వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2027 ఏప్రిల్‌ 12-17 తేదీల్లో న్యూఢిల్లీలో ఐసీఏఆర్-సీజీఐఏఆర్ శాస్త్ర, భాగస్వామ్య వారోత్సవాలు 2027 నిర్వహించనున్న భారత్‌.. 5,000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని అంచనా

దేశ వ్యవసాయ రంగంలో పరివర్తన, ప్రపంచ పరిశోధనా భాగస్వామ్యాలను చాటిచెప్పనున్న సీజీఐఏఆర్ శాస్త్ర, భాగస్వామ్య వారోత్సవాలు 2027



జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత సమన్వయం చేయనున్న ఐసీఏఆర్-సీజీఐఏఆర్: డాక్టర్‌ ఎంఎల్‌ జాట్‌



అభివృద్ధి చెందుతున్న దేశాల సహకారాన్ని ప్రోత్సహించి, ఆ దేశాలతో వ్యవసాయ ఆవిష్కరణలను పంచుకోనున్న భారత్‌: డాక్టర్‌ ఎంఎల్‌ జాట్‌



శాస్త్ర, సాంకేతికతలో భారత్‌-సీజీఐఏఆర్ భాగస్వామ్యం పరివర్తనాత్మక శక్తికి నిదర్శనం: డాక్టర్‌ ఇస్మహానే ఎలౌఫీ



శాస్త్ర, సాంకేతికత, అంతర్జాతీయ భాగస్వామ్యాలతో భారత వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు: డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌

నాడు పోస్టు చేయడమైనది: 30 OCT 2026 2:29PM by PIB Hyderabad

2027 ఏప్రిల్‌ 12 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో ‘సీజీఐఆర్ శాస్త్ర, భాగస్వామ్య వారోత్సవాలు’(సైన్స్, పార్టనర్‌షిప్ వీక్) నిర్వహించనున్నట్లు సీజీఐఏఆర్, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) సంయుక్తంగా నేడు ప్రకటించాయి. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగం (డీఏఆర్ఈ)కు చెందిన ఐసీఏఆర్, సీజీఐఏఆర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.

 

ఈ వారోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, రైతులు, ప్రభుత్వ ప్రతినిధులు, అంకుర సంస్థలు, వ్యాపార సంస్థలు న్యూఢిల్లీకి తరలిరానున్నాయి. ఇప్పటికే రైతులకు చేరువైన నూతన ఆవిష్కరణలు, మరింత ఎక్కువ మంది రైతులకు వాటిని అందించేందుకు ఇంకా చేపట్టాల్సిన కృషి వంటి అంశాలపై వీరంతా చర్చించనున్నారు.

 

ఈ కార్యక్రమ నిర్వహణకు భారత్‌ ఆతిథ్యమిచ్చే దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ వ్యవసాయ పరిశోధనా వ్యవస్థల్లో ఒకదానికి ఐసీఏఆర్ నాయకత్వం వహిస్తోంది. ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు 50 ఏళ్లకు పైగా సీజీఐఆర్‌తో కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం సీజీఐఆర్‌కు చెందిన పది పరిశోధనా కేంద్రాలు భారత్‌లో పంటలు, నీరు, పశుసంపద, చేపలు, పోషకాహారం, విధానాలకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నాయి.

 

భారత వ్యవసాయ శాస్త్ర రంగం ప్రభావం దేశ సరిహద్దులను దాటి విస్తరించింది. ఇక్రిశాట్ సంరక్షించి, ఇతర దేశాలకు అందించిన భారతీయ వేరుశనగ నమూనా.. మలావి, ఉగాండా, మొజాంబిక్‌, జాంబియాల్లో ప్రస్తుతం సాగు చేస్తున్న వేరుశనగ రకాలను అభివృద్ధి చేయడంలో దోహదపడింది. హైదరాబాద్‌లోని వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం కోసం ఏర్పాటు చేసిన సహకార కేంద్రం.. నిరూపితమైన వ్యవసాయ ఆవిష్కరణలను ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలకు విస్తరిస్తోంది.

వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో అయిదు దశాబ్దాలకు పైగా భారత్‌లో గణనీయమైన పాత్ర పోషిస్తున్న భారత్‌-సీజీఐఏఆర్ దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగం (డీఏఆర్ఈ) కార్యదర్శి, భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎంఎల్‌ జాట్‌ వివరించారు.

 

100కు పైగా దేశాల్లో పనిచేస్తున్న 15 పరిశోధనా కేంద్రాలతో కూడిన అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా భాగస్వామ్య సంస్థ అయిన సీజీఐఏఆర్.. ప్రపంచ వ్యవసాయ రంగ పురోగతికి గణనీయంగా దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఐసీఏఆర్ ద్వారా భారత్‌తో కొనసాగిస్తున్న సహకారం పంటల అభివృద్ధి, సహజ వనరుల నిర్వహణ, ఆహార భద్రత, వ్యవసాయ ఉత్పాదకత వంటి రంగాల్లో కీలకమైన పురోగతికి తోడ్పడిందని తెలిపారు.

 

హరిత విప్లవం తర్వాత భారత్‌లో చోటుచేసుకున్న వ్యవసాయ పరివర్తనను ప్రస్తావిస్తూ.. సీఐఎంఎంవైటీ, ఐఆర్ఆర్ఐ, ఇక్రిశాట్ వంటి అంతర్జాతీయ పరిశోధనా సంస్థలతో సహకారం దేశ ఆహార ఉత్పత్తి సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిందని డాక్టర్‌ జాట్‌ వివరించారు. ఒకప్పుడు ఆహార కొరతతో దిగుమతులపై ఆధారపడిన దేశంగా ఉన్న భారత్‌.. నేడు ప్రధాన ఆహార ఉత్పత్తి, ఎగుమతి దేశంగా ఎదిగిందని పేర్కొన్నారు.

 

2027లో నిర్వహించనున్న సీజీఐఏఆర్ శాస్త్ర, భాగస్వామ్య వారోత్సవాలు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి, శాస్త్రీయ పరిజ్ఞానం, సాంకేతికతలు, ఉత్తమ విధానాల మార్పిడికి కీలక వేదికగా నిలుస్తుందని ఆయన చెప్పారు.

 

అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలతో సహా ఇతర దేశాలతో భారత్‌లో విజయవంతమైన వ్యవసాయ ఆవిష్కరణలను పంచుకోవడం తమ ప్రాధాన్యమని డాక్టర్‌ జాట్‌ తెలిపారు. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, డిజిటల్‌ వ్యవసాయం, అగ్రిస్టాక్‌, వ్యవసాయ యాంత్రీకరణ, చిరుధాన్యాలు, ప్రకృతి వ్యవసాయం, సుస్థిర వ్యవసాయ పద్ధతుల్లో భారత్‌ సాధించిన పురోగతి అంతర్జాతీయ సహకారానికి విస్తృత అవకాశాలను అందిస్తోందని వివరించారు.

వ్యవసాయ-ఆహార విలువ వ్యవస్థలో ఉద్భవిస్తున్న ప్రాధాన్య అంశాలపై కూడా ఈ కార్యక్రమంలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం, నీటి నిర్వహణ, నేల ఆరోగ్యం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు, అంకుర సంస్థలు, యువత, మహిళల భాగస్వామ్యం, వ్యవసాయ శాస్త్రం, ఆవిష్కరణల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర వంటి అంశాలు ఇందులో ఉంటాయని పేర్కొన్నారు.

 

సీజీఐఏఆర్ ఎగ్జిక్యూటివ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఇస్మహానే ఎలౌఫీ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జరగబోయే ఈ కార్యక్రమం భారత్‌-సీజీఐఏఆర్ దీర్ఘకాలిక భాగస్వామ్యం సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడంతో పాటు, రాబోయే 50 ఏళ్ల వ్యవసాయ సహకారానికి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. బలమైన జాతీయ శాస్త్ర పరిశోధన వ్యవస్థ విస్తృత స్థాయిలో ఎలాంటి ఫలితాలను సాధించగలదో భారత్‌ నిరూపించిందని ఆమె అన్నారు. భారత్‌లో అభివృద్ధి చేసిన విత్తనాలు, పరిజ్ఞానం ఇప్పటికే ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని రైతులకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ ఏప్రిల్‌లో ఆ వినిమయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు, శాస్త్ర పరిశోధన ద్వారా ఇంకా ఏయే రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చో కలిసి పరిశీలించాలనుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు.

 

మానవ సంక్షేమాన్ని మెరుగుపరచడంలో, ఆహార వ్యవస్థలను బలోపేతం చేయడంలో శాస్త్ర విజ్ఞానం, శాస్త్రవేత్తల కృషిని గుర్తించడం కూడా ఎంతో ముఖ్యమని ఆమె తెలిపారు. 2025 ఏప్రిల్‌లో కెన్యాలోని నైరోబీలో జరిగిన తొలి కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో, భారత్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ప్రపంచ భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, వ్యవసాయ రంగంలో ఉద్భవిస్తున్న సవాళ్లకు పరిష్కారాలను రూపొందించేందుకు వివిధ రంగాల భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకువస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక్రిశాట్ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌ మాట్లాడుతూ, “ఆహార కొరతతో ఉన్న దేశం నుంచి ప్రధాన ఆహార ఉత్పత్తి, ఎగుమతి దేశంగా భారత్‌ సాగించిన వ్యవసాయ ప్రస్థానం.. శాస్త్ర, సాంకేతికత, అంతర్జాతీయ భాగస్వామ్యాల పరివర్తనాత్మక శక్తికి నిదర్శనం. 2027 సీజీఐఏఆర్ శాస్త్ర, భాగస్వామ్య వారోత్సవాల ద్వారా భారత వ్యవసాయ రంగం సాధించిన విజయాలను ప్రపంచానికి పరిచయం చేయడం, మన ఆవిష్కరణలను ఇతర దేశాలతో పంచుకోవడం, ప్రపంచవ్యాప్తంగా సాధించిన పురోగతి నుంచి నేర్చుకోవడం మా లక్ష్యం. తద్వారా వ్యవసాయం, ఆహార వ్యవస్థలు ఎదుర్కొంటున్న నూతన సవాళ్లకు ఉమ్మడిగా పరిష్కారాలను రూపొందించగలుగుతాం’’ అని పేర్కొన్నారు.

తొలి సీజీఐఏఆర్ సైన్స్‌ వారోత్సవం 2025 ఏప్రిల్‌లో కెన్యాలోని నైరోబీలో జరిగింది. ఆ కార్యక్రమంలో సీజీఐఏఆర్ తన ప్రస్తుత పరిశోధనా కార్యక్రమాల ప్రణాళికను ప్రారంభించింది. న్యూఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమం శాస్త్రీయ పరిశోధనలను క్షేత్రస్థాయిలో ఫలితాలుగా ఎలా మార్చాలి, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారాన్ని భాగస్వామ్యాల ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాలపై దృష్టి సారించనుంది. 2047 నాటికి భారత్‌ సాధించాలనుకుంటున్న లక్ష్యాలకు వ్యవసాయ పరిశోధన, ఆవిష్కరణలు ఏ విధంగా దోహదపడగలవో కూడా చర్చించనున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు, వక్తల పేర్లను రాబోయే నెలల్లో ప్రకటించనున్నారు.

***

 


(రిలీజ్ ఐడి: 2330673) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , हिन्दी , Gujarati , Tamil