సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెన్షన్లు, పెన్షనర్ల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నవంబర్ 1 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా అయిదో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచార కార్యక్రమం

దేశవ్యాప్తంగా 2,000 జిల్లాలు, నగరాల్లో శిబిరాల నిర్వహణ.. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద డీఎల్‌సీ ప్రచార కార్యక్రమం

ముఖ గుర్తింపు ధ్రువీకరణ సాంకేతికతతో పెన్షనర్ల డిజిటల్‌ సాధికారతకు ప్రోత్సాహం

2.30 కోట్ల డీఎల్‌సీ లక్ష్య సాధనకు సంపూర్ణ స్థాయి విధానం.. వీటిలో 1.50 కోట్లు ముఖ గుర్తింపు ధ్రువీకరణ ద్వారా జారీ చేయాలని లక్ష్యం

ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్న 19 బ్యాంకులు, 785 జిల్లా పోస్టాఫీసులు, 56 సంక్షేమ సంఘాలు, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ, యూఐడీఏఐ బృందాలు, సీజీడీఏ, రైల్వేలు, టెలికాం శాఖ, ఈపీఎఫ్ఓ, రాష్ట్ర ప్రభుత్వాలు

నాడు పోస్టు చేయడమైనది: 30 OCT 2026 1:35PM by PIB Hyderabad

పింఛను, పింఛనుదారుల సంక్షేమ శాఖ (డీఓపీపీడబ్ల్యూ) ఆధ్వర్యంలో 2026 నవంబర్‌ 1 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 2,000 నగరాలు, జిల్లాల్లో అయిదో డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ (డీఎల్‌సీ) ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను 2026 ఆగస్టు 13న జారీ చేసిన కార్యాలయ మెమోరాండం (ఓఎం) ద్వారా శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు నిర్వహించిన వాటిలో ఇదే అతిపెద్ద డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ ప్రచార కార్యక్రమం కానుంది.

దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పెన్షనర్లను సైతం చేరుకోవాలనే లక్ష్యంతో పెన్షన్లు చెల్లించే బ్యాంకులు, ఇండియా పోస్టు పేమెంట్స్‌ బ్యాంకు, పెన్షనర్ల సంక్షేమ సంఘాలు, సీజీడీఏ, టెలికమ్యూనికేషన్స్‌ శాఖ, రైల్వేలు, ఈపీఎఫ్ఓ, రాష్ట్ర ప్రభుత్వాలు, యుఐడీఏఐ, ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ సమన్వయంతో ప్రభుత్వంలోని అన్ని విభాగాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో ప్రధానంగా ముఖ గుర్తింపు ధ్రువీకరణ సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించనున్నారు. ఎలక్ట్రానిక్స్,సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, యుఏడీఏఐ ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందించనున్నాయి. డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు ముఖ గుర్తింపు ధ్రువీకరణ సులభమైన, వేగవంతమైన విధానం. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌ మొబైళ్లలోనూ దీనిని ఉపయోగించవచ్చు. దీంతో వృద్ధులైన పెన్షనర్లకు ఈ ప్రక్రియ మరింత సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ ప్రచార కార్యక్రమానికి ఆడియో, వీడియో, ప్రింట్ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించేందుకు దూరదర్శన్‌(డీడీ), ఆల్‌ ఇండియా రేడియో(ఏఐఆర్), ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) బృందాలు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ప్రచారంపై అవగాహన కల్పించేందుకు ఎస్‌ఎంఎస్‌లు, ట్వీట్లు (#DLCCampaign5), జింగిల్స్‌, లఘు చిత్రాల ద్వారా కూడా ప్రచారాన్ని విస్తృతం చేయనున్నారు.

ఈ ప్రచార కార్యక్రమాన్ని ‘ఉత్సవ్‌’ తరహాలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆరోగ్య పరీక్షలు, పెన్షనర్ల ఆధార్‌ వివరాల నవీకరణ వంటి పలు సేవలను అందిస్తారు. అవసరమైన చోట పెన్షనర్లకు వారి ఇంటి వద్దకే సేవలు అందించనున్నారు. డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్లకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార అధికారులు తక్షణ పరిష్కార విధానంతో పనిచేయనున్నారు.

పెన్షన్లు, పెన్షనర్ల సంక్షేమ శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడంతోపాటు, గుర్తించిన రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహించనున్నారు. పెన్షనర్లు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో భాగస్వామ్య సంస్థలు భారీ శిబిరాలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ శిబిరాలకు డిఓపిపిడబ్ల్యు సీనియర్‌ అధికారులు హాజరుకానున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2330407) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Tamil , Kannada