శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
26 OCT 2026 11:31AM by PIB Hyderabad
ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ (ఈఎస్టీఐసీ–2026) సన్నాహక కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (ఐసీజీఈబీ) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో శాస్త్రీయ పరిశోధన, బయోటెక్నాలజీ, ఆవిష్కరణలను అభివృద్ధి చేయడంలో సిస్టమ్, సింథటిక్ బయాలజీ, వాటికి ఉన్న పరివర్తనాత్మక సామర్థ్యంపై ఒక ప్రత్యేక సమావేశాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నీతి ఆయోగ్ సభ్యులు ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ హాజరయ్యారు. బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) కార్యదర్శి డాక్టర్ రాజేష్ ఎస్ గోఖలే, డీబీటీ సైంటిస్ట్–హెచ్ డాక్టర్ ధనంజయ్ కుమార్ తివారీ, ఐసీజీఈబీ న్యూఢిల్లీ డాక్టర్ రమేష్ వీ సొంటి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించబోయే ఈఎస్టీఐసీ–2026 కు సంబంధించిన వివరాలను డాక్టర్ రమేష్ వీ సొంటి తెలియజేశారు. అలాగే సిస్టమ్, సింథటిక్ బయాలజీ ప్రాముఖ్యాన్ని వివరించారు. ఈఎస్టీఐసీ–2026లో ‘‘సిస్టమ్స్ అండ్ సింథటిక్ బయాలజీ’’పై ఓ సెషన్‌ను డీబీటీ నిర్వహిస్తుందని వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న ఈ రంగాలు జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తాయని, శాస్త్రీయ పురోగతికి గణనీయమైన అవకాశాలను అందిస్తాయని డాక్టర్ సొంటి తెలియజేశారు.
సంక్లిష్ట జీవ వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పారిశ్రామిక బయోటెక్నాలజీ, సుస్థిరాభివృద్ధి రంగాల్లో అప్లికేషన్ల కోసం జీవ ప్రక్రియలను ఇంజినీరింగ్ చేయడంలో అంతర్విభాగ విధానాల ప్రాధాన్యాన్ని సిస్టమ్, సింథటిక్ బయాలజీపై నిర్వహించిన కార్యక్రమం తెలియజేసింది. ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, నూతన బయోటెక్నాలజీ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, ప్రపంచ బయోఎకానమీలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి గణనీయమైన అవకాశాలను అభివృద్ధి చెందుతున్న ఈ రంగాలు అందిస్తున్నాయి.
ఈ సందర్భంగా బీఐఆర్ఏసీ ఎండీ, డీబీటీ సైంటిస్ట్–హెచ్ డాక్టర్ ధనంజయ్ కుమార్ తివారీ ప్రసంగించారు. సిస్టమ్, సింథటిక్ బయాలజీ సామర్థ్యాన్ని వివరించారు. ఆరోగ్యసేవలు, బయోమ్యానుఫాక్చరింగ్, బయోడిజైన్ రంగాల్లో అనువర్తనాల గురించి తెలియజేశారు. జీవ పరిశోధనను వేగవంతం చేయడంలో కృత్రిమ మేధ పోషిస్తున్న పాత్ర గురించి కూడా వివరించారు. భారతదేశ బయోటెక్నాలజీ రంగానికి కొత్త అవకాశాలను సృష్టించడంలో బయోఈ3 పాలసీకి ఉన్న సామర్థ్యాన్ని తెలియజెప్పారు.
డీబీటీ కార్యదర్శి డాక్టర్ రాజేష్ ఎస్ గోఖలే ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి స్వాగతం పలికారు. ఆవిష్కరణలు, సామాజిక పురోగతిని నడిపించడంలో విజ్ఞాన శాస్త్రం పోషిస్తున్న పాత్ర గురించి వివరించారు. విస్తృత స్థాయిలో అమలు చేయగల పరిష్కారాలుగా శాస్త్రీయ ఆవిష్కరణలు మారి, సమాజానికి అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రభావవంతంగా ఉంటాయన్నారు. దీనికి ఉదాహరణగా పెన్సిలిన్ ఆవిష్కరణను, భారీస్థాయి ఉత్పత్తిని చూపించారు. ఆవిష్కరణలకు శక్తివంతమైన వేదికగా జీవశాస్త్రానికి ప్రాధాన్యం పెరుగుతోందని తెలిపారు. రెండో విప్లవ దశలోకి బయోటెక్నాలజీ ప్రవేశిస్తోందని, మానవ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలను ప్రభావితం చేసే సామర్థ్యం దీనికి ఉందని ఆయన పేర్కొన్నారు. పరిశోధన, అభివృద్ధి, విస్తరణను బలోపేతం చేయడం ద్వారా ప్రయోగశాల ఆవిష్కరణలను ఆచరణాత్మక విధానాల్లోకి మార్చే ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన వివరించారు.
పెరుగుతున్న భారతదేశ శాస్త్రీయ సామర్థ్యాలు, జాతీయాభివృద్ధిని నడిపించడంలో, ఆవిష్కరణల వ్యవస్థలను బలోపేతం చేయడంలో, కొత్తగా పుట్టుకొస్తున్న ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో బయోటెక్నాలజీకి ఉన్న అపారమైన సామర్థ్యం గురించి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నీతిఆయోగ్ సభ్యులు ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్ ప్రస్తావించారు. ప్రధానమంత్రి నిర్దేశించిన దార్శనికత గురించి ప్రస్తావిస్తూ... భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో జీవశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, బయోటెక్నాలజీలకు ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. అంతర్జాతీయ బయోటెక్నాలజీ రంగాన్ని నడిపించే శక్తిగా ఎదిగే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు. అలాగే, ప్రాథమిక పరిశోధనను ఆచరణాత్మక అనువర్తనాల్లోకి మార్చాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. ప్రాణాలను కాపాడే ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో, ప్రధాన ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించడంలో ప్రాథమిక జీవశాస్త్ర పరిశోధన ఎలా సాయపడుతుందో వివరించారు. దీనికి కొవిడ్–19 వ్యాక్సిన్ల అభివృద్ధిని ఉదాహరణగా చూపించారు.
ఈఎస్టీఐసీ–2026 భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భారతదేశ పరిశోధన, ఆవిష్కరణల ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడంలో కొత్తగా అభివృద్ధి చెందుతున్న శాస్త్ర రంగాల పాత్రపై చర్చలకు నాంది పలికింది.
ఈఎస్టీఐసీ–2026 గురించి
భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం అందిస్తున్న మార్గదర్శకత్వంలో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమమే ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ (ఈఎస్టీఐసీ–2026). 2026 అక్టోబర్ 27 నుంచి 29 వరకు ఈ కార్యక్రమం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతుంది. శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రదర్శించడానికి, వివిధ రంగాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, పరిశోధనను ప్రభావవంతమైన టెక్నాలజీలుగా మార్చడాన్ని వేగవంతం చేయడానికి ప్రముఖ శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, పరిశ్రమల నాయకులు, పరిశోధకులు, డీప్–టెక్ ఆవిష్కర్తలను ఒక్క చోట చేర్చడమే ఈ సదస్సు లక్ష్యం.
సిస్టమ్ అండ్ సింథటిక్ బయాలజీ, అధునాతన తయారీ, ఎనర్జీ టెక్నాలజీలు, కృత్రిమ మేధ, సెమీ కండక్టర్లు, అధునాతన ఆరోగ్య సేవలతో సహా 12 ప్రధాన రంగాల్లో చర్చలను ఈఎస్టీఐసీ నిర్వహిస్తుంది. వికసిత్ భారత్–2047 దార్శనికతకు మద్దతుగా భారతదేశ శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
అత్యాధునిక పరిశోధన, శాస్త్రీయ సహకారం, సామర్థ్య నిర్మాణం పట్ల అంకితభావాన్ని ప్రదర్శిస్తూ... బయోటెక్నాలజీని అభివృద్ధి చేయడానికి, ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగాలకు భారత్ అందించే తోడ్పాటును బలోపేతం చేయడానికి ఐసీజీఈబీ కట్టుబడి ఉంటుంది.
ఐసీజీఈబీ న్యూఢిల్లీ గురించి
న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (ఐసీజీఈబీ) జీవశాస్త్ర రంగంలో పరిశోధన, శిక్షణను అందించే ముఖ్యమైన సంస్థ. అంటువ్యాధులు, టీకాలు, రోగనిర్ధారణ, మొక్కల జీవసాంకేతికత, బయోఎనర్జీ, బయోఇన్ఫర్మేటిక్స్, జీవసాంకేతికతలోని ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఈ సంస్థ పరిశోధనలు చేపడుతుంది. శాస్త్రీయ పరిశోధన, సామర్థ్య నిర్మాణం, అంతర్జాతీయ సహకారం ద్వారా మానవ సంక్షేమం, సుస్థిరాభివృద్ధి కోసం జీవసాంకేతికతను ముందుకు తీసుకెళ్లడంలో ఐసీజీఈబీ తన వంతు కృషి చేస్తుంది.



***