నాడు పోస్టు చేయడమైనది:
29 OCT 2026 3:55PM by PIB Hyderabad
భారత పారిశ్రామిక రంగంలో పరివర్తనకు నాణ్యత, భారీ స్థాయిలో ఉత్పత్తి, ప్రపంచ మార్కెట్లలో ప్రవేశం, సమ్మిళిత వృద్ధి కీలకమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు రంగం, విద్యాసంస్థల మధ్య సహకారం ద్వారా ఆవిష్కరణలు సాధ్యమవుతాయని తెలిపారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్టడీస్ ఇనిస్టిట్యూట్ (ఐఎస్ఐడీ), ఐడీఆర్‌ఏ సంయుక్తంగా నిర్వహించిన నాలుగో జాతీయ పారిశ్రామిక పరివర్తన సదస్సులో కేంద్రమంత్రి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తయారీ రంగ దేశంగా భారత్ ఎదగాలని పిలుపునిచ్చారు.
భారత పారిశ్రామిక రంగంలో వేగవంతమైన మార్పులకు నాణ్యత, ప్రపంచ మార్కెట్లలో ప్రవేశం, భారీ స్థాయిలో ఉత్పత్తి, సమ్మిళిత వృద్ధి అనే నాలుగు అంశాలు కీలకమని శ్రీ పీయూష్ గోయల్ వివరించారు. నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్న ‘జీరో డిఫెక్ట్.. జీరో ఎఫెక్ట్’ విధానాన్ని గుర్తుచేశారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో, భారత్ తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని, అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉనికిని విస్తరించాలని, ప్రాధాన్య వాణిజ్య అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.140 కోట్ల జనాభా కలిగిన దేశీయ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశం లభించడం వల్ల తయారీదారులు తక్కువ ధరలకు ఉత్పత్తులను అందించడంతోపాటు పోటీతత్వంతో కూడిన ఉత్పత్తి వ్యయాలను సాధించగలరని ఆయన తెలిపారు. దేశంలోని ప్రజలందరికీ విస్తృత ప్రయోజనాలు చేకూరేలా సుస్థిరమైన, సమ్మిళిత వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
2047 నాటికి వికసిత్ భారత్ దార్శనికత 140 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి సంకల్పమని కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. ఈ లక్ష్య సాధనకు ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ప్రస్తుత పరిస్థితులను వాస్తవికంగా అంచనా వేసుకోవాలని, భవిష్యత్తు కోసం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. తరతరాల మధ్య సహకారం ప్రాముఖ్యతను వివరిస్తూ, సమకాలీన సవాళ్లను పరిష్కరించేందుకు సీనియర్ నిపుణుల అనుభవం, యువతలోని ఉత్సాహం కలిసిరావాలని ఆయన అన్నారు. విభిన్న విభాగాలు విడివిడిగా పనిచేయడం కాకుండా, సమష్టిగా కృషి చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
భారత్ అనుసరిస్తున్న వాణిజ్య విధానంపై శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఇతర దేశాలతో భారత్ కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందాలు కేవలం దిగుమతి సుంకాలను తగ్గించడం, వస్తువుల మూల దేశాన్ని నిర్ధారించే నిబంధనలు రూపొందించడం, మార్కెట్లలో ప్రవేశం పొందడం వంటి అంశాలకే పరిమితం కావని తెలిపారు. భారత్‌కు పోటీ సామర్థ్యం ఉన్న రంగాలను గుర్తించడం, ఎగుమతులకు కొత్త అవకాశాలను కల్పించడం, కీలక రంగాల ప్రయోజనాలను కాపాడటం ఈ ఒప్పందాల్లో భాగమని వివరించారు. దేశ అభివృద్ధికి అవసరమైన అధునాతన సాంకేతిక ఉత్పత్తులు, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు), మెమరీ సాంకేతికత, వైద్య సాంకేతిక పరికరాలు తదితర వస్తువులను పొందేందుకు కూడా ఈ ఒప్పందాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
భారత్ చేపడుతున్న వాణిజ్య చర్చల్లో సేవారంగం, పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక భాగస్వామ్యాలు, వాతావరణ లక్ష్యాల సాధనకు సహకారం వంటి అంశాలు కూడా ఉంటాయని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. వాతావరణ మార్పులపై ప్రతి దేశం నిర్దేశించుకున్న జాతీయ లక్ష్యాల సాధనకు పరస్పర సహకారానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఒప్పందాలను ఖరారు చేయడానికి ముందే వివిధ రంగాల భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వివరించారు. దేశానికి సంబంధించిన కీలక ప్రయోజనాలు, సున్నితమైన రంగాలు, రక్షణాత్మక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఒప్పందాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా దేశ ప్రయోజనాలను కాపాడుతూనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత్ అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలను ప్రస్తావిస్తూ.. ఒప్పందానికి సంబంధించిన వివరాలు వెల్లడైనప్పుడు రైతులు, ఇతర భాగస్వాముల కీలక ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలగలేదని దేశ ప్రజలు గుర్తిస్తారని శ్రీ పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్‌కు గణనీయమైన పోటీతత్వ ప్రయోజనం లభిస్తుందని తెలిపారు.
వాణిజ్యం అనేది కేవలం సంపూర్ణ గణాంకాలపై ఆధారపడేది కాదని.. ఏ రంగంలో ఏ దేశానికి ఎక్కువ సామర్థ్యం, పోటీతత్వం ఉందనే అంశాలపై ఆధారపడి ఉంటుందని కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వివరించారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలు శ్రమ ఆధారిత ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాలు విధించేలా తమ వాణిజ్య విధానాలను రూపొందించుకున్నాయని తెలిపారు. ఈ సుంకాలను వాణిజ్య చర్చల్లో బేరసారాల సాధనాలుగా ఉపయోగిస్తున్నాయని పేర్కొన్నారు.
భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు 38 అభివృద్ధి చెందిన, సాపేక్షంగా సంపన్నమైన దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందాల ద్వారా ఇరు పక్షాలకు పరస్పర ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఆయా దేశాలకు అవసరమైన ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేయడంతోపాటు, దేశ అభివృద్ధికి అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకునే అవకాశం లభిస్తుందని వివరించారు. ఇరు పక్షాలకు ప్రయోజనం చేకూర్చే ఈ భాగస్వామ్యాలు న్యాయబద్ధంగా, సమానంగా, సమతుల్యంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ద్వారా మొత్తం 60 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కలిగిన ఆర్థిక వ్యవస్థల్లో ప్రాధాన్య వాణిజ్య అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. 2014కు ముందు కుదుర్చుకున్న ఒప్పందాల పరిధిలోని ఆర్థిక వ్యవస్థల మొత్తం జీడీపీ 10 ట్రిలియన్ డాలర్లు మాత్రమేనని పేర్కొన్నారు. గతంలో కుదిరిన ఒప్పందాలు ప్రధానంగా భారత్‌తో పోటీపడే దేశాలతో ఉండేవని, ప్రస్తుత విధానం మాత్రం పరస్పర అవసరాలు, ఆర్థిక సంబంధాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.
భారతీయ ప్రతిభ, నైపుణ్యాలకు అంతర్జాతీయంగా గుర్తింపు పెరుగుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భారత్–జర్మనీ వలస ఒప్పందం, ఏటా 90 వేల మంది భారతీయుల అవసరంపై జర్మనీ విదేశాంగ మంత్రితో జరిగిన సంభాషణను ఆయన గుర్తుచేసుకున్నారు. జర్మనీకి అంతకంటే ఎక్కువ సంఖ్యలో భారతీయ ప్రతిభావంతుల అవసరం ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి తనతో చెప్పినట్లు తెలిపారు. ఫార్చ్యూన్ 500 జాబితాలోని ప్రముఖ కంపెనీల్లో ఉన్నత పదవుల్లో భారతీయ నిపుణులు పనిచేస్తుండటం, అత్యాధునిక సాంకేతిక అభివృద్ధిలో భాగస్వాములవుతుండటం భారతీయ శ్రామిక శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
భారతీయ ప్రజల్లోని ప్రతిభ, నైపుణ్యాలు, ఉత్సాహం కారణంగా రానున్న మరో 20 నుంచి 25 ఏళ్ల పాటు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని శ్రీ పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
వాతావరణ మార్పులపై చర్యలు తీసుకునేటప్పుడు ‘కాలుష్యం కలిగించిన వారే దాని పరిహార వ్యయాన్ని భరించాలి’ అనే సూత్రంతోపాటు, ‘ఉమ్మడి కానీ భిన్నమైన బాధ్యతలు’ అనే సూత్రాన్ని అనుసరించాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్‌లో ప్రస్తుతం ఏర్పాటు చేసిన మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 60 శాతం హరిత, పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి వస్తోందని తెలిపారు. అయినప్పటికీ దేశ ఇంధన భద్రతను కాపాడటానికి, ప్రజలకు అందుబాటు ధరల్లో విద్యుత్ సరఫరా చేయడానికి బొగ్గు కూడా అత్యవసరమని పేర్కొన్నారు.
ఇతర దేశాల్లో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రధాన దేశంగా ఉన్న భారత్.. ప్రస్తుతం స్వయంగా ఉత్పత్తులు తయారు చేసే దేశంగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతోందని కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం, వివిధ రంగాల్లో దశలవారీగా అమలు చేసిన తయారీ కార్యక్రమాల ద్వారా పరిశ్రమలు భారత్‌లో తమ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు, దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడిందని తెలిపారు. భవిష్యత్తులో దేశ అవసరాల్లో మరింత ఎక్కువ భాగాన్ని దేశీయంగానే తయారు చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
భారత పారిశ్రామిక రంగంలో పరివర్తనకు ఆవిష్కరణలు కీలకమని శ్రీ పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రధానంగా ప్రైవేటు రంగానికి సహాయకారిగా, ఆవిష్కరణలను ప్రోత్సహించే ఉత్ప్రేరకంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఐఐటీలు, ఇంజినీరింగ్ కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో అందుబాటులో ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానం, ఆవిష్కరణలు, పరిశోధనా సామర్థ్యాలను ఆయన ప్రస్తావించారు.
అంకుర సంస్థలకు నిధులు సమకూర్చేందుకు ఏర్పాటు చేసిన ‘స్టార్టప్ ఫండ్ ఆఫ్ ఫండ్స్’ గురించి ప్రస్తావిస్తూ.. తొలి నిధిని పూర్తిగా వినియోగించామని, ప్రస్తుతం రెండో నిధి కూడా అందుబాటులోకి వచ్చిందని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. భారత్‌లో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల నిధి (ఆర్డీఐఎఫ్) గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమాలు దేశంలో అంకుర సంస్థల వ్యవస్థ అభివృద్ధికి దోహదపడ్డాయని, ఫలితంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్ ఎదిగిందని పేర్కొన్నారు.
అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ 8.4 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉందని, 2033 నాటికి అది 44 బిలియన్ డాలర్లకు చేరుకునే సామర్థ్యం ఉందని తెలిపారు. అంతరిక్షం, కృత్రిమ మేధ, కంప్యూటింగ్, స్టార్టప్ రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేసేందుకు అంతర్జాతీయ భాగస్వాములు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.
ఇటీవల జర్మనీలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అక్కడ కొన్ని పరిశోధనా సంస్థల్లో 12 వేల నుంచి 30 వేల మంది వరకు పనిచేస్తున్నారని, ఆ సంస్థలు ప్రైవేటు రంగంతో సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయని శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. భారత్‌తో కలిసి పరిశోధనలు, ఇతర కార్యక్రమాలు చేపట్టేందుకు అవి ఆసక్తి వ్యక్తం చేశాయని చెప్పారు. భారత్–జర్మనీ భాగస్వామ్యంపై ఉన్న విశ్వాసం, ప్రతిభ, నైపుణ్యాలు, న్యాయబద్ధమైన వ్యవహారశైలి, సమాన అవకాశాల విషయంలో భారత్‌పై ఉన్న నమ్మకం ఈ ఆసక్తికి కారణమని ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కొత్త వాణిజ్య ఒప్పందాలు, అంతర్జాతీయ సంబంధాల అభివృద్ధి ద్వారా ఉమ్మడి పరిశోధనలు, సాంకేతిక అభివృద్ధి, పారిశ్రామిక సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. దేశీయ సామర్థ్యాలను అంతర్జాతీయ నైపుణ్యం, పెట్టుబడులతో సమన్వయం చేయడం ద్వారా భారత్ వృద్ధి ప్రస్థానాన్ని ఈ భాగస్వామ్యాలు కొత్త దిశలోకి తీసుకెళ్లగలవని అన్నారు.
భారత పారిశ్రామిక రంగ భవిష్యత్తుపై మూడు రోజుల పాటు చర్చలను నిర్వహించినందుకు ఐఎస్ఐడీని శ్రీ పీయూష్ గోయల్ అభినందించారు. నాణ్యత, ప్రపంచ మార్కెట్లకు అందుబాటు, భారీ స్థాయి ఉత్పత్తి ద్వారా కలిగే ప్రయోజనాలు, సమ్మిళిత వృద్ధిపై నిరంతర దృష్టి సారించడంతోపాటు, తయారీ, ఆవిష్కరణలు, పరిశోధన రంగాల మధ్య సహకారం భారత పారిశ్రామిక పరివర్తనకు కీలకమని ఆయన తెలిపారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు తమ వంతు కృషి చేస్తున్న సదస్సు నిర్వాహకులు, పాల్గొన్న ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.
***