రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
టోల్ ప్లాజాల సమీపంలో నివసించే జాతీయ రహదారి వినియోగదారుల కోసం రాయితీతో లోకల్ పాస్‌ను ప్రవేశపెట్టిన భారత ప్రభుత్వం
• టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన వాణిజ్యేతర వాహనదారులు రాయితీ లోకల్ పాస్‌ను పొందేందుకు అవకాశం
• మున్సిపాలిటీ లేదా స్థానిక పట్టణ పరిధి వెలుపల ఉన్న టోల్ ప్లాజాలకు ఏడాదికి రూ. 1,500
• మున్సిపాలిటీ పరిధిలోని టోల్ ప్లాజాలకు ఏడాదికి రూ. 3,000
• టోల్ ప్లాజా ఉన్న ప్రదేశం ఆధారంగా రాయితీపై వార్షిక పాస్ ఫీజు వర్తింపు
నాడు పోస్టు చేయడమైనది:
27 OCT 2026 5:51PM by PIB Hyderabad
జాతీయ రహదారులపై గల టోల్ ప్లాజాలకు సమీపంలో నివసించే ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు వీలుగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన వాహనదారుల (సొంతంగా వాణిజ్యేతర వాహనాలు కలిగి ఉన్న వారు) కోసం కేంద్ర ప్రభుత్వం ‘రాయితీపై లోకల్ పాస్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నిబంధన 2026 నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.
టోల్ ప్లాజా ఉన్న ప్రాంతాన్ని బట్టి ఈ వార్షిక పాసుల కోసం ఫీజును నిర్ణయించారు. మున్సిపాలిటీ లేదా స్థానిక పట్టణ ప్రాంత పరిధికి వెలుపల ఉండే టోల్ ప్లాజాల కోసం ఈ పాసుల ఫీజును ఏడాదికి రూ. 1,500గా నిర్ణయించారు. మున్సిపాలిటీ లేదా పట్టణప్రాంత పరిధిలోని టోల్ ప్లాజాల కోసం ఈ పాసుల వార్షిక ఫీజు రూ. 3,000గా ఉంటుంది.
కొత్త నిబంధన ప్రకారం... ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తూ, చెల్లుబాటయ్యే క్రియాశీల ఫాస్టాగ్ కలిగి ఉన్న అర్హతగల వాణిజ్యేతర వాహన యజమానులు వారి స్థానిక నిర్దిష్ట ప్లాజా గుండా ప్రయాణించడానికి ప్రస్తుతం ఉన్న నెలవారీ పాసును గానీ లేదా రాయితీతో కూడిన లోకల్ పాసును గానీ ఎంచుకోవచ్చు. ఈ పాస్ కేవలం ఆ ప్లాజాకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. దీనిని ఇతర ప్లాజాలకు బదిలీ చేయడానికి వీలుండదు.
క్లోజ్డ్ యూజర్-ఫీ కలెక్షన్ సిస్టమ్ ఆధారంగా టోల్ ఫీజు వసూలు చేసే జాతీయ రహదారులు లేదా ఎక్స్‌ప్రెస్‌వేలపై రాయితీతో కూడిన ఈ లోకల్ పాస్ అందుబాటులో ఉండదు. ప్రయాణికుల ఉపయోగం కోసం సర్వీస్ రోడ్డు లేదా ప్రత్యామ్నాయ రహదారి అందుబాటులో ఉన్న చోటా దీనిని జారీ చేయరు.
అర్హత కలిగిన వాహనదారులకు వారి స్థానిక టోల్ ప్లాజాల వద్ద 01.11.2026 నుంచి 'వార్షిక లోకల్ పాస్' అందుబాటులో ఉంటుంది. 01.12.2026 నుంచి 'రాజ్‌మార్గ్‌యాత్ర' యాప్ ద్వారానూ వినియోగదారులు ఈ వార్షిక లోకల్ పాసులను పొందవచ్చు.
1956 జాతీయ రహదారుల చట్టం ద్వారా సంక్రమించిన అధికారాల కింద... జాతీయ రహదారుల రుసుము (ధరల నిర్ధారణ, వసూలు) (అయిదో సవరణ) నియమావళి-2026 ద్వారా ఈ సవరణను నోటిఫై చేశారు. ఈ ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సవరించవచ్చు. ఈ సవరణలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఫాస్టాగ్‌లు జారీ చేసిన నేపథ్యంలో... టోల్ ప్లాజాల సమీపంలో నివసించే అర్హులైన నివాసితులకు ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా మార్చడానికి, స్థానిక నివాసితులకు రాకపోకల సౌలభ్యాన్ని మెరుగుపర్చడానికి ఒక ఎంపికను అందించడం ఈ కొత్త నిబంధన లక్ష్యం.
***
(రిలీజ్ ఐడి: 2329294)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7