ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని బనస్కాంతలో రూ.14,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, పలు ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

వ‌్యవసాయం, డెయిరీ నుంచి మౌలిక వసతులు, అనుసంధానత వరకు అభివృద్ధిలో కీలక ఘట్టాలను చేరుకుంటున్న బనస్కాంత: పీఎం

వికసిత్ భారత్‌కు మన రైతన్నలు, అన్నదాతలు కీలక ఆధారం... రైతుల సంక్షేమం, సాధికారతకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం: పీఎం

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పశుసంవర్ధక రంగం కీలకం... గత దశాబ్ద కాలంగా ఈ రంగంలో, డెయిరీ రంగంలో విజ్ఞాన శాస్త్రం, సాంకేతికతను జోడించేందుకు మా ప్రాధాన్యత: పీఎం

పశుసంవర్ధక రంగాన్ని కేవలం సంప్రదాయంగా కాకుండా, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, గ్రామాల్లో సమృద్ధిని తీసుకువచ్చేందుకు బలమైన సాధనం: పీఎం

మీ సేవకే నా జీవితం అంకితం: పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 30 OCT 2026 4:11PM by PIB Hyderabad

గుజరాత్‌లోని బనస్కాంతలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రూ.14,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించి, పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. నవరాత్రుల అనంతర పవిత్రమైన అమ్మవారి గడ్డపై ప్రసంగించిన ప్రధానమంత్రి... మహిళలు, పిల్లలు, రైతులు, పశుపోషకుల కోసం పలు నూతన కార్యక్రమాలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది సన్నకారు రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా నిధులను విడుదల చేశారు.

 

వికసిత్ భారత్‌కు రైతులు, అన్నదాతలు కీలక ఆధారమని ప్రధానమంత్రి అభివర్ణించారు. రైతుల సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం నిరంతరం ప్రాధాన్యతనిస్తోందని, 2013-14తో పోలిస్తే జాతీయ వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లకు పైగా పెంచామని పేర్కొన్నారు. సన్నకారు రైతుల జీవితాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అంతర్భాగంగా మారిందన్నారు. గుజరాత్‌లో 50 లక్షలకు పైగా రైతులకు రూ. 1,000 కోట్లకుపైగా నిధులను జమ చేశామని, ఇందులో బనస్కాంతలోని లక్షలాది రైతు కుటుంబాలకు దాదాపు రూ. 50 కోట్లు అందినట్లు చెప్పారు. "నేడు దాదాపు 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లకుపైగా మొత్తం జమ అయ్యింది" అని పీఎం శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

 

గత కొన్నేళ్లుగా ప్రభుత్వ విధానాల ద్వారా రైతులకు రూ. 50 లక్షల కోట్లకుపైగా లబ్ధి చేకూరినట్లు, ఆదా అయినట్లు ప్రధానమంత్రి తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా దాదాపు రూ. 4.5 లక్షల కోట్లు బదిలీ అయినట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో సన్నకారు రైతులే 85 శాతానికి పైగా ఉన్నారని, మా ప్రభుత్వం అలాంటి చిన్న రైతులను సంరక్షించి, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అండగా నిలిచిందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితుల మధ్య ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, రైతులపై ఆ భారం పడకుండా ప్రభుత్వం వారిని కాపాడిందని ప్రధానమంత్రి తెలిపారు. "ఈ అంశంపై ప్రభుత్వం దాదాపు రూ. 16 లక్షల కోట్లు ఖర్చు చేసింది" అని పీఎం శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ఎంఎస్‌పీ హామీని ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. "గత 12 ఏళ్లలో గోధుమ, వరి రైతులు ఎంఎస్‌పీ రూపంలో రూ. 24 లక్షల కోట్లకు పైగా అందుకున్నారు" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

 

పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు బలమైన భద్రతను కల్పించినట్లు ప్రధాన తెలిపారు. గత 10 నుంచి 12 ఏళ్లలో పంటల బీమా నష్టపరిహారం ద్వారా రైతులు రూ. 2 లక్షల కోట్లకు పైగా అందుకున్నారని చెప్పారు. అదేవిధంగా పీఎం-కుసుమ్ పథకం ద్వారా సాగునీటి ఖర్చులను నిరంతరం తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా దాదాపు 12 లక్షల సోలార్ పంపులను పంపిణీ చేశామని, తద్వారా అదనపు విద్యుత్ ఉత్పత్తి కావటంతో పాటు, రైతులు 80 కోట్ల లీటర్లకుపైగా డీజిల్ కొనుగోలు చేసే ఖర్చు ఆదా అయిందని వివరించారు. ఈ అయిదు ప్రధాన పథకాలు, నిర్ణయాల వల్లే రూ. 50 లక్షల కోట్ల ఆర్థిక ప్రయోజనం, ఆదా జరిగిందన్నారు. "ఈ రూ. 50 లక్షల కోట్లు దేశంలోని రైతుల ఆదాయాన్ని పెంచటమే కాక, భారతదేశ వ్యవసాయ సామర్థ్యాన్ని బలోపేతం చేశాయి" అని పీఎం శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

 

వ్యవసాయం కేవలం సంప్రదాయమే కాక, భారతీయ సంస్కృతిలో కీలక భాగమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. గత 12 ఏళ్లలో వ్యవసాయం, పశుసంవర్ధక రంగంలో విజ్ఞానశాస్త్రం సాంకేతికతను ప్రభుత్వం విస్తృతంగా అనుసంధానించిందని తెలిపారు. రైతులు పొలాలకు ఏ రకమైన ఎరువులు, ఎంత పరిమాణంలో అవసరమో మునుపటి ఇబ్బందులను మృత్తికా ఆరోగ్య కార్డు విజయవంతంగా పరిష్కరించిందని, ఇది దేశవ్యాప్తంగా వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించిందని అన్నారు. "నేడు దేశంలోని రైతుల వద్ద 26 కోట్లకు పైగా మృత్తికా ఆరోగ్య కార్డులు ఉన్నాయి" అని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.

మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులకు సవాలుగా మారుతున్నాయని గుర్తిస్తూ, రైతులకు నూచన వాతావరణాన్ని తట్టుకునే విత్తన రకాలను అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. "ఇటీవల సంవత్సరాల్లో దాదాపు మూడు వేల నూతన రకాల విత్తనాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చాం" అని పీఎం శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

 

గ్రామీణ మహిళల భాగస్వామ్యంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పశుసంవర్ధక రంగం అత్యంత కీలకమైన భాగమని ప్రధానమంత్రి తెలిపారు. గత దశాబ్ద కాలంలో డెయిరీ, పశుసంవర్ధక రంగంలో శాస్త్ర, సాంకేతికతను జోడించామని చెప్పారు. అత్యుత్తమ పశువుల జాతులు పాల ఉత్పత్తిని పెంచుతాయని, సకాలంలో టీకాలు, వైద్య చికిత్స వంటివి వ్యాధుల ద్వారా జరిగే నష్టాలను అరికడతాయని వివరించారు. "పశువు ఆరోగ్యంగా ఉంటే, పశుపోషక సోదరీసోదరులకు ఆదాయం కూడా పెరుగుతుంది" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

స్వదేశీ పశువుల సంరక్షణ, శాస్త్రీయ పెంపకాన్ని ప్రోత్సహించటంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పాత్రను ప్రధానమంత్రి కొనియాడారు. బనస్కాంతలో నిర్మించిన పరిశోధనా కేంద్రం... గిర్, సాహివాల్, కాంక్రేజ్ వంటి స్వదేశీ ఆవుల జాతులతో పాటు మెహసానా, ముర్రా, జాఫరాబాది వంటి గేదె జాతులను సంరక్షించి, వాటి నాణ్యతను మెరుగుపరచటంలో ఈ మిషన్‌ను మరింత బలపరుస్తుందని, కాంక్రేజ్ జాతికి దేశంలోనే ఇది తొలి కేంద్రం అవుతుందని తెలిపారు. తక్కువ ఖర్చుతో అధిక పాల దిగుబడినిచ్చే, ఆరోగ్యకరమైన ఆవు లక్షణాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఐవీఎఫ్ ద్వారా భవిష్యత్ తరాలకు సులభంగా అందించవచ్చని అన్నారు. "దీని ద్వారా పశుపోషక రైతు నేరుగా ప్రయోజనం పొందుతాడు" అని పీఎం శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

గాలికుంటు వ్యాధి వంటి రుగ్మతల నుంచి పశువులను రక్షించటం ప్రాధాన్యత గల అంశమని ప్రధానమంత్రి అన్నారు. ఇటువంటి వ్యాధులు పశువుల ఆరోగ్యాన్ని, పాల ఉత్పత్తిని దెబ్బతీస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్‌ను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఇప్పటివరకు దాదాపు 150 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగిందని, 8 కోట్లకు పైగా రైతుల పశువులకు ఉచితంగా టీకాలు అందాయని తెలిపారు. "ఇది పశుపోషక రైతులపై ఆర్థిక భారాన్ని కూడా తగ్గించింది" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

 

ఈ చర్యల ఫలితంగా డెయిరీ రంగంలో వచ్చిన మార్పులను వివరిస్తూ... 2013-14లో ఆవు, గేదె సగటు దైనందిన పాల ఉత్పత్తి 5 లీటర్ల లోపు ఉండగా, నేడు అది దాదాపు 8 లీటర్లకు పెరిగిందని ప్రధానమంత్రి తెలిపారు. దీనివల్ల ప్రపంచంలోనే అత్యంత వేగంగా పాల ఉత్పత్తిని సాధిస్తున్న దేశంగా భారత్ అవతరించి, గ్రామీణ రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందన్నారు. "పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారత్ ఉంది" అని పీఎం శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

 

పశువుల పెంపకందారులు పాలతో పాటు ఆవు పేడ ద్వారా కూడా ఆదాయం పొందేలా సహకరించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు. పేడ, వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌, బయో-సీఎన్‌జీ, సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలను బనాస్‌ డెయిరీ వంటి సంస్థల కీలక సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నేడు రెండు బయో-సీఎన్‌జీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. పశువుల ఆరోగ్యాన్ని కాపాడటం, పాల దిగుబడిని పెంచడం, పేడను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం తమ స్పష్టమైన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. “మేం పశుపోషణను కేవలం ఒక సంప్రదాయంగా కాకుండా, రైతుల ఆదాయాన్ని పెంచి గ్రామాలను సుసంపన్నం చేసే శక్తిమంతమైన సాధనంగా తీర్చిదిద్దుతున్నాం” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధించేందుకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం సమగ్ర విధానంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి వివరించారు. మత్స్య రంగం విస్తృతంగా అభివృద్ధి చెందడం, ఆ రంగంలో సహకార సంఘాలను ప్రోత్సహించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. “భారత్‌ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయని తెలిస్తే మీరు సంతోషిస్తారు’’ అని ప్రధానమంత్రి చెప్పారు.

రైతులకు అదనపు ఆదాయం సమకూర్చే మరో ప్రధాన మార్గంగా తేనెటీగల పెంపకాన్ని ప్రధాని శ్రీ మోదీ ప్రస్తావించారు. గత 12 ఏళ్లలో తేనె ఉత్పత్తి రెట్టింపైందని తెలిపారు. ఈ ‘మధుక్రాంతి’ని ముందుకు తీసుకెళ్లడంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు పెరుగుతున్న భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు. “సహజ తేనె ఎగుమతుల్లో మన దేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించిందని తెలిస్తే మీరు గర్వపడతారు’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

అక్టోబర్‌ 7, 2001న తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అక్టోబర్‌ 7న ప్రభుత్వ అధిపతిగా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్న విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక ఫైళ్ల గురించి తనకు ఏమాత్రం అవగాహన లేని సమయంలో ప్రతి గుజరాతీ నుంచి అపారమైన ప్రేమ, మార్గదర్శకత్వం లభించాయని ప్రధాని ప్రస్తావించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు, గ్రామ సర్పంచ్‌ కావాలని కూడా కలలు కనని కుటుంబానికి చెందిన వ్యక్తిగా.. తొలుత గుజరాత్‌కు, ఆ తర్వాత దేశానికి సేవ చేసే బాధ్యతను అప్పగించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. “ప్రేమను అందించడమే కాకుండా, ప్రతి గుజరాతీ నాకు ఎన్నో విషయాలు నేర్పించారు. సరైన మార్గంలో నడిపించారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

ప్రజాసేవ ద్వారా దేశానికి సేవ చేయడం, గుజరాత్‌ అభివృద్ధి ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడం అనే రెండు మార్గదర్శక సూత్రాలు మాత్రమే తనకు తెలుసునని, మిగతా విషయాలన్నీ ప్రజల నుంచే నేర్చుకున్నానని ప్రధానమంత్రి తెలిపారు. దేశం కోసం తాను సాధించిన ప్రతి విజయానికి ప్రజలే కారణమని ఆయన చెప్పారు. “ఇందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నా జీవితంలోని చివరి క్షణం వరకు మీ సేవలోనే నిమగ్నమై ఉంటాను” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

25 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని తీవ్రంగా వేధించిన నీటి ఎద్దటి, విద్యుత్‌ సమస్యను ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఆ రెండు వనరులను పొదుపుగా వినియోగించుకోవాలన్న తన విజ్ఞప్తికి ప్రజలు స్పందించి, తమ పరిస్థితులను పూర్తిగా మార్చుకున్నారని ఆయన తెలిపారు. ఒకప్పుడు ఎదుర్కొన్న ఆ కష్టాలు ఇప్పుడు కేవలం జ్ఞాపకాలకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. “ఈ రోజు కూడా మీకు అదే విషయం మరోసారి చెబుతున్నాను. మనం నీటిని ఆదా చేయాలి, విద్యుత్‌ను పొదుపు చేయాలి” అని ప్రధాని పిలుపునిచ్చారు.

 

నర్మదా జలాలు, బిందుసేద్యం వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు బనస్కాంత ప్రాంతాన్ని ఎలా మార్చివేశాయో ప్రధానమంత్రి వివరించారు. బనస్కాంత బంగాళాదుంపలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు, బనాస్‌ డెయిరీ సహకార ఉద్యమం కాశీతో పాటు ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తయారు చేసే బంగాళాదుంపల ప్రాసెసింగ్‌ కర్మాగారం సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రైతుల నుంచి మరింత ఎక్కువ మొత్తంలో బంగాళాదుంపలను సేకరించేందుకు వీలవుతుందని వివరించారు. “ఇది బంగాళాదుంపల రైతులకు అతి పెద్ద సదుపాయం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

పండ్లు, కూరగాయలు సాగు చేసే రైతుల కోసం కొనసాగుతున్న క్లస్టర్‌ అభివృద్ధి కార్యక్రమం గురించి ప్రధానమంత్రి వివరించారు. ఇందులో భాగంగా టమాటా, బంగాళాదుంప, మిరప, ద్రాక్ష, అరటి, ఉల్లి, నారింజ, దానిమ్మ, కోకో పంటలకు సంబంధించి నేడు 12 క్లస్టర్లకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. కొత్త పండ్ల తోటలు సాగు చేయడానికి, పాత తోటలను పునరుద్ధరించడానికి రైతులకు రాయితీలు అందిస్తున్నట్లు తెలిపారు. “ఉత్తర గుజరాత్‌కు మంజూరైన రెండు క్లస్టర్లు బనస్కాంత, సబర్కాంత జిల్లాల్లోని బంగాళాదుంప రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి” అని ప్రధాని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

గుజరాత్‌ అభివృద్ధి కోసం నేడు ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని ప్రస్తావించారు. అహ్మదాబాద్‌-వారణాసి సబర్మతి ఎక్స్‌ప్రెస్‌, మెహసానా-బెచరాజీ-సబర్మతి మెము రైలు అనే రెండు కొత్త రైలు సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపారు. గిఫ్ట్‌ సిటీ, విమానాశ్రయాలను అనుసంధానించే మెట్రో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు అహ్మదాబాద్‌ మెట్రోను విస్తరించే కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘అహ్మదాబాద్‌-మెహసానా రహదారిని నాలుగు వరుసల నుంచి ఎనిమిది వరుసల రహదారిగా విస్తరించబోతున్నాం’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

రాష్ట్రంలోని చిన్నారుల కోసం నేడు ప్రారంభించిన నూతన సామాజిక సంక్షేమ మౌలిక సదుపాయాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. గుజరాత్‌ వ్యాప్తంగా 4,000కు పైగా ఆధునిక అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. “దీని వల్ల సుమారు 4 లక్షల మంది చిన్నారులు, గర్భిణీలకు ప్రయోజనం చేకూరుతుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

ప్రతి రైతు, యువకుడు, సోదరి, కుమార్తె వికసిత్‌ భారత్‌ సంకల్పంతో ముందుకు సాగుతున్నప్పుడు, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. దురదృష్టవశాత్తూ కొందరికి ఈ పురోగతి నచ్చడం లేదని, దేశం కష్టాల్లో పడాలని వారు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. “దేశానికి సంక్షోభాలు ఎదురైనప్పుడు వారు సంతోషిస్తారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

ఇరాన్‌, గల్ఫ్‌ దేశాల చుట్టుపక్కల కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులను ఇటీవలి ఉదాహరణగా ప్రస్తావించిన ప్రధానమంత్రి.. ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్‌ ఐక్యంగా నిలిచిందని తెలిపారు. అయితే.. కొందరు ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ రైతుల్లో, గ్యాస్‌ సరఫరాపై మహిళల్లో భయాందోళనలు కలిగించేలా పుకార్లు వ్యాప్తి చేశారని అన్నారు. తనకు చెడ్డపేరు తీసుకురావాలనే ఉద్దేశంతో దేశంలో గందరగోళం సృష్టించడమే వారి పథకమని చెప్పారు. ‘‘భారత్‌ ఐక్యంగా ఈ పరిస్థితిని ఎదుర్కొనే ప్రయత్నంలో ఉన్నప్పుడు, ఈ వ్యక్తులు మాత్రం పుకార్లు వ్యాప్తి చేస్తూనే ఉన్నారు” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

 

రైతులకు అండగా నిలుస్తానని తాను ఇచ్చిన హామీని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ వ్యవసాయానికి అవసరమైన ఉత్పాదకాల కొరత ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.

 

యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, ముడి రసాయనాల ధరలు భారీగా పెరిగాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆ భారం భారతీయ రైతులపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.3,000 ధర పలుకుతున్న యూరియా బస్తాను భారత్‌లో రూ.300 కంటే తక్కువ ధరకే అందిస్తున్నామని, ప్రపంచ మార్కెట్‌లో రూ.5,000కు పైగా ధర ఉన్న డీఏపీ బస్తాను కేవలం రూ.1,350కే సరఫరా చేస్తున్నామని తెలిపారు. “మన రైతులు సాధికారత సాధించి, వారి జీవితం మరింత మెరుగుపడాలనే ఉద్దేశంతో దేశం ఈ సహాయాన్ని అందిస్తోంది” అని శ్రీ మోదీ చెప్పారు స్పష్టం చేశారు.

భారత్‌ వేగవంతమైన అభివృద్ధి అనిశ్చితితో ఉన్న ప్రపంచానికి కొత్త ఆశను అందిస్తోందని.. ఇందుకోసం ‘ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ భారత్‌’ మార్గంలో నిరంతరం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అక్టోబర్‌ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకోనున్నామని, ఈ సందర్భంగా ఐక్యతా స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ‘రన్‌ ఫర్‌ యూనిటీ’ నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. “రేపు ఉదయం జరిగే రన్‌ ఫర్‌ యూనిటీలో దేశ ప్రజలందరూ, ముఖ్యంగా నా యువ మిత్రులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరుతున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

 

అక్టోబర్‌ 31న ఏక్తా నగర్‌లో జరిగే వార్షిక ఐక్యతా ఉత్సవాల షెడ్యూల్‌లో మార్పును ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ ఏడాది వేడుకలు రేపు సాయంత్రం 5.30 గంటలకు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు, భద్రతా బలగాల కవాతులు, శకటాల ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, కచ్‌ నుంచి కామాఖ్య వరకు ఉన్న ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని సర్దార్‌ పటేల్‌కు నివాళులర్పించాలని, ‘ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ భారత్‌’ సంకల్పాన్ని మరోసారి చాటాలని ఆయన కోరారు. “ఈ విజ్ఞప్తితో పాటు, అభివృద్ధి కార్యక్రమాల కోసం మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. 

****


(రిలీజ్ ఐడి: 2330665) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam