నాడు పోస్టు చేయడమైనది:
29 OCT 2026 6:46PM by PIB Hyderabad
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) 24వ విడత నిధులను రేపు (30 అక్టోబర్ 2026న) గుజరాత్‌లోని బనస్కాంతలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.34 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 18,690 కోట్లకు పైగా సొమ్ము నేరుగా జమ కానుంది. ఇది రైతుల సంక్షేమం, వారి ఆర్థిక సాధికారత పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న గట్టి నిబద్ధతను తెలియజేస్తోంది.
రైతుల ఆదాయ మార్గాలను మెరుగుపరచడం.. వ్యవసాయ నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలను పెంచేందుకు 'వ్యవసాయ మౌలిక వసతుల నిధి' (ఏఐఎఫ్) కింద ఏర్పాటుచేసిన 521 ప్రాజెక్ట్ యూనిట్లను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. అధిక లాభదాయకమైన ఉద్యానవన పంటలను ప్రోత్సహించడానికి, రైతుల ఆదాయ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన 12 ఉద్యానవన క్లస్టర్లను ప్రారంభించనున్నారు.
మధ్యప్రదేశ్‌లోని రైసేన్ వేదికగా జరిగే పీఎం-కిసాన్ 24వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొంటారు. పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొననున్న ఈ కార్యక్రమం పీఎం-కిసాన్, మంత్రిత్వ శాఖ చేపట్టిన ఇతర కీలక ప్రాజెక్టుల ప్రాముఖ్యతను ప్రముఖంగా వివరించడానికి.. రైతుల సంక్షేమం, సమృద్ధి, సాధికారత పట్ల ప్రభుత్వ నిరంతర నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది.
పీఎం-కిసాన్ పథకంలో ఇంతవరకు 23 విడతల ద్వారా అర్హులైన రైతులకు రూ. 4.47 లక్షల కోట్లకు పైగా నిధులు అందాయి. ఈ పథకం అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఆర్థిక చేయూతనిస్తూ వారి వ్యవసా, గృహావసరాలను తీర్చుకోవడానికి.. జీవనోపాధి భద్రతకు తోడ్పడుతోంది.
కోట్లాది మంది రైతుల జీవనోపాధికి ఆధారంగా నిలుస్తూ దేశ ఆహార, పోషకాహార భద్రతను నిర్ధారిస్తున్న వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో వ్యవసాయ రంగంలో స్వయంసమృద్ధి లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం గత 12 ఏళ్లలో అనేక కీలక కార్యక్రమాలను చేపట్టింది.
వీటిలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్), ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ), కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ వంటివి అత్యంత కీలకమైనవి. రైతుల సమగ్ర సాధికారత కోసం ఆర్థిక సహాయం అందించడం, పంట నష్ట భయాన్ని తగ్గించడం, వ్యవసాయ రుణ సదుపాయాన్ని సులభతరం చేయడం, సాంకేతిక ఆధారిత వ్యవసాయ యాజమాన్య పద్ధతులను ప్రోత్సహించటమే ప్రధాన లక్ష్యాలుగా ఈ కార్యక్రమాలు చేపట్టారు.
జాతీయ వంటనూనెల మిషన్, పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగంలో స్వయంసమృద్ధిని ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్తోంది. జాతీయ సహజ సేద్య మిషన్.. దేశవ్యాప్తంగా క్లస్టర్లను అభివృద్ధి చేయడం ద్వారా నిలకడైన సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహిస్తోంది.
రైతుల ఆదాయాలను పెంచడంలో పంట కోత అనంతర యాజమాన్యం, వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం.. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్-అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) ద్వారా నిల్వ కేంద్రాలు, శీతలీకరణ నిల్వ సదుపాయాలు, ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలు, ఇతర అత్యవసర మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. ఏఐఎఫ్ కింద దేశవ్యాప్తంగా 2.28 లక్షలకు పైగా ప్రాజెక్టుల పరిధిలో దాదాపు రూ. 1.75 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఈ పెట్టుబడులు నిల్వ, ప్రాసెసింగ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి.. పంట కోత అనంతర నష్టాలను తగ్గించడానికి, మార్కెట్ అనుసంధానాన్ని పెంచడానికి, రైతులకు తమ ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించేలా చేయడానికి తోడ్పడతాయని భావిస్తున్నారు.
రైతులకు ఆదాయ అవకాశాలను పెంచడానికి, వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి ప్రభుత్వం అధిక విలువ కలిగిన ఉద్యానవన పంటల వైపు వైవిధ్యీకరణను ప్రోత్సహిస్తోంది. ఉద్యానవన విలువ గొలుసును బలోపేతం చేయడానికి, అధిక విలువ కలిగిన పంటల ఉత్పత్తి- మార్కెటింగ్‌లను ప్రోత్సహించడానికి ఉద్యానవన క్లస్టర్ల అభివృద్ధి ఒక ముఖ్యమైన అడుగు.
ఈ వినూత్న కార్యక్రమాలు రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి, వ్యవసాయ మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడానికి, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడానికి.. 'వికసిత్ భారత్' సాధన దిశగా సమృద్ధి, స్థిరత్వం, స్వయంసమృద్ధి కలిగిన వ్యవసాయ రంగాన్ని నిర్మించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్తాయి.
***