజరాత్‌లోని ఐసీడీ గాంధీధామ్/ముంద్రా;
     • తెలంగాణ లోని హైదరాబాద్‌లో గల ఐసీడీ సనత్ నగర్, తిమ్మాపూర్;
     • కర్నాటక లోని బెంగళూరులో గల ఐసీడీ వైట్‌ఫీల్డ్, ఎస్ఈజడ్ బొమ్మసంద్రలతో పాటు,
     • గగన తలం నుంచి ఔషధాల దిగుమతికి గాను ఉత్తరప్రదేశ్‌ లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం.

పైన ప్రస్తావించిన స్థానాలను, ఇప్పటికే పనిచేస్తున్న అధీకృత దిగుమతి మార్గాల వ్యవస్థకు జోడిస్తారు. నెట్‌వర్కులో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, ధన్‌బాద్, తిహీలోని ఐసీడీలే కాకుండా మందుల దిగుమతికి ఇప్పటికే గుర్తించిన విమానాశ్రయాలు భాగంగా ఉన్నాయి.
ప్రతిపాదించిన విస్తరణతో దిగుమతి సంస్థలకు సరకును వాటి తయారీ కేంద్రాలకు సమీపంలో దింపుకోవడం వీలుపడుతుందని భావిస్తున్నారు. ఫలితంగా అంతర్దేశీయ రవాణాలో దూరం తగ్గిపోవడం, రవాణాకు చేయవలసి వస్తున్న ఖర్చు కొంతవరకు ఆదా కావడమే కాకుండా, దిగుమతి సరకు రాకపోకలలో జాప్యం తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదన ఆచరణలోకి వస్తే, దిగుమతిదారులకు కార్యకలాపాల నిర్వహణలో సౌలభ్యం మెరుగుపడుతుందని, దేశంలో వివిధ ప్రాంతాలకు ఔషధాలు, వైద్య పరికరాలు, సౌందర్య వర్ధక సామగ్రిని మరింత త్వరగా చేరవేయవచ్చని ఆశిస్తున్నారు.
ఆరోగ్య సంరక్షణ ఉత్పాదనల దిగుమతికి తోడ్పడుతున్న మౌలిక సదుపాయాలను పటిష్టపరచడానికి, వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని పెంపొందింప చేయడానికి, సరఫరాల వ్యవస్థను మరింత సమర్థమైందిగా మలచడానికి ఈ ప్రతిపాదిత సవరణ ద్వారా తోడ్పాటునందించాలని మంత్రిత్వ శాఖ కోరుకుంటున్నది. ఇదే నెరవేరితే, అత్యవసర ఆరోగ్య సంరక్షణ ఉత్పాదనలను సకాలంలో అందుబాటులోకి తీసుకు రావచ్చు.
మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన సవరణపై ఏవైనా అభ్యంతరాలు గాని, సూచనలు సలహాలు గాని వ్యక్తం చేయదలచుకునే వర్గాలు తమ ప్రతిస్పందనలను, అభిప్రాయాలను అండర్ సెక్రటరీ (ఔషధ నియంత్రణ), కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, యు-6, వర్క్ హాల్, సి వింగ్, ఒకటో అంతస్తు, కర్తవ్య భవన్-1, న్యూఢిల్లీ-110001కి సమర్పించాలి.  ఆన్‌లైన్ లో అయితే, drugsdiv-mohfw[at]gov[dot]in చిరునామాకు ఈ-మెయిల్‌లో పంపించవచ్చు.
ఔషధ నియమావళి-1945కు ప్రతిపాదించిన సవరణతో కూడిన ముసాయిదా నోటిఫికేషనును ఈ కింద పేర్కొన్న లింకులోకి వెళ్లి అధికారిక రాజపత్రంలో పరిశీలించగలరు:
https://egazette.gov.in/(S(s2ixpktncwy30a02dofwfeqh))/ViewPDF.aspx

***


(రిలీజ్ ఐడి: 2331940) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam