రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బెంగళూరు-ముంబయి వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన కేంద్రమంత్రి


ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, హెచ్.డీ. కుమారస్వామి, రైల్వే సహాయమంత్రి వి. సోమన్న, ఇతర ప్రముఖులు

నూతన వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు, ముంబయి మధ్య అనుసంధానతను మెరుగుపరచటమే కాక, భారత ఐటీ, అంకుర సంస్థల కేంద్రంతో ఆర్థిక కేంద్రాన్ని అనుసంధానిస్తుంది: శ్రీ అశ్వినీ వైష్ణవ్

వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, వర్తకులు, పర్యాటకులకు ప్రయోజనం... రాత్రిపూట బయలుదేరి ఉదయం గమ్యస్థానాన్ని చేరుకునేలా ఆధునిక రైలు అనుసంధానం

నాడు పోస్టు చేయడమైనది: 01 NOV 2026 7:21PM by PIB Hyderabad

ఎస్ఎంవీటీ బెంగళూరు-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ), ముంబయి వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఇవాళ ప్రారంభించారు. కేంద్రమంత్రులు శ్రీ ప్రహ్లాద్ జోషి, శ్రీ హెచ్.డీ. కుమారస్వామి, రైల్వే శాఖ సహాయమంత్రి శ్రీ వి. సోమన్న, సహాయమంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే తదితర ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. దేశంలోని రెండు ప్రముఖ మహానగరాలు, ఆర్థిక కేంద్రాల మధ్య ఓవర్ నైట్ ఆధునిక రైలు అనుసంధానతను బలోపేతం చేయటంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కీలకంగా నిలిచింది.

ఈ తదుపరి తరం స్లీపర్ రైలు సర్వీసు ద్వారా బెంగళూరు - ముంబయి మధ్య ప్రయాణించే వారికి మరింత ఆధునిక, సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ప్రయాణమార్గం అందుబాటులోకి వస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని ముఖ్యమైన ప్రాంతీయ కేంద్రాల మధ్య రవాణా సౌకర్యాలను బలోపేతం చేస్తూనే.. నిపుణులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, విద్యార్థులు, వాణిజ్యకారులు, పర్యాటకులకు ఈ సర్వీసు ప్రయోజనకరంగా ఉంటుంది.

2026 జనవరిలో హౌరా-గౌహతి మార్గంలో వందేభారత్ స్లీపర్ సేవలను ప్రారంభించిన తర్వాత నిన్న వారణాసి-న్యూఢిల్లీ వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. ఇప్పుడు బెంగళూరు-ముంబయి సర్వీసు ఓవర్ నైట్ ఆధునిక రైలు ప్రయాణ వ్యవస్థను మరింత విస్తరిస్తోంది. ప్రయాణికులే కేంద్రంగా సాగే ప్రయాణ సౌకర్యాలపై భారత రైల్వేల నిబద్ధతను ఇది మరింత బలపరుస్తుంది.

బెంగళూరు-ముంబయి వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం గురించి శ్రీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ... దేశ ఐటీ, అంకుర సంస్థల రాజధాని బెంగళూరును, ఆర్థిక రాజధాని ముంబయితో ఈ సర్వీసు అనుసంధానిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గుంతకల్లు, కర్ణాటకలోని రాయచూరు, యాదగిరి, కలబురగి, మహారాష్ట్రలోని సోలాపూర్, పూణే, కళ్యాణ్ మీదుగా ఈ రైలు నడుస్తుందని చెప్పారు. గతంలో ఎలాంటి ప్రీమియం, ప్రపంచ స్థాయి రైలు సేవల సౌకర్యం లేని ఉత్తర కర్ణాటకలోని ఎన్నో ప్రాంతాలకు ఇది ఓవర్ నైట్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు. కర్ణాటక నుంచి ప్రారంభం కానున్న తదుపరి వందేభారత్ స్లీపర్ సర్వీసు బెంగళూరు నుంచి బయలుదేరి కర్ణాటకలోని ఉత్తర ప్రాంతాల మీదుగా హుబ్బళ్లిని కలుపుతూ పూణే, ముంబయి దిశగా వెళ్తుందని ఆయన ప్రకటించారు.

విద్యుద్దీకరణ పూర్తి కావడంతో పాటు ఈ మార్గంలో విజయవంతంగా పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో బెంగళూరు-మంగళూరు మధ్య వందేభారత్ సేవలు కొన్ని వారాల్లోనే ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. బెంగళూరు, తీరప్రాంత కర్ణాటక మధ్య అనుసంధానాన్ని ఈ సర్వీసు మరింత బలపరుస్తుందని అన్నారు. నూతన సర్వీసు ఈ ప్రాంతానికి మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన, ప్రపంచ స్థాయి రైలు ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటకలో ప్రయాణికుల అనుసంధానాన్ని బలపరచటంలో, ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంలో ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఆధారిత మెరుగుదల, హై-స్పీడ్ సేవల విస్తరణ ఎంతగానో దోహదపడతాయని ఆయన స్పష్టం చేశారు.

కర్ణాటకలో హై-స్పీడ్ రైలు అనుసంధాన విస్తరణను, ప్రాంతీయ అనుసంధానాన్ని బలపరిచి ఆర్థిక ఏకీకరణను ప్రోత్సహించే దిశగా నూతన రైల్వే కారిడార్ల అభివృద్ధిని కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ వివరించారు. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంటూ... భవిష్యత్‌లో బెంగళూరు-చెన్నై ప్రయాణం కేవలం 73 నిమిషాల్లో, బెంగళూరు-హైదరాబాద్ ప్రయాణం సుమారు 2 గంటల 10 నిమిషాల్లో పూర్తికానున్నట్లు తెలిపారు.

కర్ణాటకలో ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో రైల్వే అనుసంధానాన్ని పటిష్టం చేసేందుకు రైల్వే మంత్రిత్వశాఖ చేస్తున్న కృషిని కేంద్రమంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి అభినందించారు. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయింపులు పెరగటాన్ని, రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనుల్లో సాధించిన గణనీయమైన పురోగతిని కొనియాడారు. ఈ స్థిరమైన పెట్టుబడుల వల్ల మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు భద్రతా ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయని శ్రీ ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. కవచ్ రక్షణ వ్యవస్థను అమలు చేసిన తర్వాత రైలు ప్రమాదాల సంఖ్య 135 నుంచి 16కి తగ్గిపోయిందని, జీరో యాక్సిడెంట్స్ లక్ష్య సాధనే సంస్థాగత ధ్యేయమని తెలిపారు. నూతన వందేభారత్ సేవల ప్రారంభాన్ని, అదనపు హై-స్పీడ్ రైల్వే కారిడార్ల ప్రకటనను స్వాగతించారు. ఈ చర్యలు ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

బెంగళూరు-ముంబయి వందేభారత్ స్లీపర్ సర్వీసుని ప్రవేశపెట్టటాన్ని, బెంగళూరు-మంగళూరు మధ్య ప్రతిపాదిత వందేభారత్ అనుసంధానాన్ని, బెంగళూరును పూణేతో అనుసంధానించే రైలు మార్గాన్ని కేంద్రమంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి స్వాగతించారు. ఈ సర్వీసులు కర్ణాటక ప్రజలకే కాక బెంగళూరులో నివసిస్తున్న పశ్చిమబెంగాల్, అస్సాం, బీహార్ వంటి రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు, కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంటాయని, ప్రయాణికుల సౌలభ్యాన్ని, ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయని అభిప్రాయపడ్డారు.

కర్ణాటకలో రైల్వే మౌలిక సదుపాయాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని రైల్వే శాఖ సహాయమంత్రి శ్రీ వి. సోమన్న తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయటం, రైలు అనుసంధానాన్ని బలోపేతం చేయటం, రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచటంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. రాష్ట్రంలో సుమారు రూ. 52,000 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. రైలు సేవలను పునరుద్ధరించటంలో, రైల్వే ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిల నిర్మాణాన్ని వేగవంతం చేయటంలో, బెంగళూరుతో పాటు జిల్లా కేంద్రాలు, ఇతర ముఖ్యమైన కేంద్రాల్లో రైల్వేస్టేషన్లను ఆధునీకరించటంలో రైల్వేమంత్రి చేస్తున్న కృషిని అభినందించారు.

రెండు ప్రధాన ఆర్థిక, వాణిజ్య కేంద్రాల మధ్య అనుసంధానం

సమాచార సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, విద్య, పారిశ్రామిక రంగానికి ప్రముఖ కేంద్రమైన బెంగళూరు... దేశ ఆర్థిక, వాణిజ్య రాజధాని ముంబయి మధ్య నూతన వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు కీలకమైన ఓవర్ నైట్ రైలు మార్గ సదుపాయాన్ని కల్పిస్తుంది.

ఈ రెండు మహానగరాల మధ్య నిపుణులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, వ్యాపారులు, కుటుంబాలు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నూతన సర్వీసు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. దీనిద్వారా ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు రాత్రిపూట ప్రయాణించి, మరుసటి రోజు ఉదయానికి గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.

ఈ రైలు అనంతపురం, గుంతకల్లు, రాయచూరు, యాదగిరి, వాడి, కలబురగి, సోలాపూర్, పూణే, కల్యాణ్ తదితర కీలక స్టేషన్ల ద్వారా వెళ్తుంది. ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పరిధిలోని ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయటంతో పాటు ముఖ్యమైన వాణిజ్య, విద్యా, ప్రాంతీయ కేంద్రాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ రైలు బెంగళూరులోని ఎస్‌ఎంవీటీ నుంచి 19:45 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు 11:55 గంటలకు ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సీఎస్‌ఎమ్‌టీ నుంచి 20:10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు 12:00 గంటలకు బెంగళూరు ఎస్‌ఎంవీటీకి చేరుకుంటుంది. వారంలో ఆరు రోజుల పాటు ఈ సర్వీసు నడుస్తుంది. బెంగళూరు నుంచి బయలుదేరే రైలుకు సోమవారం, ముంబయి నుంచి బయలుదేరే రైలుకు మంగళవారం రోజున సర్వీసు ఉండదు.

ఈ రాత్రిపూట ప్రయాణ సమయం వల్ల ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణిస్తూనే, పగటి సమయాన్ని మరింత సద్వినియోగం చేసుకునేందుకు వీలవుతుంది. ఈ మార్గంలోని వివిధ నగరాలు, పట్టణాల ప్రజలు కూడా ఈ నూతన ఆధునిక రైలు ప్రయాణ సదుపాయం ద్వారా లబ్ధి పొందుతారు.

ఆధునిక మౌలిక వసతులు, అత్యాధునిక సాంకేతికత, మెరుగైన అనుసంధానంతో ప్రయాణ రంగాన్ని మార్చాలన్న భారత రైల్వే నిరంతర కృషిలో భాగంగా బెంగళూరు-ముంబయి వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం మరో కీలక ఘట్టంగా నిలిచింది. భారతదేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతూ, మహానగరాలను అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ కేంద్రాలతో అనుసంధానించే ఆధునిక, సమర్థవంతమైన, సురక్షితమైన, ప్రయాణికుల కేంద్రంగా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు భారత రైల్వే కట్టుబడి ఉంది.

***


(రిలీజ్ ఐడి: 2331715) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada