నాడు పోస్టు చేయడమైనది:
27 OCT 2026 1:48PM by PIB Hyderabad
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రేపు, అంటే 2026 అక్టోబర్ 28న ‘వికసిత్ భారత్ బిల్డథాన్ (వీబీబీ) 2025’ ముగింపు, సత్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈ కార్యక్రమంలో పాల్గొని, నూతన ఆవిష్కరణలకు గాను విజేతలుగా నిలిచిన విద్యార్థులను సన్మానిస్తారు.
భారతదేశంలో పాఠశాల విద్యతో పాటు క్షేత్ర స్థాయిలో నూతన ఆవిష్కరణలకు ఒక ముఖ్య ఘట్టంగా వీబీబీ 2025 నిలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ‘‘అతి పెద్ద ఇన్నొవేషన్ సొల్యూషన్ కాంపిటీషన్’’గా గుర్తించి, గిన్నెస్ ప్రపంచ రికార్డుల ధ్రువపత్రాన్ని ప్రకటించారు. ఇది భారతదేశ యువత ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకొనేటట్లు చేసింది.
కార్యక్రమంలో 10 జాతీయ స్థాయి విజేత జట్లను, నూతన ఆవిష్కర్తలను బహుమతులతో సత్కరించనున్నారు. ఈ సందర్భంగా పరివర్తన ప్రధాన సేవలను, మాడళ్లను పరిచయం చేస్తారు. ఇదే కార్యక్రమంలో అధికారిక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ప్రదానోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో విద్యా శాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం (డీఓఎస్ఈఎల్) ‘ఉల్లాస్-నవ్ భారత్ సాక్షరతా కార్యక్రమం’లో భాగంగా టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (టీఈఐస్)కు మార్గదర్శకాలను విడుదల చేస్తారు. ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు (ఈ-వేస్ట్)పై అవగాహనను కలిగించడానికి, ఈ-వేస్టును సేకరించడానికి మంత్రిత్వ శాఖ లోని డీఓఎస్ఈఎల్, ఉన్నత విద్య విభాగం కలసి ‘ప్రత్యేక ప్రచార ఉద్యమం 6.0’లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా తెలియజేస్తారు.
విద్య శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌధరీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి డీఓఎస్ఈల్ కార్యదర్శి శ్రీ టి.కె. అనిల్ కుమార్, డీఓఎస్ఈల్ అదనపు కార్యదర్శి శ్రీ ధీరజ్ సాహూ, ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ టి.జి. సీతారామ్లతో పాటు మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థల ప్రతినిధులు, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యా విభాగాలు, భాగస్వామ్య సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా హాజరు అవుతారు.
‘వికసిత్ భారత్ బిల్డథాన్ (వీబీబీ) 2025’ను అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఏఐఎమ్), నీతి ఆయోగ్, ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)ల సహకారంతో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం (డీఓఎస్ఈఎల్) నిర్వహిస్తోంది. పాఠశాల విద్యార్థుల్లో సమస్యలను కొత్త కొత్త పద్దతుల్లో పరిష్కరించడం, ఔత్సాహిక పారిశ్రామికత్వం, విజ్ఞానశాస్త్రం పట్ల అభిరుచిని పెంచే ధ్యేయంతో ‘వీబీబీ 2025’ను మొదలుపెట్టారు. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘స్వదేశీ’, ‘వోకల్ ఫర్ లోకల్’, ‘సమృద్ధ్ భారత్’.. ఈ నాలుగు కీలక అంశాలకు పెద్ద పీట వేస్తున్న వీబీబీ 2025 క్షేత్ర స్థాయిలో గొప్ప ప్రతిస్పందనకు నోచుకుంది. ఆలోచన, ఆచరణ.. రెండు విధాలుగానూ మొత్తం 2,87,967 ప్రాజెక్టులను ముందుకు తెచ్చారు. దేశంలో పాఠశాల స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన విస్తారిత అనుబంధ వ్యవస్థ అంతకంతకు వ్యాప్తి చెందుతుండగా దానిని మరింత బలోపేతం చేయడం, విద్యార్థులను తరగతి గదులలో ఆర్జించే జ్ఞానానికి తోడు నిత్యజీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలను పరిష్కరించే వారుగా తీర్చిదిద్దడం, పేటెంట్లను సంపాదించే స్థాయికి వారు ఎదిగేందుకు తోడ్పడడం, విద్యార్థులు భవిష్యత్తులో నూతన వాణిజ్య సంస్థలను నెలకొల్పి ‘వికసిత్ భారత్ ’లక్ష్య సాధనకు చోదకశక్తిగా మారేటట్లు వారిని వీబీబీ ప్రోత్సహిస్తుంది.
***