యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మై భారత్‌–ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నషా ముక్త్‌ యువ అభియాన్‌ 6వ వారంలో భాగంగా దేశవ్యాప్తంగా గ్రామాల్లో ‘గ్రామ సేవా ఏవం పరంప్రగత్ ఖేల్‌ దివస్‌’ నిర్వహణ

నాడు పోస్టు చేయడమైనది: 24 OCT 2026 4:54PM by PIB Hyderabad

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మై భారత్‌–జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ‘వికసిత్‌ భారత్‌ 100 వారాల సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా నిర్వహిస్తున్న ‘నషా ముక్త్‌ యువ’ కార్యక్రమం ఆరో వారంలో ‘గ్రామ సేవా ఏవం పరంప్రగత్‌ ఖేల్‌ దివస్‌’ (గ్రామ సేవ, సంప్రదాయ క్రీడల దినోత్సవం) నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రచారాన్ని విద్యాసంస్థలకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజల వద్దకు తీసుకెళ్లింది.

ఎన్‌ఎస్‌ఎస్‌ డైరెక్టరేట్‌, 15 ప్రాంతీయ డైరెక్టరేట్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని 160కి పైగా విద్యాసంస్థలు, వాటి పరిధిలోని దత్తత గ్రామాల్లో నిర్వహించారు. యువత, గ్రామ పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు సహా 80,000 మందికి పైగా ఇందులో పాల్గొన్నారు. రెండో నెలకు నిర్దేశించిన ‘ఆరోగ్యవంతమైన యువత–వ్యసనాలకు దూరంగా ఉండే యువత (శక్తి ఏవం సేవ)’ అనే ఇతివృత్తం కింద ఈ కార్యక్రమాలు చేపట్టారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో శారీరక దృఢత్వం, సమాజ భాగస్వామ్యం, సామాజిక బాధ్యతల ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

సంప్రదాయ క్రీడల్లో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలు కబడ్డీ, ఖోఖో, తాడులాగుడు, కుస్తీ వంటి స్థానిక క్రీడా పోటీలను నిర్వహించాయి. ఈ పోటీల్లో 21,500 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ యువతలో ఆరోగ్యకరమైన వినోదం, జట్టుగా పనిచేసే స్ఫూర్తి, సానుకూల కార్యకలాపాల పట్ల ఆసక్తిని ప్రోత్సహించారు.

గ్రామ సేవా కార్యక్రమంలో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, గ్రామ పంచాయతీలు కలిసి గ్రామీణ ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. వీటిలో గ్రామ వీధులను శుభ్రం చేయడం, బహిరంగ బావులు, చేతిపంపుల పరిసరాల్లో పారిశుధ్య పనులు నిర్వహించడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో 19,800 మందికి పైగా పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేయడం ద్వారా ‘నాట్‌ మీ, బట్‌ యూ’ (ముందు నువ్వు, ఆ తర్వాత నేను) అనే ఎన్‌ఎస్‌ఎస్‌ నినాదాన్ని వారు ఆచరణలో చూపించారు.

ఆరోగ్యకరమైన జీవన విధానం, ‘నషా ముక్త్‌’ ప్రచారంపై అవగాహన కార్యక్రమాలు, యువత ఆధ్వర్యంలో చర్చలు నిర్వహించారు. వీటి ద్వారా 18,600 మందికి పైగా ప్రజలకు అవగాహన కల్పించారు. క్రీడలు, సమాజ సేవా కార్యక్రమాల్లో 29,500 మందికి పైగా యువతులు పాల్గొనడం ఈ కార్యక్రమంలో లింగ సమానత్వం, మహిళల భాగస్వామ్యానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది.

ఈ ప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత #నషాముక్త్‌యువ అనే హ్యాష్‌ట్యాగ్‌తో 4,000కు పైగా సోషల్‌ మీడియా పోస్టులు రూపొందించారు. దీంతో గ్రామస్థాయిలో చేపట్టిన కార్యక్రమాల గురించి మరింత ఎక్కువ మందికి తెలిసేలా ప్రచారానికి విస్తృత ప్రాచుర్యం కల్పించారు.

సంప్రదాయ క్రీడలు, సమాజ సేవ, అవగాహన కార్యక్రమాలను సమన్వయం చేయడం ద్వారా ఈ ప్రచారంలో ఆరో వారం విద్యాసంస్థలకు, గ్రామీణ సమాజాలకు మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, యువతను సానుకూల కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం, వ్యసనరహిత వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించడం కోసం సమష్టి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది.

****


(రిలీజ్ ఐడి: 2328109) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Gujarati , Tamil