నాడు పోస్టు చేయడమైనది:
01 NOV 2026 5:43PM by PIB Hyderabad
నవంబర్ 2న న్యూఢిల్లీలోని భారత మండపంలో సాయంత్రం 4:30 గంటలకు భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్, ఎక్స్పో-2026ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
నవంబర్ 2 నుంచి 5, 2026 వరకు నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. ‘పెట్టుబడి. ఆవిష్కణ. స్ఫూర్తి’ ఇతివృత్తంతో ఈ సదస్సుని నిర్వహిస్తున్నారు.
భారత్ ఆర్ఈ-2026లో 130కి పైగా దేశాలు, 40 మంది మంత్రులతో పాటు విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమల ప్రముఖులు పాల్గొంటారు. స్వచ్ఛ ఇంధన రంగంలో పెట్టుబడులకు, పరిశ్రమల భాగస్వామ్యానికి, సాంకేతిక సహకారానికి ప్రపంచ వేదికగా ఈ సదస్సు నిలుస్తుంది. ఆస్ట్రేలియా, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్ దేశాలు ఇందులో భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటున్నాయి.
పదమూడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు - ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్... పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, పెట్టుబడి అవకాశాలు, తయారీ రంగ నైపుణ్యాలను ప్రదర్శిస్తాయి.
అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) అసెంబ్లీ 9వ సెషన్, నాలుగో గ్రీన్ హైడ్రోజన్ అంతర్జాతీయ సదస్సు (ఐసీజీహెచ్)తో పాటు ఈ సదస్సును నిర్వహించారు. స్వచ్ఛ ఇంధన రంగంలో పెట్టుబడులు, పరిశ్రమ, సాంకేతిక భాగస్వామ్యాలపై భారత్ ఆర్ఈ దృష్టి సారిస్తుండగా... ఆర్థిక, సంస్థాగత సామర్థ్యంతో సహా సౌర ఇంధనంలో అంతర్జాతీయ సహకారాన్ని ఐఎస్ఏ అసెంబ్లీ ముందుకు తీసుకువెళుతుంది. గ్రీన్ హైడ్రోజన్ సాంకేతికతలు, పెట్టుబడులు, వాటి విస్తరణపై ఐసీజీహెచ్ దృష్టి సారిస్తుంది. ఈ మూడు వేదికలు సంయుక్తంగా అంతర్జాతీయ సహకారాన్ని బಲపరిచి, స్వచ్ఛ ఇంధన వృద్ధిని వేగవంతం చేస్తాయి.
భారతదేశ ప్రధాన పునరుత్పాదక ఇంధన పెట్టుబడి సదస్సు 'రీ-ఇన్వెస్ట్' వారసత్వాన్ని కొనసాగిస్తూ... స్వచ్ఛ ఇంధన రంగంలో ప్రపంచ స్థాయి భాగస్వామ్యానికి భారత్ ఆర్ఈ 2026 విస్తృత వేదికను అందిస్తుంది. ఈ సదస్సులో పెట్టుబడులు, భాగస్వామ్యాలు, ప్రాజెక్టు అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్లీనరీ సెషన్లు, మంత్రివర్గ చర్చలు, సీఈఓ రౌండ్‌టేబుల్ సమావేశాలు, దేశ, రాష్ట్ర స్థాయి సెషన్లతో పాటు బిజినెస్-టు-బిజినెస్, బిజినెస్-టు-గవర్నమెంట్, గవర్నమెంట్-టు-గవర్నమెంట్ సమావేశాలు కూడా జరుగుతాయి. సౌర, పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్, ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాల్లో అత్యాధునిక సాంకేతికతలు, భారత తయారీ సామర్థ్యాలు, స్వచ్ఛమైన ఇంధన పరిష్కారాలను ప్రదర్శిస్తూ 400 మందికి పైగా ప్రదర్శనకారులతో ఎక్స్పోని నిర్వహిస్తారు.
***