నాడు పోస్టు చేయడమైనది:
22 OCT 2026 3:11PM by PIB Hyderabad
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రిపబ్లిక్ ఆఫ్ పోలెండ్ ప్రధాని శ్రీ డొనాల్డ్ టస్క్ భారత్‌లో 2026 అక్టోబర్ 21 నుంచి 23 వరకు అధికారికంగా పర్యటిస్తున్నారు. 100 మంది ప్రముఖ సీఈవోలు, పారిశ్రామిక ప్రతినిధులతో సహా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ప్రధాని టస్క్ వెంట ఉంది.
పరస్పర ఆసక్తి ఉన్న ద్వైపాక్షిక, ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ప్రధానమంత్రి మోదీ, ప్రధాని టస్క్ సమగ్ర చర్చలు జరిపారు.
2024 ఆగస్టులో పోలెండ్‌లో ప్రధాని మోదీ చేపట్టిన పర్యటనను ప్రధానమంత్రులు ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి మెరుగుపరిచారు. అలాగే 2024-2028 కాలానికి ఇండియా- పోలెండ్ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. 2026 సెప్టెంబరులో వార్సాలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, పోలెండ్ డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీ నిర్వహించిన కార్యాచరణ ప్రణాళిక మధ్యంతర సమీక్షను వారు ఆమోదించారు.
వ్యూహాత్మక భాగస్వామ్యానికి సరికొత్త వేగాన్ని ప్రస్తుత పర్యటన జోడిస్తుందని ప్రధానులు గుర్తించారు. ఈ భాగస్వామ్యాన్ని పటిష్టమైన, కాలపరిమితితో కూడిన, పరస్పర ప్రయోజనకరమైన ఫలితాలుగా మార్చాలనే తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.
అత్యున్నత స్థాయి రాజకీయ చర్చలను, సంస్థాగత సమావేశాలను మరింత పెంచేందుకు నాయకులు అంగీకరించారు. అదే విధంగా తమ పార్లమెంటులు, రాష్ట్ర, ప్రాంతీయ అధికార యంత్రాంగాలు, మేధావులు, విధాన సంస్థల మధ్య సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించారు.
న్యూఢిల్లీలో 2026 జనవరి 27న జరిగిన చరిత్రాత్మక ఇండియా-ఈయూ సదస్సుకూ, టువార్డ్స్ 2030: భారత్-యూరోపియన్ యూనియన్ సంయుక్త సమగ్ర వ్యూహాత్మక అంజెండాకూ, ఈయూ-ఇండియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ముగింపునకూ, వ్యక్తుల రాకపోకల సహకారంపై సమగ్ర కార్యాచరణ విధానానికీ ఉన్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రులు తెలియజేశారు. వాణిజ్యం, పెట్టుబడులకు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం, కీలకమైన విలువ ఆధారిత వ్యవస్థలను వైవిధ్యీకరించడం, బలోపేతం చేయడం, కొత్త మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించి ఎఫ్‌టీఏపై త్వరగా సంతకాలు చేసి, ఆమోదించడంతో పాటు త్వరగా అమల్లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
వాణిజ్యం, ఆర్థిక సహకారం, పెట్టుబడి
ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల జీడీపీ మార్కును దాటిన పోలెండ్‌కు భారత ప్రధాని అభినందనలు తెలియజేశారు. పోలెండ్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని, క్రియాశీలతను ప్రశంసించారు. అత్యంత వేగంగా విస్తరిస్తున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ సాధించిన రికార్డును, రాబోయే సంవత్సరాల్లో 10 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనున్న అద్భుతమైన ప్రయాణాన్ని పోలెండ్ ప్రశంసించింది. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల్లోనూ పరస్పర ప్రయోజనాన్ని అందించే సామర్థ్యాలను, భారత్, పోలెండ్ దేశాలు సాధిస్తున్న అభివృద్ధి మార్గాల ద్వారా లభించే అవకాశాలను నాయకులు గుర్తించారు.
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని నాయకులు నిర్దేశించుకున్నారు. భారత్‌లో పెట్టుబడులను, కార్యకలాపాలను విస్తరించాలని పోలిష్ సంస్థలను భారత ప్రధాని ఆహ్వానించారు. విస్తృతమైన భారత మార్కెట్, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, వృద్ధి చెందుతున్న తయారీ, ఆవిష్కరణల వ్యవస్థలు అందించే ప్రయోజనాలను పొందాలని సూచించారు. పోలెండ్‌లో భారత పెట్టుబడులను ప్రధాని టస్క్ ప్రశంసించారు. మధ్య, తూర్పు ఐరోపాతో పాటు, విస్తృతమైన యూరోపియన్ మార్కెట్లో తమ ఉనికిని విస్తరించాలనుకుంటున్న భారతీయ వ్యాపార సంస్థలకు ప్రధాన ద్వారంగా ఉన్న పోలెండ్ సామర్థ్యాన్ని వివరించారు.
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ద్వైపాక్షిక కార్యాచరణ బృందం కార్యాకలాపాలను తిరిగి ప్రారంభించడం ద్వారా వ్యవసాయంలో సహకారాన్ని విస్తరించేందుకు నాయకులు అంగీకరించారు.
ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాలకు చెందిన ప్రముఖ సీఈవోలు, పారిశ్రామిక ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన ఇండియా-పోలెండ్ బిజినెస్ ఫోరమ్‌ను ప్రధానులు స్వాగతించారు. పారిశ్రామిక యంత్రాలు, రక్షణ, మౌలిక వసతులు, ఫార్మాసూటికల్స్, మైనింగ్, కీలకమైన ఖనిజాలు, ఇంధనం, ఐసీటీతో సహా పరస్పరం ఆసక్తి ఉన్న ఇతర రంగాల్లోనూ భాగస్వామ్యాలను అన్వేషించాలని వ్యాపార సంస్థలను ప్రోత్సహించారు.
పటిష్టమైన, విస్తృతమైన సరఫరా వ్యవస్థలకూ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహానికీ, ఆవిష్కరణల ఆధారిత వృద్ధికీ, డిజిటల్ పరివర్తనకూ ఉన్న ప్రాముఖ్యాన్ని నాయకులు వివరించారు. ఆర్థిక వృద్ధి, ఉత్పాదకత, ప్రజా సేవల పంపిణీలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాలు, కృత్రిమ మేధ తీసుకువచ్చే మార్పులను వారు గుర్తించారు. ఇండియా-ఈయూ సమగ్ర వ్యూహాత్మక అజెండాను పరిగణనలోకి తీసుకుంటూ... ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీపై ఉమ్మడి పరిశోధనలనూ, అంకుర సంస్థల భాగస్వామ్యాలనూ విస్తరించేందుకు నాయకులిద్దరూ అంగీకరించారు. రెండు దేశాల్లోని పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, ఆవిష్కరణ రంగాల మధ్య మరింత సన్నిహిత సహకారాన్ని ప్రోత్సహించడానికి అంగీకరించారు.
రక్షణ, భద్రత సహకారం
రక్షణ, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడంలో తమ చిత్తశుద్ధిని నాయకులు పునరుద్ఘాటించారు. 2026 సెప్టెంబరులో వార్సాలో జరిగిన రక్షణపై ఉమ్మడి కార్యాచరణ బృందం ఎనిమిదో సమావేశం ఫలితాలను వారు స్వాగతించారు. రెండు దేశాల రక్షణ సంస్థల మధ్య క్రమం తప్పకుండా చర్చలు నిర్వహించేందుకు అంగీకరించారు.
భారత్, పోలిష్ రక్షణ సంస్థల మధ్య పెరుగుతున్న సహకారాన్ని వారు స్వాగతించారు. వాణిజ్యపరంగా సాధ్యమయ్యే రంగాల్లో సహకారాన్ని గుర్తించాలని ఆ సంస్థలను ప్రోత్సహించారు. రక్షణ పారిశ్రామిక సహకారానికి అవసరమైన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడానికి డిఫెన్స్ ఇండస్ట్రీ డైలాగ్‌ను ఏర్పాటు చేయాలని నాయకులు ప్రతిపాదించారు. దీనిలో భాగంగా వ్యాపార సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడం, పరస్పర అంగీకారంతో సాంకేతిక పరిజ్ఞానం, ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తితో సహా ఇతర పారిశ్రామిక రంగాల్లో భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడం ఉన్నాయి.
2026 జనవరిలో కుదిరిన భారత్-ఈయూ భద్రత, రక్షణ భాగస్వామ్య ఒప్పందాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. వ్యాపార సంస్థలు, ఇతర వేదికల ద్వారా కీలకమైన, అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, సైబర్ భద్రత, రక్షణ ఆవిష్కరణల్లో భారత్-పోలెండ్ సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికున్న ప్రాధాన్యాన్ని వారు స్పష్టం చేశారు. ఇది సాంకేతిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి, భారత్-ఈయూ భద్రత, రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి దోహదపడుతుందని తెలిపారు.
వర్గీకృత సమాచారాన్ని ఉమ్మడిగా రక్షించడానికి, వినిమయానికి సంబంధించిన ఒప్పందం అవసరాన్ని ఇరుపక్షాలు స్పష్టంగా తెలియజేశాయి. ఈ ఒప్పందం త్వరలోనే కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతరిక్ష సహకారం/నూతన సాంకేతిక పరిజ్ఞానాలు
వ్యూహాత్మక భాగస్వామ్యంలో ముఖ్యమైన అంశంగా అంతరిక్ష రంగంలో సహకారాన్ని నాయకులు గుర్తించారు. ఈ రంగంలో బలమైన సంస్థాగత, పారిశ్రామిక స్థాయి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. అలాగే పరస్పరం ప్రయోజనాన్ని అందించే సహకారం కోసం నిర్దిష్ట రంగాలను గుర్తించే ప్రయత్నాలను స్వాగతించారు.
సెమీకండక్టర్ల రంగంలో సన్నిహిత సహకారానికి ఉన్న అవకాశాలను ఇరువురు నాయకులు వివరించారు.
బ్యాటరీల రీసైక్లింగ్, అరుదైన ఖనిజాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ... పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ, పునరుద్ధరణ పరిశ్రమల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాల గురించి ప్రధానమంత్రులు తెలియజేశారు.
జియాలజీ, మైనింగ్, కీలకమైన ఖనిజ రంగాల్లో సన్నిహిత సహకారానికి ఉన్న అవకాశాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన ఎంవోయూ చర్చల దశలో ఉంది.
అనుసంధానం, నౌకా వాణిజ్యం, నౌకాయానం
భారత్, పోలండ్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా, ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించడాన్ని ఉభయ దేశాల అధినేతలు స్వాగతించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చిహ్నంగా... ఇరు దేశాల పౌర విమానయాన అధికారులు త్వరలోనే ప్రత్యక్ష చర్చలు జరపాలని వారు పిలుపునిచ్చారు.
నౌకాయాన పరిశ్రమతో పాటు నౌకా వాణిజ్య భద్రత రంగంలోనూ పరస్పర సహకారానికి గల అవకాశాలను ఇరుపక్షాలు ప్రత్యేకంగా ప్రస్తావించాయి.
భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ) వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా రవాణా అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడం ఎంతో కీలకమని ఇరు దేశాల అధినేతలు అభిప్రాయపడ్డారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నుంచి కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించుకోవడానికి, రవాణా సమయాన్ని తగ్గించడానికి, ప్రపంచ సరుకు రవాణా వ్యవస్థలను విస్తృతం చేయడానికి ఓడరేవుల మధ్య సహకారం చాలా అవసరమని వారు గుర్తించారు. సురక్షితమైన, సుస్థిరమైన, సమగ్రమైన రవాణా వ్యవస్థను నిర్మించడంలో ఈ సహకారం ఎంతో దోహదపడుతుందనీ వారు స్పష్టం చేశారు.
ధ్రువ ప్రాంతాల పరిశోధనల్లో శాస్త్రీయ సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు దేశాల ప్రధానమంత్రులు అంగీకరించారు.
సైన్స్, విద్య, విద్యాసంబంధ సహకారం
భారతీయ సంస్కృతి, సంస్కృత భాషల పట్ల పోలండ్‌కు ఉన్న శతాబ్దాల నాటి అనుబంధాన్ని ఇరు దేశాల అధినేతలు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. క్రాకోవ్లోని జగెల్లోనియన్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా 'ఇండియన్ స్టడీస్' విభాగాన్ని ఏర్పాటు చేయడాన్నీ వారు స్వాగతించారు. మన దేశంలోని విశ్వవిద్యాలయాల్లో పోలిష్ భాష నేర్పించే ఉపాధ్యాయులూ ఉండటం విశేషమని కొనియాడారు. ఇరు దేశాల ఉన్నత విద్యా సంస్థల మధ్య బంధాన్ని మరింత పెంపొందిస్తూ... విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర మార్పిడి కార్యక్రమాలు, సరికొత్త ఉమ్మడి పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలని వారు పిలుపునిచ్చారు.
సంస్కృతి, ప్రజా సంబంధాలు
భారత్-పోలండ్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన బంధమే ప్రధాన బలమని ఇరు దేశాల అధినేతలు పునరుద్ఘాటించారు. నిపుణులు, పర్యాటకుల రూపంలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రాకపోకలను స్వాగతిస్తూ... సాంస్కృతిక సహకారం, క్రీడలు, యువజన మార్పిడి కార్యక్రమాలు, పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సంస్కృతి, సైన్స్, ఉన్నత విద్యా రంగాల్లో పరస్పర సహకారం కోసం త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనున్నారు. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, జనరల్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆర్కైవ్స్ ఆఫ్ పోలండ్ మధ్య సహకార ఒప్పందం ఖరారైందనీ, దీనిపై త్వరలోనే సంతకాలు చేయనున్నట్లు వారు వెల్లడించారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వేలాది మంది పోలిష్ మహిళలు, పిల్లలకు భారత్ ఆశ్రయం ఇచ్చి ఆదుకుందని ఇరు దేశాల అధినేతలు గుర్తుచేసుకున్నారు. ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా... వార్సా నగరంలోని మహారాజా జామ్‌సాహెబ్ (పోలండ్‌లో 'ది గుడ్ మహారాజా'గా ప్రసిద్ధి), కొల్హాపూర్ సంస్థానాల స్మారక చిహ్నాలు ఇరు దేశాల ప్రజల మధ్య నేటికీ ఒక వారధిలా నిలుస్తున్నాయని వారు కొనియాడారు. ఇరు దేశాల మైత్రికి ప్రతీకగా ఇప్పటివరకు రెండుసార్లు జరిగిన 'జామ్ సాహెబ్ మెమోరియల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్' విజయవంతం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఇటీవల అక్టోబర్ 2026లో జరిగిన తాజా కార్యక్రమాన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో అక్కడ చిక్కుకుపోయిన 2,000 మందికి పైగా భారతీయ విద్యార్థులను 'ఆపరేషన్ గంగా' ద్వారా సురక్షితంగా తరలించడంలో పోలండ్ అథారిటీల అపార సహకారాన్ని ఇరుపక్షాలు ఈ సందర్భంగా కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నాయి.
బహుళపక్ష సహకారం, ప్రపంచ సమస్యలు
ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను కేంద్రంగా చేసుకుని బహుళపక్షవాదం ప్రాముఖ్యతను ఇరువురు నేతలు ప్రముఖంగా ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి తన ప్రాసంగికతను, విశ్వసనీయతను, ప్రభావాన్ని నిలుపుకోవాలంటే... శాశ్వత, తాత్కాలిక విభాగాల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని విస్తరించడం సహా, నిర్మాణాత్మక సంస్కరణలూ ఎంతో అవసరమని ఇరుపక్షాలు అంగీకరించాయి. మరింత సమ్మిళితమైన, సంస్కరించిన, విస్తరించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ సభ్యత్వానికి తమ మద్దతును ప్రకటించిన పోలండ్... 2028-29 సంవత్సరానికి భద్రతా మండలిలో తాత్కాలిక స్థానం కోసం భారత్ అభ్యర్థిత్వానికీ తమ మద్దతును పునరుద్ఘాటించింది.
అంతర్జాతీయ సహకారానికి జీ20 ఒక అత్యున్నత వేదిక అని ఇరు దేశాల అధినేతలు స్పష్టం చేశారు. పోలండ్ భాగస్వామిగా ఉన్న లేదా భవిష్యత్తులో పాల్గొనడం కోసం ఆహ్వానించే జీ20 సదస్సులు, చర్చా సమూహాల్లో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరు దేశాలు ప్రకటించాయి.
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, దాని వల్ల ఏర్పడుతున్న ఘోరమైన, విషాదకరమైన మానవతా సంక్షోభం పట్ల ఇరు దేశాల అధినేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు కట్టుబడి... సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రతను గౌరవిస్తూ, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉక్రెయిన్‌లో సమగ్రమైన, న్యాయబద్ధమైన, శాశ్వత శాంతి నెలకొనాల్సిన అవసరాన్నీ వారు పునరుద్ఘాటించారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ ఆహార, ఇంధన భద్రతపై... ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలపై దాని ప్రతికూల ప్రభావాలను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ... సీమాంతర ఉగ్రవాదం సహా ఏదైనా రూపంలోని, ఏదైనా ఉద్దేశంతో కూడిన హింసాత్మక తీవ్రవాదాన్ని ఇరు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా 22 ఏప్రిల్ 2025న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని వారు తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. యూఎన్ఎస్సీ - 1267 ఆంక్షల కమిటీ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై కఠినమైన, ఉమ్మడి చర్యలు తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలను, వారి మౌలిక సదుపాయాలను నిర్మూలించడానికి, ఉగ్రవాద నిధుల వ్యవస్థలను దెబ్బతీయడానికి అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఐక్యరాజ్యసమితిలో 'అంతర్జాతీయ ఉగ్రవాద నిరోధక సమగ్ర ఒప్పందం' (సీసీఐటీ) ని త్వరగా ఆమోదించాలని కోరుతూ, ఉగ్రవాద నిర్మూలనపై ఇరు దేశాల మధ్య ప్రత్యేక చర్చల నిర్వహణకు వారు అంగీకరించారు.
భారత్-పోలండ్ వ్యూహాత్మక సంబంధాల్లో భాగంగా... స్వేచ్ఛాయుతమైన, అందరికీ అందుబాటులో ఉన్న, శాంతియుతమైన, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రాముఖ్యతను ఇరు దేశాల అధినేతలు పునరుద్ఘాటించారు. 1982 ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందానికి (యూఎన్సీఎల్వోఎస్) కట్టుబడి ఉంటూ... అంతర్జాతీయ చట్టాలను గౌరవించాల్సిన అవసరాన్ని వారు ప్రధానంగా ప్రస్తావించారు. సముద్రయాన స్వేచ్ఛను కాపాడటంతో పాటు, వివాదాలను అంతర్జాతీయ చట్టాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవడం ఎంతో కీలకమని వారు స్పష్టం చేశారు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్' (ఐపీవోఐ) లో భాగస్వామి కావాల్సిందిగా పోలండ్‌ను భారత్ ఆహ్వానించింది.
భారత్-విజెగ్రాడ్ గ్రూప్ (వీ4 - పోలండ్, హంగేరి, చెక్ రిపబ్లిక్, స్లోవాక్ రిపబ్లిక్) దేశాల మధ్య తొలిసారిగా విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం జరగడాన్ని ఇరు దేశాల అధినేతలు స్వాగతించారు. 'వీ4+భారత్' కూటమి ద్వారా పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం పట్ల వారు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఉమ్మడి ప్రయోజనాలు, పరస్పర అవసరాల ఆధారంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని వారు నిర్ణయించారు.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇరు దేశాల అధినేతలు స్పష్టం చేశారు. పారిస్ ఒప్పందానికి, ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు ప్రక్రియకు వారు తమ సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటించారు. తీవ్రమైన వాతావరణ మార్పులు, పర్యావరణ క్షీణత వల్ల పెరుగుతున్న ముప్పులను ఎదుర్కొనేందుకు హరిత ఇంధనం, అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునే అభివృద్ధి రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఇంధన భద్రతను పెంచడానికి జాతీయ ఇంధన వినియోగంలో స్వదేశీ హరిత ఇంధన వాటాను పెంచాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ... విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ)లో చేరనున్నట్లు పోలండ్ చేసిన ప్రకటనను భారత్ స్వాగతించింది. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ), గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమిలోనూ భాగస్వామి కావాల్సిందిగా పోలండ్‌ను భారత్ ఆహ్వానించింది.
తనకు, తన ప్రతినిధి బృందానికి అందించిన ఆత్మీయ ఆతిథ్యానికి గానూ పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్... భారత ప్రధానమంత్రి శ్రీ మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, నిర్దేశిత యాక్షన్ ప్లాన్ 2024-2028 సమర్థ అమలు కోసం నిరంతరం ఉన్నత స్థాయి చర్చలు, సంస్థాగత సహకారాన్ని కొనసాగించడం పట్ల ఇరు దేశాల అధినేతలు తమ ఉమ్మడి నిబద్ధతను చాటారు.
పోలండ్‌లో పర్యటించాల్సిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ ఆహ్వానించారు.
***