ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అక్టోబర్ 30, 31 తేదీల్లో గుజరాత్‌లో పీఎం పర్యటన


బనస్కాంతలో రూ.14,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేయనున్న ప్రధాని

పీఎం–కిసాన్ 24వ విడత కింద సుమారు రూ.19,000 కోట్ల నిధులను విడుదల చేయనున్న ప్రధాని


బనస్కాంతలో భారత్ బొవిన్ బ్రీడింగ్ అండ్ రీసెర్చి సెంటర్‌ను జాతికి అంకితం చేయనున్న పీఎం

అహ్మదాబాద్ మెట్రో ఫేజ్–2ఏ (ఎయిర్పోర్టు ఎక్స్‌టెన్షన్), ఫేజ్–2బీ (గిఫ్ట్ సిటీ ఎక్స్‌టెన్షన్)కు శంకుస్థాపన చేయనున్న పీఎం

ఏక్తానగర్‌లో భారత్ పర్వ్ ‌ను ప్రారంభించి, ఏక్తా ప్రకాశ్ పర్వ్ కార్యక్రమాన్ని వీక్షించనున్న పీఎం

సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల్లో పాల్గొననున్న ప్రధానమంత్రి

వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భద్రతాబలగాలు సాధించిన విజయాలకు ఈ ఏడాది నిర్వహించే కవాతులో ప్రాధాన్యం

రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకల ప్రధాన ఇతివృత్తం ‘వందేమాతరం’

ఏక్తా నగర్‌లో రూ.400 కోట్లకు పైగా విలువైన విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్న పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 29 OCT 2026 2:56PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 అక్టోబర్ 30, 31 తేదీల్లో గుజరాత్‌లో పర్యటిస్తారు.

అక్టోబర్ 30 ఉదయం 9:30 గం.లకు బనస్కాంతలో ఎంబ్రియో ట్రాన్సఫర్ టెక్నాలజీ–ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఈటీ–ఐవీఎఫ్) ల్యాబరేటరీని, భారత్ బొవిన్ బ్రీడింగ్ అండ్ రీసెర్చి సెంటర్ (బీబీబీఆర్‌సీ)ను ప్రధానమంత్రి సందర్శిస్తారు. ఉదయం 10:30 గంటలకు బనస్కాంతలో రూ.14,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. జాతికి అంకితమిస్తారు. అలాగే పీఎం–కిసాన్ 24వ విడతలో సుమారుగా రూ.19,000 కోట్ల నిధులను కూడా విడుదల చేస్తారు. రెండు రైలు సర్వీసులను ప్రారంభిస్తారు. సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఆ తర్వాత కేవాడియాలోని ఏక్తానగర్‌కు ప్రధానమంత్రి బయలుదేరతారు. సాయంత్రం సుమారు 5 గం.ల ప్రాంతంలో భారత్ పర్వ్–2026ను ప్రారంభిస్తారు. సాయంత్రం 7:45 కు ఏక్తా ప్రకాశ్ పర్వ్‌ను, రాత్రి 8:15 గం.ల ప్రాంతంలో నర్మదా హారతిని వీక్షిస్తారు.

అక్టోబర్ 31న ఉదయం సుమారు 9 గం.లకు ఐక్యతా మూర్తి వద్ద ప్రధానమంత్రి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం ఉదయం సుమారు 9:15 గం.లకు ఏక్తా నగర్‌లో రూ.400 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత ఏక్తా నగర్‌లోని రెయిన్ ఫారెస్ట్, వామన వృక్ష వాటికను సందర్శిస్తారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే జాతీయ ఏక్తా దినోత్సవాల్లో సాయంత్రం 5:30 గం.లకు పాల్గొంటారు.

బనస్కాంతలో పీఎం పర్యటన

గుజరాత్‌లోని బనస్కాంతలో గల భిల్డీ వద్ద ఏర్పాటు చేసిన భారత్ బొవిన్ బ్రీడింగ్ అండ్ రీసెర్చి సెంటర్ (బీబీబీఆర్‌సీ)ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. అత్యాధునికమైన ఈ ఎక్సలెన్స్ సెంటర్ 127 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంది. పశువుల జననాన్ని, జన్యువులను మెరుగుపరచడాన్ని, ఆధునిక ప్రత్యుత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాలను బీబీబీఆర్‌సీ బలోపేతం చేస్తుంది. తద్వారా జాతి అభివృద్ధిని 10–20 రెట్లు వేగవంతం చేస్తుంది. ఇది దేశంలో కంక్రేజ్ పశు జాతి వృద్ధికి కృషి చేసే మొదటి కేంద్రంగా నిలుస్తుంది.

థారడ్, రాధన్‌పూర్‌ వద్ద బనాస్ డెయిరీలో రెండు బయో–సీఎన్జీ ప్లాంట్లకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటిలో ఒక ప్లాంటుకి రోజుకి 75 మెట్రిక్ టన్నుల పశువుల పేడను శుద్ధి చేసే సామర్థ్యం ఉండగా మరోదానికి 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉంది.

అహ్మదాబాద్ మెట్రో ఫేజ్–2ఏ (ఎయిర్పోర్ట్  ఎక్స్‌టెన్షన్), ఫేజ్–2బీ (గిఫ్ట్ సిటీ ఎక్స్‌టెన్షన్)కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. కోటేశ్వర్ రోడ్డు నుంచి విమానాశ్రయం వరకు 6 కిలోమీటర్లకు పైగా సాగే ఫేజ్-2ఏ పరిధిలో అయిదు స్టేషన్లు, గిఫ్ట్ సిటీ నుంచి షాహ్‌పూర్ వరకు 3.3 కిలోమీటర్లకు పైగా సాగే ఫేజ్-2బీ పరిధిలో మూడు స్టేషన్లు ఉంటాయి.

అహ్మదాబాద్–మెహసానా రోడ్డు (రాష్ట్ర రహదారి–41)ను నాలుగు వరసల నుంచి ఎనిమిది వరసలకు పెంచే పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ పనులను సుమారుగా రూ.2,600 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు అహ్మదాబాద్, ఉత్తర గుజరాత్ మధ్య ప్రయాణాన్ని వేగవంతంగా, సురక్షితంగా, మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది.

గుజరాత్‌లో 4,030 కొత్త అంగన్వాడీ కేంద్రాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. నిర్మాణం పూర్తయిన 361 అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభిస్తారు. రూ.800 కోట్ల నిధులతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా 4 లక్షల మందికి పైగా ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.

వ్యవసాయ మౌలిక వసతుల నిధి పరిధిలో పూర్తయిన 521 ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం సుమారుగా రూ.4,950 కోట్లు. వీటిలో శీతల గిడ్డంగి సౌకర్యాలు, శీతల సరఫరా సౌకర్యాలు, గిడ్డంగులు, గాదెలు, పాలీహౌస్‌లు, గ్రీన్‌హౌస్‌లు, సమీకృత ప్రాథమిక, ద్వితీయ ప్రాసెసింగ్  కేంద్రాలు, ప్రాథమిక శుద్ధి కేంద్రాలు ఉన్నాయి.

మరింత విస్తరించిన బంగాళాదుంపల శుద్ధి కేంద్రాన్ని సనాదర్‌లో ప్రారంభిస్తారు. పాలన్‌పూర్‌లో అత్యధిక ఉష్ణోగ్రత (యూహెచ్‌టీ) ఉత్పత్తుల కోసం ఆటోమేటెడ్ స్టోరేజ్ అండ్ రిట్రీవల్ సిస్టమ్ (ఏఎస్ఆర్ఎస్) కార్యకలాపాలను ప్రారంభిస్తారు.

రైలు అనుసంధానాన్ని బలోపేతం చేసేలా అహ్మదాబాద్ (సబర్మతి)-వారణాసి ఎక్స్‌ప్రెస్, మెహసానా–బెచరాజీ–సబర్మతి మెము రైలు సేవలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

దేశవ్యాప్తంగా రైతులకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కొనసాగిస్తూ పీఎం–కిసాన్ 24వ విడతలో రూ.19,000 కోట్ల నిధులను ప్రధానమంత్రి విడుదల చేస్తారు. ఆమోదించిన 12 ఉద్యానవన క్లస్టర్ల పరిధిలో క్షేత్రస్థాయి కార్యకలాపాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. సుమారుగా 1.46 లక్షల హెక్టార్ల భూమి వీటి పరిధిలోకి వస్తుంది. అలాగే 1.3 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఉత్తర గుజరాత్‌లోని రెండు క్లస్టర్లు బంగాళాదుంపలపై దృష్టి సారిస్తాయి.

ఏక్తానగర్‌లో పీఎం పర్యటన

రాష్ట్రీయ ఏక్తా దివస్ ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 30న భారత్ పర్వ్–2026ను ప్రధానమంత్రి ఏక్తానగర్లో ప్రారంభిస్తారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి, జాతీయ సమైక్యతకు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి ప్రతీకగా ఈ ఉత్సవం నిలుస్తుంది. ఇది దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తమ విశిష్ట సంప్రదాయాలు, జానపద ప్రదర్శనలు, ప్రాంతీయ వంటకాలు, హస్తకళలు, పర్యాటక ప్రదేశాల గురించి తెలియజేసే వేదికను అందిస్తుంది. ఈ ఉత్సవం ఏక్తానగర్, దాని పరిసర ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది 2026 నవంబర్ 15 వరకు కొనసాగుతుంది. 

భారతదేశ సమైక్యతను, వైవిధ్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రగతిని చాటిచెప్పే వెలుగుల ఉత్సవం ఏక్తా ప్రకాశ్ పర్వ్‌ను ప్రధానమంత్రి వీక్షిస్తారు. థిమాటిక్ ఇల్యూమినేషన్, లైటింగ్ డిస్‌ప్లేల ద్వారా ఏక్తానగర్‌లో నైట్ టూరిజంను ఈ ఉత్సవం ప్రోత్సహిస్తుంది. దీనికి రెండు ప్రధాన ఆకర్షణలు ఉన్నాయి. మొదటిది ‘‘ప్రాచీన భారతదేశం నుంచి ఆధునిక భారతదేశం వరకు’’ అనే ఇతివృత్తంతో తీర్చిదిద్దిన 530 మీటర్ల పొడవైన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ రోడ్. ఇది దీపాలంకరణ, భారతదేశ జాతీయ గుర్తింపు, నాగరికత, మహిళా సాధికారత, భద్రతా దళాలు, సాంకేతిక పరిజ్ఞానం, యోగా, బాలల కోసం ఊహజనిత ప్రపంచాన్ని ప్రదర్శిస్తుంది. రెండోది ‘‘భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం’’ ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన 180 మీటర్ల పొడవైన గ్లో టన్నెల్. ఇది భారతదేశంలోని నాలుగు ప్రాంతాల సంస్కృతులు, శిల్పకళ, జానపద నృత్యాలు, హస్తకళలు, జీవనశైలిని ప్రదర్శిస్తుంది. వీటిలో 1.5 కోట్లకు పైగా ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు రూపొందించిన కళారూపాలు ఉన్నాయి.

ఏక్తానగర్‌లో రూ. 400 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అక్టోబర్ 31న ప్రధానమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో మురుగు నీరు, నీటి శుద్ధి కేంద్రం, ఫసాడ్ లైటింగ్, నర్మదా ఘాటు మెరుగుదల, ఐఆర్‌సీటీసీ హోటల్ ఏక్తానగర్‌లోని రెయిన్ ఫారెస్ట్, యూనిటీ అండ్ ఎకో ట్రెయిల్, తదితరమైనవి ఉన్నాయి. గోరా–భంద్రా రోడ్డు అభివృద్ధి, సమీకృత వ్యర్థరహిత స్మార్ట్ ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్ట్, ఖల్వానీ ఎకో టూరిజం అభివృద్ధి, కాక్టస్ అండ్ బటర్‌ఫ్లై గార్డెన్ సమగ్రాభివృద్ధితో సహా వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 

సర్దార్ వల్లభభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా 2026 అక్టోబర్ 31న నిర్వహించే రాష్ట్రీయ ఏక్తా దివస్ ఉత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), రాష్ట్ర పోలీసు బలగాలు, కేంద్ర పోలీసు సంస్థల క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యం, ధైర్యం, అంకితభావాన్ని ఏక్తా పరేడ్ ప్రదర్శిస్తుంది. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భద్రతా బలగాలు సాధించిన విజయాలకు, అలాగే గతంలో ప్రభావితమైన ప్రాంతాల్లో శాంతి, భద్రత, అభివృద్ధి దిశగా సాధించిన పరివర్తనకు ఈ ఏడాది కవాతు ప్రత్యేక ప్రాధాన్యమిస్తుంది.

నక్సల్ ముక్త భారత్ కార్యక్రమంపై వామపక్ష తీవ్రవాదం వల్ల ప్రభావితమైన 126 జిల్లాలకు చెందిన సుమారు 2,000 మంది కళాకారులతో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) నిర్వహించే ప్రత్యేక నాటక ప్రదర్శన ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆయా ప్రాంతాల్లో సమాజాలు ఎదుర్కొన్న సవాళ్లను, శాంతి, భద్రత, అభివృద్ధి దిశగా వారు సాగించిన ప్రయాణాన్ని ఈ నాటకాల ద్వారా కళాకారులు ప్రదర్శిస్తారు.

వందేమాతరం ఇతివృత్తంగా శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. ఇవి దేశభక్తిని, జాతీయ గర్వాన్ని, సామూహిక ఐక్యతను ప్రదర్శిస్తాయి. ప్రజల ఆకాంక్షలను, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సాంస్కృతిక సంపదను, ప్రజల అభివృద్ధి ప్రయాణాన్ని ఈ శకటాలు ప్రదర్శిస్తాయి. 

దేశం నలుమూలలకు చెందిన సుమారుగా 5,000 మంది కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహిస్తారు. దీనిలో వైవిధ్యమైన దేశ శాస్త్రీయ, జానపద సంప్రదాయాలు, సంగీతం, నృత్యం,  కళా వారసత్వాన్ని ప్రదర్శిస్తారు.

 

***


(రిలీజ్ ఐడి: 2330230) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Odia , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam