నాడు పోస్టు చేయడమైనది:
01 NOV 2026 4:48PM by PIB Hyderabad
భారతదేశంలో ఏడు విమానాశ్రయాలలో అంతర్జాతీయ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ‘డిజి యాత్ర’ పరీక్షలను మొదలుపెట్టారు. ఇది దేశంలో విమానయాన రంగంలో డిజిటల్ సాంకేతికతను అనుసరించే దిశలో వేసిన మరొక అడుగు అని చెప్పాలి. ఈ పరీక్షలను 2026 నవంబర్ మొదలు డిసెంబర్ వరకు చేపడతారు. వీటిలో భాగంగా, ఈ-పాస్‌పోర్టులు కలిగివున్న భారతీయ పౌరులు ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు నిర్వహించే కొన్ని అంతర్జాతీయ ఫ్లైట్లలో ప్రయాణించేటపుడు, ఆయా విమానాశ్రయాలలో నిర్ధారించిన కేంద్రాల వద్ద డిజి యాత్ర సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
ఈ ప్రయోగాత్మక పథకాన్ని ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోచి, ముంబయి, చెన్నయి, అమృత్సర్ విమానాశ్రయాలలో నిర్వహిస్తున్నారు. అర్హులైన ప్రయాణికులు టర్మినల్ ప్రవేశ ద్వారాలు, సెక్యూరిటీ హోల్డ్ ఏరియా (ఎస్హెచ్ఏ)లు, బోర్డింగ్ గేట్ల వద్ద, సంబంధిత మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న చోట్లల్లా, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న సమయంలో అందే అభిప్రాయాలు 2027లో విస్తృత స్థాయిలో దీనిని అమలు చేసేందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయడంలో ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు.
ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి, అర్హత కలిగిన భారతీయ పౌరులు ‘డిజి యాత్ర’ మొబైల్ అప్లికేషన్ (యాప్) ద్వారా ఈ-పాస్‌పోర్ట్ ఆధారిత వెరిఫైయబుల్ క్రెడెన్షియల్ (వీసీ)ని రూపొందించుకోవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఈ-పాస్‌పోర్టు ‘మెషీన్ రీడబుల్ జోన్’ (ఎమ్ఆర్జడ్)ను స్కాన్ చేయడం, సంబంధిత స్మార్ట్‌ఫోన్ లోని ‘నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్’ (ఎన్ఎఫ్సీ) ఫీచరును ఉపయోగించి అందులో అమర్చి ఉన్న చిప్‌ను చదవడం, సెల్ఫీ తీసుకోవడం, వివరాలను సరైనవని ధ్రువీకరించడం వంటి అంశాలు ఇమిడి ఉంటాయి. ఈ గుర్తింపు పత్రం ప్రయాణికుల డివైస్‌లో ఉండే ‘డిజి యాత్ర’ వ్యాలెట్‌లో నిల్వ అయి ఉంటుంది. దీనిని విమానాశ్రయంలో పరీక్షలకు ఉద్దేశించిన కేంద్రాల వద్ద ఉపయోగించవచ్చు.
ఈ సదుపాయం ప్రస్తుత ప్రయాణ ప్రక్రియలకు ఒక పూరకంగా ఉంటుంది. అంతే తప్ప, ఆ ప్రక్రియలను తోసిరాజనడం ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంలోని ఉద్దేశం కానే కాదు. ప్రయాణికులు తమ ప్రయాణ దస్తావేజులను తమతో పాటు అట్టిపెట్టుకోవాలి. విమాన సంస్థ తాలూకు దస్తావేజుల తనిఖీ, ఇమిగ్రేషన్ ప్రక్రియలు, ఇతర వర్తించే ప్రయాణ లాంఛనాలను ప్రయాణికులు తప్పనిసరిగా నెరవేర్చవలసి ఉంటుంది.
భారతదేశ విమానయాన నెట్వర్కులో ‘డిజి యాత్ర’ను ఉపయోగించే ధోరణి నిరంతరాయంగా విస్తరిస్తోంది. ఈ సేవను 26.5 మిలియన్ కన్నా ఎక్కువ మంది వినియోగదారులు పొందుతున్నారు. ఇది దేశీయ ఎయిర్‌లైన్స్ ఉపయోగించుకుంటున్న 39 దేశీయ విమానాశ్రయాలలో 110 మిలియన్‌కు మించిన ప్రయాణాలకు మార్గాన్ని సుగమం చేసింది. 2027 కల్లా మరో 25 దేశీయ ఎయిర్‌పోర్టులను దీని పరిధిలోకి తీసుకురావాలనుకుంటున్నారు.
భారత్ ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’, ‘ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్’ దృష్టికోణాలకు అనుగుణంగా విమానాశ్రయాల కార్యకలాపాలను మెరుగుపరచడానికి, ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా విమాన ప్రయాణానికి మార్గాన్ని సుగమం చేయడానికి సాంకేతికతను ఉపయోగించుకొనేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
***