వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడుల సంబంధాలను బలోపేతం చేసేలా నెదర్లాండ్స్‌లో ఉన్నతస్థాయి చర్చలు నిర్వహించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్

నాడు పోస్టు చేయడమైనది: 27 OCT 2026 9:54AM by PIB Hyderabad

నెదర్లాండ్స్‌లో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పర్యటన కొనసాగుతోంది. దీనిలో భాగంగా 2026 అక్టోబర్ 26న డచ్ ప్రభుత్వ నేతలు, పార్లమెంటేరియన్లు, అక్కడి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పలు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడం, వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడం, భారత-డచ్ సంస్థల మధ్య భాగస్వామ్యానికి గల కొత్త అవకాశాలను గుర్తించడంపై ఈ చర్చలు సాగాయి.

విదేశీ వాణిజ్యం, అభివృద్ధి సహకార శాఖ మంత్రి స్జోర్డ్ స్జోర్డ్‌స్మా, ఆర్థిక వ్యవహారాలు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి హెలీన్ హెర్బర్ట్, నార్త్ హాలెండ్ ప్రావిన్స్ కింగ్స్ కమిషనర్ ఆర్థర్ వాన్ డిజ్క్‌లతో శ్రీ పీయూష్ గోయల్ సమావేశాలు నిర్వహించారు. 

విదేశీ వాణిజ్యం, అభివృద్ధి సహకారంపై డచ్ హౌస్ ప్రతినిధుల కమిటీ, యూరోపియన్ వ్యవహారాల సెనేట్ కమిటీ సభ్యులతో కూడా కేంద్ర మంత్రి చర్చలు నిర్వహించారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులతో పాటు విస్తృతమైన భారత-యూరోపియన్ యూనియన్ ఆర్థిక భాగస్వామ్యంపై అభిప్రాయాలను పంచుకోవడానికి ఈ సమావేశాలు ఒక మంచి అవకాశాన్ని కల్పించాయి. 

ఆ రోజు నిర్వహించిన కార్యక్రమాల్లో ‘‘భారత్–నెదర్లాండ్స్ బిజినెస్ ఫోరం’’ ముఖ్యమైనది. దీనిని కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్, నెదర్లాండ్స్ విదేశీ వాణిజ్యం, అభివృద్ధి సహకార శాఖ మంత్రి శ్రీ స్జోర్డ్ స్జోర్డ్‌స్మా సంయుక్త అధ్యక్షతన నిర్వహించారు. భారత, డచ్ వ్యాపార రంగ ప్రముఖులతో సహా దాదాపు 200 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే కీలక అవకాశాలపై ఈ ఫోరం ప్రధాన దృష్టిని సారించింది. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడం, పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, మార్కెట్ అవకాశాలను మెరుగుపరచడం, కీలక రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై చర్చలు జరిగాయి. భారతదేశ, డచ్ ఆర్థిక వ్యవస్థల్లోని పరస్పరం ప్రయోజనం చేకూర్చే అంశాలపై చర్చించారు. ఎఫ్‌టీఏ పరిధిలో లభించే అవకాశాలను స్పష్టమైన వ్యాపార భాగస్వామ్యాలుగా, పెట్టుబడులుగా మలచుకోవడానికి, భారత్-ఐరోపాల మధ్య సరఫరా వ్యవస్థలను మరింత పటిష్ఠంగా అనుసంధానించడానికి రెండు దేశాల మధ్య సన్నిహిత పారిశ్రామిక సంబంధాలు అవసరమని ఈ సమావేశం స్పష్టం చేసింది.

పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించిన ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రముఖ డచ్ సంస్థల సీఈవోలతో శ్రీ పీయూష్ గోయల్ వ్యక్తిగత సమావేశాలు నిర్వహించారు. వ్యాపార ప్రాధాన్యాలు, పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై పారిశ్రామిక దిగ్గజాలతో చర్చించే వేదికలుగా ఈ సమావేశాలు నిలిచాయి. సెమీకండక్టర్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, ఇంధన-పారిశ్రామిక పరిష్కారాలు, సాంకేతిక పరిజ్ఞానం, రిటైల్ తదితర విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు ఇందులో పాల్గొన్నాయి.

ది హేగ్‌లోని భారత రాయబార కార్యాలయం, హెచ్‌ఎస్‌బీసీ నెదర్లాండ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలోనూ శ్రీ పీయూష్ గోయల్ పాల్గొన్నారు. దీనిలో 15 డచ్ కంపెనీల సీఎక్స్‌వోలు పాల్గొన్నారు. 

భారత్-నెదర్లాండ్స్ మధ్య పెట్టుబడులు, వాణిజ్య భాగస్వామ్యాలు, మరింత లోతైన ఆర్థిక సహకారానికి ఉన్న అవకాశాలపై వ్యాపార రంగంలోని ప్రముఖులతో ప్రత్యక్షంగా చర్చించేందుకు ఈ రౌండ్‌టేబుల్ సమావేశం దోహదపడింది. వ్యాపార పరిస్థితులపై పరస్పర అభిప్రాయాలను పంచుకొనే, ప్రైవేట్ రంగాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలను గుర్తించే వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది.

తన పర్యటనలో భాగంగా మీడియా ప్రతినిధులతో కూడా శ్రీ పీయూష్ గోయల్ ముచ్చటించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేర్చడం, భారత్–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో భారత్–నెదర్లాండ్స్ ఆర్థిక సంబంధాల్లో సాధిస్తున్న వృద్ధి గురించి మంత్రి వివరించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలను విస్తరించేందుకు ఉన్న విస్తృత అవకాశాల గురించి వివరించారు. యూరోపియన్ మార్కెట్లకు ప్రవేశ ద్వారంగా నెదర్లాండ్స్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. నెదర్లాండ్స్‌తో పాటు యూరోపియన్ యూనియన్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భారత ఆర్థిక వృద్ధిని, పెట్టుబడి అవకాశాలను, నిబద్ధతను వివరించే అవకాశాన్ని ఈ సమావేశం అందించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2328957) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam